వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం
స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో నిర్వహణ
దేవాలయాలకు లీజు రూపంలో ఆదాయం
ప్రయోగాత్మక పరిశీలనకు 250 ఎకరాల భూమి గుర్తింపు
సాక్షి, హైదరాబాద్ : దేవాదాయ శాఖ భూముల్లో సౌర విద్యుత్తు ఉత్పత్తి కానుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములు దశాబ్దాలుగా వృథాగా ఉంటున్నాయి. ఈ భూముల్లో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. కొన్నిచోట్ల భూములు అన్యాక్రాంతమయ్యాయి. అలాంటి భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, వ్యవసాయానికి ఉపయోగపడని భూములను గుర్తించి వాటిల్లో కూడా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు.
అయితే నేరుగా దేవాదాయ శాఖ కాకుండా.. స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీలు) ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. భూములు ఇవ్వటం ద్వారా లీజు రూపంలో దేవాదాయ శాఖకు ఆదాయం రానుండగా, సౌర విద్యుత్తు ప్లాంట్ల నిర్వహణ రూపంలో ఎస్‌హెచ్‌జీలకు రాబడి సమకూరుతుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని దేవాలయాల భూములను గుర్తించి ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో రెడ్‌కో, ఎస్‌హెచ్‌జీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు.
ప్రస్తుతానికి 250 ఎకరాల భూములను గుర్తించారు. 62 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసే వీలుంది. వీటి ద్వారా నిత్యం సగటున 2.48 లక్షల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అంచనా.
రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖకు 40 వేల ఎకరాలకు పైగా భూములున్నాయి. వీటి ఆలనాపాలనా అంత పక్కాగా లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వేల ఎకరాల భూములు కబ్జా చేశారు. వీటిల్లో విడిపించుకోదగ్గ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, వాటికి సంబంధిత దేవుడి పేరుతో పాస్ పుస్తకాలు పొందే కసరత్తు దేవాదాయ శాఖ ప్రారంభించింది.
ఇప్పటికే 57 శాతం భూముల వివరాలను ధరణిలో నమోదు చేయించారు. ఇప్పటికి స్వాధీనం అయిన భూములు, కబ్జా కాకుండా ఉన్న భూములను దేవాలయాలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా వినియోగించుకునే ప్రయత్నం ప్రారంభమైంది. అయితే వ్యవసాయ యోగ్యంగా లేని భూములపై ఇప్పటివరకు పెద్దగా దృష్టి లేకుండా పోయింది.
ఇప్పుడు వాటిల్లో సౌర విద్యుత్తు ఫలకాలు ఏర్పాటు చేయటం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసి విక్రయించాలని నిర్ణయించారు. అయితే దీన్ని సొంతంగా నిర్వహించగలిగే స్థాయిలో దేవాదాయ శాఖ వద్ద మానవవనరులు లేవు. దీంతో ఎస్‌హెచ్‌జీలను తెరపైకి తెచ్చారు.
దేవాదాయ శాఖకు 40 వేల ఎకరాల భూములు
ఈ ప్రాజెక్టును ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా రెండుదశల్లో నిర్వహించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. తొలి దశలో ఐదు దేవాలయాలకు చెందిన 231 ఎకరాలను గుర్తించింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయానికి చెందిన 20 ఎకరాలు, మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మందిరానికి చెందిన 100 ఎకరాలు, నిర్మల్ జిల్లా భైంసాలోని శ్రీ గోశాలకు చెందిన 96 ఎకరాలు, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చెందిన 9 ఎకరాలు, నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం బుజలాపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి చెందిన 6 ఎకరాలను మొదటి దశ కోసం గుర్తించారు.
రెండో దశలో మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం మాటేడు గ్రామ శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్, మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవాలయం, మహబూబాబాద్‌లోని శ్రీ శివాలయం, హనుమకొండ రాగన్న దర్వాజా ప్రాంతంలోని శ్రీసీతారామచంద్రస్వామిదేవాలయాలకు చెందిన 21 ఎకరాలను ఇందుకోసం గుర్తించారు.
వీటిల్లో త్వరలో సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఆయా భూముల్లో రెడ్ కో, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సర్వే జరుగుతోంది. ఎకరాకు రూ.15 వేల మేర లీజును ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment