మీరు వెళ్లిపోండి.. లేదంటే.. | 104 staff protest across the state | Sakshi
Sakshi News home page

మీరు వెళ్లిపోండి.. లేదంటే..

Published Wed, Nov 6 2024 4:19 AM | Last Updated on Wed, Nov 6 2024 4:19 AM

104 staff protest across the state

108, 104 వాహనాల నిర్వహణ నుంచి తప్పుకోవాలని అరబిందోపై సర్కారు కత్తి 

గడువున్నా ఉన్నపళంగా ఎంఓయూ రద్దుచేసుకోవాలని అల్టిమేటం 

ఆలస్యం చేసేకొద్దీ ఇబ్బందులు తప్పవని బెదిరింపులు 

తొలుత సబ్‌కాంట్రాక్టు ఇచ్చి తప్పుకోవాలని సూచన 

కానీ, చివరికి అరబిందో ప్రస్తావనే లేకుండా చేయాలని స్కెచ్‌ 

అందుకే ఎంఓయూను రద్దుచేసుకుని వెళ్లిపోవాలని హెచ్చరిక 

అస్మదీయులకు కట్టబెట్టడానికి ప్రభుత్వం కుట్ర 

ఐదు నెలలుగా నయాపైసా కూడా చెల్లించని వైనం 

బిల్లులు చెల్లించాలని కోరినా కనికరించని ప్రభుత్వం  

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కట్టబెట్టిన కాంట్రాక్టులను ఇప్పుడు తన అస్మదీయులకు కట్టబెట్టేందుకు సామదానభేద దండోపాయాలు ఉపయోగిస్తున్న టీడీపీ కూటమి సర్కారు బాగోతాల్లో మరొకటి వెలుగులోకి వచ్చి0ది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కాలపరిమితి ఉన్నప్పటికీ ఉన్నఫళంగా రద్దుచేసుకుని వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేస్తూ రాష్ట్రంలో కాంట్రాక్టు సంస్థలను బెంబేలెత్తిస్తోంది. 

పైగా.. నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా పొగపెడుతూ ‘మీ అంతట మీరు వెళ్లిపొండి’ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఉన్నతాధికారుల ద్వారా హెచ్చరిస్తోంది. 108 అంబులెన్సులు, 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ)ల నిర్వహణ విషయంలో ఇప్పుడిదే జరుగుతోంది. 

గత ప్రభుత్వంలో ఈ రెండు సర్వీసుల నిర్వహణ కాంట్రాక్టును అరబిందో సంస్థ దక్కించుకుంది. 2027 వరకూ ఈ కాంట్రాక్టు కాలపరిమితి ఉంది. కానీ, ఉన్నఫళంగా ఎంఓయూను రద్దుచేసుకుని వెళ్లిపోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.   

పైసా విదల్చని ప్రభుత్వం.. 
104, 108 వాహనాల నిర్వహణను తన అస్మదీయులకు కట్టబెట్టేందుకు ప్రస్తుత నిర్వహణ సంస్థ అరబిందోను రాష్ట్ర ప్రభుత్వం పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వైద్యశాఖ వర్గాల్లోనే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహణ సంస్థకు నయాపైసా చెల్లించలేదు. సాధారణంగా ప్రతి మూడునెలలకు ఒకసారి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయాల్సి ఉంటుంది. 

కానీ, ఏప్రిల్‌ నుంచి అక్టోబరు మధ్య రెండు క్వార్టర్లకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ఇప్పటివరకూ మంజూరు చేయలేదు. ‘సిబ్బందికి మూడునెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. పైగా.. వాహనాలను నడపాలంటే రోజుకు రూ.20 లక్షలు డీజిల్‌ కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. డీజిల్‌ కొనుగోలుకు కూడా ఇబ్బంది పడుతున్నాం’.. అని ప్రభుత్వానికి సంస్థ తెలియజేసినా చంద్రబాబు సర్కారు కనికరించడంలేదు.  

వీలైనంత త్వరగా రద్దుచేసుకోండి.. 
ప్రభుత్వం తమపట్ల విముఖత వ్యక్తపరుస్తుండటంతో చేసేదేమీ లేక మీరెలా చెబితే అలా చేస్తామని సంస్థ యాజమాన్యం తెలియజేసింది. ఎంఓయూలోని నిబం­ధనల ప్రకారం సబ్‌ కాంట్రాక్టు ఇచ్చి మీరు పక్కకు తప్పుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో.. ప్రభుత్వ పెద్దలు చెప్పిన జేవీ కంపెనీ ఆఫ్‌ ఎమర్జెంట్‌ మెడికల్‌ సర్వీసెస్, యునైటెడ్‌ హెల్త్‌కేర్‌ సంస్థలకు సబ్‌ కాంట్రాక్టు ఇవ్వాలని అరబిందో సంస్థ కూడా వైద్యశాఖకు ప్రతిపాదించింది.

అయితే, ఆయా సంస్థలకు సబ్‌ కాంట్రాక్టు ఇచ్చినప్పటికీ అరబిందో సంస్థ పేరిటే కార్యకలాపాలన్నీ నడుస్తాయి కాబట్టి అరబిందో ప్రస్తావనే లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో సబ్‌ కాంట్రాక్టు ప్రస్తావనను ప్రభుత్వం విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఎంఓయూను మీరే రద్దుచేసుకుని వెళ్లిపోండని అరబిందోకు తేల్చిచెప్పినట్లు సమాచారం. ఎలాగైనా ఎంఓయూ రద్దుచేసి తీరాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండటంతో వైద్యశాఖ ఉన్నతాధికారులు సైతం ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. 

వీలైనంత త్వరగా ఎంఓయూ రద్దు చేసుకోండని సంస్థ ప్రతినిధులతో ఇప్పటికే పలుమార్లు చర్చించారు. అంతేకాక.. ప్రభుత్వానికి విస్తృతమైన అధికారులున్నాయని, కాంట్రాక్టును రద్దుచెయ్యొచ్చని బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ‘యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (యూకే ఎన్‌హెచ్‌ఎస్‌) నిర్వహణ కాంట్రాక్టులో భాగస్వామిగా ఉందని.. ఇక్కడి పరిస్థితులపై సమాచారం ఇచ్చామని.. ఆ సంస్థ స్పందన ఆధారంగా ఎంఓయూ రద్దుపై తుది నిర్ణయం తెలియజేస్తాం’.. అని అరబిందో చెప్పినట్లు సమాచారం.  

సిబ్బందిలో ఆందోళన 
మరోవైపు.. ఇప్పటికే మూడు నెలలుగా వేతనాల్లేక 104, 108లో పనిచేసే 6,500 మంది సిబ్బంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దసరా, దీపావళి ఇలా పండుగలన్నీ పస్తులతోనే గడిపారు. ఈ పరిస్థితుల్లో నిర్వహణ సంస్థ మారుతోందంటూ ప్రభుత్వమే ఎల్లో మీడియాలో లీకులిచ్చి కథనాలు రాయిస్తుండడంతో సిబ్బంది కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. నిర్వహణ సంస్థ మారితే తమకు రావాల్సిన బెని్ఫట్స్‌ రాకుండా పోతాయేమోనని వారు ఆవేదన చెందుతున్నారు.  

పెండింగ్‌ వేతనాలు చెల్లించండి
రాష్ట్రవ్యాప్తంగా 104 సిబ్బంది నిరసన
పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనా­లను తక్షణమే చెల్లించడంతో పాటు, ఉద్యోగ భద్రత సహా పలు డిమాండ్ల పరిష్కారం ఎజెండాగా 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ) సిబ్బంది నిరసన బాట పట్టారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మండలాల్లో మెడికల్‌ ఆఫీసర్లకు తమ సమస్యలపై డీఈవోలు, డ్రైవర్లు వినతి పత్రాలు అందజేశారు. బుధవారం డీఎంహెచ్‌వోలు, ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంలోనూ నోడల్‌ అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని ఏపీ 104 ఎంఎంయూ ఎంప్లాయీస్‌ యూని­యన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఫణికుమార్‌ తెలిపారు. 

8వ తేదీ తహసీల్దార్‌లు, ఎంపీడీవోలకు, 10న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తా­మని వెల్ల­డించారు. 11న గ్రీవెన్స్‌లో వినతు­లిస్తామని, 14వ తేదీన డ్రైవర్లు, డీఈవోలు అధికారిక గ్రూప్‌ల నుంచి లెఫ్ట్‌ అయి పనులు నిలుపుదల చేస్తామ­న్నారు. నిరసన చేస్తున్నన్ని రోజులూ నల్ల­బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement