
ఇందిరమ్మ పథకానికి కేటాయింపులు అంతంతే... తెలంగాణకు కేంద్రం షాక్
పట్టణ ప్రాంతాలను పెంచి భారీగా నిధులు పొందాలనుకున్న రాష్ట్రం ఆశలపై నీళ్లు
10 లక్షల యూనిట్లు, రూ.15 వేల కోట్ల నిధులు ఇవ్వాలని రాష్ట్రం ప్రతిపాదనలు
మీ పట్టణ జనాభా దేశంలో 4% ఉన్నందున 4 లక్షల యూనిట్లే ఇస్తామని తేల్చిచెప్పిన కేంద్రం
ఆ లెక్కన రూ.6 వేల కోట్ల నిధులు అందే చాన్స్.. కేంద్రంపై మరింత ఒత్తిడి చేసి లెక్క మార్పించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాలను పెంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా నిధులు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నంపై కేంద్రం నీళ్లు జల్లింది. కేంద్రం నుంచి భారీగా ‘పట్టణ ప్రాంత పేదల ఇళ్ల’ నిధులు సాధించి ఇందిరమ్మ పథకం ఖర్చును భారీగా తగ్గించుకోవాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి షాకిచ్చింది. పట్టణప్రాంత ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఐదేళ్లకు రూ.15 వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించగా, కేంద్రం తాజాగా చెప్పిన లెక్క ప్రకారం రూ.6 వేల కోట్లు మాత్రమే దక్కుతాయని తేలింది. దీంతో ఇళ్ల పథకం అమలులో రాష్ట్ర ఖజానాపై భారం పడబోతోంది.
అనుకున్నదొకటి, జరిగింది మరొకటి..
పీఎంఏవై కింద దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కోటి, గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పేదింటి పథకాలకు ఈ మొత్తాన్ని కేటాయిస్తుంది. పీఎంఏవైలో అర్బన్‌లో యూనిట్ కాస్ట్ రూ.లక్షన్నరగా ఉండగా, రూరల్‌లో రూ.72 వేలుగా ఉంది. దీంతో ఎక్కువ నిధుల కోసం అర్బన్ యూనిట్లు ఎక్కువగా పొందాలని తెలంగాణ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలో పట్టణ ప్రాంత విస్తీర్ణం, జనాభా ఎక్కువగా ఉందని చూపేందుకు ఇటీవల పట్టణ ప్రాంత అభివృద్ధి సంస్థలను అమాంతం పెంచేసింది.
గతంలో 9 పట్టణ ప్రాంత అభివద్ధి సంస్థలు ఉండగా, వాటిని 28కి పెంచింది. ఫలితంగా వేల సంఖ్యలో గ్రామ పంచాయతీలు ‘పట్టణ’ పరిధిలోకి చేరాయి. వీటి ఆధారంగా రాష్ట్రానికి 10 లక్షల అర్బన్ యూనిట్లు కేటాయించాలని, వీటికి రూ.లక్షన్నర చొప్పున రూ.15 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఈ నిధులు వస్తే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంపై భారం తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి గరిష్టంగా రూ.5 లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయించినందున, ఒక్కో ఇంటికి రూ.లక్షన్నర చొప్పున ఖర్చు తగ్గుతుంది.
కానీ, కేంద్రం దేశంలోని మొత్తం పట్టణ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 4 శాతమని తేల్చింది. ఈ లెక్కన రాష్ట్రానికి 4 లక్షల యూనిట్లు, రూ.6 వేల కోట్లు రానున్నాయి. ఇదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం అధికంగా ఉంటుంది. కేంద్రం నుంచి నిధులు బాగా తగ్గనుండటంతో, సొంతంగా నిధులు సమీకరించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీంతో కేంద్రంపై మళ్లీ ఒత్తిడి పెంచి మనసు మార్చాలని భావిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో..
ఇక గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా,. తెలంగాణకు సంవత్సరానికి లక్షన్నర వరకు మంజూరయ్యే అవకాశం ఉంది. కానీ, వీటి లెక్కలను మాత్రం కేంద్రం ఇంకా తేల్చలేదు. అర్బన్ యూనిట్లతో పోలిస్తే ఇవి రెట్టింపు సంఖ్యలో మంజూరవుతాయని రాష్ట్రం అంచనా వేస్తోంది. వీటి యూనిట్ కాస్ట్ తక్కువ అయినందున, వాటి వల్ల రాష్ట్ర ఖజానాకు అంతగా ఉపయోగం ఉండదు.
చాలా రాష్ట్రాల్లో రూ.2.5 లక్షలే..
చాలా రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణ పథకం యూనిట్ కాస్ట్ రూ.రెండున్నర లక్షలుగా ఉంటోంది. పట్టణ ప్రాంతాల్లో అయితే.. కేంద్రం ఒక్కో ఇంటికి రూ.లక్షన్నర ఇస్తుంటే, మిగతా మొత్తాన్ని రాష్ట్రం భరిస్తే సరిపోయేది. కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ కాస్ట్‌ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది. పట్టణ ప్రాంత ఇళ్ల యూనిట్ కాస్ట్‌ను కేంద్రం రూ.2.25 లక్షలకు పెంచుతుందని తొలుత ప్రచారం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యూనిట్ కాస్ట్‌లో 45 శాతం కేంద్రమే భరించినట్టవుతుందని భావించింది.
కానీ, కేంద్రం ఆ యూనిట్ కాస్ట్‌ను పెంచకుండా రూ.లక్షన్నరనే కొనసాగించి తొలి షాక్ ఇవ్వగా, ఇప్పుడు యూనిట్ల సంఖ్యను తగ్గించి రెండో షాక్ ఇచి్చంది. కాగా, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్రం వద్ద పలుకుబడి ఉపయోగించి ఈ యూనిట్ల సంఖ్యను పెంచేలా చూడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment