indiramma homes scheme
-
తెలంగాణకు కేంద్రం షాక్.. మీరు అడిగినన్ని ఇళ్లు ఇవ్వం
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాలను పెంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా నిధులు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నంపై కేంద్రం నీళ్లు జల్లింది. కేంద్రం నుంచి భారీగా ‘పట్టణ ప్రాంత పేదల ఇళ్ల’ నిధులు సాధించి ఇందిరమ్మ పథకం ఖర్చును భారీగా తగ్గించుకోవాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి షాకిచ్చింది. పట్టణప్రాంత ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఐదేళ్లకు రూ.15 వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించగా, కేంద్రం తాజాగా చెప్పిన లెక్క ప్రకారం రూ.6 వేల కోట్లు మాత్రమే దక్కుతాయని తేలింది. దీంతో ఇళ్ల పథకం అమలులో రాష్ట్ర ఖజానాపై భారం పడబోతోంది. అనుకున్నదొకటి, జరిగింది మరొకటి.. పీఎంఏవై కింద దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కోటి, గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పేదింటి పథకాలకు ఈ మొత్తాన్ని కేటాయిస్తుంది. పీఎంఏవైలో అర్బన్‌లో యూనిట్ కాస్ట్ రూ.లక్షన్నరగా ఉండగా, రూరల్‌లో రూ.72 వేలుగా ఉంది. దీంతో ఎక్కువ నిధుల కోసం అర్బన్ యూనిట్లు ఎక్కువగా పొందాలని తెలంగాణ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలో పట్టణ ప్రాంత విస్తీర్ణం, జనాభా ఎక్కువగా ఉందని చూపేందుకు ఇటీవల పట్టణ ప్రాంత అభివృద్ధి సంస్థలను అమాంతం పెంచేసింది. గతంలో 9 పట్టణ ప్రాంత అభివద్ధి సంస్థలు ఉండగా, వాటిని 28కి పెంచింది. ఫలితంగా వేల సంఖ్యలో గ్రామ పంచాయతీలు ‘పట్టణ’ పరిధిలోకి చేరాయి. వీటి ఆధారంగా రాష్ట్రానికి 10 లక్షల అర్బన్ యూనిట్లు కేటాయించాలని, వీటికి రూ.లక్షన్నర చొప్పున రూ.15 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఈ నిధులు వస్తే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంపై భారం తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి గరిష్టంగా రూ.5 లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయించినందున, ఒక్కో ఇంటికి రూ.లక్షన్నర చొప్పున ఖర్చు తగ్గుతుంది. కానీ, కేంద్రం దేశంలోని మొత్తం పట్టణ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 4 శాతమని తేల్చింది. ఈ లెక్కన రాష్ట్రానికి 4 లక్షల యూనిట్లు, రూ.6 వేల కోట్లు రానున్నాయి. ఇదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం అధికంగా ఉంటుంది. కేంద్రం నుంచి నిధులు బాగా తగ్గనుండటంతో, సొంతంగా నిధులు సమీకరించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీంతో కేంద్రంపై మళ్లీ ఒత్తిడి పెంచి మనసు మార్చాలని భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో.. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా,. తెలంగాణకు సంవత్సరానికి లక్షన్నర వరకు మంజూరయ్యే అవకాశం ఉంది. కానీ, వీటి లెక్కలను మాత్రం కేంద్రం ఇంకా తేల్చలేదు. అర్బన్ యూనిట్లతో పోలిస్తే ఇవి రెట్టింపు సంఖ్యలో మంజూరవుతాయని రాష్ట్రం అంచనా వేస్తోంది. వీటి యూనిట్ కాస్ట్ తక్కువ అయినందున, వాటి వల్ల రాష్ట్ర ఖజానాకు అంతగా ఉపయోగం ఉండదు. చాలా రాష్ట్రాల్లో రూ.2.5 లక్షలే.. చాలా రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణ పథకం యూనిట్ కాస్ట్ రూ.రెండున్నర లక్షలుగా ఉంటోంది. పట్టణ ప్రాంతాల్లో అయితే.. కేంద్రం ఒక్కో ఇంటికి రూ.లక్షన్నర ఇస్తుంటే, మిగతా మొత్తాన్ని రాష్ట్రం భరిస్తే సరిపోయేది. కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ కాస్ట్‌ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది. పట్టణ ప్రాంత ఇళ్ల యూనిట్ కాస్ట్‌ను కేంద్రం రూ.2.25 లక్షలకు పెంచుతుందని తొలుత ప్రచారం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యూనిట్ కాస్ట్లో 45 శాతం కేంద్రమే భరించినట్టవుతుందని భావించింది. కానీ, కేంద్రం ఆ యూనిట్ కాస్ట్‌ను పెంచకుండా రూ.లక్షన్నరనే కొనసాగించి తొలి షాక్ ఇవ్వగా, ఇప్పుడు యూనిట్ల సంఖ్యను తగ్గించి రెండో షాక్ ఇచి్చంది. కాగా, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్రం వద్ద పలుకుబడి ఉపయోగించి ఈ యూనిట్ల సంఖ్యను పెంచేలా చూడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. -
‘ఎస్కలేషన్’ పేర నొక్కేశారు!
రాజీవ్ స్వగృహలో భారీ కుంభకోణం ఒకే ఫైలుతో రూ.70 కోట్ల చెల్లింపులు రెండో దఫాలో రూ.150 కోట్లకు ఎసరు కిరణ్‌కుమార్ రాజీనామాకు ముందు చక్రం తిప్పిన నేత, ఇద్దరు ఉన్నతాధికారులు రాష్ట్రపతిపాలన సమయంలో రెండో ఫైలును పక్కనపెట్టిన గవర్నర్ సంబంధం లేని ఉత్తర్వులను వర్తింపజేసి మరీ స్వాహా తాజాగా దాన్ని గుర్తించిన గృహ నిర్మాణ శాఖ వివరాలు తిరగదోడుతున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కట్టని ఇళ్లకు కూడా బిల్లులు చెల్లించిన వ్యవహారంపై ఒకవైపు సీఐడీ దర్యాప్తు చేస్తున్న తరుణంలో రాజీవ్ స్వగృహ పథకంలో కూడా ఓ భారీ కుంభకోణం వెలుగుచూసింది. సంబంధం లేని ఉత్తర్వులను ఆసరా చేసుకుని ఆగమేఘాల మీద దాన్ని రాజీవ్ స్వగృహకు వర్తింపచేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహాచేసిన వ్యవహారమిది. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయడానికి కొన్ని రోజుల ముందు జరిగిన ఈ తతంగాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తిరగదోడుతోంది. కాంట్రాక్టర్లతో లాలూచీపడ్డ ఉన్నతాధికారులు, నేతలు దగ్గరుండి మరీ కథ నడిపిన ఈ వ్యవహారంలో ఇప్పటికే దాదాపు రూ.70 కోట్ల ప్రజాధనం కాంట్రాక్టర్ల పాలు కాగా, మరో ఫైలును గవర్నర్ నరసింహన్ నిలిపివేయటంతో రూ.150 కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఈ ఫైలు గృహనిర్మాణ శాఖకు చేరటంతో గుట్టురట్టయింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కూపీలాగుతోంది. ఇవీ వివరాలు... నిర్మాణ సామగ్రి ధరలు పెరిగితే కాస్ట్ ఎస్కలేషన్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వపరంగా జరిగే నిర్మాణాలకు సంబంధించి ఇందుకు అవకాశం కల్పిస్తూ అప్పటి ప్రభుత్వం 2009లో ఉత్తర్వు (నం.35) జారీ చేసింది. సిమెంటు, స్టీలుతోపాటు ఇసుక, ఇటుక, విద్యుత్తు ఉపకరణాలు, ఫ్లోరింగ్ మెటీరియల్, శానిటరీ ఫిట్టింగ్స్, రంగులు, లేబర్ చార్జీలు... ఇలా అన్ని రకాల అంశాలకు మార్కెట్లో మెటీరియల్ ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అదనపు మొత్తం చెల్లిస్తుంది. అప్పట్లో దీన్ని రాజీవ్ స్వగృహకు కూడా వర్తింపచేయాలని కాంట్రాక్టర్లు కోరారు. ప్రభుత్వ నిధులు కాకుండా, ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తంతో స్వగృహ పనులు చేస్తున్నందున ఈ ఉత్తర్వుల పరిధిలోకి స్వగృహను చేర్చొద్దంటూ నాటి కార్పొరేషన్ అధికారులు పేర్కొనటంతో ప్రభుత్వం దాన్ని స్వగృహకు వర్తింపచేయలేదు. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసే ముందు ఓ ప్రజాప్రతినిధి, ఇద్దరు ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద ఆ ఉత్తర్వులను స్వగృహకు వర్తింపజేసేలా చక్రం తిప్పారు. ఈ తతంగంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే తీవ్ర ఆరోపణలున్నాయి. దీన్ని ఆధారం చేసుకుని స్వగృహ ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో అదనపు చెల్లింపులు జరిపేందుకు వేగంగా రంగం సిద్ధం చేశారు. విచిత్రమేంటంటే... ఈ నిర్ణయం వెలువడ్డాక జరిగే పనులకే ఉత్తర్వులను వర్తింపజేయాల్సి ఉన్నప్పటికీ, గతంలో జరిగిన పనులకూ దాన్ని అమలు చేశారు. ఒకే ఫైలుతో రూ.70 కోట్లు చెల్లింపు... సరిగ్గా ఇదే తరుణంలో స్వగృహ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆ సమయంలో ప్రభుత్వం రూ.105 కోట్లను రుణంగా ఇచ్చింది. దీంతో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత రెండోసారి రూ.240 కోట్లను ఇచ్చింది. ఈ రెండో కోటా నిధుల నుంచి రూ.70 కోట్లను జీఓ 35 ప్రకారం కాంట్రాక్టర్లకు అదనంగా చెల్లించేశారు. ఆ తర్వాత అధికారులు రూ.425 కోట్లతో మరో ఫైలును సిద్ధం చేసి అందులో కాంట్రాక్టర్లకు రూ.150 కోట్లను చెల్లించేలా ఏర్పాటు చేశారు. అప్పుడే తెలంగాణ విభజన అంశం తెరపైకి రావటంతో కేంద్రం రాష్ట్రపతిపాలన విధించింది. దీంతో అధికారులు హడావుడిగా ఆ ఫైలును గవర్నర్ నరసింహన్‌కు పంపి ఆమోదముద్ర వేయించాలనుకున్నారు. కానీ ఆయన దాన్ని పరిశీలించి పెద్దమొత్తానికి సంబంధించిన అంశం కావటంతో... కొత్త ప్రభుత్వం కొలువుదీరాక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తిప్పిపంపారు. దీంతో రూ.150 కోట్ల చెల్లింపు నిలిచిపోయింది. ఇప్పుడు ఆ ఫైలు తెలంగాణ ప్రభుత్వం దృష్టికొచ్చింది. దీంతో కూపీలాగితే ఈ వ్యవహారం వెలుగు చూసింది. తొలుత ప్రభుత్వం రుణంగా ఇచ్చిన రూ.105 కోట్ల నుంచి కూడా కాంట్రాక్టర్లకు ‘ఎస్కలేషన్’పేరుతో ఎంతిచ్చారనే వివరాలను గృహనిర్మాణ శాఖ అధికారులు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.