క్రమబద్ధీకరణ సొమ్ము చెల్లింపు గడువు పెంపు
చెల్లింపు కేటగిరీ ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు కొత్త మార్గదర్శకాలు
హైదరాబాద్: చెల్లింపు కేటగిరీలో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం లబ్ధిదారులు సొమ్ము చెల్లించేందుకు సర్కారు మరింత గడువిచ్చింది. గతంలో ఇచ్చిన వాయిదాల కాలపరిమితి షెడ్యూలును తాజాగా సవరించింది. ఈ మేరకు శనివారం కలెక్టర్లకు రెవెన్యూశాఖ ఉత్తర్వులు పంపింది. తాజాగా విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 15 లోగా చెల్లించాల్సిన రెండవ వాయిదా గడువును ఆగస్టు 31 వరకు పెంచారు. జూన్ 30తో ముగిసిన వాయిదా గడువును సెప్టెంబర్ 30 వరకు, సెప్టెంబర్ 30తో ముగియనున్న నాలుగో ఇన్‌స్టాల్‌మెంట్ గడువును నవంబర్ 15 వరకు పొడిగించారు. చివరి ఇన్‌స్టాల్‌మెంట్ గడువును యథావిధిగా (డిసెంబర్ 31) ఉంచినట్లు షెడ్యూల్లో ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అలాగే.. చెల్లింపు కేటగిరీలో ఆయా స్థలాలను క్ర మబద్ధీకరించేందుకు అధికారులు పాటించాల్సిన నిబంధనలతో రెవెన్యూ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సోమవారం నుంచి చెల్లింపు కేటగిరీ దరఖాస్తుల పరిశీలనను ప్రారంభించి, ఆగస్టు 15 లోగా విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని మండలాల తహశీల్దార్లకు ఆదేశాలు అందాయి.
కొత్త మార్గదర్శకాలు ఇలా..
చెల్లింపు కేటగిరీ (జీవో 59) కింద దరఖాస్తు చేసుకున్న కుటుంబంలోని మహిళ పేరిటే స్థలాన్ని క్రమబద్ధీకరించాలి. మహిళలు లేని పక్షంలోనే దరఖాస్తులో పేర్కొన్న వ్యక్తి పేరిట కన్వీనియన్స్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయాలి. దరఖాస్తుదారు వివరాలను నిర్ధారించుకునేందుకు ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లెసైన్స్.. తదితర గుర్తింపు కార్డులు పరిశీలించాలి. దరఖాస్తులో పేర్కొన్న స్థలం అభ్యంతర కరమైనదో, కాదో నిర్ధారించుకోవాలి. ఎఫ్‌టీఎల్, శిఖం, కోర్టుకేసులున్న భూముల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులను తిరస్కరించాలి. అభ్యంతరం లేని భూములైనప్పటికీ అవి ఏ ప్రభుత్వ విభాగానికి చెందినవన్న సమాచారాన్ని సేకరించాలి. ఆయా విభాగాల నుంచి అనుమతి పొందాకే క్రమబద్ధీకరణ చేపట్టాలి. దరఖాస్తులో పేర్కొన్న స్థలాన్ని ఫొటో తీయాలి. స్థలం రిజిష్ట్రేషన్ ధర, లబ్ధిదారు చెల్లించిన సొమ్మును పరిశీలించాలి. ఈ వివరాలన్నింటితో చెక్‌మెమోను ఆర్డీవో ఆధ్వర్యంలోని కమిటీ అనుమతించాకే దరఖాస్తుదారు పేరిట ఆ స్థలాన్ని క్రమబద్ధీకరించాలి. ఈ ప్రక్రియలో ఏ దశలోనైనా దరఖాస్తును తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉంది.