
పీఎం సూర్యఘర్‌కు ఆదరణ అంతంతే...
3 కేడబ్ల్యూహెచ్‌కు కేంద్రం సబ్సిడీ రూ.78 వేలు
3 కేడబ్ల్యూహెచ్ ఏర్పాటుకు అయ్యే గరిష్ట వ్యయం రూ.2.10 లక్షలు
దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో సబ్సిడీ డబ్బు ఖాతాల్లో జమ
అయినా ముందుకురాని వినియోగదారులు
సాక్షి, హైదరాబాద్: ఇంటిపై సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 33 శాతం సబ్సిడీ ఇస్తున్నా..రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. పీఎం సూర్యఘర్ పథకం కింద 3 కిలోవాట్స్ (కేడబ్ల్యూహెచ్) కోసం కేంద్రం రూ.78 వేల సబ్సిడీ ఇస్తోంది. మొదటి రెండు కిలోవాట్స్‌కు రూ.60 వేలు, మూడో కిలోవాట్‌కు రూ.18 వేల సబ్సిడీ ఉంటుంది.
అపార్ట్‌మెంట్‌లపై కూడా సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. గరిష్టంగా 500 కిలోవాట్స్ వరకు అనుమతి ఉంది. అయితే ప్రతీ కిలోవాట్‌కు రూ.18 వేల సబ్సిడీని కేంద్రం అందిస్తుంది. అయితే మొత్తాన్ని అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తులందరూ వినియోగించుకునేలా (ఉదాహరణకు లిఫ్ట్, నీటి అవసరాలు, మెట్లు, కామన్ స్పేస్‌లో లైటింగ్) వెసులుబాటు కల్పించారు.
రాష్ట్రంలో దాదాపు 1.16 కోట్ల కుటుంబాలు ఉన్నట్టు ఇటీవల నిర్వహించిన సమగ్ర కులగణన సర్వేలో తేలింది. విద్యుత్ వినియోగం పెరుగుతున్న తరుణంలో విద్యుత్ అందుబాటులో లేకుంటే కోతలు విధించాల్సిన పరిస్థితులు ఈ వేసవిలో తలెత్తే అవకాశముంది.
దరఖాస్తు ఇలా...
మిద్దెలపై సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు నేరుగా జాతీయ రెన్యూవబుల్ ఎనర్జీ సైట్‌లోకి వెళ్లి నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న వెంటనే సంబంధిత డిస్కమ్ నుంచి అధికారులు వచ్చి..మీ గృహాన్ని సందర్శిస్తారు. ఎన్ని కిలోవాట్స్ సోలార్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది? ప్రస్తుత విద్యుత్ వినియోగం ఎంత? తదితర వివరాలు తెలుసుకొని సాధ్యాసాధ్యాలపై ఓ నివేదిక ఇస్తారు.
ఆ తర్వాత సైట్‌లోనే మీరు సౌర ఫలకలు ఏర్పాటు చేసే వెండర్స్ జాబితాను ఎంపిక చేసుకోవచ్చు. అనంతరం డి్రస్టిబ్యూషన్ కంపెనీలు నెట్‌మీటరింగ్‌ను ఏర్పాటు చేస్తాయి. సౌరవిద్యుత్ ఉత్పత్తి యూనిట్లు, మీ వినియోగం ఆధారంగా డిస్కమ్‌లు మీ విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేస్తుంది.
మీ సోలార్ యూనిట్ ఉత్పత్తి చేసే విద్యుత్ కంటే తక్కువగా వినియోగించుకుంటే, మిగిలిన యూనిట్లను డిస్కమ్ వినియోగించుకుంటుంది. అలా ప్రతీ ఆరునెలలకోమారు మీరు ఏర్పాటు చేసుకున్న యూనిట్ నుంచి ఉత్పత్తి మిగిలిందా? లేక తగ్గుదల ఉందా అన్న అంశాన్ని పరిశీలించి విద్యుత్ బిల్లుల్లో సంబంధిత డిస్కమ్ సర్దుబాటు చేస్తుంది.
వినియోగం నెలకు 150కు పైగా ఉంటే..
మీ ఇంట్లో విద్యుత్ వినియోగం ప్రతీనెలా 150 యూనిట్ల కంటే అధికంగా ఉంటే 3 కిలోవాట్స్ సోలార్ విద్యుత్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇందుకోసం అన్ని కలుపుకొని దాదాపు రూ. 2.10 లక్షల వరకు వ్యయం అవుతుంది. సోలార్ పవర్ కోసం మీరు చేసే వ్యయం..నాలుగైదేళ్లలో తిరిగి వచ్చేస్తుంది. ఒకసారి ఈ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే 25 సంవత్సరాల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
– సంపత్‌కుమార్, రెడ్కో అధికారి
Comments
Please login to add a commentAdd a comment