Huge scandal
-
గత టీడీపీ సర్కారు నిర్వాకం: వైద్య రంగంలో భారీ కుంభకోణం..
జి. రామచంద్రారెడ్డి- సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఒక పని చేయాలంటే అందుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫైలు పెట్టాలి. ఎన్నో రకాల అనుమతులు కావాల్సి ఉంటుంది. అదే నగదుకు సంబంధించినదైతే ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎన్నో నిబంధనలుంటాయి. కానీ దాదాపు రూ.వెయ్యి కోట్ల వ్యవహారంలో ఎలాంటి అనుమతులూ లేవు. అసలు ఒక్క ఫైలు కూడా లేదు. ఉన్నతాధికారులకు అసలు తెలియనే తెలియదు. ప్రైవేటు సంస్థలతో పని చేయించేందుకు అవసరమైన ఎంఓయూలు (అవగాహనా ఒప్పందాలు)లేవు. కింది స్థాయి అధికారులతో తతంగం నడిపించేశారు. రూ.6వేలకు పని చేస్తామని ముందుకొచ్చిన సంస్థను కాదని అంతకు ఐదు రెట్లు ఎక్కువ కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగించారు.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవినీతి బాగోతాలలో ఇదో మకిలి వ్యవహారం. వైద్య ఆరోగ్య శాఖను గబ్బు పట్టించిన ఈ తతంగాన్ని చూద్దాం పదండి.. వైద్య ఆరోగ్య రంగాన్ని అలక్ష్యం చేసి ప్రజల బాగోగులను గాలికి వదిలేసిన గత సర్కారు ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు మాత్రం ఏ ఒక్క మార్గాన్నీ విడిచిపెట్టలేదు. ఆరోగ్య ఉపకేంద్రాల్లో టెలిమెడిసిన్ హబ్‌ల ఏర్పాటు పేరుతో గత సర్కారు హయాంలో జరిగిన భారీ కుంభకోణం ఇది. తరచి చూస్తే నిర్ఘాంతపోయే వాస్తవాలు బైటపడ్డాయి. మారుమూల ప్రాంతాలకు ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలందించేందుకు టెలిహబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఘనంగా ప్రకటించారు. కానీ ఆ ముసుగులో దాదాపు రూ.వెయ్యి కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన కొందరు టీడీపీ నేతల సహకారంతో వైద్య ఆరోగ్యశాఖలో ఈ తతంగం నడిచినట్లు గుర్తించారు. టెలి మెడిసిన్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు 2018లో టెలి మెడిసిన్ హబ్స్, ఐటీ సొల్యూషన్స్ పేరుతో టెండర్లు పిలిచారు. 5,500 ఆరోగ్య ఉపకేంద్రాల్లో టెలిమెడిసిన్ హబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ హబ్‌ల ద్వారా మారుమూల ప్రాంతాల రోగులకు టెలి మెడిసిన్‌తో మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఒక్కో కేంద్రం నిర్వహణకు నెలకు రూ.6 వేల చొప్పున పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన సంస్థను తప్పించి రూ.28 వేలు కోట్ చేసిన ధనుష్ ఇన్ఫోటెక్ అనే సంస్థకు అప్పగించారు. ఎల్ 2 సంస్థకు ఇవ్వాలంటే ఎల్ 1 ధరకు అంగీకరించాలి. లేదంటే ఇంకా తక్కువకు చేయడానికి సిద్ధపడాలి. అవేవీ కాకపోయినా 2019లో ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థకు 3,010 సెంటర్లు, వరల్డ్ హెల్త్ పార్ట్నర్ అనే మరో సంస్థకు 2,490 కేంద్రాలను అప్పగించారు. ఒక్కో కేంద్రం నిర్వహణ వ్యయం రూ.28 వేలు కాగా నెలకు రూ.15.4 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.924 కోట్లకుపైగా చెల్లించేలా గుట్టుగా వ్యవహారం సాగింది. అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై ఉన్నతాధికారులు సంతకాలు చేయలేదు. అప్పటి ప్రజారోగ్య సంచాలకులతో కథ నడిపించారు. లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) మరో కిందిస్థాయి అధికారితో తీసుకున్నారు. ఒప్పందం ఏమిటి? 5,500 ఆరోగ్య ఉపకేంద్రాల్లో టెలిమెడిసిన్ ఐటీ సొల్యూషన్స్ సేవలందించాలి. ఇంటర్నెట్తో పాటు టెలి వీడియో కన్సల్టెన్సీ, డ్రగ్ వెండింగ్ మెషీన్లు, మల్టీ పారామానిటర్ లాంటివి ఏర్పాటు చేయాలి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇవి పనిచేయాలి. వీటితో పాటు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, డయాబెటిస్, రక్తపోటు లాంటి జబ్బులకు స్క్రీనింగ్ చేయాలి. ధనుష్ సంస్థకు ఇచ్చిన టెర్మినేషన్ నోటీసు కాపీ.. నిర్వహణ దారుణం.. టెండరు నిబంధనల ప్రకారం 2019 ఏప్రిల్ నాటికి 5,500 ఆరోగ్య ఉప కేంద్రాలలో నిర్వహణ సంస్థల సేవలు ప్రారంభం కావాల్సి ఉండగా కేవలం 500 కేంద్రాల్లో అరకొరగా మొదలయ్యాయి. రోగ నిర్ధారణ పరీక్షలు చేయలేదు. ఐటీ సొల్యూషన్స్ అభివృద్ధి చేయలేదు. 40 రకాల మందులను పంపిణీ చేయాల్సి ఉండగా ఒక్కటీ ఇవ్వలేదు. క్యాన్సర్ స్క్రీనింగ్ లేదు. సర్వీస్ ప్రొవైడర్ సేవలను కోర్‌డాష్ బోర్డుకు రోజూ అనుసంధానించాలన్న నిబంధనను గాలికి వదిలేశారు. ఆరోగ్యశాఖలో అతి పెద్దదిగా చెప్పుకునే ఈ ప్రాజెక్టు నిర్వహణ సంస్థలతో గత ప్రభుత్వ పెద్దలు భారీగా లావాదేవీలు చేసుకున్నట్లు తేలింది. ప్రపంచ బ్యాంకు దీనికి ఎలాంటి నిధులు ఇవ్వలేదు. కనీసం ఫైలు కూడా లేకుండా చేశారంటే ఇందులో ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయో అంచనా వేయొచ్చు. బండారం ఇలా బయట పడింది 2019 జూన్ తర్వాత నిర్వహణ సంస్థ టెలిమెడిసిన్, ఐటీ సొల్యూషన్స్ పేరిట కుటుంబ సంక్షేమశాఖకు బిల్లులు రావడంతో బాగోతం బయటపడింది. దీనికి సంబంధించి కనీసం ఫైలు కూడా లేకపోవడంతో ఇద్దరు అధికారులకు నోటీసులు ఇవ్వగా అప్పటి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి మౌఖిక ఆదేశాల మేరకు నడుచుకున్నట్లు వెల్లడించారు. భారీ అవకతవకలు జరిగినట్లు తేలడంతో ఈ ప్రాజెక్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రాజెక్టును రద్దు చేయడంతో పాటు నిర్వహణ సంస్థలకు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. ముగ్గురు అధికారులు ఇందులో కీలక పాత్ర పోషించినట్లు కుటుంబ సంక్షేమశాఖ విచారణలో తేలింది. రూ.90 కోట్లు ఇవ్వండి టెలిమెడిసిన్ పేరుతో అప్పట్లో ధనుష్ సంస్థ నిర్వహణ చేపట్టింది. ఆ తర్వాత తమకు రూ.90 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలని కోర్టులో వ్యాజ్యం వేసింది. నిర్వహణ వ్యయం కింద ప్రభుత్వం తనకు ఇప్పటివరకూ రూ.10 కోట్లే ఇచ్చిందని, మరో రూ.90 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. దీనిపై కోర్టు ఇంకా ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. రూ.1,026 కోట్లు రికవరీ చేస్తాం నిర్వహణ సంస్థ సరిగా టెలిమెడిసిన్ సేవలు చేయకపోవడంతో దీనివల్ల ప్రజలకు రూ.1026 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, ఈ సొమ్మును మీరు ఇవ్వాల్సి ఉందని ధనుష్ సంస్థకు కుటుంబ సంక్షేమశాఖ నోటీసులు జారీచేసింది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)తో పాటు, గర్భిణుల వైద్యపరీక్షలు ఇలా రకరకాల సేవలు చేయకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి, రూ.1026 కోట్లమేరకు వ్యయం చేశారని, ఈ సొమ్ము మీరే చెల్లించాలని ధనుష్ సంస్థకు నోటీసులు జారీచేసింది. చాలా రకాల సేవలు అందించలేకపోయారు.. నిర్వహణ సంస్థ అందించాల్సిన సేవలపై ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. ఇందులో పలు రకాల సేవలు ఉన్నాయి. అవేమిటంటే.. ♦టెలిమెడిసిన్ అప్లికేషన్‌ను సరిగా నిర్వహించలేక పోయారు. ♦ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా నిర్వహణ చేయలేక పోవడం వల్ల వీడియో కన్సల్టెన్సీ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ♦జీవనశైలి జబ్బులకు సంబంధించిన పరీక్షలు (30 సంవత్సరాలు దాటిన మహిళలకు) రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి టెస్టులు చేయలేదు. ♦ సబ్ సెంటర్లలో మల్టీ పారామానిటరింగ్ చేయకపోవడం వల్ల టెస్టులు జరగలేదు. ♦డ్రగ్ వెండింగ్ మెషీన్ల నిర్వహణ లేదు. దీనిపై ఎవరైనా అడిగినా సరిగా స్పందించలేదు. దీనివల్ల రోగులు మందులు తీసుకోలేక పోయారు. ♦ప్రతి గర్భిణికి యాంటీనేటల్ చెకప్స్ (ఏఎన్సీ)చేయాల్సి ఉంది. కానీ వీరికి పరీక్షలు చేయలేకపోయారు. ♦టెలిమెడిసిన్ హబ్స్‌ను సరిగా ఏర్పాటు చేయకపోవడమే కాదు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిర్వహణ చేయలేకపోయారు. అప్పుడు ప్రైవేటుకు.. ఇప్పుడు ప్రభుత్వమే ప్రైవేటు సంస్థకు ఇవ్వకుండా ఇదే ఆరోగ్య ఉపకేంద్రాల్లో ప్రభుత్వమే టెలీమెడిసిన్, ఈ–సంజీవనీ ఓపీడీ పేరుతో ఉచితంగా నిర్వహణ చేపట్టింది. ఇప్పటికే 2,960 కేంద్రాల్లో సేవలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ నెలాఖరుకు మరో 3 వేల కేంద్రాల్లో టెలిమెడిసిన్ సేవలు అందుబాటులోకి తేనున్నారు. మార్చి చివరి నాటికి 10,051 కేంద్రాల్లో టెలిమెడిసిన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. కనిష్టంగా రోజుకు లక్ష మందికి ప్రభుత్వమే సేవలు ఉచితంగా అందిస్తోంది. గతంలో ప్రైవేటు సంస్థ నిర్వహణకంటే మెరుగైన సేవలు అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే అత్యంత అద్భుతంగా టెలిమెడిసిన్ సేవలు ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతున్నట్టు జాతీయ హెల్త్‌మిషన్ పేర్కొంది. నివేదిక ఆధారంగా చర్యలు ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవు. నిర్వహణ కూడా లేదు. దీనికి బాధ్యులైన అధికారులను గుర్తించాం. నివేదికను ప్రభుత్వానికి పంపుతున్నాం. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటుంది. – అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఇవీ చదవండి: బడికి వెళ్లకుంటే.. వలంటీర్ వస్తారు! మంత్రి వేముల పీఆర్వోపై కేసు: భార్యపై దాడి చేసిన వీడియో వైరల్ -
మళ్లీ రాజుకున్న రఫేల్ గొడవ
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ సంస్థ నుంచి భారత్ 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందన్న అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఫ్రాన్స్‌లో తాజాగా న్యాయ విచారణ మొదలైనట్లు ఫ్రెంచ్ పరిశోధక వెబ్సైట్ ‘మీడియాపార్ట్’ వెల్లడించింది. విచారణకు నేతృత్వం వహించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక న్యాయమూర్తిని నియమించినట్లు ఆ వెబ్సైట్ పేర్కొంది. దాదాపు రూ.59 వేల కోట్ల విలువైన ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని, కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయల సొమ్ము చేతులు మారిందని ఆరోపణలు వెల్లువెత్తడం తెల్సిందే. దసాల్ట్ ఏవియేషన్ కంపెనీ తయారు చేసిన 36 రఫేల్ ఫైటర్ జెట్లను ఇండియాకు విక్రయించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం గతంలో ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించి ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య 2016 సెప్టెంబర్‌లో ఒప్పందం కుదిరింది. ఇప్పటికే కొన్ని ఫైటర్ జెట్లను దసాల్ట్ సంస్థ తయారుచేసి భారత్‌కు పంపించింది. ఈ ఒప్పందంలో అవినీతి ఆరోపణలు ఇరుదేశాల్లోనూ రాజకీయ ప్రకంపనలు రేపాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద రఫేల్ డీల్‌పై ఫ్రాన్స్‌లో ‘నేషనల్ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్ ఆఫీస్(పీఎన్ఎఫ్)’ ఆదేశాల మేరకు గత నెల 14న న్యాయ విచారణ అధికారికంగా ప్రారంభమైనట్లు మీడియాపార్ట్ పేర్కొంది. అత్యంత భారీ ఆర్థిక, వాణిజ్య నేరాల విచారణ కోసం ఫ్రాన్స్ ప్రభుత్వం.. పీఎన్‌ఎఫ్‌ను 2013 ఏడాదిలో ఏర్పాటుచేసింది. భారత మధ్యవర్తికి రూ.8.84 కోట్లు రఫేల్ ఒప్పందంలో అవినీతి, అవకతవకలపై ‘షెర్పా’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో) ఫిర్యాదు చేసిందని, ఆర్థిక నేరాల గుట్టును రట్టు చేయడంలో ఈ సంస్థ దిట్ట అని మీడియాపార్ట్ గతంలో పేర్కొంది. డీల్ కుదిర్చినందుకు దసాల్ట్ .. భారత్‌లోని ఓ మధ్యవర్తికి 10 లక్షల యూరోలు(దాదాపు రూ.8.84 కోట్లు) కమీషన్ కింద చెల్లించినట్లు వెబ్సైట్ పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను దసాల్ట్ కంపెనీ కొట్టిపారేసింది. రఫేల్ ఒప్పందంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు చెప్పింది. రఫేల్ డీల్ లో కమీషన్ల బాగోతంపై వచ్చిన మొదటి ఫిర్యాదును 2019లో అప్పటి పీఎన్ఎఫ్ చీఫ్ ఎలియానీ హూలెట్ తొక్కిపెట్టారని మీడియాపార్ట్ వెబ్సైట్ పాత్రికేయుడు యాన్ ఫిలిప్పిన్ ఆరోపించారు. ప్రత్యర్థి కంపెనీల ఏజెంట్ రాహుల్: బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రత్యర్థి రక్షణ కంపెనీల ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయన ఆయా కంపెనీ చేతుల్లో పావుగా మారారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా శనివారం మండిపడ్డారు. రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్‌తోపాటు రాహుల్ గాంధీ పసలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అసత్య ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పర్యాయపదంగా మారిపోయిందన్నారు. రఫేల్ డీల్‌లో సోనియా గాంధీ కుటుంబానికి కమీషన్లు ముట్టలేదని, ఆ అక్కసుతో ఎన్డీయే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రఫేల్ ఒప్పందంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ‘కాగ్’, సుప్రీంకోర్టు తేల్చిచెప్పాయని సంబిత్ గుర్తుచేశారు. ఫైటర్ జెట్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు విశ్వసించలేదని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మళ్లీ పట్టం కట్టారని అన్నారు. జేపీసీ దర్యాప్తునకు ఆదేశించాలి: కాంగ్రెస్ రఫేల్ ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా శనివారం డిమాండ్ చేశారు. దేశ రక్షణకు సంబంధించిన ఫైటర్ల జెట్ల కొనుగోలులో గోల్మాల్ను నిగ్గుతేల్చడానికి ఇదొక్కటే మార్గమని చెప్పారు. ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని, జేపీసీ దర్యాప్తునకు ఆదేశించాలని సూర్జేవాలా డిమాండ్‌చేశారు. ‘ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఫ్రెంచ్ ప్రభుత్వం అంగీకరించింది. న్యాయ విచారణ ప్రారంభించింది. అలాంటప్పుడు ఈ అవినీతికి మూలకేంద్రమైన భారత్‌లో జేపీసీ దర్యాప్తు ఎందుకు జరపకూడదు?’ అని సూర్జేవాలా ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ పోటీ అంశం కాదని, దేశ భద్రత, అవినీతికి సంబంధించిన అంశమన్నారు. రఫేల్ డీల్ సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని తెలిపారు. -
సీఆర్ఆర్ ఫార్మసీ కళాశాలలో భారీ కుంభకోణం
ఏలూరు టౌన్: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సర్ సీఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాలలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. విద్యార్థులు చెల్లించిన ఫీజులను కళాశాల ప్రిన్సిపాల్ ఈడ్పుగంటి సుధీర్‌బాబు, ఇంటర్నల్ ఆడిటర్ శివరామప్రసాద్ పక్కదారి పట్టించారు. ఏకంగా రూ.1.62 కోట్లను స్వాహా చేసినట్టు తెలుస్తోంది. సీఆర్ఆర్ విద్యాసంస్థల యాజమాన్యం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. కైంకర్యం చేసిందిలా..: సీఆర్ఆర్ ఫార్మసీ కళాశాలలో విద్యార్థుల నుంచి పూర్తి ఫీజులు వసూలు చేశారు. ఫీజులో రాయితీ కల్పిస్తున్నట్టు ఓ నకిలీ జీవో సృష్టించి.. విద్యార్థులు చెల్లించిన ఫీజుల్లో నుంచి 40 శాతం సొమ్మును స్వాహా చేశారు. ఇలా సుమారు రూ.1.62 కోట్ల మేర సొమ్ములు కాజేసినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం. ప్రిన్సిపాల్, ఆడిటర్‌తోపాటు రాణి సంయుక్త, విజయకుమార్ అనే ఉద్యోగులకూ ఈ కుంభకోణంలో పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. -
బాపట్ల ప్రభుత్వాసుపత్రిలో భారీ స్కాం!
సాక్షి, గుంటూరు: బాపట్ల ప్రభుత్వాసుపత్రిలో భారీ స్కామ్ బయటపడింది. దాదాపు రూ. 52 లక్షల నిధులను ఆసుపత్రి సూపరింటెండ్ ఆశీర్వాదం స్వాహా చేసినట్టు ఆడిట్లో వెలుగుచూసింది. ఈ ఘటనలో ఆశీర్వాదంతో పాటు మరో ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. దీంతో ఈ ముగ్గురిపై ప్రభుత్వ ఆసుపత్రుల కోఆర్డినేటర్ ప్రసన్నకుమార్ కేసు పెట్టారు. కాగా, ఆశీర్వాదం ఇటీవలే బదిలీపై వైజాగ్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. -
యూపీఏలో ‘ఫోన్కో లోన్’
న్యూఢిల్లీ: ఇష్టమొచ్చినట్లుగా రుణాలు మంజూరుచేసి గత యూపీఏ ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థను ప్రమాదకర స్థితిలోకి నెట్టిందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. నిరర్థక ఆస్తుల పాపం మన్మోహన్ ప్రభుత్వానిదే అని మండిపడ్డారు. నామ్‌దార్(గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి)లు ఫోన్లు చేసిన వెంటనే, వారి సన్నిహిత వ్యాపారులకు భారీగా రుణాలు మంజూరయ్యాయని ఆరోపించారు. ఇలా ‘ఫోన్కొక లోన్’ చొప్పున యూపీఏ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని, దీంతో మొండిబకాయిలు పెరిగాయన్నారు. రుణ ఎగవేతదారుల నుంచి ప్రతి పైసా వసూలు చేస్తామని హామీనిచ్చారు. యూపీఏ ప్రభుత్వం ల్యాండ్‌మైన్‌పై ఉంచిన ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఢిల్లీలో శనివారం ఇండియా పోస్ట్ పేమెంట్స్æ బ్యాంక్(ఐపీపీబీ)ని ప్రారంభించాక మోదీ మాట్లాడారు. సుమారు రూ.1.75 లక్షల కోట్ల నిర్థరక ఆస్తులుగా మిగిలిపోయిన రుణాల్లో ఏదీæ ఎన్డీయే హయాంలో మంజూరు కాలేదని తెలిపారు. బ్యాంకులను దోచుకున్నారు.. తిరిగిరాని మొండిబకాయిలను యూపీఏ ప్రభుత్వం దాచిపెట్టిందని, తామొచ్చి వాటిని గుర్తించి రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టాలు చేశామన్నారు. నిరర్థక ఆస్తులను యూపీఏ రూ.2.5 లక్షల కోట్లుగా ప్రకటించి దేశాన్ని మోసం చేసిందని, వాటి విలువ రూ.9 లక్షల కోట్లని తెలిపారు. 2008–14 కాలంలో బ్యాంకు రుణాలు రూ.52 లక్షల కోట్లకు పెరిగాయని, అంతకుముందు ఈ రుణాలు రూ.18 లక్షల కోట్లేనన్నారు. ‘నిబంధనలు పాటించకుండా రుణాలిచ్చారు. రుణాల పునర్ వ్యవస్థీకరణ పేరిట మరిన్ని రుణాలిచ్చారు. నామ్దార్ల నుంచి వచ్చిన ఒక్క ఫోన్‌కాల్‌తో వారి సన్నిహిత వ్యాపారవేత్తలు భారీగా రుణాలు పొందారు. బ్యాంకుల ఉన్నతాధికారులను నియమించేది నామ్దార్లే కాబట్టి, వారి మాటకు తిరుగేలేద’ అని మోదీ అన్నారు. ఎమ్మెల్యే అయ్యాకే ఖాతా తెరిచా.. ఎమ్మెల్యే అయ్యే వరకు తనకు క్రియాశీల బ్యాంకు ఖాతా లేదని మోదీ అన్నారు. చిన్నతనంలో బ్యాంకులో వేసేందుకు తగినంత నగదు లేకపోవడమే అందుకు కారణమన్నారు. పాఠశాల రోజుల్లో విద్యార్థులకు దేనా బ్యాంకు ఖాతా ఇచ్చిందని, కానీ తన వద్ద నగదు లేకపోవడంతో ఆ ఖాతాను ఖాళీగా ఉంచినట్లు గుర్తుచేసుకున్నారు. చివరకు 32 ఏళ్ల తరువాత బ్యాంకు అధికారులు తన వద్దకు వచ్చి ఖాతాను మూసేసేందుకు సంతకం తీసుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యే అయ్యాక జీతం తీసుకునేందుకు ఖాతాను తెరిచానన్నారు. ముంగిట్లోకి బ్యాంకింగ్ న్యూఢిల్లీ: సుమారు 1.55 లక్షల తపాలా శాఖలు, 3 లక్షల మంది పోస్ట్‌మెన్, గ్రామీణ్ డాక్ సేవక్‌లతో బ్యాంకింగ్ సేవలను ప్రతి ఇంటికీ, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి తోడ్పడటానికి ప్రారంభించినదే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ). ఈ బ్యాంకు సేవలు ఇతర సాధారణ బ్యాంకుల మాదిరిగానే ఉన్నా కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. ఐపీపీబీలో ముందస్తు రుణాలు(అడ్వాన్స్డ్ లోన్స్), క్రెడిట్ కార్డుల వంటి సేవలు లేవు. రూ.1 లక్ష వరకున్న డిపాజిట్లనే అంగీకరిస్తారు. ఐపీపీబీ విశేషాలు.. ► ఇతర బ్యాంకుల మాదిరిగానే విదేశాల నుంచి నగదు బదిలీ, మొబైల్ చెల్లింపులు, ట్రాన్స్ఫర్స్, ఏటీఎం, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, థర్డ్‌పార్టీ ఫండ్ ట్రాన్స్ఫర్స్ తదితర సేవలు అందిస్తాయి. ► డిపాజిట్లపై 4 శాతం వడ్డీ చెల్లిస్తారు. ► వినియోగదారుడి ఇంటి వద్దకే వచ్చి పోస్ట్‌మన్ సేవింగ్స్, కరెంట్ ఖాతాలను తెరుస్తాడు. ► రుణాలు, బీమా వంటి థర్డ్‌పార్టీ సేవలందించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, బజాజ్ అలియాన్జ్ జీవిత బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ► రూ.1 లక్ష మించే డిపాజిట్లను ఆటోమేటిక్‌గా పొదుపు ఖాతాలుగా మార్చుతారు. ► కౌంటర్ సేవలు, మైక్రో ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ యాప్, మెసేజింగ్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. ► ఆధార్ సాయంతోనే ఖాతాలు తెరుస్తారు. ఖాతాదారుడి గుర్తింపు ధ్రువీకరణ, చెల్లింపులు, లావాదేవీలకు క్యూఆర్ కోడ్, బయోమెట్రిక్స్‌ను ఉపయోగిస్తారు. ► లావాదేవీలు నిర్వహించేందుకు గ్రామీణ్ డాక్ సేవక్‌లకు స్మార్ట్ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలను సమకూరుస్తారు. ► ఈ బ్యాంకులో వంద శాతం వాటా ప్రభుత్వానిదే. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లతో పోటీపడేలా ఐపీపీబీ మూలధన వ్యయాన్ని కేంద్రం ఇటీవలే 80 శాతం పెంచింది. ► ఐపీపీబీ సేవలు తొలుత 650 తపాలా శాఖలు, 3,250 యాక్సెస్ పాయింట్లలో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాదిచివరికల్లా దేశంలోని అన్ని శాఖలకు విస్తరిస్తారు. ► గ్రామీణ ప్రాంతాల్లో 1.30 లక్షల యాక్సెస్ పాయింట్లు నెలకొల్పనున్నారు. ► 17 కోట్ల పోస్టల్ సేవింగ్స్ ఖాతాలను ఐపీపీబీ ఖాతాలతో అనుసంధానం చేయడానికి అనుమతి ఉంది. -
అ‘రాఫెల్’ ఒప్పందంలో భారీ స్కాం
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఒప్పందం కుదిరేలా మోదీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్నారని, ఇప్పుడు ఆ వివరాల్ని బహిర్గతం చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ.. ‘మొట్టమొదటిసారి రాఫెల్ యుద్ధ విమానాలపై పెట్టిన ఖర్చుల వివరాల్ని బహిర్గతం చేయనని రక్షణ మంత్రి చెబుతున్నారు. ఈ ఒప్పందంలో కుంభకోణం జరిగిందని గుజరాత్ ఎన్నికల సమయంలోనే నేను చెప్పాను. ఒప్పందం కుదిరేలా ప్రధాని మోదీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్నారు’ అని రాహుల్ పేర్కొన్నారు. మోదీ వ్యక్తిగతంగా పారిస్‌కు వెళ్లారని, ఆ సమయంలో ఒప్పందంలో మార్పులు జరిగాయని ఆయన ఆరోపించారు. ‘దేశం మొత్తానికి ఈ విషయం తెలుసు. అయితే రక్షణ మంత్రి మాత్రం విమానాల కొనుగోలుకు చేసిన ఖర్చును దేశానికి చెప్పనంటున్నారు. అంటే ఇందులో ఏదో కుంభకోణం ఉందనే అర్థం’ అని సందేహం వ్యక్తం చేశారు. ట్వీటర్లోను రాహుల్ స్పందిస్తూ.. నమ్మకస్తుడైన వ్యక్తి ద్వారా ప్రధాని మోదీయే ఈ ఒప్పందం కుదిర్చారని, ఇది ‘ది గ్రేట్ రాఫెల్ డీల్’ అని పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తి పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. రాఫెల్ ఒప్పందం కోసం దేశ ప్రయోజనాలు, భద్రత విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం రాజీ పడిందని, ఒప్పంద సమయంలో సంప్రదింపుల్లో పారదర్శకత లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. యుద్ధ విమానాల కొనుగోలులో భారీ కుంభకోణం నడుస్తోందని ఆయన అన్నారు. భారత్, ఫ్రాన్స్‌ల మధ్య కుదిరిన అవగాహన మేరకు ఒప్పందం వివరాల్ని పార్లమెంటుకు తెలిపేందుకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ నిరాకరించారు. -
తవ్వే కొద్దీ అక్రమాలు
పాడేరు/చింతపల్లి: చింతపల్లి సబ్ ట్రెజరీలో తవ్వే కొద్దీ అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. లేని ఉద్యోగుల పేరిట రూ.2.87 కోట్లు పక్కదారి పట్టినట్టు ప్రాథమిక విచారణలో తేలడంతో జిల్లా ఉన్నతాధికారులు మరింత లోతుగా విచారణకు చర్యలు చేపట్టారు. ట్రెజరీలో అవకతవకలపై సమగ్ర విచారణకు కలెక్టర్ యువరాజ్ ఆదేశించారు. ఇందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికను కూడా సమర్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్ఎఫ్ఎల్ ఆడిట్ బృందం చింతపల్లి ఖజానా కార్యాలయంలో సమగ్ర విచారణ జరిపింది. అక్రమాలు వాస్తవమేనని నిర్ధారణకు వచ్చాక, ఆ నివేదికను కలెక్టర్‌కు అందజేసింది. 2013కు ముందు కూడా భారీస్థాయిలో అక్రమాలు జరిగినట్లు అధికారులకు ఫిర్యాదులు అందడంలో 2011 నుంచి సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు. చింతపల్లి ట్రెజరీలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు జరిపిన చెల్లింపుల వివరాలన్నీ సేకరించిన ప్రత్యేక అధికారుల బృందం సుమారు రూ.8 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టాయనే నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా పలు పీహెచ్‌సీల రికార్డులను అధికారులు మళ్లీ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. భారీ కుంభకోణంలో 60 మంది వైద్య ఆరోగ్యశాఖ నిధులను పక్కదారి పట్టించి రూ.కోట్లను కాజేసిన ఈ భారీ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన వైద్య శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. డీఎంహెచ్‌వో, ఏడీఎంహెచ్ఓ, ఆయా కార్యాలయాల సీనియర్ అసిస్టెంట్లు, చింతపల్లి ఉప ఖజాన కార్యాలయం పరిధిలోని ఆరోగ్య కేంద్రాల వైద్యులు, కార్యాలయ అధికారులు, కొంతమంది వైద్య ఉద్యోగులు కూడా ఇందులో సూత్రధారులుగా తనిఖీ బృందం అధికారులు నిర్ధారించారు. కొంత మంది వైద్య ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోనే రూ.లక్షలు డిపాజిట్ అయినా నోరు మెదపకుండా వ్యవహరించిన తీరును కూడా తనిఖీ బృందం అధికారులు తప్పుపడుతున్నారు. ఈ వ్యవహారంలో వారి పాత్రలపై కూడా నివేదికను సిద్ధం చేశారు. చింతపల్లి ఉపఖజానా కార్యాలయంలో రూ.కోట్ల అవకతవకలను ప్రభుత్వం కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నది. జిల్లా కలెక్టర్ యువరాజ్ ఎప్పటికప్పుడు ఈ వివరాలను సేకరిస్తున్నారు. -
‘ఎస్కలేషన్’ పేర నొక్కేశారు!
రాజీవ్ స్వగృహలో భారీ కుంభకోణం ఒకే ఫైలుతో రూ.70 కోట్ల చెల్లింపులు రెండో దఫాలో రూ.150 కోట్లకు ఎసరు కిరణ్‌కుమార్ రాజీనామాకు ముందు చక్రం తిప్పిన నేత, ఇద్దరు ఉన్నతాధికారులు రాష్ట్రపతిపాలన సమయంలో రెండో ఫైలును పక్కనపెట్టిన గవర్నర్ సంబంధం లేని ఉత్తర్వులను వర్తింపజేసి మరీ స్వాహా తాజాగా దాన్ని గుర్తించిన గృహ నిర్మాణ శాఖ వివరాలు తిరగదోడుతున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కట్టని ఇళ్లకు కూడా బిల్లులు చెల్లించిన వ్యవహారంపై ఒకవైపు సీఐడీ దర్యాప్తు చేస్తున్న తరుణంలో రాజీవ్ స్వగృహ పథకంలో కూడా ఓ భారీ కుంభకోణం వెలుగుచూసింది. సంబంధం లేని ఉత్తర్వులను ఆసరా చేసుకుని ఆగమేఘాల మీద దాన్ని రాజీవ్ స్వగృహకు వర్తింపచేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహాచేసిన వ్యవహారమిది. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయడానికి కొన్ని రోజుల ముందు జరిగిన ఈ తతంగాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తిరగదోడుతోంది. కాంట్రాక్టర్లతో లాలూచీపడ్డ ఉన్నతాధికారులు, నేతలు దగ్గరుండి మరీ కథ నడిపిన ఈ వ్యవహారంలో ఇప్పటికే దాదాపు రూ.70 కోట్ల ప్రజాధనం కాంట్రాక్టర్ల పాలు కాగా, మరో ఫైలును గవర్నర్ నరసింహన్ నిలిపివేయటంతో రూ.150 కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఈ ఫైలు గృహనిర్మాణ శాఖకు చేరటంతో గుట్టురట్టయింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కూపీలాగుతోంది. ఇవీ వివరాలు... నిర్మాణ సామగ్రి ధరలు పెరిగితే కాస్ట్ ఎస్కలేషన్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వపరంగా జరిగే నిర్మాణాలకు సంబంధించి ఇందుకు అవకాశం కల్పిస్తూ అప్పటి ప్రభుత్వం 2009లో ఉత్తర్వు (నం.35) జారీ చేసింది. సిమెంటు, స్టీలుతోపాటు ఇసుక, ఇటుక, విద్యుత్తు ఉపకరణాలు, ఫ్లోరింగ్ మెటీరియల్, శానిటరీ ఫిట్టింగ్స్, రంగులు, లేబర్ చార్జీలు... ఇలా అన్ని రకాల అంశాలకు మార్కెట్లో మెటీరియల్ ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అదనపు మొత్తం చెల్లిస్తుంది. అప్పట్లో దీన్ని రాజీవ్ స్వగృహకు కూడా వర్తింపచేయాలని కాంట్రాక్టర్లు కోరారు. ప్రభుత్వ నిధులు కాకుండా, ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తంతో స్వగృహ పనులు చేస్తున్నందున ఈ ఉత్తర్వుల పరిధిలోకి స్వగృహను చేర్చొద్దంటూ నాటి కార్పొరేషన్ అధికారులు పేర్కొనటంతో ప్రభుత్వం దాన్ని స్వగృహకు వర్తింపచేయలేదు. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసే ముందు ఓ ప్రజాప్రతినిధి, ఇద్దరు ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద ఆ ఉత్తర్వులను స్వగృహకు వర్తింపజేసేలా చక్రం తిప్పారు. ఈ తతంగంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే తీవ్ర ఆరోపణలున్నాయి. దీన్ని ఆధారం చేసుకుని స్వగృహ ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో అదనపు చెల్లింపులు జరిపేందుకు వేగంగా రంగం సిద్ధం చేశారు. విచిత్రమేంటంటే... ఈ నిర్ణయం వెలువడ్డాక జరిగే పనులకే ఉత్తర్వులను వర్తింపజేయాల్సి ఉన్నప్పటికీ, గతంలో జరిగిన పనులకూ దాన్ని అమలు చేశారు. ఒకే ఫైలుతో రూ.70 కోట్లు చెల్లింపు... సరిగ్గా ఇదే తరుణంలో స్వగృహ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆ సమయంలో ప్రభుత్వం రూ.105 కోట్లను రుణంగా ఇచ్చింది. దీంతో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత రెండోసారి రూ.240 కోట్లను ఇచ్చింది. ఈ రెండో కోటా నిధుల నుంచి రూ.70 కోట్లను జీఓ 35 ప్రకారం కాంట్రాక్టర్లకు అదనంగా చెల్లించేశారు. ఆ తర్వాత అధికారులు రూ.425 కోట్లతో మరో ఫైలును సిద్ధం చేసి అందులో కాంట్రాక్టర్లకు రూ.150 కోట్లను చెల్లించేలా ఏర్పాటు చేశారు. అప్పుడే తెలంగాణ విభజన అంశం తెరపైకి రావటంతో కేంద్రం రాష్ట్రపతిపాలన విధించింది. దీంతో అధికారులు హడావుడిగా ఆ ఫైలును గవర్నర్ నరసింహన్‌కు పంపి ఆమోదముద్ర వేయించాలనుకున్నారు. కానీ ఆయన దాన్ని పరిశీలించి పెద్దమొత్తానికి సంబంధించిన అంశం కావటంతో... కొత్త ప్రభుత్వం కొలువుదీరాక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తిప్పిపంపారు. దీంతో రూ.150 కోట్ల చెల్లింపు నిలిచిపోయింది. ఇప్పుడు ఆ ఫైలు తెలంగాణ ప్రభుత్వం దృష్టికొచ్చింది. దీంతో కూపీలాగితే ఈ వ్యవహారం వెలుగు చూసింది. తొలుత ప్రభుత్వం రుణంగా ఇచ్చిన రూ.105 కోట్ల నుంచి కూడా కాంట్రాక్టర్లకు ‘ఎస్కలేషన్’పేరుతో ఎంతిచ్చారనే వివరాలను గృహనిర్మాణ శాఖ అధికారులు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. -
తూర్పు కార్పొరేషన్లో కుంభకోణం
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. గత 19 నెలలుగా రూ.25 కోట్లమేర అక్రమాలు జరిగిన విషయం బట్టబయలైంది. కార్పొరేషన్ వినియోగిస్తున్న ట్రక్కులు, లోడర్ల కోసం రూ.63.10 లీటర్ చొప్పున గత 19 నెలలుగా డీజిల్‌ను కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఇది మార్కెట్ ధరకంటే రూ.10.04 ఎక్కువ. అందులో కొన్ని ట్రక్కులు తిరగకపోయినా కూడా రోజుకు 50 లీటర్లు కొనుగోలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఈ అక్రమాలకు బాధ్యులైన ఇద్దరు అధికారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌తో పోలిస్తే తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కేవలం డీజిల్‌పైనే రూ.2.06 కోట్లు అధనంగా ఖర్చు చేసింది. నిజానికి మార్కెట్ ధరకంటే రూ.10.04 ఎక్కవ వెచ్చించి తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నేరుగా చమురు కంపెనీల నుంచే డీజిల్‌ను కొనుగోలు చేస్తున్నట్లు పత్రాలు చూపుతున్నాయి. ఈ విషయమై స్టాండింగ్ కమిటీ చైర్మన్ మెహక్ సింగ్ మాట్లాడుతూ... వాహనాల అద్దె విషయంలో కూడా అవకతకవకలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. రూ.212 అద్దెను అదనంగా చెల్లిస్తున్నట్లు కూడా రికార్డుల్లో ఉంది. కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి చెత్తను సేకరించి, ఘాజీపూర్ డంప్ యార్డుకు తరలించేందుకు ఈ ట్రక్కులను, లోడర్లను వినియోగిస్తారు. నిబంధనల ప్రకారం రీడింగ్‌లో నమోదైన కిలోమీటర్ల ప్రకారం ఇంధనాన్ని నింపుకోవాల్సి ఉంటుంది. అయితే అన్ని వాహనాలకు గంపగుత్తగా ప్రతిరోజూ 50 లీటర్ల డిజిల్‌ను నింపినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. ఇక వాహనాల అద్దె విషయంలో ఇంజనీర్-ఇన్ చీఫ్ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ జూనియర్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు కూడా చొరవ తీసుకొని బిల్లులను చెల్లించారు. ఇది కార్పొరేషన్ నిబంధనలను ఉల్లంఘించడమే. వాహనాల విడిభాగాల విషయంలోనూ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. కొనుగోలు చేసిన విడిభాగాల నాణ్యత కూడా నాసిరకంగా ఉన్నట్లు స్పష్టమైంది. చిత్రమేమిటంటే కొనుగోలు చేసిన విడిభాగాలను వాహనాలకు ఇంకా బిగించనేలేదు. ఇప్పటికీ మరమ్మతులకు నోచుకోకుండానే వాహనాలు తిరుగుతున్నాయి. అయినప్పటికీ మరమ్మతుల కోసం రూ.30 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతున్నారు. ఇలా అన్ని అక్రమాల విలువ రూ. 25 కోట్లపైనే ఉంటుందని అంచనా వేస్తున్నామ’న్నారు.ఇదిలాఉండగా అక్రమాలకు పాల్పడిన ఇద్దరు అధికారులపై కార్పొరేషన్ చర్యలకు ఉపక్రమించిందని, వారిపై భారీ జరిమానా విధించే యోచనలో కమిషనర్ ఉన్నట్లు సమాచారం. ఈ అక్రమాల విషయాన్ని కమిషనర్ కుమారస్వామి కూడా అంగీకరించారు. ‘కార్పొరేషన్ అధికారులు తక్కువ ధరకే ఇంధనాన్ని కొనుగోలు చేసినట్లు రుజువైతే వారిపై చర్యలు తప్పవు. మిగతా కార్పొరేషన్లతో పోలిస్తే తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చాలా తక్కువ. దీంతో ఇంధన వినియోగం కూడా తక్కువగా ఉండాలి. కానీ దీనికి భిన్నంగా మిగతా కార్పొరేషన్ల కంటే ఇంధన ఖర్చు ఎక్కువగా ఉండడం అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తుయ’న్నారు. ఆరోపణలు నిజమని తేలితే అక్రమాలకు పాల్పడినవారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. మిగతా విషయాల్లో కూడా ఏవైనా అక్రమాలు జరిగాయా అనే కోణాల్లో కూడా దర్యాప్తు జరిపేందుకు సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారి చేస్తామని కమిషనర్ చెప్పారు.