NAKSHA Pilot Project: పట్టణాల్లో ప్రాపర్టీ కార్డ్‌! | NAKSHA Pilot Project starts across India from 18th Feb 2025 | Sakshi
Sakshi News home page

NAKSHA Pilot Project: పట్టణాల్లో ప్రాపర్టీ కార్డ్‌!

Published Tue, Feb 18 2025 3:37 AM | Last Updated on Tue, Feb 18 2025 3:37 AM

NAKSHA Pilot Project starts across India from 18th Feb 2025

నేటి నుంచే దేశవ్యాప్తంగా ‘నక్ష’ పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభం

ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాల పూర్తి వివరాలన్నీ జియో స్పేషియల్‌ సాంకేతికతతో సేకరణ

పట్టణాలు, నగరాల్లో అణువణువూ డిజిటల్‌ రూపంలో నిక్షిప్తం

పైలట్‌ ప్రాజెక్టులో రాష్ట్రంలో 10 మున్సిపాలిటీలు 

పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతో కార్యక్రమం

ఇళ్లు, భవనాల విస్తీర్ణం, ఎత్తు, సర్వే నంబర్, యజమాని పేరు, ఇతర పూర్తి వివరాలతో ప్రాపర్టీ కార్డు 

పట్టణాల్లో పక్కాగా రెవెన్యూ రికార్డులు.. ఆస్తిపన్ను నిర్ణయం, వసూళ్లలో పారదర్శకత 

ఇళ్లు, స్థలాల వివాదాలకు ఇక చెక్‌.. భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలకు ఊతం

సాక్షి, హైదరాబాద్‌: పట్టణాల్లో రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించేందుకు.. ఇళ్లు, స్థలాల వివాదాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నక్ష’ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. మున్సిపాలిటీల్లో విస్తృత స్థాయిలో సర్వే చేసి.. ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాల వివరాలన్నీ తేల్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇంటి యజమాని పేరు, ఆస్తి పన్ను వివరాలు, ఆస్తి విస్తీర్ణం, సర్వే నంబర్, అనుమతి తీసుకున్న నంబర్, ప్లాన్, నల్లా కనెక్షన్‌.. ఇలా సమస్త వివరాలతో ప్రాపర్టీ కార్డుల జారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

పట్టణాలు, నగరాల్లోని అణువణువు ఇకపై డిజిటల్‌ రూపంలో నిక్షిప్తం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డ్స్‌ మాడరై్నజేషన్‌ ప్రోగ్రాం (డీఐఎల్‌ఆర్‌ఎంపీ)లో భా­గంగా ‘నేషనల్‌ జియో స్పేషియల్‌ నాలెడ్జ్‌ బేస్డ్‌ ల్యాండ్‌ సర్వే ఆఫ్‌ అర్బన్‌ హ్యాబిటేషన్స్‌ (నక్ష)’ కార్యక్రమాన్ని చేపట్టింది. 

మంగళవారం దేశవ్యాప్తంగా రెండు లక్షల వరకు జనాభా ఉన్న 152 మున్సిపాలిటీల్లో పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఈ పట్టణాల్లో ఏడాదిపాటు పైలట్‌ ప్రాజెక్టును అమలు చేసిన తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా మార్పు, చేర్పులు చేస్తారు. అనంతరం మొదటి దశ కింద దేశవ్యాప్తంగా 1,000 మున్సిపాలిటీల్లో, ఆ తర్వాత దేశంలోని 4,912 పట్టణాలు, నగరాల్లో ‘నక్ష’ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

ఆధార్‌ మాదిరిగా ప్రాపర్టీ కార్డ్‌.. 
పట్టణాలు, నగరాల్లోని భూముల సర్వే నంబర్లు, ఇళ్లను ‘నక్ష’ కార్యక్రమం ద్వారా అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం పౌరులందరికీ ఆధార్‌ ఇస్తున్నట్టుగానే.. ప్రతీ గృహ యజమానికి ప్రాపర్టీ కార్డును విశిష్ట గుర్తింపు సంఖ్యతో ఇవ్వనున్నట్టు పురపాలక శాఖ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ఈ కార్డుపై ‘క్యూఆర్‌’ కోడ్‌ ఉంటుందని, దానిని స్కాన్‌ చేస్తే పూర్తి వివరాలు లభిస్తాయని తెలిపారు. 

ఇంటి యజమాని పేరు, ఆస్తి పన్ను వివరాలు, ఆస్తి విస్తీర్ణం, సర్వే నంబర్, అనుమతి తీసుకున్న నంబర్, ప్లాన్, నల్లా కనెక్షన్‌ ఇలా సమస్త సమాచారం అందులో ఉంటుందని వెల్లడించారు. లైడార్‌ సర్వే మాదిరిగా ఇది ఉంటుందని, పైలట్‌ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో ఎంపిక చేసిన మున్సిపాలిటీల్లో ఏడాదిపాటు పూర్తి స్థాయిలో ఈ సర్వే నిర్వహిస్తారని తెలిపారు. ఈ మున్సిపాలిటీల్లోని ప్రతి ఇంటిని త్రీడ్రీ కెమెరాలతో మ్యాపింగ్‌ చేస్తారని, ఇందుకోసం మూడు రకాల కెమెరాలను ఉపయోగిస్తారని వెల్లడించారు. 

ఈ సర్వే పూర్తయితే.. ఆస్తిపన్ను మదింపు పారదర్శకంగా జరుగుతుందని, స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలవుతుందని వివరించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, భవిష్యత్తులో జీఐఎస్‌ మాస్టర్‌ ప్లాన్‌ల రూపకల్పన సులభతరం అవుతుందని స్పష్టం చేస్తున్నారు. పట్టణాల్లోని రెవెన్యూ సర్వే నంబర్లు ఎన్ని సబ్‌ డివిజన్లుగా మారాయన్న వివరాలను కూడా నమోదు చేయనున్నట్టు తెలిపారు. 

అర్బన్‌ ల్యాండ్‌ రికార్డులు నాలుగు రాష్ట్రాల్లోనే.. 
దేశంలో తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో మాత్రమే పట్టణ భూముల రికార్డులను పక్కాగా నిర్వహిస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో వాటి నిర్వహణ సరిగా లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలోనే ‘నక్ష’ ప్రాజెక్టును చేపట్టినట్టు చెబుతోంది. రెవెన్యూ, మున్సిపాలిటీలు, సర్వే ఆఫ్‌ ఇండియా, ఎంపీ స్టేట్‌ ఎల్రక్టానిక్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ), సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లు సంయుక్తంగా ఈ పైలట్‌ ప్రాజెక్టును అమలు చేయనున్నాయి. 

పట్టణాలు, నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ సర్వే కీలకమని కేంద్రం తెలిపింది. భూముల విలువలు వేగంగా పెరుగుతున్నందున వివాదాలకు చెక్‌ పెట్టేలా ఇది ఉంటుందని, న్యాయపరమైన అంశాల్లోనూ ఉపయోగపడుతుందని వెల్లడించింది. అదే సమయంలో ఈ సర్వే డిజిటైజేషన్‌తో ప్రణాళికాబద్ధంగా పట్టణాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు వీలుంటుందని పేర్కొంది. ఆయా ఆస్తుల యజమానులు రుణాలు తీసుకోవడానికి ఈ సర్వే అనంతరం జారీ చేసే ప్రాపర్టీ కార్డు ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది. 

3 పద్ధతుల్లో ఏరియల్‌ సర్వే..  


రాష్ట్రంలో ఎంపిక చేసిన మున్సిపాలిటీలివే.. 
జడ్చర్ల, హుస్నాబాద్, కొడంగల్, వర్ధన్నపేట, యాదగిరిగుట్ట, మహబూబాబాద్, వేములవాడ, మిర్యాలగూడ, జగిత్యాల, మణుగూరు మున్సిపాలిటీలను ‘నక్ష’ పైలట్‌ ప్రాజెక్టు కోసం  రాష్ట్రం నుంచి ఎంపిక చేశారు. రాష్ట్రంలోని మొత్తం 155 పట్టణాలు, 29 పట్టణాభివృద్ధి సంస్థల్లో కూడా భవిష్యత్తులో ఈ సర్వే నిర్వహించేందుకు అవసరమైన నిధులు దాదాపు రూ.700 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుందని తెలిసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement