‘ఎస్కలేషన్’ పేర నొక్కేశారు! | 70 crore rupees scam in rajiv swagruha scheme | Sakshi
Sakshi News home page

‘ఎస్కలేషన్’ పేర నొక్కేశారు!

Published Sun, Aug 3 2014 12:49 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM

‘ఎస్కలేషన్’ పేర నొక్కేశారు! - Sakshi

‘ఎస్కలేషన్’ పేర నొక్కేశారు!

రాజీవ్ స్వగృహలో భారీ కుంభకోణం
ఒకే ఫైలుతో రూ.70 కోట్ల చెల్లింపులు
రెండో దఫాలో రూ.150 కోట్లకు ఎసరు
కిరణ్‌కుమార్ రాజీనామాకు ముందు చక్రం తిప్పిన నేత, ఇద్దరు ఉన్నతాధికారులు
రాష్ట్రపతిపాలన సమయంలో రెండో ఫైలును పక్కనపెట్టిన గవర్నర్
సంబంధం లేని ఉత్తర్వులను వర్తింపజేసి మరీ స్వాహా
తాజాగా దాన్ని గుర్తించిన గృహ నిర్మాణ శాఖ
వివరాలు తిరగదోడుతున్న తెలంగాణ ప్రభుత్వం

 
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కట్టని ఇళ్లకు కూడా బిల్లులు చెల్లించిన వ్యవహారంపై ఒకవైపు సీఐడీ దర్యాప్తు చేస్తున్న తరుణంలో రాజీవ్ స్వగృహ పథకంలో కూడా ఓ భారీ కుంభకోణం వెలుగుచూసింది. సంబంధం లేని ఉత్తర్వులను ఆసరా చేసుకుని ఆగమేఘాల మీద దాన్ని రాజీవ్ స్వగృహకు వర్తింపచేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహాచేసిన వ్యవహారమిది. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయడానికి కొన్ని రోజుల ముందు జరిగిన ఈ తతంగాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తిరగదోడుతోంది. కాంట్రాక్టర్లతో లాలూచీపడ్డ ఉన్నతాధికారులు, నేతలు దగ్గరుండి మరీ కథ నడిపిన ఈ వ్యవహారంలో ఇప్పటికే దాదాపు రూ.70 కోట్ల ప్రజాధనం కాంట్రాక్టర్ల పాలు కాగా, మరో ఫైలును గవర్నర్ నరసింహన్ నిలిపివేయటంతో  రూ.150 కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఈ ఫైలు గృహనిర్మాణ శాఖకు చేరటంతో గుట్టురట్టయింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కూపీలాగుతోంది.

ఇవీ వివరాలు...

నిర్మాణ సామగ్రి ధరలు పెరిగితే కాస్ట్ ఎస్కలేషన్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వపరంగా జరిగే నిర్మాణాలకు సంబంధించి ఇందుకు అవకాశం కల్పిస్తూ అప్పటి ప్రభుత్వం 2009లో ఉత్తర్వు (నం.35) జారీ చేసింది. సిమెంటు, స్టీలుతోపాటు  ఇసుక, ఇటుక, విద్యుత్తు ఉపకరణాలు, ఫ్లోరింగ్ మెటీరియల్, శానిటరీ ఫిట్టింగ్స్, రంగులు, లేబర్ చార్జీలు... ఇలా అన్ని రకాల అంశాలకు మార్కెట్‌లో మెటీరియల్ ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అదనపు మొత్తం చెల్లిస్తుంది. అప్పట్లో దీన్ని రాజీవ్ స్వగృహకు కూడా వర్తింపచేయాలని కాంట్రాక్టర్లు కోరారు. ప్రభుత్వ నిధులు కాకుండా, ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తంతో స్వగృహ పనులు చేస్తున్నందున ఈ ఉత్తర్వుల పరిధిలోకి స్వగృహను చేర్చొద్దంటూ నాటి కార్పొరేషన్ అధికారులు పేర్కొనటంతో ప్రభుత్వం దాన్ని స్వగృహకు వర్తింపచేయలేదు. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసే ముందు ఓ ప్రజాప్రతినిధి, ఇద్దరు ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద ఆ ఉత్తర్వులను స్వగృహకు వర్తింపజేసేలా చక్రం తిప్పారు. ఈ తతంగంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే తీవ్ర ఆరోపణలున్నాయి. దీన్ని ఆధారం చేసుకుని స్వగృహ ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో అదనపు చెల్లింపులు జరిపేందుకు వేగంగా రంగం సిద్ధం చేశారు. విచిత్రమేంటంటే... ఈ నిర్ణయం వెలువడ్డాక జరిగే పనులకే ఉత్తర్వులను వర్తింపజేయాల్సి ఉన్నప్పటికీ, గతంలో జరిగిన పనులకూ దాన్ని అమలు చేశారు.

ఒకే ఫైలుతో రూ.70 కోట్లు చెల్లింపు...

సరిగ్గా ఇదే తరుణంలో స్వగృహ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆ సమయంలో ప్రభుత్వం రూ.105 కోట్లను రుణంగా ఇచ్చింది. దీంతో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత రెండోసారి రూ.240 కోట్లను ఇచ్చింది. ఈ రెండో  కోటా నిధుల నుంచి రూ.70 కోట్లను జీఓ 35 ప్రకారం కాంట్రాక్టర్లకు అదనంగా చెల్లించేశారు. ఆ తర్వాత అధికారులు రూ.425 కోట్లతో మరో ఫైలును సిద్ధం చేసి అందులో కాంట్రాక్టర్లకు రూ.150 కోట్లను చెల్లించేలా ఏర్పాటు చేశారు. అప్పుడే తెలంగాణ విభజన అంశం తెరపైకి రావటంతో కేంద్రం రాష్ట్రపతిపాలన విధించింది. దీంతో అధికారులు హడావుడిగా ఆ ఫైలును గవర్నర్ నరసింహన్‌కు పంపి ఆమోదముద్ర వేయించాలనుకున్నారు. కానీ ఆయన దాన్ని పరిశీలించి పెద్దమొత్తానికి సంబంధించిన అంశం కావటంతో... కొత్త ప్రభుత్వం కొలువుదీరాక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తిప్పిపంపారు. దీంతో రూ.150 కోట్ల చెల్లింపు నిలిచిపోయింది. ఇప్పుడు ఆ ఫైలు తెలంగాణ ప్రభుత్వం దృష్టికొచ్చింది. దీంతో కూపీలాగితే ఈ వ్యవహారం వెలుగు చూసింది. తొలుత ప్రభుత్వం రుణంగా ఇచ్చిన రూ.105 కోట్ల నుంచి కూడా కాంట్రాక్టర్లకు ‘ఎస్కలేషన్’పేరుతో ఎంతిచ్చారనే వివరాలను గృహనిర్మాణ శాఖ అధికారులు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement