జి. రామచంద్రారెడ్డి- సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఒక పని చేయాలంటే అందుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫైలు పెట్టాలి. ఎన్నో రకాల అనుమతులు కావాల్సి ఉంటుంది. అదే నగదుకు సంబంధించినదైతే ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎన్నో నిబంధనలుంటాయి. కానీ దాదాపు రూ.వెయ్యి కోట్ల వ్యవహారంలో ఎలాంటి అనుమతులూ లేవు. అసలు ఒక్క ఫైలు కూడా లేదు. ఉన్నతాధికారులకు అసలు తెలియనే తెలియదు. ప్రైవేటు సంస్థలతో పని చేయించేందుకు అవసరమైన ఎంఓయూలు (అవగాహనా ఒప్పందాలు)లేవు. కింది స్థాయి అధికారులతో తతంగం నడిపించేశారు. రూ.6వేలకు పని చేస్తామని ముందుకొచ్చిన సంస్థను కాదని అంతకు ఐదు రెట్లు ఎక్కువ కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగించారు.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవినీతి బాగోతాలలో ఇదో మకిలి వ్యవహారం. వైద్య ఆరోగ్య శాఖను గబ్బు పట్టించిన ఈ తతంగాన్ని చూద్దాం పదండి..
వైద్య ఆరోగ్య రంగాన్ని అలక్ష్యం చేసి ప్రజల బాగోగులను గాలికి వదిలేసిన గత సర్కారు ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు మాత్రం ఏ ఒక్క మార్గాన్నీ విడిచిపెట్టలేదు. ఆరోగ్య ఉపకేంద్రాల్లో టెలిమెడిసిన్ హబ్‌ల ఏర్పాటు పేరుతో గత సర్కారు హయాంలో జరిగిన భారీ కుంభకోణం ఇది. తరచి చూస్తే నిర్ఘాంతపోయే వాస్తవాలు బైటపడ్డాయి. మారుమూల ప్రాంతాలకు ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలందించేందుకు టెలిహబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఘనంగా ప్రకటించారు. కానీ ఆ ముసుగులో దాదాపు రూ.వెయ్యి కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన కొందరు టీడీపీ నేతల సహకారంతో వైద్య ఆరోగ్యశాఖలో ఈ తతంగం నడిచినట్లు గుర్తించారు.
టెలి మెడిసిన్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో..
వైద్య ఆరోగ్యశాఖ అధికారులు 2018లో టెలి మెడిసిన్ హబ్స్, ఐటీ సొల్యూషన్స్ పేరుతో టెండర్లు పిలిచారు. 5,500 ఆరోగ్య ఉపకేంద్రాల్లో టెలిమెడిసిన్ హబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ హబ్‌ల ద్వారా మారుమూల ప్రాంతాల రోగులకు టెలి మెడిసిన్‌తో మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఒక్కో కేంద్రం నిర్వహణకు నెలకు రూ.6 వేల చొప్పున పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన సంస్థను తప్పించి రూ.28 వేలు కోట్ చేసిన ధనుష్ ఇన్ఫోటెక్ అనే సంస్థకు అప్పగించారు. ఎల్ 2 సంస్థకు ఇవ్వాలంటే ఎల్ 1 ధరకు అంగీకరించాలి.
లేదంటే ఇంకా తక్కువకు చేయడానికి సిద్ధపడాలి. అవేవీ కాకపోయినా 2019లో ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థకు 3,010 సెంటర్లు, వరల్డ్ హెల్త్ పార్ట్‌నర్ అనే మరో సంస్థకు 2,490 కేంద్రాలను అప్పగించారు. ఒక్కో కేంద్రం నిర్వహణ వ్యయం రూ.28 వేలు కాగా నెలకు రూ.15.4 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.924 కోట్లకుపైగా చెల్లించేలా గుట్టుగా వ్యవహారం సాగింది. అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై ఉన్నతాధికారులు సంతకాలు చేయలేదు. అప్పటి ప్రజారోగ్య సంచాలకులతో కథ నడిపించారు. లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ) మరో కిందిస్థాయి అధికారితో తీసుకున్నారు.
ఒప్పందం ఏమిటి?
5,500 ఆరోగ్య ఉపకేంద్రాల్లో టెలిమెడిసిన్ ఐటీ సొల్యూషన్స్ సేవలందించాలి. ఇంటర్నెట్‌తో పాటు టెలి వీడియో కన్సల్టెన్సీ, డ్రగ్ వెండింగ్ మెషీన్లు, మల్టీ పారామానిటర్ లాంటివి ఏర్పాటు చేయాలి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇవి పనిచేయాలి. వీటితో పాటు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, డయాబెటిస్, రక్తపోటు లాంటి జబ్బులకు స్క్రీనింగ్ చేయాలి.
ధనుష్ సంస్థకు ఇచ్చిన టెర్మినేషన్ నోటీసు కాపీ..
నిర్వహణ దారుణం..
టెండరు నిబంధనల ప్రకారం 2019 ఏప్రిల్ నాటికి 5,500 ఆరోగ్య ఉప కేంద్రాలలో నిర్వహణ సంస్థల సేవలు ప్రారంభం కావాల్సి ఉండగా కేవలం 500 కేంద్రాల్లో అరకొరగా మొదలయ్యాయి. రోగ నిర్ధారణ పరీక్షలు చేయలేదు. ఐటీ సొల్యూషన్స్ అభివృద్ధి చేయలేదు. 40 రకాల మందులను పంపిణీ చేయాల్సి ఉండగా ఒక్కటీ ఇవ్వలేదు. క్యాన్సర్ స్క్రీనింగ్ లేదు. సర్వీస్ ప్రొవైడర్ సేవలను కోర్‌డాష్ బోర్డుకు రోజూ అనుసంధానించాలన్న నిబంధనను గాలికి వదిలేశారు. ఆరోగ్యశాఖలో అతి పెద్దదిగా చెప్పుకునే ఈ ప్రాజెక్టు నిర్వహణ సంస్థలతో గత ప్రభుత్వ పెద్దలు భారీగా లావాదేవీలు చేసుకున్నట్లు తేలింది. ప్రపంచ బ్యాంకు దీనికి ఎలాంటి నిధులు ఇవ్వలేదు. కనీసం ఫైలు కూడా లేకుండా చేశారంటే ఇందులో ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయో అంచనా వేయొచ్చు.
బండారం ఇలా బయట పడింది
2019 జూన్ తర్వాత నిర్వహణ సంస్థ టెలిమెడిసిన్, ఐటీ సొల్యూషన్స్ పేరిట కుటుంబ సంక్షేమశాఖకు బిల్లులు రావడంతో బాగోతం బయటపడింది. దీనికి సంబంధించి కనీసం ఫైలు కూడా లేకపోవడంతో ఇద్దరు అధికారులకు నోటీసులు ఇవ్వగా అప్పటి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి మౌఖిక ఆదేశాల మేరకు నడుచుకున్నట్లు వెల్లడించారు. భారీ అవకతవకలు జరిగినట్లు తేలడంతో ఈ ప్రాజెక్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రాజెక్టును రద్దు చేయడంతో పాటు నిర్వహణ సంస్థలకు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. ముగ్గురు అధికారులు ఇందులో కీలక పాత్ర పోషించినట్లు కుటుంబ సంక్షేమశాఖ విచారణలో తేలింది.
రూ.90 కోట్లు ఇవ్వండి
టెలిమెడిసిన్ పేరుతో అప్పట్లో ధనుష్ సంస్థ నిర్వహణ చేపట్టింది. ఆ తర్వాత తమకు రూ.90 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలని కోర్టులో వ్యాజ్యం వేసింది. నిర్వహణ వ్యయం కింద ప్రభుత్వం తనకు ఇప్పటివరకూ రూ.10 కోట్లే ఇచ్చిందని, మరో రూ.90 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. దీనిపై కోర్టు ఇంకా ఎలాంటి తీర్పు ఇవ్వలేదు.
రూ.1,026 కోట్లు రికవరీ చేస్తాం
నిర్వహణ సంస్థ సరిగా టెలిమెడిసిన్ సేవలు చేయకపోవడంతో దీనివల్ల ప్రజలకు రూ.1026 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, ఈ సొమ్మును మీరు ఇవ్వాల్సి ఉందని ధనుష్ సంస్థకు కుటుంబ సంక్షేమశాఖ నోటీసులు జారీచేసింది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ)తో పాటు, గర్భిణుల వైద్యపరీక్షలు ఇలా రకరకాల సేవలు చేయకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి, రూ.1026 కోట్లమేరకు వ్యయం చేశారని, ఈ సొమ్ము మీరే చెల్లించాలని ధనుష్ సంస్థకు నోటీసులు జారీచేసింది.
చాలా రకాల సేవలు అందించలేకపోయారు..
నిర్వహణ సంస్థ అందించాల్సిన సేవలపై ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. ఇందులో పలు రకాల సేవలు ఉన్నాయి. అవేమిటంటే..
♦టెలిమెడిసిన్ అప్లికేషన్‌ను సరిగా నిర్వహించలేక పోయారు.
♦ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా నిర్వహణ చేయలేక పోవడం వల్ల వీడియో కన్సల్టెన్సీ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
♦జీవనశైలి జబ్బులకు సంబంధించిన పరీక్షలు (30 సంవత్సరాలు దాటిన మహిళలకు) రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి టెస్టులు చేయలేదు.
♦ సబ్ సెంటర్లలో మల్టీ పారామానిటరింగ్ చేయకపోవడం వల్ల టెస్టులు జరగలేదు.
♦డ్రగ్ వెండింగ్ మెషీన్ల నిర్వహణ లేదు. దీనిపై ఎవరైనా అడిగినా సరిగా స్పందించలేదు. దీనివల్ల రోగులు మందులు తీసుకోలేక పోయారు.
♦ప్రతి గర్భిణికి యాంటీనేటల్ చెకప్స్ (ఏఎన్‌సీ)చేయాల్సి ఉంది. కానీ వీరికి పరీక్షలు చేయలేకపోయారు.
♦టెలిమెడిసిన్ హబ్స్‌ను సరిగా ఏర్పాటు చేయకపోవడమే కాదు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిర్వహణ చేయలేకపోయారు.
అప్పుడు ప్రైవేటుకు.. ఇప్పుడు ప్రభుత్వమే
ప్రైవేటు సంస్థకు ఇవ్వకుండా ఇదే ఆరోగ్య ఉపకేంద్రాల్లో ప్రభుత్వమే టెలీమెడిసిన్, ఈ–సంజీవనీ ఓపీడీ పేరుతో ఉచితంగా నిర్వహణ చేపట్టింది. ఇప్పటికే 2,960 కేంద్రాల్లో సేవలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ నెలాఖరుకు మరో 3 వేల కేంద్రాల్లో టెలిమెడిసిన్ సేవలు అందుబాటులోకి తేనున్నారు. మార్చి చివరి నాటికి 10,051 కేంద్రాల్లో టెలిమెడిసిన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. కనిష్టంగా రోజుకు లక్ష మందికి ప్రభుత్వమే సేవలు ఉచితంగా అందిస్తోంది. గతంలో ప్రైవేటు సంస్థ నిర్వహణకంటే మెరుగైన సేవలు అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే అత్యంత అద్భుతంగా టెలిమెడిసిన్ సేవలు ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతున్నట్టు జాతీయ హెల్త్‌మిషన్ పేర్కొంది.
నివేదిక ఆధారంగా చర్యలు
ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవు. నిర్వహణ కూడా లేదు. దీనికి బాధ్యులైన అధికారులను గుర్తించాం. నివేదికను ప్రభుత్వానికి పంపుతున్నాం. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటుంది.
– అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి
ఇవీ చదవండి:
బడికి వెళ్లకుంటే.. వలంటీర్ వస్తారు!
మంత్రి వేముల పీఆర్‌వోపై కేసు: భార్యపై దాడి చేసిన వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment