
మూడింటికి బ్యాంకు రుణంతో లింకు
మరో మూడింటికి లబ్ధిదారు వాటాతో పరిమితం
పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
ఏప్రిల్ 5 వరకు ఓబీఎంఎంఎస్‌లో దరఖాస్తులు.. జూన్ 9వ తేదీ లోపు ప్రక్రియ మొత్తం పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆరు కేటగిరీల్లో రాయితీలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడింటికి బ్యాంకు రుణాన్ని అనుసంధానం చేస్తారు. c
ఈ పథకం పూర్తిస్థాయి మార్గదర్శకాలను మంగళవారం ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు ఈ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అర్హతలివే..
– గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షల వార్షికాదాయం, పట్టణ(మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ) ప్రాంతాల్లో రూ.2 లక్షల వార్షికాదాయం ఉన్నవారు అర్హులు.
– దరఖాస్తులో రేషన్ కార్డు వివరాలు సమర్పించాలి. రేషన్‌కార్డు లేకుంటే తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రం వివరాలను ఇవ్వాలి.
– వ్యవసాయేతర కేటగిరీలకు దరఖాస్తుదారు వయసు 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
– వ్యవసాయ అనుబంధ కేటగిరీ యూనిట్లకు వయసు 21 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.
– ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తికి మాత్రమే అర్హత (ఐదేళ్ల సమయంలో స్వయం ఉపాధి పథకాలకు)
ప్రాధాన్యతలు: మొదటిసారి ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్(ఈఎస్‌ఎస్)కు దరఖాస్తు చేసుకునేవారికి, మహిళలకు 25 శాతం (ఒంటరి మహిళ, వితంతువులకు ప్రాధాన్యం), వికలాంగులకు 5 శాతం, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమ కుటుంబాలకు, నైపుణ్యం గల వారికి ప్రాధాన్యం.
కావాల్సిన పత్రాలు
ఆధార్ కార్డు, రేషన్‌కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెలంగాణ ఏర్పాటు తర్వాత జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా సంబంధిత యూనిట్‌లైతే), పట్టాదారు పాసుపుస్తకం (వ్యవసాయ అనుబంధ పథకాలకు), సదెరమ్ సర్టిఫికెట్ (వికలాంగ కేటగిరీ), పాస్‌పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్, అత్యంత పేదలైతే వల్నరబుల్ గ్రూప్ సర్టిఫికేషన్ (మండల స్థాయి కమిటీ).
దరఖాస్తు విధానం..
తెలంగాణ ఆన్‌లైన్ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం (ఓబీఎంఎంఎస్) వెబ్‌సైట్‌లో దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు ఫారం భర్తీ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్‌అవుట్‌తో పాటు అప్‌లోడ్ చేసిన ధ్రువీకరణ పత్రాలను జతచేసి సంబంధిత మండల ప్రజాపాలన సేవా కేంద్రాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలి.
మండల స్థాయిలో..
వచ్చిన దరఖాస్తులను మండలస్థాయిలో పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్/జోనల్ కమిషన్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన ప్రత్యేకాధికారి, మండల పరిధిలోని అన్ని బ్యాంకుల మేనేజర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ల ప్రతినిధులు, డీఆర్‌డీఏ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
జిల్లా స్థాయిలో...
జిల్లా స్థాయిలో ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా డీఆర్‌డీఏ పీడీ, సభ్యులుగా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), సభ్యులుగా ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు, మైనార్టీ సంక్షేమాధికారి, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, లీడ్‌బ్యాంక్ మేనేజర్ ఉంటారు.
– నిర్దేశించిన తేదీల్లో మండల, జిల్లా స్థాయి కమిటీలు దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించాల్సి ఉంటుంది. అర్హులను ఖరారు చేసిన తర్వాత ఆ జాబితాను జిల్లా ఇన్‌చార్జి మంత్రికి కలెక్టర్ సమర్పించాలి.
– ఎంపికైన లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన సామగ్రి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. రాయితీ నిధులు లబ్ధిదారుకు కాకుండా సదరు సంస్థ, ఏజెన్సీల పేరిట విడుదల చేస్తారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుకు ఇస్తారు.
– స్వయం ఉపాధి శిక్షణకు జిల్లా కమిటీలు కార్యాచరణ రూపొందించుకోవాలి.
– యూనిట్లు గ్రౌడింగ్ అయిన తర్వాత కూడా వాటిని విధిగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా అధికారులను నియమించుకుని తనిఖీలు చేపట్టాలి.
ఎంపిక ప్రక్రియ ఇలా..
– ఆన్‌లైన్ రిజి్రస్టేషన్ ప్రక్రియ ఏప్రిల్ 5వ తేదీ వరకు కొనసాగుతుంది.
– ఏప్రిల్ 6 నుంచి మే 20 వరకు మండల కమిటీలు దరఖాస్తులను పరిశీ లించి అర్హులను ఎంపిక చేసి, ఆయా జాబితాలను జిల్లా కమిటీలకు సమర్పించాలి.
– మే 21 – 31 తేదీల మధ్యలో జిల్లా కమిటీలు ఆయా జాబితాలను పరిశీలించి మంజూరీలు చేపట్టాలి
– జూన్ 2 నుంచి 9 తేదీల మధ్య లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించాలి.