108 vehicles
-
108 ఉద్యోగుల నిరసన
-
విజయవాడలో 108 సిబ్బంది ఆందోళన
-
ఆపద్భాంధవులకే ఆపద.. సమ్మె బాటలో 108 ఉద్యోగులు
సాక్షి, విజయనగరం జిల్లా : అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడే 108 ఉద్యోగులకు ఇప్పుడు పుట్టెడు కష్టాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 108 ఉద్యోగులు తరచూ వేతనాలు సకాలంలో అందక నానా అవస్థలు పడుతున్నారు. కుటుంబ భారాన్ని మోయలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ తరుణంలో తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ 108 ఉద్యోగులు రోడ్డెక్కనున్నారు. నవంబర్ 25 నుంచి సమ్మె చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు సమ్మె నోటీసులు అందించారు. జీతం బకాయిలు వెంటనే చెల్లించాలి. 108లను ప్రభుత్వమే నిర్వహించాలి. ఉద్యోగులను ఆరోగ్య శాఖ సిబ్బందిగా గుర్తించడంతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. -
మీరు వెళ్లిపోండి.. లేదంటే..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కట్టబెట్టిన కాంట్రాక్టులను ఇప్పుడు తన అస్మదీయులకు కట్టబెట్టేందుకు సామదానభేద దండోపాయాలు ఉపయోగిస్తున్న టీడీపీ కూటమి సర్కారు బాగోతాల్లో మరొకటి వెలుగులోకి వచ్చి0ది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కాలపరిమితి ఉన్నప్పటికీ ఉన్నఫళంగా రద్దుచేసుకుని వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేస్తూ రాష్ట్రంలో కాంట్రాక్టు సంస్థలను బెంబేలెత్తిస్తోంది. పైగా.. నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా పొగపెడుతూ ‘మీ అంతట మీరు వెళ్లిపొండి’ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఉన్నతాధికారుల ద్వారా హెచ్చరిస్తోంది. 108 అంబులెన్సులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)ల నిర్వహణ విషయంలో ఇప్పుడిదే జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఈ రెండు సర్వీసుల నిర్వహణ కాంట్రాక్టును అరబిందో సంస్థ దక్కించుకుంది. 2027 వరకూ ఈ కాంట్రాక్టు కాలపరిమితి ఉంది. కానీ, ఉన్నఫళంగా ఎంఓయూను రద్దుచేసుకుని వెళ్లిపోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. పైసా విదల్చని ప్రభుత్వం.. 104, 108 వాహనాల నిర్వహణను తన అస్మదీయులకు కట్టబెట్టేందుకు ప్రస్తుత నిర్వహణ సంస్థ అరబిందోను రాష్ట్ర ప్రభుత్వం పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వైద్యశాఖ వర్గాల్లోనే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహణ సంస్థకు నయాపైసా చెల్లించలేదు. సాధారణంగా ప్రతి మూడునెలలకు ఒకసారి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ, ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య రెండు క్వార్టర్లకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ఇప్పటివరకూ మంజూరు చేయలేదు. ‘సిబ్బందికి మూడునెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. పైగా.. వాహనాలను నడపాలంటే రోజుకు రూ.20 లక్షలు డీజిల్ కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. డీజిల్ కొనుగోలుకు కూడా ఇబ్బంది పడుతున్నాం’.. అని ప్రభుత్వానికి సంస్థ తెలియజేసినా చంద్రబాబు సర్కారు కనికరించడంలేదు. వీలైనంత త్వరగా రద్దుచేసుకోండి.. ప్రభుత్వం తమపట్ల విముఖత వ్యక్తపరుస్తుండటంతో చేసేదేమీ లేక మీరెలా చెబితే అలా చేస్తామని సంస్థ యాజమాన్యం తెలియజేసింది. ఎంఓయూలోని నిబంధనల ప్రకారం సబ్ కాంట్రాక్టు ఇచ్చి మీరు పక్కకు తప్పుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో.. ప్రభుత్వ పెద్దలు చెప్పిన జేవీ కంపెనీ ఆఫ్ ఎమర్జెంట్ మెడికల్ సర్వీసెస్, యునైటెడ్ హెల్త్‌కేర్ సంస్థలకు సబ్ కాంట్రాక్టు ఇవ్వాలని అరబిందో సంస్థ కూడా వైద్యశాఖకు ప్రతిపాదించింది.అయితే, ఆయా సంస్థలకు సబ్ కాంట్రాక్టు ఇచ్చినప్పటికీ అరబిందో సంస్థ పేరిటే కార్యకలాపాలన్నీ నడుస్తాయి కాబట్టి అరబిందో ప్రస్తావనే లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో సబ్ కాంట్రాక్టు ప్రస్తావనను ప్రభుత్వం విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఎంఓయూను మీరే రద్దుచేసుకుని వెళ్లిపోండని అరబిందోకు తేల్చిచెప్పినట్లు సమాచారం. ఎలాగైనా ఎంఓయూ రద్దుచేసి తీరాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండటంతో వైద్యశాఖ ఉన్నతాధికారులు సైతం ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. వీలైనంత త్వరగా ఎంఓయూ రద్దు చేసుకోండని సంస్థ ప్రతినిధులతో ఇప్పటికే పలుమార్లు చర్చించారు. అంతేకాక.. ప్రభుత్వానికి విస్తృతమైన అధికారులున్నాయని, కాంట్రాక్టును రద్దుచెయ్యొచ్చని బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ‘యునైటెడ్ కింగ్డమ్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ (యూకే ఎన్హెచ్ఎస్) నిర్వహణ కాంట్రాక్టులో భాగస్వామిగా ఉందని.. ఇక్కడి పరిస్థితులపై సమాచారం ఇచ్చామని.. ఆ సంస్థ స్పందన ఆధారంగా ఎంఓయూ రద్దుపై తుది నిర్ణయం తెలియజేస్తాం’.. అని అరబిందో చెప్పినట్లు సమాచారం. సిబ్బందిలో ఆందోళన మరోవైపు.. ఇప్పటికే మూడు నెలలుగా వేతనాల్లేక 104, 108లో పనిచేసే 6,500 మంది సిబ్బంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దసరా, దీపావళి ఇలా పండుగలన్నీ పస్తులతోనే గడిపారు. ఈ పరిస్థితుల్లో నిర్వహణ సంస్థ మారుతోందంటూ ప్రభుత్వమే ఎల్లో మీడియాలో లీకులిచ్చి కథనాలు రాయిస్తుండడంతో సిబ్బంది కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. నిర్వహణ సంస్థ మారితే తమకు రావాల్సిన బెని్ఫట్స్ రాకుండా పోతాయేమోనని వారు ఆవేదన చెందుతున్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించండిరాష్ట్రవ్యాప్తంగా 104 సిబ్బంది నిరసనపెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలను తక్షణమే చెల్లించడంతో పాటు, ఉద్యోగ భద్రత సహా పలు డిమాండ్ల పరిష్కారం ఎజెండాగా 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) సిబ్బంది నిరసన బాట పట్టారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మండలాల్లో మెడికల్ ఆఫీసర్లకు తమ సమస్యలపై డీఈవోలు, డ్రైవర్లు వినతి పత్రాలు అందజేశారు. బుధవారం డీఎంహెచ్వోలు, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలోనూ నోడల్ అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని ఏపీ 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఫణికుమార్ తెలిపారు. 8వ తేదీ తహసీల్దార్లు, ఎంపీడీవోలకు, 10న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని వెల్లడించారు. 11న గ్రీవెన్స్‌లో వినతులిస్తామని, 14వ తేదీన డ్రైవర్లు, డీఈవోలు అధికారిక గ్రూప్‌ల నుంచి లెఫ్ట్ అయి పనులు నిలుపుదల చేస్తామన్నారు. నిరసన చేస్తున్నన్ని రోజులూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామన్నారు. -
13 ఏళ్లుగా '108 అంబులెన్స్' రూపంలో.. వెంటాడిన మృత్యువు!
వరంగల్: 108.. ఈ నంబర్ వినగానే మృత్యువు దారిదాపుల్లో ఉన్న వారి ప్రాణాలు లేచి వస్తాయి. ఈ వాహనం.. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన ఎంతో మందిని మృత్యువు అంచుల నుంచి కాపాడుతోంది. అయితే అదే వాహనం.. తన వద్దే ఈఎంటీగా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిని బలితీసుకుంది. ఆ ఉద్యోగిని విషయంలో మృత్యువు 13 ఏళ్ల నుంచి వెంటాడుతోంది. రెండు సార్లు రోడ్డు ప్రమాదాలకు గురి చేసింది. ఫలితంగా అందరికీ ప్రాణదాతగా ఉన్న 108 వాహనం తమ ఉద్యోగి పాలిట మృత్యుశకటంగా మారి బలితీసుకున్న ఘటన సహా ఉద్యోగులు, బాధిత ఉద్యోగి కుటుంబీకులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. మొదటి నుండి ఇలా.. దివంగత నేత వైఎస్సార్ 108 వాహనాలు ప్రారంభించిన తొలిరోజులు.. 2007లో హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన సూదమళ్ల స్వప్న ఈఎంటీగా విధుల్లో చేరారు. విధుల్లో చురుకుగా ఉండే స్వప్న ఉత్తమ పనితీరుతో సహా ఉద్యోగులు, ఉన్నతాధికారుల ప్రశంసలతోపాటు పలు అవార్డులు అందుకున్నారు. విధుల్లో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు, హనుమకొండ, ఏటూరునాగారం, తాడ్వాయి, పరకాల తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 108 వాహనంలో 108 ప్రసవాలు చేసి రికార్డు సృష్టించారు. ఇలా హుషారుగా సాగుతున్న స్వప్న జీవితానికి, తన సంతోషానికి కారణమైన 108 వాహనమే ఈ విషాదానికి కారణమైంది. 2010 సంవత్సరంలోలో 108 వాహనంలో కేయూసీ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఓ ప్రమాద ఘటనా స్థలికి వెళుతుండగా కేయూసీ– హసన్‌పర్తి రోడ్డులో తమ 108 వాహనం ఘొర ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వప్న హైదరాబాద్‌లో చికిత్స పొందింది. అయితే మెదడులో తీవ్ర గాయం కావడంతో రక్తం గడ్డకట్టిందని వైద్యులు చెప్పారు. ఒకటికి మూడుసార్లు ఆపరేషన్లు చేశారు. అయినా పూర్తిగా కోలుకోలేకపోయింది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యపరిస్థితి పూర్తిగా దిగజారడంతో మళ్లీ విధుల్లో చేరింది. కరోనా కాలంలో రెట్టించిన ఉత్సాహంతో విధుల్లో చేరింది. తన పునర్జన్మ కరోనా బాధితుల కోసమే అంటూ ధైర్యంగా పనిచేసింది. కానీ స్వప్న విషయంలో విధి వెక్కిరించింది. 108 రూపంలో వెంటాడుతున్న మృత్యువు మరోసారి దెబ్బతీసింది. 2021లో పరకాల 108 వాహనంలో పనిచేస్తూ ఓ క్షతగాత్రుడిని ఎంజీఎం తరలించి వెళ్తోంది. ఈ క్రమంలో 108 వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఫలితంగా తను పనిచేస్తున్న వాహనం రెండోసారి మృత్యుశకటమై ఆసుపత్రి పాలు చేసింది. నాటి నుంచి స్వప్న మంచానికే పరిమితమైంది. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సహా ఉద్యోగులు తమకు తోచిన మేర ఆర్థిక సాయం చేశారు. దీంతో మరోమారు వారం క్రితం తను పనిచేసిన...తనను మృత్యుకూపంలోకి నెట్టిన 108వాహనంలో హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా స్వప్న తిరిగి రాలేదు. ఆదివారం కనిపించని లోకాలకు తరలింది. అదే సంస్థ వాహనంలో విగతజీవిగా వచ్చింది. 13 ఏళ్లు స్వప్నను వెంటాడి వధించిన మృత్యువు తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది. ఉద్యోగి కాదంటున్న యాజమాన్యం సుమారు దశాబ్దకాలం పాటు తమ సంస్థలో పని చేసి విధుల్లో ప్రమాదానికి గురై మృతి చెందిన స్వప్ర.. ప్రస్తుతం ఆ సంస్థకు కానిది అయింది. ఎందుకంటే కొద్ది రోజుల కిత్రం సంస్థ పేరును ‘గ్రీన్ హెల్త్ సర్వీస్’గా మార్చారు. మార్చిన తరువాత గతంలో ఉన్న ఉద్యోగుల నుంచి బయోమెట్రిక్, ఇతర సమాచారం తీసుకుని నమోదు చేసుకున్నారు. ఆ సమయంలో స్వప్న మంచానికే పరిమితమైంది. దీంతో తమ సంస్థలో పనిచేస్తున్నట్లు కొత్త ఐడీ నంబర్ ఉంటేనే గుర్తింపు ఇస్తామని సంస్థ చెపుతోందని సహా ఉద్యోగులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇది అన్యాయమని వారు వాపోతున్నారు. కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే.. కడు పేద కుటుంబంలో ఉన్న స్వప్న ఒంటరిగా ఉంటోంది. తన అక్కకు ముగ్గురు సంతానం. ఇందులో ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అక్కకు భర్త లేడు. దీంతో వారిలో ఒక కూతురును స్వప్న పెంచుకోవడంతోపాటు అక్క కుటుంబ బాధ్యతలు తనే చూస్తోంది. స్వప్న మృతితో ఇప్పుడు తమకు ఎలాంటి ఆధారం లేకుండా పోయిందని ఆ కుటుంబం రోదిస్తోంది. దశాబ్దానికి పైగా 108లో సేవలందించి అందరికీ దూరమైన స్వప్న విషయంలో ప్రభుత్వం స్పందించాలని సహా ఉద్యోగులు, కుటుంబీకులు కోరుతున్నారు. సంస్థకూడా ఉద్యోగిగా గుర్తించి పరిహారం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. స్వప్న విషయంలో సంస్థ గుర్తింపు ఇవ్వడానికి సాంకేతిక కారణాలు చూపినా అందులో ఉన్న ఉద్యోగులు మానవత్వం చాటుకున్నారు. సంస్థ రాష్ట్ర బాధ్యుడు ఖలీద్ సూచన మేరకు జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్ ఆధ్వర్యంలో స్వప్న అంత్యక్రియలకు ఆదివారం రూ. 10 వేలు అందించారు. మిగతా విషయాలు తమ పరిధిలో లేవన్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇవి చదవండి: ప్రాణం పోస్తారనుకుంటే.. తీశారు! -
108 సేవలకు రూ.725 కోట్లు
సాక్షి, అమరావతి: అనుకోని ప్రమాదాలు, అనారోగ్య సమస్యలకు గురై ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న వారికి 108 అంబులెన్స్‌లు సంజీవనిలా మారాయి. ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను వేగంగా ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలను నిలబెడుతున్నాయి. ప్రాణం విలువ తెలిసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం టీడీపీ హయాంలో నిర్వీర్యమైన 108 వ్యవస్థకు ఊపిరి పోసింది. 768 అంబులెన్స్‌ల ద్వారా ప్రజలకు ఉచితంగా సేవలందించేందుకు ఇప్పటి వరకూ రూ.589 కోట్లను ఖర్చు చేయగా కొత్త వాహనాల కొనుగోలుకు మరో రూ.136 కోట్లకుపైగా వ్యయం చేయడం గమనార్హం. గర్భిణులే అత్యధికం.. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సగటున మూడు వేల మందికి అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్‌లు సేవలందిస్తున్నాయి. 2020 జూలై నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు నాటికి 36 లక్షల మంది సేవలు పొందారు. వీరిలో అత్యధికంగా 23 శాతం మంది గర్భిణులుండగా 14 శాతం కిడ్నీ బాధితులు, 11 శాతం మంది రోడ్డు ప్రమాద బాధితులున్నారు. నిర్వహణకు ఏటా రూ.188 కోట్లకు పైగా రోడ్డు ప్రమాదాల బాధితులు, గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని ఎంత త్వరగా ఆస్పత్రికి తరలిస్తే ప్రాణ రక్షణకు అంత ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో 108 అంబులెన్స్‌ల నిర్వహణ, ఉచితంగా అత్యవసర రవాణా సేవలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. క్షేత్ర స్థాయిలో అంబులెన్స్ కార్యకలాపాల కోసం 3700 మందికి పైగా విధులు నిర్వహిస్తుండగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లో మరో 311 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరికి వేతనాలతో పాటు అంబులెన్స్‌ల నిర్వహణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. ప్రతి నెలా 108 అంబులెన్సుల నిర్వహణ కోసం రూ.14.39 కోట్లు వెచ్చిస్తోంది. ఏడాదికి రూ.172.68 కోట్లను నిర్వహణ కోసం కేటాయిస్తోంది. దీనికి తోడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోంది. అంటే ఏడాదికి మొత్తం రూ.188 కోట్లకు పైగా వ్యయం చేస్తోంది. గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకంగా వాహనాలు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉండగా మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితికి తెర దించుతూ సీఎం జగన్ 2020 జూలై 1న ఏకంగా 412 కొత్త 108 అంబులెన్సులను ప్రారంభించారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందుకోసం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా 20 కొత్త అంబులెన్స్‌లను రూ.4.76 కోట్లతో 2022 అక్టోబర్‌లో అదనంగా కొనుగోలు చేశారు. దీంతో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కి.మీకిపైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో ఈ ఏడాది జూలైలో 146 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు. వీటి కొనుగోలుకు ప్రభుత్వం మరో రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది. ఇలా రూ.136.02 కోట్లు అంబులెన్స్ కొనుగోలుకు వెచ్చించారు. తద్వారా నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలు కోసం రూ.725.02 కోట్లు ఖర్చు చేశారు. -
మరింత సేవకు..
సాక్షి, అమరావతి: అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా 146 కొత్త 108 వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం బయట ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్న ఆయన అత్యాధునిక వసతులతో కూడిన అంబులెన్స్ వాహనాన్ని పరిశీలించారు. ఇందులో ఉండే వసతుల గురించి వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సీఎంకు వివరించారు. అనారోగ్య బాధితులను ఏ విధంగా అంబులెన్స్‌లోకి ఎక్కిస్తారో సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేదికపైకి చేరుకుని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం జగన్ నివాళులు అర్పించారు. తర్వాత జెండా ఊపి అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఈ కార్య్రకమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ నందిగం సురేశ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిరప్రసాద్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా రూ.34.79 కోట్లతో 146 కొత్త అంబులెన్స్‌లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన 108 వ్యవస్థను బలోపేతం చేస్తూ 2020లోనే మండలానికి ఒక 108 అంబులెన్స్‌ను సమకూర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో 768 అంబులెన్స్‌లు ఉన్నాయి. కాగా, వీటిలో మరమ్మతులకు గురైన వాహనాల స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టారు. -
మళ్లీ జీవీకే చేతికి ‘108’.. మండలానికో అంబులెన్సు..
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు అత్యవసర వైద్య సేవలందించే ‘108’వాహన టెండర్‌ను మళ్లీ జీవీకే సంస్థే దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో జీవీకేతోపాటు మరో కంపెనీ పాల్గొంది. చివరకు జీవీకే సంస్థకే టెండర్ దక్కినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు ఈసారి 102 అమ్మ ఒడి, 104, ప్రభుత్వ ఆసుపత్రులనుంచి పేదల శవాలను వారి సొంతూళ్లకు ఉచితంగా తరలించేందుకు ఏర్పాటు చేసిన వాహనాల బాధ్యత కూడా జీవీకేకే అప్పగించారు. ప్రస్తు తం 50 వాహనాలు పేదల శవాలను ఆసుపత్రుల నుంచి సొంతూళ్లకు ఉచితంగా తీసుకెళ్తున్నాయి. ఈ నాలుగు సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఆ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం 358 వాహనాలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘108’అత్యవసర అంబులెన్స్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో అకస్మాత్తుగా వైద్యం అవసరమైన వారు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు ‘108’నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా ఈ అంబులెన్స్ సేవలను ఉచితంగా పొందుతున్నారు. ప్రస్తుతం 358 వాహనాలు ‘108’అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో 333 రోడ్లపై అందుబాటులో ఉండగా, మిగిలిన వాటిని రిజర్వులో ఉంచారు. అప్పట్లో కొన్ని వాహనాలు చెడిపోగా, వాటి స్థానంలో కొన్ని వాహనాలను గిఫ్ట్ ఎ స్మైల్ కింద రాజకీయ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు ఉచితంగా ఇచ్చారు. ప్రస్తుతం లక్ష మంది జనాభాకు ఒకటి చొప్పున ‘108’వాహనం ఉందని అధికారులు చెపుతున్నారు. ఫోన్ చేసిన దాదా పు 20 నిమిషాల్లో అంబులెన్స్ బాధితుల వద్దకు చేరుకోవాలనేది నిబంధన. ఈ అంబులెన్స్ సరీ్వసులను ప్రస్తుతం కూడా జీవీకే సంస్థనే నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 108 వాహనాల నిర్వహణకోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 86 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈసారి ఎంతకు ఖరారు చేశారన్న దానిపై స్పష్టత లేదు. పలు మార్పులకు శ్రీకారం.. ప్రస్తుతమున్న ‘108’అంబులెన్స్ సేవల్లో పలు మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు జీవీకే సంస్థ ఏర్పాట్లు చేసే అవకాశముంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేట్ ఆఫ్ ఆర్ట్ కాల్ సెంటర్‌కు రూపకల్పన చేస్తారు. దాని ద్వారా కంప్యూటర్ ఆధారంగా అంబులెన్సులను ఆటోమాటిక్‌గా నడిపిస్తారు. ఆటోమాటిక్ కాల్ డి్రస్టిబ్యూటర్ (ఏసీడీ) వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. కంప్యూటర్ టెలిఫోనీ ఇంటర్ఫేస్ (సీటీఐ), వాయిస్ లాగింగ్ కేపబిలిటీస్, జీపీఎస్ ఇంటిగ్రేషన్, హైలీ సెక్యూర్డ్ నెట్‌వర్క్‌లను రూపొందిస్తారు. ఈ వ్యవస్థ ప్రస్తుతానికే కాకుండా భవిష్యత్ అవసరాలకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అంతేకాక దీనిని విపత్తు నిర్వహణ విభాగానికి అనుసంధానం చేస్తారు. ఇది పోలీస్, ఫైర్ సరీ్వసులతోనూ అనుసంధానం అవుతుంది. అన్ని ‘108’అంబులెన్స్‌లకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. మండలానికో ’108’వాహనం.. ఇకపై ప్రతీ మండలానికి ఒక ‘108’ వాహనాన్ని సమకూర్చాలని సర్కారు యోచిస్తోంది. తద్వారా దాని పరిధిలోని సమీప గ్రామాలకు తక్కువ సమయంలో చేరుకోవడానికి వీలుకలుగుతుందని, అనేకమందిని ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చనేది ప్రభు త్వ ఆలోచన. ప్రస్తుతం లక్ష మంది జనాభాకు ఒకటి చొప్పున ‘108’వాహనం ఉండగా, మండలానికి ఒకటి కేటాయించడం ద్వారా ప్రతీ 70 వేల జనాభాకు ఒకటి అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. చదవండి: ట్రాక్‌లో పడేదెప్పుడు? దశాబ్దకాలంగా అమలుకు నోచని వెహికిల్ ట్రాకింగ్ -
108కు శాశ్వత కార్యాలయం
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆపదలో ఉన్నవారికి అపర సంజీవనిలా సేవలు అందిస్తున్న 108 వాహనానికి, సిబ్బందికి శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేసి విజయవాడ నగరపాలకసంస్థ సముచిత గౌరవం కల్పించింది. సాధారణంగా 108 వాహనాలు, ఉద్యోగులకు ప్రత్యేకంగా ఎటువంటి కార్యాలయాలు ఉండవు. స్థానికంగా ఉన్న అవకాశాల మేరకు షెడ్లు లేదా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోని చెట్ల కింద అంబులెన్స్‌లను పెట్టుకుని సిబ్బంది అక్కడే ఉంటారు. ఆపదలో ప్రజలు ఉన్నారంటూ తమకు ఫోన్ వచ్చిన వెంటనే వెళ్లి ప్రాణాలను కాపాడుతుంటారు. ఇదే తరహాలో విజయవాడ 18వ డివిజన్ రాణిగారితోటలోని కనకదుర్గమ్మ వారధి పక్కన వాటర్ ట్యాంక్ కింద ఆశ్రయం పొందుతున్న 108 వాహనం, సిబ్బందికి నగరపాలక సంస్థ రూ.12లక్షలతో శాశ్వత భవనం నిర్మించింది. వాటర్ ట్యాంక్ కింద 108 అంబులెన్స్ పెట్టుకుని సిబ్బంది పడుతున్న ఇబ్బందులను గుర్తించిన స్థానిక కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ... ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు కార్పొరేషన్ అధికారులతో సంప్రదించి వారధి సమీపంలోనే 108 అంబులెన్స్‌కు శాశ్వత కార్యాలయం నిర్మాణానికి అనుమతులు, రూ.12లక్షల నిధులు మంజూరు చేయించారు. నిర్మాణ పనులు పూర్తయి కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ కార్యాలయంలో విద్యుత్, వాహనాల పార్కింగ్ వంటి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు. 108 వాహనానికి శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేయడంపై సిబ్బంది హర్షం వ్యక్తంచేస్తున్నారు. -
‘ఆపద్బాంధవి’ మరింత బలోపేతం.. మరిన్ని 108 అంబులెన్స్‌లు
సాక్షి, అమరావతి: అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌చేసిన నిమిషాల్లో కుయ్.. కుయ్‌మంటూ వచ్చి బాధితులను ఆస్పత్రులకు చేరుస్తూ ‘108’ అంబులెన్స్‌లు ఆపద్బాంధవిలా లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాయి. ఈ సేవలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కొత్త వాహనాల కొనుగోలుకు చర్యలు చేపడుతోంది. టీడీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ‘108’ సేవలకు సీఎం వైఎస్ జగన్ ఊపిరిలూదిన విషయం తెలిసిందే. ఫలితంగా 2020 జూలై నుంచి ఇప్పటివరకూ ఈ అంబులెన్స్‌లు 10 లక్షలకు పైగా ఎమర్జెన్సీ కేసుల్లో ప్రజలను ఆస్పత్రులకు చేర్చాయి. ఫోన్‌చేసిన వెంటనే అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకునే సమయం గణనీయంగా తగ్గింది. రూ.46 కోట్లతో 146 వాహనాలు టీడీపీ హయాంలో 440 అంబులెన్స్‌లతో ఏపీలో 108 సేవలు అంతంతమాత్రంగా ఉండేవి. సీఎం వైఎస్ జగన్ వచ్చాక 768 అంబులెన్స్‌లతో వాటి సేవలను విస్తరించారు. తాజాగా.. రూ.46 కోట్లతో మరో 146 కొత్త వాహనాల కొనుగోలుకు వైద్యశాఖ చర్యలు తీసుకుంటోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుకోసం రూ.107 కోట్లతో 432 కొత్త 104 వాహనాలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. కానీ, రాష్ట్రంలో 10,032 డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా పీహెచ్సీ వైద్యులు నెలలో రెండుసార్లు ఒక్కో గ్రామాన్ని 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ)తోపాటు విలేజ్ క్లినిక్‌లను సందర్శించాలి. ఇప్పటికే ఉన్న 656 ‘104 ఎంఎంయూ’ వాహనాలతో 7,166 విలేజ్ క్లినిక్‌లను సందర్శిస్తున్నారు. మిగిలిన విలేజ్ క్లినిక్‌లలోనూ నెలలో రెండుసార్లు సందర్శించడానికి 260 నూతన 104 వాహనాలు కొనుగోలు చేస్తే సరిపోతుందని వైద్యశాఖ నిర్ణయించింది. ఇదీ చదవండి: చెత్తతో ‘పవర్’ ఫుల్ -
Telangana: ‘108’ నుంచి జీవీకే అవుట్!
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు అత్యవసర వైద్య సేవలందించే ‘108’సేవల్లో మార్పులు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎన్నో ఏళ్లుగా దానిని నిర్వహిస్తున్న జీవీకే సంస్థకు చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉంది. త్వరలో టెండర్లు నిర్వహించి కొత్త ఏజెన్సీకి అప్పగించాలని భావిస్తోంది. అలాగే అత్యంత ఆధునిక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో నామినేషన్ పద్ధతిలో ఒక ప్రముఖ సంస్థకు ఇవ్వాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల టెండర్లకు వెళ్లడమే సరైనదనే నిర్ణయానికి వైద్య ఆరోగ్యశాఖ వచ్చింది. ఈ నేపథ్యంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూడా పరిశీలిస్తున్న వైద్యశాఖ అధికారులు.. అందుకోసం మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఉమ్మడి ఏపీలో..వైఎస్ హయాంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ‘108’అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో అత్యవసరంగా వైద్యం అవసరమైన వారు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు ‘108’నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా తక్షణమే ఉచితంగా అంబులెన్స్ సేవలు పొందేలా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పట్నుంచే ‘108’గా ఈ పథకం అత్యంత ప్రజాదరణ పొందింది. అందుబాటులో 333 వాహనాలు.. ప్రస్తుతం రాష్ట్రంలో 358 వాహనాలు ఈ అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో 333 రోడ్లపై అందుబాటులో ఉండగా, మిగిలినవి రిజర్వులో ఉంచారు. అప్పట్లో కొన్ని వాహనాలు చెడిపోగా, వాటి స్థానంలో కొన్ని వాహనాలను ‘గిఫ్ట్ ఏ స్మైల్’కింద అనేకమంది రాజకీయ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు ఉచితంగా అందించారు. ప్రస్తుతం లక్షమంది జనాభాకు ఒకటి చొప్పున ‘108’వాహనం ఉందని అంటున్నారు.రోజుకు ఒక్కో వాహనం నాలుగు ట్రిప్పులు వెళ్లేలా ఈ పథకాన్నితీర్చిదిద్దారు. ఫోన్ చేసిన దాదాపు 20 నిమిషాల్లో బాధితుల వద్దకు చేరుకోవాలనేది నిబంధన. 2007 నుంచి జీవీకే ఆధ్వర్యంలోనే.. ఈ అంబులెన్స్ సర్వీసులను ప్రస్తుతం జీవీకే సంస్థ నిర్వహిస్తుంది. ప్రభుత్వం ఒక్కో వాహనానికి రూ.1.62 లక్షల చొప్పున ఏడాదికి రూ.86 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అందులోనే ప్రాథమిక వైద్యంలో సుశిక్షితులైన సిబ్బంది వేతనాలు, నిర్వహణ ఖర్చు కలిపి ఉంటాయి. 2007 నుంచి ఆ సంస్థకే అప్పగిస్తూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఇప్పటికీ ఆ సంస్థ కార్యకలాపాలు చేస్తోంది. వాస్తవానికి జీవీకే నిర్వహణ సమయం 2016 లోనే ముగిసిందని, కానీ అప్పటినుంచి అలా పొడిగిస్తూ వస్తున్నారని వైద్య, ఆరోగ్య వర్గాలు తెలిపాయి. ఇక ఆటోమేటిక్‌గా పరుగులు.. ప్రస్తుతమున్న ‘108’అత్యవసర అంబులెన్సులను ఉపయోగించుకుంటూనే, నిర్వహణలో అనేక మార్పులు చేర్పులూ చేయాలని వైద్యారోగ్య శాఖ భావిస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్యంత ఆధునిక కాల్ సెంటర్‌కు రూపకల్పన చేస్తారు. దానిద్వారా కంప్యూటర్ ఆధారంగా అంబులెన్సులను ఆటోమేటిక్‌గా నడిపిస్తారు. ఆటోమేటిక్ కాల్ డిస్ట్రిబ్యూటర్ (ఏసీడీ) వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. కంప్యూటర్ టెలిఫోన్ ఇంటర్ఫేస్ (సీటీఐ), వాయిస్ లాగింగ్ కేపబిలిటీస్, జీపీఎస్ ఇంటిగ్రేషన్, హైలీ సెక్యూర్డ్ నెట్‌వర్క్‌లను రూపొందిస్తారు. తద్వారా అంబులెన్స్ ప్రమాదం జరిగిన స్థలాన్ని అత్యంత వేగంగా (ర్యాపిడ్) గుర్తించి, తక్కువ సమయంలో బాధితులను చేరుకుంటుంది. అలాగే బాధితుడిని తీసుకెళ్లే ఆసుపత్రికి ముందస్తు సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. విపత్తు నిర్వహణ, పోలీస్, ఫైర్ సర్వీసులకు అనుసంధానం ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అప్లికేషన్‌ను రూపొందిస్తారు. ఈ అప్లికేషన్‌ను విపత్తు నిర్వహణకు అనుసంధానం చేస్తారు. ఇది పోలీస్, ఫైర్ సర్వీసులతోనూ అనుసంధానం అవుతుంది. అన్ని ‘108’అంబులెన్స్‌లకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. అత్యంత సమర్థులైన, శిక్షణ పొందిన సిబ్బందిని నియమిస్తారు. ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఎన్జీవోలతోనూ అనుసంధానం చేయనున్నారు. ప్రభుత్వ డబ్బు..పేరు ఏజెన్సీది! భవిష్యత్తులో అన్ని గ్రామాల్లో ఫస్ట్ రెస్పాండర్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తారు. అన్ని కార్పొరేట్ కంపెనీల్లోనూ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. శాటిలైట్ ట్రామా సెంటర్లను రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారుల్లో ఏర్పాటు చేసేలా టెండర్లలో అనేక నిబంధనలు విధిస్తారు. ఆ ప్రకారం ముందుకు వచ్చే ఏజెన్సీ సంస్థనే ఎంపిక చేస్తారు. ముఖ్యంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సామాజిక బాధ్యత) (సీఎస్ఆర్) కింద సంస్థే కొంత భరించేలా నిబంధన విధించే అవకాశముంది. అవసరమైతే రివర్స్ టెండరింగ్ పద్ధతిని అనుసరించడంపై కూడా సర్కారు ఆలోచన చేస్తోంది. ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే సంస్థలు తమ పేరును ప్రచారం చేసుకుంటున్నాయన్న భావన ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఏజెన్సీ కనీసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయడం లేదని వైద్యశాఖ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డబ్బు ఖర్చు చేయకుండా.. సామాజిక బాధ్యత కింద ముందుకు వచ్చే సంస్థలను రివర్స్ టెండరింగ్ ద్వారా ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఒక ప్రముఖ కంపెనీ ఈ మేరకు నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం గమనార్హం. మండలానికో ’108’వాహనం ప్రతి మండలానికి ఒక ‘108’వాహనాన్ని సమకూర్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. తద్వారా దాని పరిధిలోని సమీప గ్రామాలకు తక్కువ సమయంలో చేరుకోవడానికి వీలు కలుగుతుందని, ప్రాణాపాయం నుంచి అనేకమందిని రక్షించ వచ్చని భావిస్తోంది. ప్రస్తుతం లక్ష మంది జనాభాకు ఒకటి చొప్పున ‘108’వాహనం ఉండగా, మండలానికి ఒకటి ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి 70 వేల జనాభాకు ఒకటి చొప్పున ఉండేలా చూడాలని అనుకుంటున్నారు. వేతనాల పెంపుపై అధ్యయనం సిబ్బంది వేతనాలను పెంచాలనే కీలక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వేతనాలు పెంచారు. అక్కడ ఎంత పెంచారన్న దానిపై అధికారులు అధ్యయనం చేశారు. ఆ ప్రకారం పెంచడం, ఐదేళ్లకోసారి సవరించడం వంటి అంశాలపైనా ఆలోచన చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని వేతనాలను, ఇతర సేవలనూ అధ్యయనం చేస్తున్నారు. -
రైలు బోగీలో ప్రసవం
సామర్లకోట: చెన్నై నుంచి జార్ఖండ్ వెళుతున్న ఓ గర్భిణి ఆదివారం రైలులో ప్రసవించింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన శంకర్ క్రికిత్త ఉద్యోగ రీత్యా చెన్నైలో ఉంటున్నాడు. అతడి భార్య వాసకుమారి(21) ప్రస్తుతం ఏడో నెల గర్భిణి. దీంతో శంకర్ ఆమెను పుట్టిల్లయిన జార్ఖండ్ తీసుకువెళుతున్నాడు. భార్యాభర్తలిద్దరూ బొకారో ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి జార్ఖండ్ బయలుదేరారు. రైలు తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట వచ్చాక ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమెను భర్త బాత్రూమ్కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై తోటి ప్రయాణికులు 108కు సమాచారం ఇచ్చారు. రైలును కొద్దిసేపు సామర్లకోటలో నిలిపివేశారు. స్టేషన్‌కు చేరుకున్న 108 సిబ్బంది తల్లీబిడ్డలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడ తీసుకెళ్లాల్సిందిగా వారికి సూచించారు. -
108లో నలుగురి జననం
మాకవరపాలెం/గూడెంకొత్తవీధి/రౌతులపూడి: 108 వాహనాల్లో బుధవారం నలుగురు చిన్నారులు జన్మించారు. మూడో చోట్ల జరిగిన ఈ ఘటనల్లో ఓ తల్లి కవలలకు జన్మనివ్వడం విశేషం. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం మామిడిపాలేనికి చెందిన భవానికి బుధవారం పురిటినొప్పులొచ్చాయి. కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇవ్వగా సిబ్బంది వచ్చి గర్భిణిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తీసుకెళుతున్నారు. అయితే మార్గం మధ్యలోనే ప్రసవమై మగబిడ్డకు జన్మనిచ్చిందని 108 సిబ్బంది వినీత, మురళి తెలిపారు. అలాగే చింతపల్లి మండలం చెరపల్లికి చెందిన దేవూరు సుమలతకు పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో 108 సిబ్బంది వాహనంలోనే ఆమెకు ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్టు సిబ్బంది రాజు, రెహమాన్‌లు చెప్పారు. గర్భిణికి సుఖప్రసవం.. కవలల జననం తూర్పుగోదావరి జిల్లా శంఖవరానికి చెందిన శివకోటి అనంతలక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో మంగళవారం రౌతులపూడి సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి కొద్దిగా ఆందోళనకరంగా ఉందని అక్కడి డాక్టర్.. కాకినాడ జీజీహెచ్‌కు తరలించాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు బుధవారం తెల్లవారుజామున 108లో ఆమెను తరలిస్తుండగా వాహనంలోనే కవలలు(ఆడ, మగ)కు జన్మనిచ్చింది. ఆ తర్వాత తల్లీబిడ్డలను జీజీహెచ్‌కు తరలించారు. -
కరోనా బాధితురాలికి 108లో ప్రసవం
బనగానపల్లె రూరల్: కరోనా పాజిటివ్ వచ్చిన ఓ గర్భిణి 108లోనే ప్రసవించింది. అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) కిరణి చొరవ తీసుకుని ఆమెకు సుఖప్రసవం చేశారు. కర్నూలు జిల్లా పాణ్యం మండలం అలమూరుకు చెందిన ఓ గర్భిణికి పురిటినొప్పులు రావడంతో బనగానపల్లె కమ్యూనిటీ వైద్యశాలకు తెచ్చారు. ఆమెకు రెండు రోజుల కిందట కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయం తెలుసుకున్న కమ్యూనిటీ వైద్యశాల సిబ్బంది ఆమెకు ఇక్కడ ప్రసవం చేయడం కష్టమని, వెంటనే 108లో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. 108 వాహనంలో ఎక్కించాక ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను బనగానపల్లె వైద్యశాలలో చేర్పించారు. -
ఒక్క కాల్... నిమిషాల్లో 108
-
సీఎం జగన్‌పై అరబిందో సీఓఓ ప్రశంసలు
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో అంబులెన్స్ వాహనాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అరబిందో ఫార్మా ఫౌండేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) సాయిరామ్ స్వరూప్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 104, 108 అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించడం ద్వారా ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశ్యంతో 108 లు ఏర్పాటు చేశామని అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. 2015లో స్థాపించిన ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేసిందన్నారు. ప్రతి గ్రామంలో అంబులెన్స్ సేవలు అందేలా ఏర్పాటు చేశామన్నారు. (దేశం మొత్తం చూసేలా చాటి చెప్పాం : సీఎం జగన్) 108 ద్వారా 3558 మందికి అంబులెన్స్‌లో ఉద్యోగాలు ముఖ్యమంత్రి కల్పించారని సాయిరామ్ స్వరూప్ అన్నారు. జిల్లాలలో శిశు మరణాలు తగించడానికి ప్రణాళిక కూడ పెట్టామని, అత్యాధునిక పరిజ్ఞానంతో అంబులెన్సు ద్వారా అందరికి మెరుగైన వైద్యం అందిచవచ్చన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కరోనాకు ప్రత్యేక అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. 108,104 సర్వీసుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వైద్యపరంగా కొత్త విప్లవాన్ని చూస్తారన్నారు.(‘చంద్రబాబు.. ఇలా అయినా సంతోషించు’) -
విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో 108,104 వాహానాల ప్రారంభం
-
‘పిల్లల కోసం కూడా అంబులెన్స్’
సాక్షి, తాడేపల్లి: 108,104 అంటే గుర్తుకు వచ్చేది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. తాడేపల్లిలో గురువారం ఆయన మాట్లాడుతూ, ‘ ప్రతి మండలానికి 108, 104 ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేశారు. పట్టణాల్లో 15, గ్రామాల్లో 20, ఏజెన్సీలో 25 నిమిషాల్లో 108 చేరుకుంటుంది. పేదల ప్రాణాల విలువ తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఉక్రోషంతో 104, 108లో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు.108,104 లకు 203 కోట్లు ఖర్చు చేస్తే 307 కోట్లు అవినీతి జరిగిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని అన్నారు. (దేశమంతా ఏపీ వైపు చూసేలా..) ఇంకా ఆయన మాట్లాడుతూ... ‘పెద్దలకే కాదు చిన్న పిల్లలు కోసం నియో నానిటల్ అంబులెన్స్ ను తొలిసారిగా ఏర్పాటు చేశారు. 1800 వాహనాలు ఏర్పాటు చేశామని చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. 1800ల 108, 104 వాహనాలు ఎక్కడ ఏర్పాటు చేశారో చూపించాలని సవాల్ చేస్తున్నా. దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో 104, 108 వ్యవస్థ ను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. చంద్రబాబు హయాంలో 108, 104 షెడ్లకు పరిమితమయ్యాయి. డీజల్ లేక మధ్యలోనే పేషంట్లతో 108 వాహనాలు ఆగిపోయేవి. ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్యను 2000లకు సీఎం జగన్ పెంచారు. ఐదు లక్షల ఆదాయం ఉన్నా సరే పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం 28 వేల కోట్లు ఖర్చు చేసింది. పార్టీ సైనికులుగా విజయ సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పని చేశారు. వారిపైన కూడా చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. వారి భుజాలు పైన మరింత బాధ్యతను సీఎం జగన్ పెట్టారు. ఇప్పుడు వారికి కొత్తగా పదవులు కట్టబెట్టలేదు. గతంలో కూడా వారు జిల్లాల బాధ్యతలు చూశారు. లోకేష్‌కు ఏమి అర్హత ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టావు. లోకేష్ ఏమి సాధించాడని దొడ్డిదారిన ఎమ్మెల్సీ, మంత్రి పదవి కట్టబెట్టావు. దాదాపు వందకు పైగా దేశాల్లో అరబిందో విస్తరించి ఉంది. లాభాపేక్ష కోసం అరబిందో కు 104, 108 ఇచ్చారని మాట్లాడడం కరెక్ట్ కాదు’ అని పార్థసారధి అన్నారు. (ఏపీలో అన్‌లాక్ 2.0 అమలు ఉత్తర్వులు జారీ) -
సీఎం జగన్ నిర్ణయంపై 108,104 సిబ్బంది హర్షం
-
ఏపీలో 108,104 వాహనాల ప్రారంభం పై ప్రశంసలు
-
అత్యవసర వైద్య సేవల కల్పనలో సువర్ణాధ్యాయం
-
దేశం మొత్తం చూసేలా చాటి చెప్పాం : సీఎం జగన్
సాక్షి, అమరావతి : జాతీయ వైద్యుల దినోత్సవం రోజు ఒకేసారి 1,008 సంఖ్యలో అధునాతన 104,108 సర్వీసు వాహనాలను ప్రారంభించడం గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని ముంఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ట్వీటర్ వేదికగా ఆయన జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఏపీ చరిత్రలో ఈ రోజు ఒక సువర్ణఅధ్యాయంగా నిలుస్తుంది. ఒకేసారి 1088 సంఖ్యలో అధునాతన 104, 108 సర్వీసు వాహనాలను, గుంటూరు జీజీహెచ్ లో క్యాన్సర్ కేర్ సెంటర్ ను ప్రారంభించడం గొప్ప ఆనందాన్నిస్తోంది. ప్రతి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం మనదని మొత్తం దేశం చూసేలా చాటిచెప్పాం’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. (చదవండి : 108 సిబ్బందికి సీఎం జగన్ శుభవార్త) కాగా, బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 1,088 అంబులెన్స్‌లను విజయవాడలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్ బ్లాక్‌ను ప్రారంభించారు. దీంతో పాటు 108 సిబ్బంది జీతాలను కూడా భారీగా పెంచారు. ఇంతకు ముందుకు డ్రైవర్లకు నెలకు రూ.10వేలు జీతం వస్తుండగా, ఇకపై వారి సర్వీసుకు అనుగుణంగా రూ.18వేల నుంచి 20వేల రూపాయల వరకు అందజేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అలాగే ఎమెర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల జీతాలను కూడా పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ప్రస్తుతం రూ.12వేల జీతం అందుకుంటున్న మెడికల్ టెక్నీయన్ ఇకపై రూ.20 వేల నుంచి 30 వేల వరకు అందుతుందని సీఎం జగన్ చెప్పారు. చదవండి : ఏపీ: ఆరోగ్య చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభం సీఎం జగన్ కృషి.. సుదీర్ఘ స్వప్నం సాకారం -
హెల్త్ ఎక్స్‌ప్రెస్
-
'వైద్య, ఆరోగ్య చరిత్రలో రేపు నూతనధ్యాయం'
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సర్వీసులు తిరిగి రేపటి నుంచి అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వస్తున్నట్లు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య చరిత్రలో రేపు నూతనధ్యాయానికి తెరతీస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత టీడీపీ హయాంలో 108 వాహనాలు నిర్లక్ష్యంగా వ్యవహరించి పేదల ప్రాణాలను హరించాయన్నారు.(అత్యాధునిక 108, 104 సర్వీసులు రేపే ప్రారంభం) ఆళ్ల నాని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 201 కోట్ల రూపాయలు నూతన 108, 104 వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (బుధవారం) అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 108, 104 వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ప్రారంభించనున్నారని తెలిపారు. దీంతో 676 మండలాల్లో నూతన 108, 104 వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. అర్బన్ పరిధిలో 15 నిమిషాలు, రూరల్ పరిధిలో 20నిమిషాలు,ఏజెన్సీ పరిధిలో 25 నిమిషాల్లో 108 వాహనం చేరుకునేలా టైం మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. మూడు రకాలైన 108 వాహనాలు అందుబాటులోకి తేవడంతో పాటు 104 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వాహనాలు, 282 బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలు, 26 నియోనాటల్ సపోర్ట్ వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా సౌకర్యాలు పెంచే దిశగా అప్రమత్తంగా ఉన్నామన్నారు. ప్రజలకు సంభందించి అవగాహన సౌకర్యాలు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం ప్రత్యేకంగా చెప్పారన్నారు. ప్రతి క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాలు పెంచాలని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్మెంట్పై ప్రత్యేక నిబంధనలు రూపొందించారన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు సహకరించారు కాబట్టే కేసులు తక్కువగా నమోదయ్యాయన్నారు. కేంద్రం రూపొందించిన కరోనా మార్గదర్శకాలుకు అనుగుణంగా ప్రజలు తమ భాగస్వామ్యం, సహకారం కావాలన్నారు. లాక్డౌన్ సడలింపు తర్వాత ఎక్కువగా కేసులు పెరగుతుండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలిని ఆయన తెలిపారు. -
అత్యాధునిక 108, 104 సర్వీసులు రేపే ప్రారంభం
సాక్షి, అమరావతి : అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ దిశలో మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు చేపట్టి, అమలు చేస్తున్న సీఎం ఇప్పుడు అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసుల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వసతులతో 108, 104 సర్వీసుల్లో సమూలు మార్పులు చేసి వాటిని తీర్చిదిద్దారు. బుధవారం ఉదయం 9:35 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ బెంజి సర్కిల్ వద్ద అత్యాధునిక అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించనున్నారు. విషమ పరిస్థితిల్లో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా చికిత్స అందించేలా వాటిలో మార్పులు చేశారు. వాటి సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. ఇంకా చిన్నారుల కోసం కూడా ప్రత్యేకంగా నియో నేటల్ అంబులెన్సులు ప్రారంభిస్తున్నారు. 108 సర్వీసుల్లో మార్పులు : అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన వారు ఎవరికైనా గుర్తుకు వచ్చే 108 సర్వీసులో సమూల మార్పులు చేశారు. వాటిలో అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేశారు. కొత్తగా 412 అంబులెన్సులను కొనుగోలు చేసి, ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్సులను కూడా వినియోగించనున్నారు.కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్సులలో 282 బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్ఎస్)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్ లైఫ్ సపోర్టు (ఏఎల్ఎస్)తో తీర్చి దిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు (నియో నేటల్) వైద్య సేవలందించేలా తయారు చేశారు. ఏయే సదుపాయాలు ? బీఎల్ఎస్ అంబులెన్సులలో స్పైన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ ఛైర్, బ్యాగ్ మస్క్, మల్టీ పారా మానిటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయగా, ఏఎల్ఎస్ అంబులెన్సులలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ఇక నియోనేటల్ అంబులెన్సులలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను కూడా అమర్చారు. సకాలంలో వైద్యం అందక ఏ ఒక్క రోగి కానీ, ప్రమాదానికి గురైన వారు కానీ, చిన్నారులు కానీ మృత్యువాత పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన అంబులెన్సులను పెద్ద సంఖ్యలో ఒకేసారి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. శిశు మరణాలను కూడా పూర్తిగా నివారించే దిశలో ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేస్తోంది. ఎంత వేగంగా సేవలు..? పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 30 నిమిషాల్లో అంబులెన్సులు చేరే విధంగా ఆ స్థాయిలో సర్వీసులు ప్రారంభిస్తున్నారు. ఎలా సాధ్యం..? ప్రతి అంబులెన్సును ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్సీ)తో అనుసంధానం చేయడం ద్వారా, ఫోన్ చేసిన వారిని వేగంగా ట్రాక్ చేసే వీలు కలుగుతుంది. అదే విధంగా ప్రతి అంబులెన్సులో ఒక కెమెరా, ఒక మొబైల్ డేటా టెర్మినల్ (ఎండీటీ), మొబైల్ ఫోన్‌తో పాటు, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్‌టీ) బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. 104 సర్వీసుల్లో మార్పులు : 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేసిన ప్రభుత్వం, హెల్త్ కేర్ డెలివరీ విధానంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఆ స్థాయిలో మొబైల్ మెడికల్ యూనిట్ల(ఎంఎంయూ)ను తీర్చిదిద్దింది. మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా, అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక సర్వీసు అందుబాటులో ఉండే విధంగా ఒకేసారి 656 సర్వీసులను సిద్ధం చేశారు. ఎంఎంయూ(104)ల్లో సదుపాయాలు : ప్రతి మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)లో ఒక వైద్య అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్ఎంతో పాటు, ఆశా వర్కర్ ఉంటారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)తో అనుసంధానమై పని చేసే ఎంఎంయూలు, ఇక నుంచి మారుమూల కుగ్రామాలలో సైతం శరవేగంగా వైద్య సేవలందించనున్నాయి. రోగులకు అప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన ఔషథాలను ఉచితంగా అందజేస్తారు.ప్రతి ఎంఎంయూలో ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్‌టీ)తో పాటు, గ్లోబల్ పొజిషనింగ్ విధానం (జీపీఎస్) కూడా ఏర్పాటు చేశారు. ఆధార్ కోసం బయోమెట్రిక్ ఉపకరణాలు, ఇంకా రోగులకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయడం కోసం ట్యాబ్, పర్సనల్ కంప్యూటర్ (పీసీ) కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. తద్వారా రోగులకు సంబంధించి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు (ఈహెచ్‌ఆర్) తయారు చేయడం చాలా సులువు అవుతుంది. ఎంఎంయూలు- 20 రకాల సేవలు : మాతా శిశు మరణాలు నివారించడంతో పాటు, చిన్నారుల ఆరోగ్యం కాపాడడం, వారిలో పౌష్టికాహార లోపం లేకుండా చూడడం, ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని సీజన్లలో ప్రబలే అంటువ్యాధులు నివారించడం, కుగ్రామాలలో నివసించే వారికి కూడా అత్యాధునిక వైద్య సదుపాయం కల్పిస్తూ, మొత్తం 20 రకాల సేవలందించడం కోసం 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేస్తూ, ప్రభుత్వం ఎంఎంయూలను తీర్చిదిద్దింది. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, ఈ సేవలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏయే సర్వీసులు ఎన్నెన్ని.. ? అన్నీ కలిపి ఒకేసారి మొత్తం 1068 వాహనాలను సీఎం వైయస్ జగన్ బుధవారం ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.200.15 కోట్లు ఖర్చు చేసింది.కొత్త, పాత అంబులెన్సులతో పాటు, మొత్తం ఎంఎంయూల నిర్వహణకు ఏటా రూ. 318.93 కోట్లు ఖర్చు కానుంది. గతంలో... ఇప్పుడు : రాష్ట్రంలో గతంలో 108 అంబులెన్సులు 440 చోట్ల (ప్రాంతాలు వాహనాలు)లో మాత్రమే సేవలందించగా, ఇప్పుడు మొత్తం 705 చోట్లనుంచి పని చేయనున్నాయి. ప్రతి మండలం (676 మండలాలు)తో పాటు, పట్టణ ప్రాంతాల్లోనూ సేవలందించనున్నాయి. అదే విధంగా గతంలో 104 అంబులెన్సులు (ఎంఎంయూ) 292 మాత్రమే ఉండగా, ఇప్పుడు మండలానికి ఒకటి చొప్పున మొత్తం 676 సర్వీసులు పని చేయనున్నాయి. 20 రకాల వైద్య సేవలందిస్తూ, రోగులకు అవసరమైన మొత్తం 74 రకాల ఔషథాలు కూడా అందజేయనున్నాయి. గతంలో ఈ అంబులెన్సులలో కేవలం 52 రకాల ఔషథాలు మాత్రమే ఉండేవి. వైద్యులు అతి కష్టం మీద అందుబాటులో ఉండేవారు. కానీ ఇప్పుడు 104ల్లోమొత్తం 744 మంది వైద్యులు సేవలందించనున్నారు. ఇంకా వీటిని డాక్టర్ వైయస్సార్ టెలి మెడిసిన్, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసి నిర్వహించనున్నారు. తద్వారా అన్ని చోట్ల క వైద్య సేవలు అందనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 676 సంఖ్యలో ఉన్న 104 వాహనాలు ప్రతి రోజూ 40,560 మందికి సేవ చేస్తూ, ఏటా ఏకంగా 1.45 కోట్ల రోగులకు వైద్య సేవలందిస్తాయని భావిస్తున్నారు. డాక్టర్ వైఎస్సార్ రహదారి భద్రత 108 సర్వీస్ ద్వారా.. 108 అంబులెన్సు సర్వీసులకు కొత్తగా ప్రారంభిస్తున్న డాక్టర్ వైయస్సార్ రహదారి భద్రత కార్యక్రమాన్ని లింక్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి దీని ద్వారా ఆస్పత్రులలో ఉచితంగా వైద్య సేవలందిస్తారు. రెండు రోజుల పాటు లేదా గరిష్టంగా రూ.50 వేల వ్యయం వరకు ఆ వైద్య సేవలందిస్తారు. డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీలో సరికొత్తగా 108, 104 వాహనాలు
-
సమయం చెప్తే ఆధారాలతో వస్తా..
సాక్షి, తాడేపల్లి : ఎల్లో మీడియాలో తప్పుడు వార్తలు రాయడం, వాటిని పట్టుకొని టీడీపీ నేతలు మీడియా ముందుకు మళ్ళీ రావడంపై వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ స్పందించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అత్యవసర సర్వీసులైన 108, 104 గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని ధ్వజమెత్తారు. 104, 108లలో ఎక్కడ అవినీతి జరిగిందో టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. 108, 104లలో అవినీతి జరిగిందంటున్న మీడియా సమక్షంలో టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. సమయం చెబితే తన దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకొని వస్తానని, తమ దగ్గర ఉన్న ఆధారాలతో టీడీపీ నేతలు రావాలని సవాల్ విసిరారు. (‘ఆ భేటీ వెనుక కుట్ర దాగుంది’) దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అత్యవసర సర్వీసుల వాహనాలు లక్షల మంది ప్రాణాలు నిలబెట్టాయని, చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో 108, 104 వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో 108, 104 సర్వీసులు సరిగా పనిచేయక ఎంతోమంది ప్రాణాలు పోయాయని, ఇవన్నీ ఎల్లో మీడియా పచ్చ గ్యాంగ్‌కు కనిపించవా అని ప్రశ్నించారు. 1060 కొత్త వాహనాలు ప్రవేశ పెడితే చంద్రబాబు కడుపు మంటతో మండిపోతున్నారని, పేదల ప్రాణాలు వైఎస్ జగన్మోహన్రెడ్డి కాపాడతారని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. (మార్గమధ్యలో కరోనా.. అంతా పరుగో పరుగు!) 108,104 వాహనాలను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపి టెండర్లు పిలిశామని, తాడు బొంగరం లేని నేతలు సీఎం వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి మీద విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటిలేటర్లు ఉండే 108 వాహనాలు తీసుకువస్తున్నామని జోగి రమేష్ తెలిపారు. 108, 104 టెండర్లకు రెండు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయని, అరబిందో కంపెనీ టెండర్లు దక్కించుకుందని తెలిపారు. అచ్చెన్నాయుడును చంద్రబాబు మోసం చేశారు కాబట్టే ఆదిరెడ్డి భవాని పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిందన్నారు. బాబాయికి అన్యాయం చేసిన చంద్రబాబుకు అనుకూలంగా భవాని ఓటు వేస్తోందా అని ఎమ్మెల్యే జోగి రమేష్ నిలదీశారు. (హాలీవుడ్ నిర్మాత ఆత్మహత్య ) -
108 వాహనాల్లోనే ప్రసవాలు
కొత్తచెరువు/తనకల్లు: అనంతపురం జిల్లాలో శుక్రవారం ఇరువురు గర్భిణిలు 108 వాహనాల్లోనే ప్రసవించారు. కొత్తచెరువు మండలం తలమర్ల గ్రామానికి చెందిన గర్భిణి అపర్ణకు శుక్రవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. లాక్డౌన్ నేపథ్యంలో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో 108కి ఫోన్ చేయగా వెంటనే వచ్చింది. అపర్ణను పుట్టపర్తి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా కొత్తచెరువు వద్ద వాహనంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అదేవిధంగా తనకల్లు మండల పరిధిలోని బాబేనాయక్తండాకు చెందిన రోజా శుక్రవారం 108 వాహనంలో పండంటి పాపకు జన్మనిచ్చింది. రోజాకు ఉదయం పురిటినొప్పులు అధికం కావడంతో కదిరి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు కాన్పు కష్టంగా మారే అవకాశం ఉందని వెంటనే అనంతపురానికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో 108 వాహనంలో తరలిస్తుండగా బత్తలపల్లి సమీపంలోకి రాగానే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని 108 ఈఎంటీ మౌలాలి, పైలెట్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
ఆపదలో ‘పరమపద’!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన పేదల మృతదేహాలను తరలించేందుకు ఏర్పాటు చేసిన ‘పరమపద’ వాహనాలు ఆపదలో చిక్కుకున్నాయి. తరచూ రిపేర్లు వస్తుండటం, పలు వాహనాలకు కాలం చెల్లిపోవడంతో మూలనపడ్డాయి. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మృతిచెందిన వారి శవాల తరలింపు ప్రశ్నార్థకంగా మారింది. 2016 నవంబర్ 18న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘హెర్సే’ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. గాంధీ, ఉస్మానియా మార్చురీలకు పది చొప్పున, నిమ్స్, నిలోఫర్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రులకు ఐదు చొప్పున వాహనాలు కేటాయించింది. మరో పది వాహనాలను అందుబాటులో ఉంచింది. వీటిలో ప్రస్తుతం ఏడు వాహనాలు మాత్రమే పని చేస్తున్నాయి. అవి కూడా తరచు మార్గమధ్యలో మెరాయిస్తున్నాయి. దీంతోమృతదేహాల తరలింపు నిలిచిపోయి సమస్యలు తలెత్తుతున్నాయి. పాతవాటికి రంగులేసి.. నగరంలో ఉస్మానియా, గాంధీ తదితర ప్రతిష్టాత్మాక ప్రభుత్వ ఆస్పత్రులు ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం రాష్ట్రం నలుమూలల నుంచి నిరుపేద రోగులు ఇక్కడికి వస్తున్నారు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్న తర్వాత ఆస్పత్రికి చేరుకోవడం, చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో వారిలో పలువురు ఆస్పత్రిలోనే మృత్యువాత పడుతున్నారు. వీరికి తోడు వివిధ రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులతో పాటు ప్రమాదాల్లో మరణించిన వారి మృతదేహాలను సైతం పోస్టుమార్టం నిమిత్తం ఇక్కడికే తీసుకొస్తుంటారు. అయితే ప్రైవేటు అంబులెన్స్‌లో మృతదేహాల తరలింపు బాధితులకు భారం కావండంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చనిపోయిన పేదల మృతదేహాలను వారి సొంత గ్రామాలకు తరలించేందుకు ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ‘హెర్సె’ పథకాన్ని ప్రవేశపెట్టింది. వాస్తవానికి ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెట్టినప్పుడు ఆ మేరకు కొత్త వాహనాలు కొనుగోలు చేయాల్సిఉన్నప్పటికీ...వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. అప్పటికే 108 విభాగంలో సేవలు అందించి వివిధ సాంకేతిక కారణాలతో షెడ్డుకు చేరిన వాహనాలకు తాత్కాలిక రిపేర్లు చేసి వాటిని మార్చురీలకు అప్పగించారు. అప్పటికే వాటిని కొనుగోలు చేసి చాలా కాలం కావడం, పాతవాటికి కొత్తగా రంగులు అద్దడం, నిర్ధేశిత దూరానికి మించి ప్రయాణించడం, వివిధ రోడ్డు ప్ర మాదాల్లో విడిభాగాలు పూర్తిగా దెబ్బతినడంతో మార్చురీలకు అప్పగించిన కొద్ది రోజులకే అవి మళ్లీ మూలన పడ్డాయి. వీటి స్థానంలో కొత్త వాహనాలు సమకూర్చాలని ఆయా ఆస్పత్రుల అధికారులు వైద్య ఆరోగ్యశాఖకు లేఖ రాసినా పట్టించుకోవడం లేదు. దీంతో మృతదేహాల తరలింపునకు ప్రభుత్వ అంబులెన్స్‌లు లేకపోవడంతో బాధితులు ప్రైవేటు అంబులెన్స్‌లను సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఒక్కో మృతదేహం తరలింపుకు రూ.10 వేలకుపైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కొత్త వాహనాల కోసం లేఖ గాంధీ ఆస్పత్రి మార్చురీకి పది వాహనాలు కేటాయించగా, వాటిలో ఇప్పటికే ఏడు వాహనాలు షెడ్డుకు చేరాయి. ప్రస్తుతం మూడు వాహనాలే పని చేస్తున్నాయి. ఉస్మానియా మార్చురీకి పది వాహనాలు కేటాయించగా, ప్రస్తుతం నాలుగు వాహనాలు మాత్రమే పని చేస్తున్నాయి. ఒక్కో మార్చురీకి రోజుకు సగటున 25 మృతదేహాలు చేరుతుంటాయి. అనాథ మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం జీహెచ్ఎంసీకి అప్పగిస్తుండగా, మిగిలిన వాటిని వారి బంధువులకు అప్పగిస్తుంటారు. మృతదేహాల నిష్పత్తికి తగినన్ని హెర్సే వాహనాలు లేకపోవడంతో ఒక్కో వాహనంలో రెండు మూడు బాడీలను తరలించాల్సి వస్తుందని ఆయా ఆస్పత్రుల అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉచిత అంబులెన్స్‌లు ఉన్నప్పటికీ...ఎందుకు కేటాయించడం లేదని మృతుల బంధువులు తరచూ వైద్యాధికారులతో ఘర్షణలకు దిగుతున్నారు. ఇలాంటి సమయంలో వారికి సమాధానం చెప్పలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాల తరలింపునకు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు మరో పది వాహనాలు సమకూర్చాల్సిందిగా పేర్కొంటూ ఆయా ఆస్పత్రుల అధికారులు ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సహా ముఖ్య కార్యదర్శులకు లేఖలు రాయడం విశేషం. -
మండలానికి అండ 108
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక ‘108’ అత్యవసర వైద్య సేవల వాహనాన్ని సమకూర్చాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందుకు సంబంధించి సమాలోచనలు జరుపుతోంది. ప్రతి మండ లానికి ‘108’ సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తే దాని పరిధిలోని సమీప గ్రామా లకు తక్కువ సమయంలో చేరుకోవడానికి వీలు కలుగుతుందని, ప్రాణాపాయం నుంచి అనేక మందిని రక్షించవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం 358 వాహ నాలు ‘108’ వైద్య సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో 333 వాహనాలు రోడ్లపై అందు బాటులో ఉండగా మిగిలినవి రిజర్వులో ఉన్నాయి. పట్టణాలు, నగరాల్లోనూ ఇవే వాహనాలు అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రులకు చేరుస్తున్నాయి. ప్రతి లక్ష జనాభాకు ఒకటి చొప్పున ప్రస్తుతం ‘108’ వాహనం ఉండగా మండలానికి ఒకటి పెంచడం ద్వారా ప్రతి 70 వేల జనాభాకు ఒక వాహనాన్ని అందు బాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారం రాష్ట్రంలో 589 మండలాలుండగా ఆ మేరకు వాహనాల సంఖ్యను పెంచనుంది. దేశవ్యాప్త అధ్యయనం... దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి అందుబాటులోకి తెచ్చిన ‘108’ అత్యవసర వైద్య సేవల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో అత్యవసర వైద్యం అవసరమైనవారు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు అంబులెన్స్ సేవలను ఉచితంగా పొందుతున్నారు. రోజుకు ఒక్కో వాహనం నాలుగు ట్రిప్పులు వెళ్లేలా ఈ పథకాన్ని తీర్చిదిద్దారు. ఫోన్ చేసిన 20 నిమిషాల్లోగా బాధితుల వద్దకు చేరుకోవా లనేది నిబంధన. 2007 నుంచి అంబులెన్స్ సర్వీసులను జీవీకే సంస్థ నిర్వహిస్తోంది. వాహనాల నిర్వహణ ఖర్చు, సిబ్బంది వేతనాలు కలిపి ప్రభుత్వం ఆ సంస్థకు ఏటా రూ. 86 కోట్లు చెల్లిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఇప్పటికీ ఆ సంస్థ కార్యకలాపాలు చేపడుతోంది. దాని నిర్వహణ ఒప్పందం 2016లో ముగిసినా పొడిగిస్తూ వస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మూడు నెలల క్రితం టెండర్ల ద్వారా 108 సర్వీసుల నిర్వహణ బాధ్యతను ఒక ప్రతిష్టాత్మక సంస్థకు అప్పగించాలనుకున్నా అది కుదరలేదు. అయితే ‘108’ సేవల్లో మరిన్ని విప్లవాత్మక మార్పులు చేసి కొత్త నిబంధనలతో సేవలను అందుబాటులోకి తేవాలని సర్కారు నిర్ణయించింది. అందుకోసం సేవల అమలు తీరును తెలుసుకునేందుకు ఆరోగ్యశాఖలోని రాష్ట్రస్థాయి అధికారుల బృందాలు ఢిల్లీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి వచ్చాయి. అందుకు సంబంధించి ఎటువంటి మార్పులు చేయాలన్న దానిపై నివేదిక తయారు చేసి రెండ్రోజుల కిందట ప్రభుత్వానికి సమర్పించాయి. సీఎస్ఆర్ కింద నిర్వహణకు ముందుకొచ్చిన అరబిందో... ‘108’ సేవల కోసం ఏటా రూ. 86 కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం మూడు నెలలకోసారి నిర్వహణ సంస్థకు చెల్లించాల్సి ఉండగా ఒక్కోసారి బిల్లుల చెల్లింపులు, ఇతరత్రా సాంకేతిక కారణాలతో నిధుల విడుదల ఆలస్యమవుతోంది. దీంతో పలు సందర్భాల్లో డీజిల్ కొరత, ఉద్యోగులకు వేతనాల చెల్లింపు జరగక వాహన సేవల్లో అంతరాయం ఏర్పడుతోందని వైద్య బృందాలు తమ నివేదికలో ప్రస్తావించాయి. ఈ నేపథ్యంలో ‘108’ నిర్వహణ పూర్తి బాధ్యతను తమకు అప్పగిస్తే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద రూ. 30 కోట్లు ఖర్చు చేస్తామని అరబిందో ఫార్మా వర్గాలు పేర్కొన్నాయని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఒక అధికారి వ్యాఖ్యానించారు. దీనివల్ల నిధుల కొరత ఉండదని, అంతరాయం ఏర్పడదని, సర్కారుపైనా భారం తగ్గుతుందని భావిస్తున్నారు. ఈసారి టెండర్లకు వెళ్లాలని సర్కారు భావించినా ఆ ఆలోచనను విరమించుకొని నామినేషన్ పద్ధతిలోనే అప్పగించాలని యోచిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం. వాళ్లు ముందుకొచ్చారు... ‘108’ వాహన సేవల నిర్వహణకు అరబిందో ఫార్మా ముందుకొచ్చిన విషయం వాస్తవమే. సీఎస్ఆర్ కింద రూ. 30 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. దీనివల్ల సర్కారుపై భారం ఉండదని భావిస్తున్నాం. అయితే ఇవన్నీ ప్రతిపాదనలే.. వాటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. – ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి -
మానవత్వం చాటుకున్న 108 సిబ్బంది!
సాక్షి, గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరంలో 108 సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. నడిరోడ్డు మీద పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళకు 108 వాహనంలో పురుడుపోశారు. అనంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఆస్పత్రిలో చేర్పించారు. సకాలంలో వైద్యం అందక పేదలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 వాహనాలు.. ఆపదలో ఉన్న ఎంతో మందికి ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి. అలాంటి 108 వాహనాలను గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఆపదలో ఉండి ఎవరైనా 108కు ఫోన్ చేస్తే డీజిల్ లేదని, టైర్లలో గాలి లేదని సమాధానం వచ్చేది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పగ్గాలు చేపట్టిన అనంతరం 108 వాహనాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. ప్రమాదంలో ఉన్నవారికి క్షణాల్లో వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. తాజాగా కృష్ణాజిల్లా గన్నవరంలో ఓ మహిళ నడిరోడ్డు మీద ప్రసవ వేదన పడటం చూసిన స్థానికులు 108కు కాల్ చేశారు. క్షణాల్లో అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది మహిళ పరిస్థితిని చూసి మానవత్వంతో తమ అంబులెన్స్ వాహనంలోనే పురుడుపోశారు. ఉంగుటూరు మండలం కొయ్యగూరప్పాడుకు చెందిన ఇట్ల సంధ్య నిండు గర్భిణి. పొలాల్లో కూలి పనులు చేసుకునే ఆమెకు సోమవారం రాత్రి భర్త ఇంట్లోలేని సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆటో ఎక్కి గన్నవరం సినిమా హాల్ సెంటర్లో దిగి ప్రభుత్వ ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆమెకు పురిటినొప్పులు తీవ్రమయ్యాయి. ఇది గమనించి స్థానికులు 108కు కాల్ చేయగా.. 108 సిబ్బంది నాయుడు, సాయిబాబు సకాలంలో అక్కడకు చేరుకున్నారు. పురిటినొప్పులు ఎక్కువకావడంతో తమ అంబులెన్స్ వాహనంలోనే ఆమెకు పురుడుపోశారు. అనంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. 108 సిబ్బంది సకాలంలో వచ్చి తల్లీబిడ్డలను రక్షించడంతో 108 సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు. -
మూలకు నెట్టేసి.. భ్రష్టు పట్టించేసి..
అత్యవసర వేళ ఆదుకునే ఆపద్బాంధవిని మూలకు నెట్టేశారు. ప్రాధాన్యమివ్వాల్సిన ఈ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఎంతోమంది బాధితులకు సాయమందించిన అందులోని ఉద్యోగులను కనీసంగానైనా గుర్తించకుండా వదిలేశారు. వారికి కల్పించాల్సిన సదుపాయాలను నీరుగార్చేశారు. గ్రాట్యుటీ... లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌వంటి వాటిని బకాయిపెట్టేశారు. ఇదీ గత పాలకుల నిర్వాకం. ఇప్పుడదే ప్రస్తుత ప్రభుత్వానికి గుదిబండగా తయారైంది. వారి బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది ఆందోళనకు దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వారి సమస్యలు చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపై పడింది. గత ప్రభుత్వ పాపం ఇప్పుడు మోయాల్సిన దుస్థితి దాపురించింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆపదలో ఉన్నారని ఒక్క ఫోన్ చేస్తే చాలు కుయ్.. కుయ్.. కుయ్.. అంటూ ఇరవై నిమిషాల్లో సంఘటనా ప్రాంతానికి చేరుకుని సాయం అందించే ప్రాణ ప్రదాయినిగా 108 వాహనాలను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. ఆయన ఉన్నంతకాలం అలాగే అమలు జరిగేలా చూసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల మందిని 108 అంబులెన్స్‌లు కాపాడాయి. గత టీడీపీ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. వాటిలో పనిచేస్తున్న సిబ్బందికి కాంట్రాక్టు తీసుకున్న సంస్థ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎగవేస్తున్నా పట్టించుకోకుండా నిద్రపోయింది. చివరికి 108 వాహనాలు నడపడానికి అవసరమైన ఇంధనం కూడా సమకూర్చకుండా, బాగోగులకు కనీస ప్రాదాన్యం ఇవ్వకుండా వాహనాలన్నీ తుప్పుపట్టి పాడైపోయేలా చేసింది. ఫలితంగా ఈ రోజు 108 ఉద్యోగులు 135 మంది సమ్మె బాట పట్టాల్సిన దుస్థితి వచ్చింది కండిషన్ కోల్పోయిన వాహనాలు జిల్లాలో 108 అంబులెన్సులు 27 ఉన్నాయి. వీటిలో చాలా వరకూ పనిచేసే స్థితిలో లేవు. ఇందులో 66 మంది ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్)లు, 69 మంది ఫైలట్(డ్రై వర్లు) పనిచేస్తున్నారు. ఎమర్జెన్సీ కేసులు, మెడికల్ ఎమర్జెన్సీ, ప్రసూతి కేసులు, ట్రామా వాహనం, కార్డియాక్, రెస్పిరాట్రీ, రివర్స్ ట్రాన్స్పోర్ట్ వంటి సేవలను 108 వాహనం ద్వారా ప్రజలకు అందుతోంది. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా 108 ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ గతంలో 108 నిర్వహించిన యాజమాన్యం చెల్లించకపోయినప్పటికీ అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకుండా నేడు వారంతా సమ్మె చేయడానికి కారణమయ్యారు. గ్రాడ్యూటీతో పాటు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ డబ్బులు కూడా 108 ఉద్యోగులకు జీవీకే యాజమాన్యం ఇవ్వలేదు. వాహనాల నిర్వహణ గాలికి 108 అంబులెన్సుల నిర్వహణను గతంలో జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ నిర్వహించేది. 2017లో ఈ అంబులెన్సుల నిర్వహణను బీవీకే సంస్థ టెండర్లలో దక్కించుకుంది. అప్పటినుంచి బీవీకే సంస్థ 108 అంబులెన్సుల నిర్వహణను చూస్తోంది. ఈ సంస్థకు 108 అప్పగించేసరికి అందులోని ఉద్యోగులకు జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ డబ్బులు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో ఒక్కో ఉద్యోగికి రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకూ బకాయిలు రావాల్సి ఉంది. వాటిని ఇప్పించాల్సిందిగా గత టీడీపీ ప్రభుత్వ హయంలో ఉద్యోగులు ఆందోళనలు కూడ చేశారు. వారికి జీవీకే యాజమాన్యం నుంచి గ్రాట్యు టీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు వచ్చేలా చేస్తామని అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులు 108 ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. కానీ ఎప్పటిలాగే మాటతప్పిన చంద్రబాబు రెండేళ్లపాటు 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదు. పైగా వారికి ఉద్యోగ భద్రత కూడా లేకుండా 108 వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సరికొత్తగా అడుగులు వేస్తోంది. ఈ దశలో మరలా 108 ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. దీనికి తోడు ఆరోగ్యశ్రీ, 108కు వైఎస్ఆర్ కాలం నాటి వైభవాన్ని తిరిగి తీసుకువస్తామని సాక్షాత్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలనుకున్నట్లున్నారు. దానిలో భాగంగానే సమ్మె చేపట్టారు. నిజానికి గత ప్రభుత్వమే గనుక 108 ఉద్యోగులను పట్టించుకుని, ఆ వ్యవస్థను పటిష్టం చేసిఉంటే ఈ రోజు ఈ పరిస్థితి తలెత్తేది కాదు. -
అందుబాటులోకి మరిన్ని వైద్య సేవలు: ఆళ్ల నాని
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 108 అంబులెన్స్‌ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టినట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 439 అంబులెన్స్‌లు మాత్రమే ఉన్నాయని.. వీటి సంఖ్యను 710కి పెంచుతామని తెలిపారు. సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా 108, 104 వాహనాలకు సంబంధించి పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన 108, 104 వాహనాలు గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘పేద ప్రజల ఆరోగ్యంపై దివంగత నేత వైఎస్సార్ కనబరిచిన నిబద్ధతను ఇతర ప్రభుత్వాలు గుర్తించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. గత ఐదు ఏళ్లుగా టీడీపీ ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించకపోవడం వల్ల 108, 104 పథకాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. ఈ పథకాలు మళ్లీ పేద ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. వీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ.. ఈ బడ్జెట్లో 104కు రూ.179.76 కోట్లు, 108కు రూ.143.38 కోట్లు కేటాయించారు. అంతకుముందు లేని మరిన్ని కొత్త సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. కన్ను, చెవికి సంబంధించిన సేవలు అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నాం. 104 వాహనాల్లో మందుల కొరత లేకుండా చూస్తాం. 108 వాహనాలు సమయ పాలన ఉండేలా కృషి చేస్తామ’ని తెలిపారు. అంతకు ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి .. మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్‌లు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. గత ప్రభుత్వ హయంలో అవి పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. పేషెంట్లను దగ్గర్లోని నెట్వర్క్ ఆస్పత్రులకు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని కోరారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. 108లో సిబ్బంది సంఖ్యను పెంచాలని, సౌకర్యాలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. -
108 సేవల్లో జాప్యం జరిగితే చర్యలు తప్పవు
సాక్షి, అమరావతి : 108 సేవల విషయంలో జాప్యం జరిగితే చర్యలు తప్పవని వైదార్యోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి హెచ్చరించారు. 108 సేవలపై సమీక్షలో భాగంగా మంగళవారం వీవీజీ సంస్థ ప్రతినిధులతో జవహర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 108 కాల్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు.108 వాహనాల్లో ప్రాథమిక చికిత్సకు కావాల్సిన పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. 108 వాహనాల నిర్వహణకు కనీసం మూడు నెలల పాటు కావాల్సిన నిధులను సిద్ధంగా ఉంచుకోవాలని జవహర్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం వైపు నుంచి నిధుల జాప్యాన్ని నివారిస్తామని తెలిపారు.108 సేవలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలపై నివేదికను సిద్దం చేయాలన్నారు. -
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
వైద్య శాఖను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో ఆరోగ్య కేంద్రాలు, 108 సర్వీసుల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. వైద్య విధాన పరిషత్, వైద్య విభాగాల పని తీరును ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘమైన సమీక్షలో.. వైద్య రంగాన్ని మెరుగుపరచి ప్రతి పేదవారికి కూడా వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతిని సహించేది లేదని, వైద్యశాఖను తానే ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అధికారులు అంతా బాధ్యతతో పనిచేసి ఇందుకు సంబంధించి 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అన్ని వ్యవస్థలను సమూలంగా మార్పు తీసుకురావాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు. ప్రధానంగా వ్యవస్థీకృతంగా ఉన్న లోపాలను సరిదిద్దాలని సూచించారు. అలాగే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 108 వాహనాల నిర్వహణ గందరగోళంగా ఉన్న నేపథ్యంలో 108కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని అధికారులతో చర్చించారు. ఎన్టీఆర్ వైద్యసేవ పేరును వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా అమలు చేయాలని సూచించారు. వైఎస్సార్ స్పూర్తికి అనుగుణంగా ఈ సర్వీసులు పనిచేయాలన్నారు. ప్రయివేట్ ఆస్పత్రులు కన్నా ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళనకు ఆరోగ్య రంగ నిపుణల కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు.. దీనిని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేశ్ సీఎం కార్యాలయం తరఫున సమన్వయ పరుస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. వైఎస్సార్ అప్పట్లో అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108 సర్వీసులు వంటి అనేక విధానాలను పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని గుర్తుచేశారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, ఇతర పోస్టుల భర్తీపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.. పోస్టుల భర్తీ, ఆర్థిక అవసరాలు, మౌలిక అభివృద్ధిపై తక్షణమే నివేదిక రూపొందించాల్సిందిగా సూచించారు.. గతంలో రోగులను ఎలకలు కోరికేయడం, సెల్ ఫోన్ లైట్లతో శస్త్ర చికిత్స చేయడం వంటి ఘటనలపై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ మందులు, నాణ్యత లేని ఔషధాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే 104 వాహనాలౖ నిర్వహణపై కూడా ముఖ్యమంత్రి చర్చ జరిపారు. రాష్ట్రంలో మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు, మౌలిక వసతులు, సిబ్బంది కొరత, ఆరోగ్యశ్రీ పథకంలో తీసుకురావాల్సిన మార్పులపై కూడా దృష్టి సారించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ సీఎస్ అజయ్ కల్లాం, వైద్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరి కాసేపట్లో జల వనరుల శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. -
అంపశయ్యపై.. అపర సంజీవని
రోడ్డు ప్రమాదమైనా.. అస్వస్థతకు గురైనా.. పురిటి నొప్పులు పడుతున్నా.. కళ్లముందు ఎవరైనా మృత్యువుతో పోరాడుతున్నా ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకు వచ్చే అపర సంజీవని 108 అంబులెన్స్. ఫోన్ చేసిన 15 నిమిషాల్లో పూర్తి సరంజామాతో వాలిపోయి.. పోతున్న ప్రాణాలను పట్టి జీవితాలను నిలబెట్టిన ప్రాణదాత ఈ వాహనం. ప్రజల ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ 108 సేవలు ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం, నిర్వాకంతో పూర్తిస్థాయిలో అందని దుస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆపన్నులు విగతజీవులుగా మారిపోతున్నారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేక మొన్న పిఠాపురంలో ఒకరు మృతి చెందితే.. వాహనం సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోక నాలుగు నెలల క్రితం పిఠాపురం సమీపంలోని చేబ్రోలు వద్ద రోడ్డు ప్రమాదంలో ఏడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ప్రాణదాత అంపశయ్య పైకి చేరి.. సేవలు నిర్వీర్యమవుతున్న వేళ.. సకాలంలో వైద్యం అందక జిల్లాలో పలువురు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. మండపేట/ కాకినాడ సిటీ: సంఘటన జరిగినా పెద్దల నుంచి చిన్నారుల వరకూ వెంటనే 108కు ఫోన్ చేసేంతగా అనతికాలంలోనే ప్రజల్లోకి ఈ సేవలు చొచ్చుకుపోయాయి. వైఎస్సార్ ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని 18 రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఆయన హఠాన్మరణానంతరం వచ్చిన పాలకులు 108 సేవలను క్రమంగా నిర్వీర్యం చేస్తూ వచ్చారు. దీంతో అంతంతమాత్రంగా మారిన ఈ సేవలు ఐదేళ్లుగా పట్టిన ‘చంద్ర’గ్రహణంతో మరింతగా క్షీణించాయి. వైఎస్ గురుతులను చెరిపేయాలన్న లక్ష్యంతో 108 సేవల్ని టీడీపీ ప్రభుత్వం దెబ్బతీస్తూ వచ్చింది. ఫలితంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రథమ చికిత్సను సహితం అందించలేని దుస్థితికి 108 సేవలు చేరుకున్నాయి. 108 సేవలు సక్రమంగా అందకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రభుత్వం ఎన్నికల ముందు జగ్గంపేట, ప్రత్తిపాడు, అన్నవరం, కరప, తాళ్లరేవు మండలాలకు ఒక్కొక్కటి చొప్పున కొత్త వాహనాలను అందించింది. అయినప్పటికీ ఇతర సమస్యలు అలాగే ఉండడంతో 108 సేవలు సకాలంలో అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇవీ సమస్యలు జిల్లాలో 42 వాహనాలకు గాను అధికారిక లెక్కల ప్రకారం 39 తిరుగుతున్నాయి. వాస్తవానికి దాదాపు 13 వాహనాలు నాలుగు నెలల నుంచి ఏడాది కాలంగా పాడై షెడ్లలోనే ఉండగా, 29 వాహనాలు మాత్రమే తిరుగుతున్నట్టు తెలుస్తోంది. చాలా 108 అంబులెన్సులలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ప్రతి అంబులెన్స్‌కు ఇద్దరు పైలట్లను, ఇద్దరు టెక్నీషియన్లను నియమించారు. చాలా అంబులెన్సులలో నిన్నమొన్నటి వరకూ టెక్నీషియన్లు కూడా లేక ప్రథమ చికిత్స కూడా అందేది కాదు. కొన్ని వాహనాలు ఒక్క పైలట్‌తోనే నడుస్తున్నాయి. సిబ్బంది ఉన్న చాలా వాహనాల్లో ప్రథమ చికిత్సకు అవసరమైన పరికరాలు కూడా లేవు. దీంతో ప్రమాద బాధితులు, అపాయంలో ఉన్నవారికి అత్యవసర వైద్య సేవలు అందడం లేదు. దీనినిబట్టి ఈ సేవలపై ప్రభుత్వం ఏ స్థాయిలో నిర్లక్ష్యం చూపుతోందో అర్థం చేసుకోవచ్చు. అధిక శాతం వాహనాలు మైనర్ రిపేర్లతో నడుస్తున్నాయి. ఇంజిన్ ఆయిల్ మార్చకపోవడం, టైర్లు అరిగిపోవడం, బ్రేకులు పని చేయకపోవడం తదితర సమస్యలు అపర సంజీవని లక్ష్యానికి ప్రతిబంధకమవుతున్నాయి. సాధారణంగా రెండు లక్షల కిలోమీటర్లు తిరిగిన అంబులెన్సులను మార్చాల్సి ఉండగా.. జిల్లాలో అధిక శాతం వాహనాలు నాలుగు నుంచి ఐదు లక్షల కిలోమీటర్లు తిరిగినవి కావడం గమనార్హం. దీంతో అత్యవసర సమయాల్లో ఇవి ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అత్యవసరంగా వెళ్లాల్సిన సమయంలో వాహనాలు మొరాయించి తీవ్ర జాప్యం జరుగుతూండటంతో ప్రాణనష్టం జరిగిపోతోంది. ఫిట్నెస్ లేకపోవడంతో తరచూ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల ఆరు కొత్త వాహనాలు ఇచ్చినట్టు చెబుతుండగా మరమ్మతులు చేయించక పాత వాహనాలు షెడ్లలోనే మూలుగుతున్నాయి. వైఎస్ హయాంలో అత్యవసర వైద్యసేవల కోసం అంబులెన్సులలో 120 రకాల మందులు అందజేస్తే ప్రస్తుత ప్రభుత్వం 100కు తగ్గించేసి, వాటిని కూడా అరకొరగానే అందిస్తోంది. ఆక్సిజన్ లేక పోతున్న ఆయువు అత్యవసర కేసుల్లో క్షతగాత్రులకు, రోగికి ఆక్సిజన్ అందించడం తప్పనిసరి. ఆస్పత్రికి తరలించేంత వరకూ రోగి ప్రాణాలు నిలపడంలో ఆక్సిజన్ కీలకం. కాగా జిల్లాలో కేవలం ఐదు వాహనాల్లో మాత్రమే ఆక్సిజన్ అందుబాటులో ఉండడం గమనార్హం. మిగిలిన వాహనాల్లో సిలిండర్లు కూడా లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఒక్కో వాహనంలో రెండు ఆక్సిజన్ సిలిండర్లు ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆక్సిజన్ అయిపోయిందని చెప్పినా నిర్వాహకులు ఆక్సిజన్ సమకూర్చడం లేదని పలువురు 108 సిబ్బంది చెబుతున్నారు. శ్వాస సంబంధ సమస్యతో బాధ పడుతున్న పిఠాపురం ఇందిరా కాలనీ వాసి కూరపాటి చినగంగరాజు 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా.. అంబులెన్సులో ఆక్సిజన్ లేక మార్గంమధ్యలోనే మృతి చెందడం ‘అపర సంజీవని’ సేవలు నిర్వీర్యమవుతున్న తీరుకు నిదర్శనం. ఇంధనమూ కష్టమే 108 వాహనాలకు డీజిల్ నింపడం కూడా కష్టంగా మారింది. రోజూ డీజిల్ నింపుకొనేందుకు ఆయా ప్రాంతాల్లో 108 వాహనాలకు కొన్ని బంకులు కేటాయించారు. ఇదివరకు ఆన్లైన్ బిల్లింగ్ పేరుతో ఫుల్ట్యాంక్ కొట్టేవారు. అయితే ఇప్పటికే లక్షల రూపాయల మేర డీజిల్ బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో బంకు యజమానులు డీజిల్ పోయడానికి నిరాకరిస్తున్నారని తెలుస్తోంది. అత్యవసర సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలి 108 అనేది అత్యవసర సేవ. దీనిపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు. ప్రమాదాలు జరిగిన సమయాల్లో వేలాది మంది ప్రాణాలను కాపాడిన ఘనత 108కు ఉంది. కొత్త వాహనాలను ఏర్పాటు చేసి సేవలను మెరుగుపరచాలి. ప్రసూతి కోసం ఇదే వాహనాలను ఉపయోగించడంతో ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో వాహనాలు అందడం లేదు. ప్రసూతి కోసం గర్భిణులను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. నిధులు కేటాయించి, డీజిల్‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి. – అడ్డూరి ఫణీశ్వర రవిరాజ్‌కుమార్, జిల్లా ప్రయాణికుల సంఘం కార్యదర్శి, డీఆర్‌యూసీసీ మెంబర్, కాకినాడ -
108లో ఆక్సిజన్ లేక రోగి మృతి
పిఠాపురం : 108 వాహనాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా మరో నిండు ప్రాణం బలైపోయింది. వాహనంలో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు చెప్పిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణం ఇందిరా కాలనీకి చెందిన కూరపాటి చిన గంగరాజుకు భార్య చింతాలమ్మ, ఇద్దరు కుమారులున్నారు. ఆయన కొంతకాలం కిందట అనారోగ్యానికి గురయ్యాడు. కోలుకున్నాక వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున గంగరాజు ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఇది గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మెరుగుపడడంతో ఇంటికి తీసుకువచ్చారు. ఇంతలో శుక్రవారం ఉదయం మళ్లీ అదే పరిస్థితి ఎదురవగా ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. 108లో అయితే ఆక్సిజన్ ఉంటుందని భావించి ఫోన్ చేశారు. అది రాగానే ఆక్సిజన్‌ను వెంటనే పెట్టాలని అభ్యర్థించగా.. రెగ్యులేటర్ పనిచేయడంలేదని సిబ్బంది చెప్పారు. దీంతో ఆక్సిజన్ లేకుండానే అందులో తరలిస్తుండగా మార్గమధ్యంలో గంగరాజు మృతిచెందాడు. ఆక్సిజన్ ఉండి ఉంటే మృతిచెంది ఉండేవాడు కాదని బంధువులు రోదిస్తూ చెప్పారు. కాగా, గత కొన్ని రోజులుగా ఆక్సిజన్ ఉపయోగించే రెగ్యులేటర్ పనిచేయడంలేదని, మరమ్మతుల కోసం పై అధికారులకు సమాచారం ఇచ్చామని 108 సిబ్బంది వివరించారు. మరమ్మతులు కాకపోవడంవల్లే ఆక్సిజన్ అందించలేక పోయామన్నారు. -
నడిరోడ్డుపై గర్భిణి నరకయాతన
పొదలకూరు: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెలలు నిండకుండానే ఓ గర్భిణికి రక్తస్రావం అయ్యింది. సకాలంలో గమ్యస్థానానికి చేర్చి వైద్యం అందించాల్సిన 108 వాహనానికి ఇంధనం లేకపోవడంతో ఆయిల్ పట్టుకుని వస్తామని చెప్పి సిబ్బంది గర్భిణిని నడిరోడ్డుపై వదిలి వెళ్లారు. దీంతో ఆ మహిళ నడిరోడ్డుపై నరకయాతన అనుభవించింది. బస్టాండ్‌లో ఉన్న ఓ ఆటో డ్రైవర్ 108 వచ్చేలోగా తాను గర్భవతిని నెల్లూరుకు తరలిస్తానని ముందుకు వచ్చి మానవత్వం చాటుకున్నాడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవెల్లటూరు గ్రామానికి చెందిన ఆరో నెల గర్భిణికి రక్తస్రావం అవుతుండటంతో 108 అంబులెన్స్‌లో బంధువులు పొదలకూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రతినెలా ఇదే ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తున్నారు. గర్భిణి పరిస్థితి విషమించడంతో వైద్యురాలు మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో నెల్లూరుకు తరలించాల్సిందిగా సూచించారు. ఈలోగా 108 సిబ్బంది వాహనంలో ఇంధనం లేదని దాన్ని నింపుకుని వస్తామని గర్భిణిని రోడ్డుపై వదిలేసి వెళ్లారు. అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో రక్తస్రావం అవుతున్న గర్భిణి నరకయాతన అనుభవించింది. ఆమె ఆర్తనాదాలకు స్థానికులు చుట్టుముట్టారు. బంధువులకు ఏమి చేయాలో పాలుపోక అయోమయంలో ఉండగా గర్భిణిని తాను నెల్లూరుకు తీసుకెళతానని ఓ ఆటోడ్రైవర్ ముందుకొచ్చారు. అయితే ఇంధనం వేయించుకుని 108 వాహనం అక్కడికి రావడంతో గర్భిణిని అందులోనే నెల్లూరుకు తరలించారు. ఈ ఘటనపై అంబులెన్స్ సిబ్బంది మాట్లాడుతూ..తాము ముందుగానే నెల్లూరుకు తరలిస్తామని చెప్పినా గర్భిణి పొదలకూరు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వెళ్లాల్సిందిగా తమకు చెప్పిందని తెలిపారు. 108 సిబ్బంది చెప్పినట్లు వారు నేరుగా నెల్లూరుకు వెళ్లినా మధ్యలో ఇంధన సమస్య వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని బంధువులు అంటున్నారు. -
సంజీవనికి చంద్రగ్రహణం..
సాక్షి, మండపేట: 2018 అక్టోబరు 23.. అప్పటి వరకు కాకినాడలోని బంధువుల ఇంట జరిగిన వేడుకలో అందరితో ఆనందంగా గడిపారు. వెళ్లివస్తామంటూ విశాఖ జిల్లాలోని తమ స్వస్థలాలకు తిరుగుపయనమయ్యారు. చేబ్రోలు సమీపంలో రాంగ్ రూట్లో దూసుకొచ్చిన లారీ వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా మరో ఏడుగురు గాయపడ్డారు. వెంటనే స్థానికులు, పోలీసులు 108కి సమాచారం అందించారు. ఎంతసేపటికీ రాకపోవడంతో పోలీసులు ఆటోలో క్షతగ్రాతులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. ఈలోగా మరో ఇరువురు మృత్యు ఒడికి చేరుకున్నారు. నాలుగు నెలల క్రితం కత్తిపూడి సమీపంలో మతిస్థిమితం లేని మహిళ శిశువుకు జన్మనిచ్చింది. వైద్యసాయం కోసం స్థానికులు 108 సమాచారం ఇచ్చారు. మూడు గంటల తర్వాత 108 అంబులెన్స్ అక్కడకు చేరుకుంది. శిశువుకు సకాలంలో వైద్యం అందక జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆరు నెలల క్రితం మండపేట రూరల్ ఏడిదకు చెందిన ఇరువురు రాజమహేంద్రవరం నుంచి మోటారు సైకిల్‌పై గ్రామానికి తిరిగి వస్తుండగా చింతాలమ్మ ఆలయం సమీపంలో ఎదురుగా మట్టిలోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దుర్గాప్రసాద్ తలకు తీవ్రగాయమై రోడ్డుపై పడిపోగా, వెంకటరమణ పక్కనే ఉన్న పంట బోదెలో పడిపోయాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కోసం ఫోన్ చేసినా ఎంతసేపటికీ వాహనం రాకపోవడంతో ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చేసరికి దుర్గాప్రసాద్ చనిపోగా, కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ వెంకటరమణ మృతిచెందాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ప్రాణదాత సేవలు నిర్వీర్యమవుతున్న వేళ సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కో కొల్లలు. ఆపదలో మృత్యువుతో పోరాడుతున్న వేళ.. ఫోన్ చేసిన 15 నిమిషాలకే కుయ్.. కుయ్.. మంటూ చెంతకు వచ్చి ప్రాణాలు నిలిపే అపర సంజీవనికి చంద్ర గ్రహణం పట్టింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాథమిక చికిత్స అందించేందుకు సామగ్రి లేక సతమతమవుతోంది. సర్కారు నిర్లక్ష్యంతో మరమ్మతులకు గురైన వాహనాలను పట్టించుకునే వారు లేక సైరన్ మూగపోతోంది. జిల్లాలో 42 వాహనాలకు అధికారిక లెక్కల ప్రకారం 39 తిరుగుతున్నాయి. కాగా మరమ్మతులతో రామచంద్రపురం, ప్రత్తిపాడు తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 13 వాహనాలు నాలుగు నెలల నుంచి ఏడాది కాలంగా షెడ్లలోనే ఉండగా, 29 వాహనాలు మాత్రమే తిరుగుతున్నట్టు తెలుస్తోంది. వీటిలో అధికశాతం వాహనాలు స్వల్ప మరమ్మతులతోనే నడుస్తున్నాయి. ఇంజిన్‌లో ఆయిల్ మార్చకపోవడం, టైర్లు అరిగిపోవడం తదితర సమస్యలు అపర సంజీవని లక్ష్యానికి ప్రతిబంధకంగా తయారయ్యాయి. సాధారణంగా రెండు లక్షల కిలోమీటర్లు తిరిగిన అంబులెన్స్‌లను మార్చివేయాల్సి ఉంది. కాగా జిల్లాలో అధికశాతం వాహనాలు నాలుగు నుంచి ఐదు లక్షల కిలోమీటర్లు వరకు తిరిగినవి కావడం గమనార్హం. అత్యవసరంగా వెళ్లాల్సిన సమయంలో వాహనాలు మొరాయించి ఆలస్యమవుతుండడంతో జరగాల్సిన ప్రాణనష్టం జరిగిపోతోంది. ఫిట్నెస్ లేకపోవడంతో తరచూ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల ఆరు కొత్త వాహనాలు ఇచ్చినట్టు చెబుతుండగా పాత వాహనాలకు మరమ్మతులు చేయించకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో 108 దుస్థితి ఇదీ.. జిల్లాలో మొత్తం వాహనాలు 42 ప్రస్తుతం తిరుగుతున్న వాహనాలు 29 మరమ్మతులతో మూలకు చేరినవి 13 స్వల్ప లోపాలతో తిరుగుతున్న వాహనాలు 24 ఎక్కువ లోపాలున్నా తిరుగుతున్నవి 2 ఆక్సిజన్ అందుబాటులో లేని వాహనాలు 24 ఇంజిన్ ఆయిల్ కూడా మార్చకుండా తిప్పుతున్న వాహనాలు 20 టైర్లు అరిగిపోయినా తిరుగుతున్న వాహనాలు 20 సకాలంలో వచ్చి ఉంటే ప్రాణాలు నిలిచేవి కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆటోను గొల్లప్రోలు సమీపంలో లారీ ఢీకొట్టినప్పుడు సాయం కోసం 108కు సమాచారం అందించాం. ఎంతసేపటికీ రాకపోవడంతో పోలీసులు, స్థానికులు ఆటోల్లో తరలించే ఏర్పాటుచేశాం. సకాలంలో 108 రాకపోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సకాలంలో వచ్చి ఉంటే రెండు ప్రాణాలు నిలిచేవి. వాహనం వచ్చే సరికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. – ఎల్.అప్పన్నదొర, గొల్లప్రోలు చూద్దామంటే కనిపించడం లేదు దివంగత వైఎస్ 108 పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేశారు. కుయ్ కుయ్ కుయ్‌మన్న హారన్ వినిపిస్తే వైఎస్సార్ గుర్తొచ్చేటంతగా ఈ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. లక్షలాది మందికి పునర్జీవితాన్ని ఇచ్చింది. అటువంటి 108 ఇప్పుడు చూద్దామంటే కనిపించడం లేదు. – దుగ్గిరాల రాంబాబు, మండపేట ప్రథమ చికిత్స అందడం లేదు దారిన వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే 108కి సమాచారమిచ్చేవాళ్లం. వెంటనే 108 సిబ్బంది వచ్చి ప్రథమ చికిత్స చేసేవారు. దీనివల్ల ఆపదలో ఉన్నవారి ప్రాణాలు నిలిపేందుకు ఆస్కారముండేది. ఇప్పుడు ఫోన్‌చేసినా వాహనాలు రావడం లేదు. ఆటోల్లో తరలిస్తే ప్రథమ చికిత్స అందడం లేదు. – గొర్రెల శ్రీనివాసరావు, కరప ఫోన్ చేసిన పావు గంటలో వచ్చేది గతంలో ఫోన్ చేసిన పావుగంటలో 108 వాహనాలు సంఘటన స్థలానికి వచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంబులెన్స్ వస్తుందో లేదో తెలీని దుస్థితి. వేరే కేసులో ఉన్నామనో? దూరంగా ఉన్నామనో సమాధానం చెబుతున్నారు. దీంతో గాయపడిన వారిని ఆటోల్లో తరలించాల్సి వస్తోంది. – గుబ్బల శ్రీనివాస్, న్యాయవాది, రామచంద్రపురం -
సీఎం సభకు 108 వాహనాలు.. వైద్యం అందక బాలిక మృతి
సాక్షి, తాడికొండ: రాజధాని ప్రాంతంలో పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా అనువైన రోడ్లు లేకపోవడం.. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాల్సిన 108 వాహనాలు అందుబాటులో లేకపోవడం కారణంగా ఓ బాలిక మృత్యుఒడికి చేరింది. తాడికొండ మండలం మోతడక గ్రామ పరిధిలో శుక్రవారం సాయంత్రం వేగంగా వెళుతున్న ఆటోకు టైరు పేలడంతో అదుపుతప్పింది. దీంతో అమరావతి వలస మాలపల్లికి చెందిన రాయపూడి గీతాంజలి (14) తీవ్రగాయాలపాలై కొట్టుమిట్టాడుతుండగా.. స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేశారు. అయితే వాహనం అందుబాటులో లేదని, రావడానికి సమయం పడుతుందంటూ సమాధానం రావడంతో కంగుతిన్నారు. చిన్నారిని హుటాహుటిన ప్రైవేటు వాహనంలో గుంటూరులోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. కాగా, ముఖ్యమంత్రి సభ పేరిట శుక్రవారం ఉదయం 8 గంటలకే తాడికొండ, అమరావతి మండలాలకు చెందిన 108 వాహనాలను తుళ్ళూరు ప్రాంతానికి తరలించారు. దీంతో ఈ ప్రాంతంలో 108 సేవలు శుక్రవారం పూర్తిగా నిలిచిపోయాయి. -
‘108’లోనూ అవినీతి.. తెలంగాణ కంటే 4లక్షలు ఎక్కువ ఖర్చు!!
సాక్షి, షాద్‌నగర్ : 108 వాహనాల కొనుగోళ్లలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ వైద్యాశాఖ తాజా మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆరోపించారు. షాద్‌నగర్‌లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఒక్కో 108 వాహనానికి తెలంగాణ ప్రభుత్వం కంటే రూ. నాలుగు లక్షలు ఎక్కువగా పెట్టి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, దీని వెనుక అవినీతి జరిగిందని ఆయన తెలిపారు. జన్మభూమి కమిటీలతోనే చంద్రబాబు సర్కార్ అవినీతి మొదలైందని, మహబూబ్‌నగర్‌లో కరువు పేరుతో ప్రపంచబ్యాంకు నిధులను తెచ్చి దోచుకున్న చరిత్ర చంద్రబాబుదని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అవినీతిపై ప్రచారం చేస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు. -
108 ఆంక్షలు!
సాక్షి, అమరావతి: 108 అంబులెన్సుల పనితీరు రోజురోజుకూ మరింతగా దిగజారుతోంది. ఇప్పటికే నిధులు విడుదల చేయక నిర్వీర్యమైన ఆ పథకం.. ఇప్పుడు మరింత పతనావస్థకు చేరుతోంది. కనీస సౌకర్యాలు సైతం కల్పించకుండానే అవి తిరుగుతున్నట్లు చూపిస్తూ.. సవాలక్ష ఆంక్షలు విధిస్తూ ఎంతో ప్రాధాన్యమున్న ‘108’ను అగాథంలోకి నెట్టేస్తున్నారు. వీటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే.. అంబులెన్స్‌ల్లోని సిబ్బంది చేతికి వేసుకునే గ్లౌజులకు రేషన్ విధించారు. రోజుకు ఒక్క జత మాత్రమే ఇస్తాం.. ఉదయం ఈ గ్లౌజులు వేసుకుని రాత్రి వరకూ అవే వాడండి అంటూ యాజమాన్యం పరిమితులు విధించింది. ప్రమాద కేసుల్లో గాయపడిన బాధితులను అంబులెన్సులోకి ఎక్కించాలంటే విధిగా గ్లౌజ్ వేసుకోవాల్సిందే. ఒక బాధితుడికి వాడిన తర్వాత వాటిని మరో బాధితుడికి వాడే అవకాశం ఉండదు. కానీ, రోజుకు ఒక్క జత మాత్రమే గ్లౌజులు ఇస్తామని వాటి నిర్వాహకులు చెబుతుండడంతో సిబ్బంది తెల్లముఖం వేస్తున్నారు. ఉదయం వేసుకున్న గ్లౌజులే సాయంత్రం వరకూ వాడుకోవాలని, అంతకుమించి ఇవ్వలేమని చెప్పడం దారుణమని.. రక్తమోడుతున్న పేషెంట్లు అని చెప్పినా వినడంలేదని సిబ్బంది వాపోతున్నారు. ఇంజక్షన్లకూ పరిమితులు 108 అంబులెన్సుకు ఫోన్ చేశారంటేనే బాధితులు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నట్లు లెక్క. ప్రధానంగా ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్న వారే వీటిని ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటారు. వీరికి ఘటనా స్థలిలోనే ట్రమడాల్ అనే నొప్పి నివారణ ఇంజక్షన్ ఇస్తారు. కానీ, వీటిని కూడా రోజుకు ఒకటీ లేదా రెండు ఇంజక్షన్లు మాత్రమే ఇస్తామని యాజమాన్యం చెబుతున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అలాగే, అంబులెన్సుల్లో కనీసం 30 రకాల మందులు ఉండాలని.. కానీ, ఏ మందు కూడా ఇవ్వడంలేదని వారు చెబుతున్నారు. ఇంజక్షన్లు, గ్లౌజులు, టాబ్లెట్లు.. ఇలా ఒకటేమిటి అన్నిటికీ పరిమితులు విధించారని, ఇదేమని అడిగితే మీరు బాధితుడిని తీసుకొచ్చి ఆస్పత్రికి అప్పగించడం వరకే మీ పని, అంతకంటే ఎక్కువ మాట్లాడొద్దు అని తమను యాజమాన్యం బెదిరిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. వీఐపీ కాన్వాయ్కి వెళ్తే మందులకు మోక్షం రోజువారీ అంబులెన్సుల్లో మందులు, ఇంజిక్షన్లు, గ్లౌజులు ఇవేమీ ఉండవు. అదే ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ కాన్వాయ్కి గానీ ఈ 108 అంబులెన్సులను పంపిస్తే అన్ని రకాల మందులూ, గ్లౌజులు, ఇంజిక్షన్లు వస్తున్నాయని చెబుతున్నారు. కాన్వాయ్ నుంచి అంబులెన్సు బయటకు రాగానే మళ్లీ ఇవేమీ కనిపించని పరిస్థితి. అంతేకాకుండా.. రాజకీయ నాయకులు ఒత్తిడి తెస్తే ఆ ప్రాంతానికి అంబులెన్సు పంపుతున్నారు. ఒక్కో 108కు నెలకు 250 ఎమర్జెన్సీ కేసులు 108 వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా 439 ఉన్నాయి. ఇందులో కనిష్టంగా 80 వాహనాలు తిరగడంలేదు. అంటే 359 వాహనాలు తిరుగుతున్నాయనుకున్నా... ఒక్కో వాహనం నెలకు సరాసరిన 250 నుంచి 300 ఎమర్జెన్సీ కాల్స్‌కు హాజరవుతుంది. వీటిలో 40 నుంచి 50 శాతం ప్రమాద కేసులే. అంటే కనీసం 120 మంది ప్రమాదంలో గాయపడిన వారే. రోజుకు ఒక్కో వాహనం ఐదారుగురు బాధితుల్ని ఆస్పత్రుల్లో చేరుస్తుంటాయి. ఒక్కో వాహనానికి కనీసం 10 జతల గ్లౌజులు అవసరం. అధిక రక్తస్రావం అయినప్పుడు రెండు మూడు జతల గ్లౌజులు కూడా వాడాలి. కానీ, ఒక్క పేషెంటుకు మాత్రమే గ్లౌజులు ఇస్తుంటే మిగతా వారిని ఎలా అంబులెన్సు ఎక్కించాలన్నది ఉద్యోగుల వాదన. అసలే రకరకాల ఇన్ఫెక్షన్లు కాటేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో యాజమాన్యం నిబంధనలు విధించడం అటు సిబ్బందిని, ఇటు బాధితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. సీఎం డాష్బోర్డా మజాకా ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకునే కోర్‌డాష్ బోర్డును చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. పైగా 108 అంబులెన్సుల విషయంలో దాని పనితీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. 99.54 శాతం వాహనాలు విజయవంతంగా తిరుగుతున్నట్లు చూపించారంటే పరిస్థితి అంచనా వెయ్యొచ్చు. అన్ని వాహనాలకు ఇస్తున్నాం.. అన్ని వాహనాలకూ కావాల్సినన్ని మందులూ, గ్లౌజులు, ఇంజక్షన్లూ ఇస్తున్నామని యాజమాన్యం ప్రభుత్వానికి చెబుతోంది. స్టాకు పంపిణీ జరిగినట్టు కూడా చూపిస్తోంది. కానీ, వాహనాల్లోకి రావడం లేదంటే ఎక్కడ లోపం జరుగుతోందో విచారణ చేయిస్తాం. ఇప్పటికే ఈ వాహనాల్లో మందులు ఉన్నాయా లేదా, కాటన్, సర్జికల్స్ వంటివన్నీ ఉన్నాయో లేదో చూడాలని డ్రగ్ ఇన్స్పెక్టర్లకు కూడా ఆదేశాలిచ్చాం. రోజు వారీగా వాహనానికి ఎన్ని మందులు, ఎన్ని గ్లౌజులు ఇవ్వాలో యాజమాన్యానికి చెప్పాం. – డా.రాజేంద్రప్రసాద్, నోడల్ అధికారి, 108 అంబులెన్సుల పథకం -
శవాల తరలింపునకు దారేదీ..!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదల మృతదేహాల తరలింపు ప్రక్రియ ప్రహనంగా మారింది. నిర్వహణ లోపం వల్ల వాహనాలు తరచుగా మెరాయిస్తుండటం, వివిధ సాంకేతిక లోపాలతో షెడ్డుకు చేరిన వాహనాలకు సకాలంలో రిపేర్లు చేయించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో బాధితులు ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయిస్తున్నారు. మృతదేహాన్ని ఎలాగైనా సొంతూరికి తీసుకెళ్లాలనే బంధువుల ఆతృతను ప్రైవేటు అంబులెన్స్ యజమానులు ఆసరాగా చేసుకొని నిలువు దోపిడికి పాల్పడుతున్నారు. 32 వాహనాల్లో సగం షెడ్డులోనే.. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి చనిపోయిన వారి శవాలు, వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన వారి మృతదేహాలు, వివిధ పనులపై నగరానికి వచ్చి ఆకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయిన వారు, అనాధ శవాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా, గాంధీ శవాగారాలకు తరలిస్తుంటారు. వీటితో పాటు వివిధ జబ్బులతో బాధపడుతూ ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని బతికించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేక చనిపోయిన బాధితు లు ఉంటారు. ఇలా ఉస్మానియా మార్చురీకి రోజుకు సగటున 18 మృతదేహాలు వస్తుండగా, గాంధీ మార్చురీకి రోజుకు సగటున 25 మృతదేహాలు వస్తుంటా యి. శవపంచనామా తర్వాత ఫోరెన్సిక్ వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం చేసి, బంధువులకు అప్పగిస్తుంటారు. పేదల మృతదేహాల తరలింపు కోసం ప్ర భుత్వం 2016 నవంబర్‌లో 50 ‘హెర్సే’(పరమపద వాహనాలు)అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ఉస్మానియా, గాంధీ, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, నిలోఫర్, నిమ్స్ ఆస్పత్రులకు 32 వాహనాలను కేటాయించింది. నిధుల కేటాయింపు లేమితో పాటు నిర్వహణ లోపం వల్ల వీటిలో ప్రస్తుతం పదిహేను వాహనాలు పని చేయడం లేదు. ఎప్పటికప్పుడు వీటికి రిపేర్లు నిర్వహించి బాధితులకు అందుబాటులో ఉంచాల్సిన యంత్రాంగం పట్టించుకో కపోవడంతో విధిలేని పరిస్థితు ల్లో సొంతూళ్లకు మృత దేహాలను తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయించాల్సి వస్తుంది. నిజానికి హెర్సే వాహనాలు అందుబాటులోకి వచ్చిన త ర్వాత ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రైవేటు అంబులెన్స్‌ను నిషేదించారు. కానీ ప్రస్తుతం వీటిలో చాలా వరకు రిపేర్ల పేరుతో షెడ్డులో చేరడంతో ప్రైవేటు వాహనాలు బారులు తీరుతున్నాయి. విధులకు దూరంగా ఆర్‌ఎంఓలు.. ఒక వైపు సగానికిపైగా వాహనాలు షెడ్డు దాటని పరిస్థితులో ఉంటే..మరో వైపు అందుబాటులో ఉన్నవాటికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఆస్పత్రిలో ఎవ రైనా బాధితుడు చనిపోతే..మృతదేహం తరలింపు కోసం పరమపద వాహనాలను సమకూర్చాల్సిన బాధ్యతను సంబంధిత ఆస్పత్రి ఆర్ఎంఓలకు అప్పగిం చింది. కానీ ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఆర్‌ఎంఓలు కాకుండా హెల్త్ ఇన్స్పెక్టర్లకు అప్పగించడం వివాదాస్పదంగా మారింది. కీలకమైన ఎంఎల్సీ కేసుల వివరాలు నమోదు సహా పరమపద వాహనాల బుకింగ్ హెల్త్ ఇన్స్పెక్టర్లు అప్పగించడం వివాదాస్పదంగా మారింది. సమయానికి వీరు ఆస్పత్రిలో అందుబా టులో లేక పోవడంతో బంధువులకు ఇబ్బందులు తప్పడం లేదు. గంటల తరబడి ఎదురు చూసినా వీరు రాకపోవడం, ఒక వేళ వచ్చి వాహనం సమకూర్చి నా..డిజిల్ ఖర్చుల పేరుతో సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆదుకోని ఆపద్బంధువు
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : కత్తిపూడి శివారు 216వ జాతీయ రహదారి పక్కన ఇటీవల 108 సేవలు సకాలంలో అందకపోవడంతో నడిరోడ్డుపైనే మతి స్థిమితం లేని మహిళ ప్రసవించింది. ఫోన్ చేసినా సకాలంలో 108 రాకపోవడంతో జన్మించిన శిశువుకు వైద్యం అందలేదు. దీంతో శిశువు వెంటనే కన్నుమూసింది. ఘటన జరిగిన 3 గంటల తర్వాత 108 వాహనం అక్కడికి చేరుకుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోమవారం కూడా అదే తరహా జాప్యం పునరావృతమైంది. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో టాటా మేజిక్ వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కి ఫోన్ చేయగా వెంటనే రాలేదు. ఫోన్ చేసిన 2 గంటల తర్వాత వాహనం చేరుకుంది. ఈలోపు తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరు మృతి చెందారు. 108 వచ్చేలోపు పోలీసు జీపు, ఇతర వాహనాల్లో క్షతగాత్రులను పిఠాపురం ఆసుపత్రికి తరలించారు. ఇలా చెప్పుకునిపోతే గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. కానీ, ప్రభుత్వంలో చలనం లేదు. వైఎస్సార్ హయాంలో ఎన్నో ప్రాణాల్ని కాపాడిన ఆపద్బంధువు ఇప్పుడేమాత్రం ఆదుకోలేకపోతోంది. ఫోన్ చేసిన కొన్ని గంటల తర్వాత గానీ రాని పరిస్థితి నెలకొంది. ఈలోపే క్షతగాత్రులు, ఆపదలో ఉన్న వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒకప్పుడు ప్రథమ చికిత్సతోప్రాణాల్ని నిలబెట్టేవి. తదుపరి వైద్యసేవలు అందేవరకు మెరుపు వేగంతో తరలి వచ్చి పునర్జన్మ ప్రసాదించేవి. ఇప్పుడా పరిస్థితి జిల్లాలో కనిపించడం లేదు. సమయానికి రాకపోగా, వచ్చేవి కూడా ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితిలో 108 ఉంది. ఆక్సిజన్ కూడా 108 వాహనాల్లో లేని దుస్థితి నెలకొంది. జిల్లాలో 42 వాహనాలుండేవి. ఇందులో ప్రస్తుతం 33 పని చేస్తున్నట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికైతే క్షేత్రస్థాయిలో 29 మాత్రమే తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మిగతా వన్నీ మూలకు చేరిపోయాయి. ప్రస్తుతం పనిచేస్తున్న వాటిలో 20 వరకు చిన్న,చిన్న మరమ్మతులతో ఉన్నాయి. ఎప్పుడేది ఆగిపోతుందో తెలియదు. ఇక, ఆక్సిజన్ లేక, ఇంజన్ ఆయిల్ మార్చక, టైర్లు ఆరిగిపోయి తిరుగుతున్న వాహనాలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. వాస్తవ పరిస్థితి బయటకు చెబితే ప్రభుత్వం కన్నెర్ర చేస్తుందని అధికార వర్గాలు బయటికి చెప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 108 వాహనాలు వచ్చి ఆదుకుంటాయనే ఆశ ప్రజలకు లేకుండా పోయింది. అందుకు ఉదాహరణే తాజాగా గొల్లప్రోలు వద్ద జరిగిన ప్రమాదం. కత్తిపూడిలో అదే నిర్లక్ష్యం... మొన్న కత్తిపూడిలో ఫోన్ చేసిన 3 గంటల తర్వాత 108 వాహనం రావడంతో రోడ్డుపై మతి స్థిమితం లేని మహిళ జన్మనిచ్చిన శిశువు చనిపోగా సోమవారం చేబ్రోలులో జరిగిన రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు సేవలందించే విషయంలో కూడా అదే తరహా జాప్యం చోటుచేసుకుంది. దీనికంతటికీ ప్రమాదం జరిగిన గొల్లప్రోలు మండలంలో 108 వాహనం లేకపోవడమే కారణం. గతంలో ఇక్కడ 108 వాహనం ఉండేది. కాకినాడ రూరల్‌లోని వాహనం పాడైందని గొల్లప్రోలులో ఉండే వాహనాన్ని తరలించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గమంతటికీ రెండే వాహనాలున్న పరిస్థితి నెలకొంది. అసలే అరకొరగా పనిచేస్తుండగా, ఆపై వాహన కొరత ఉండటంతో ఫోన్ చేసిన వెంటనే ఘటన జరిగిన చేబ్రోలుకు 108 రాలేకపోయినట్టు తెలుస్తోంది. సుమారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రమాదం జరగ్గా 108 వచ్చే సరికి రెండు గంటలు ఆలస్యమైంది. ఈలోపే తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు సకాలంలో వైద్యసేవలందక మృతి చెందారు. సమయానికి వచ్చి ఉంటే వారిద్దరూ బతికేవారేమోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రాణాలను పణంగా పెట్టక తప్పదన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. జాప్యానికి కారణంపరిశీలిస్తా... ఫోన్ చేసిన వెంటనే 108 వాహనం ఎందుకు రాలేకపోయిందో పరిశీలిస్తాను. ఏ కారణం చేత రాలేదో తెలుసుకుంటాను. కాకినాడ రూరల్ 108 వాహనం చెడిపోయిన కారణంగా గొల్లప్రోలు వాహనాన్ని అక్కడికి తరలించాం. 108 వాహనాల కొరత ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో వాహనాలు రానున్నాయి.– బాలాజీ, 108 సేవల జిల్లా మేనేజర్ -
ఆపదలో ‘108’!
సాక్షి, సిటీబ్యూరో: ఆపదలో పిలిస్తే చాలూ కుయ్..కుయ్‌మంటూ పరుగెత్తుకొచ్చే 108 అత్యవసర సర్వీసులకు ఆపదొచ్చింది. సమయానికి ఆయిల్ మార్చకపోవడం, సర్వీసింగ్ చేయించకపోవడం, తదితర నిర్వహణ లోపం వల్ల వాహనాలు తరచూ మొరాయిస్తున్నాయి. ఒక్కోసారి బాధితులను మధ్యలోనే దింపేసి వేరే వాహనాల్లో తరలించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 316 సర్వీసులు ఉండగా, వీటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 42 వాహనాలు పనిచేస్తున్నాయి. 1787 మంది క్షేత్రస్థాయిలో(పైలెట్, ఈఎంటీ), 73 మంది కాల్సెంటర్లో పని చేస్తున్నారు. ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈఎం టీలు, పైలెట్లు ఇటీవల సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. హెచ్చరికలను బేఖాతార్ చేస్తూ సమ్మె కొనసాగిస్తున్న 930 మందిని టెర్మినేట్ చేయడం, వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవడం తెలిసిందే. నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే గ్రేటర్ రహదారులపై డ్రైవింగ్‌లో సరైన అనుభవం లేని వ్యక్తులతో వాహనాలను నడిపిస్తుండటం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం ఈ సమ్మె కాలంలోనే వందవాహనాల వరకు డ్యామేజైనట్లు తెలిసింది. గతంలో రోజుకు ఏడు నుంచి ఎనిమిది కేసులను అటెండ్ చేసిన వాహనాలు..నిర్వహణ లోపం వల్ల ప్రస్తుతం ఐదారు కేసులనే అటెండ్ చేస్తున్నాయి. ఇటీవల సాంకేతిక లోపంతో కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి ఎదురుగా 108 వాహనం నిలిచిపోయింది. సమస్యను గుర్తించడమే పైలెట్‌కు కష్టంగా మారింది. ఉప్పల్‌లోని ఓ రిపేరింగ్ సెంటర్‌కు నిత్యం నాలుగైదు వాహనాలు చేరుకుంటుండటం పరిస్థితికి నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఆపదలో ఉన్న రోగులకు సత్వర వైద్యసేవలు అందించాలనే ఆలోచనతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2005 సెప్టెంబర్ 15న 108 ఉచిత అంబులెన్స్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పట్లో ప్రభుత్వం, సత్యం ఈఎంఆర్‌ఐల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. 2011 తర్వాత ప్రభుత్వానికి జీవీకే–ఈఎంఆర్‌ఐకి మధ్య ఒప్పందం కుదిరింది. 2016 సెప్టెంబర్‌తో ఒప్పందం గడువు ముగిసింది. ఆ తర్వాత కూడా అదే సంస్థకు బాధ్యతలను కట్టబెట్టింది. దీర్ఘకాలికంగా ఒకే సంస్థకు ఇవ్వడం, ఈ సేవలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో సమస్య తలెత్తింది. వాహనాల మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం నెలకు రూ.21 వేలు చెల్లిస్తున్నా..వేళకు సర్వీసింగ్ చేయించకపోవడం, దెబ్బతిన్న పార్ట్‌లను మార్చకపోవడం వల్ల ఇంజన్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ఇటీవల సమ్మెలోకి వెళ్లిన సీనియర్ ఈఎంటీ, పైలెట్లను విధుల నుంచి తొలగించడం, వారిస్థానంలో వచ్చిన వారికి అత్య వసర సేవలపై కనీస అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మార్గమధ్యలో కనీస వైద్యసేవలు అందకపోవడం గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం ఉండటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యథావిధిగా సేవలు జీవీకే ఈఎంఆర్ఐ అత్యవసర సర్వీసులన్నీ యథావిధిగా పని చేస్తున్నాయి. ఉద్యోగులు సమ్మెలో ఉన్నప్పటికీ సేవలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చూశాం. నిర్వహణ పరంగా ఎలాంటి లోపాలు లేవు. అన్ని వాహనాల్లోనూ ఫైలెట్ సహా ఈఎంటీ ఉన్నారు. అత్యవసర రోగులకు ప్రాధమిక వైద్యసేవలు అందిస్తున్నారు. వాహనంలో ఆక్సిజన్ సహా అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి సమస్యలు లేవు. వాహనాలకు విధిగా సర్వీసింగ్ చేయిస్తున్నాం. ఇప్పటికే పాత వాహనాల స్థానంలో 150 కొత్త వాహనాలు ఏర్పాటు చేశాం. ఉద్యోగుల టెర్మినేట్ అంశం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఆదేశాల ప్రకరమే నడుచుకుంటాం. – బ్రహ్మానందరావు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ -
108పై 420 అటాక్!
పేదవాడికి అపర సంజీవని లాంటి పథకాన్ని స్వయంగా సర్కారే గొంతు నులుముతోంది. అర్ధరాత్రి, అపరాత్రి అనే భేదం లేకుండా పిలవగానే వచ్చి వాలిపోయే 108 పథకాన్ని ప్రభుత్వమే రెక్కలు విరగ్గొడుతోంది. ఆపదలో ఉన్నామంటూ ఆర్తనాదాలు చేస్తున్నా బాధితుల గోడు పట్టించుకోకుండా అంబులెన్సు వ్యవస్థను కుప్పకూల్చుతోంది. ఇదే ఆరోగ్యశాఖలో పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్) పేరుతో కార్పొరేట్లకు కోట్లకు కోట్లు చెల్లిస్తున్న ప్రభుత్వానికి పేదవాడిని కాపాడే అంబులెన్సులు గుర్తుకు రాలేదు. టైర్లు అరిగిపోయాయని, డీజిల్ లేదని, వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని ఉద్యోగులు రోజూ మొత్తుకుంటున్నా పెడచెవిన పెడుతోంది. నిధులివ్వాల్సిన ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకో కుండా నిర్వహణ సంస్థపైకి నెట్టేస్తోంది. పథకం సరిగా నడవక పోవడానికి నిర్వహణ సంస్థే కారణమని పదేపదే ప్రభుత్వం చెప్పడం, తన అనుకూల మీడియాతో రాయించుకోవడం తెలిసిందే. ఓవైపు మూలన పడ్డ వాహనాలను పట్టించుకోకపోగా మరోవైపు కొత్త అంబులెన్సుల కొనుగోళ్లను కూడా అవినీతిమయంగా మార్చిన ప్రభుత్వానికి బాధితుల గోడు పట్టడం లేదు. అంబులెన్సు వాహనాలకు ప్రభుత్వం కనీసం ఇన్సూరెన్స్ కూడా చెల్లించడం లేదు. బీమా కట్టకపోవడంతో వాహనాలు ఏదైనా ప్రమాదానికి గురైతే పేదల జీవితాలు వీధిపాలవుతున్నాయి. ఈ పథకంలో పనిచేసే స్వల్ప వేతన జీవులకు సకాలంలో వేతనం అందకపోవడం నిర్వహణ సంస్థల బాధ్యతా? ఇది సర్కారుది కాదా? ఏతావాతా రాష్ట్రంలో అంబులెన్సు వ్యవస్థను నీరుగార్చి ఆపదలో ఉన్నవారిని గాలికొదిలేసిన సర్కారు...ఏ కొనుగోళ్లలో ఎంత కమీషన్లు వస్తాయని చూస్తోందే కానీ నీరుగారిన పథకాన్ని పునరుద్ధరించే ఆలోచనే చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో పథకం పురుడు పోసుకుని దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో అమలవుతుండగా... పురుడు పోసుకున్న చోటే ఈ పథకం పుట్టెడు కష్టాల్లోకి నెట్టేయబడుతోంది. సాక్షి, అమరావతి: ఆపదలో ఆదుకునే అంబులెన్సులకే ఆపద వాటిల్లుతోంది! అత్యవసర వాహనాలు ఆగిపోకుండా చూడాల్సిన సర్కారే వీటిని మూలనపెడుతోంది. వాహనాలకు నిధులివ్వకపోగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా నిర్వహణా సంస్థలపై నెపం వేస్తోంది. రెండు ప్రభుత్వ విభాగాల మధ్య నెలకొన్న వివాదంతో 50 కొత్త అంబులెన్సులు విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద ఓ షెడ్లో మూడు నెలలుగా మూలనపడి ఉండటం సర్కారు అసమర్థతకు నిదర్శనం. ఇక రోగులను కాపాడాల్సిన అంబులెన్సుల కొనుగోలును కూడా ప్రభుత్వ పెద్దలు ఆదాయ వనరుగా మార్చుకున్న తీరు విస్మయం కలిగిస్తోంది. నిధులివ్వకుండా నిర్వహణ సంస్థలపై నెపం... 108 నిర్వహణకు టెండర్లు పిలిచింది సర్కారే. ఇష్టారాజ్యంగా బాధ్యతలు కట్టబెట్టిందీ ప్రభుత్వమే. పర్యవేక్షణ మరచి ఇప్పుడు సంస్థలపై నెపం వేస్తోంది. నాలుగున్నరేళ్లుగా ఏ నెలలోనూ సకాలంలో పథకానికి నిధులు చెల్లించలేదు. వాహనాలకు మరమ్మతులు చేయించలేదు. ఎప్పుడూ వంద వాహనాలు మూలనే ఉంటున్నాయి. ప్రస్తుతం బీవీజీ సంస్థ 108 నిర్వహణా బాధ్యతలు చూస్తోంది. ఈ సంస్థ సరిగా నిర్వహించడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. టైర్లు అరిగి, డీజిల్ లేక, ఇంజన్లు రిపేరుకు రావడంతో వాహనాలు తిరగడం లేదని, వీటికి మరమ్మతులు చేయించాలని మొత్తుకున్నా సర్కారు స్పందిచటం లేదని, అలాంటప్పుడు తమపై నెపం ఎలా వేస్తారని నిర్వహణ సంస్థ ప్రశ్నిస్తోంది. ఘటనా స్థలం నుంచి బాధితులతో అంబులెన్సులు వచ్చేదాకా అనుమానమేనని సిబ్బంది పేర్కొంటున్నారు. కొన్నవీ వాడుకోవడం లేదు... కేంద్ర ప్రభుత్వ నిధులతో 50 అంబులెన్సులను ఏపీఎంఎస్ఐడీసీ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) మూడు నెలల క్రితం కొనుగోలు చేసింది. వీటిని రిజిస్ట్రేషన్ చేయించి వినియోగించాల్సిన బాధ్యత కుటుంబ సంక్షేమశాఖది. ఫ్యాబ్రికేషన్, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తేనే తీసుకుంటామని ఆ శాఖ చెబుతోంది. కొనుగోలు చేసి ఇచ్చామని, ఇక ఆ బాధ్యత తమది కాదని ఏపీఎంఎస్ఐడీసీ అంటోంది. ఇలా రెండు విభాగాల మధ్య వివాదంతో విజయవాడ వద్ద గన్నవరంలోని ఓ షెడ్లో కొత్త అంబులెన్సులను మూలనపడేశారు. మరోవైపు ఇప్పటివరకూ ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో వాహనాల తయారీ సంస్థ కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలిసింది. కొనుగోలుచేసిన వాహనాలను ఎందుకు వాడుకోవడం లేదని 108 వాహనాల పర్యవేక్షణాధికారి డా.రాజేంద్రప్రసాద్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించ లేదు. తిరిగేవి 310... డాష్‌బోర్డులో 414 సీఎం కోర్ డ్యాష్‌బోర్డులో మాయలు జరుగుతున్నాయనేందుకు 108 వాహనాల వివరాలే నిదర్శనం. రాష్ట్రంలో మొత్తం 439 వాహనాలుండగా రోడ్డుమీద తిరుగుతున్నవి తక్కువగా ఉంటున్నాయి. సోమవారం వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 108 ఉద్యోగుల నుంచి సేకరించిన సమాచారం మేరకు 310 వాహనాలు తిరిగినట్టు తేలింది. కానీ సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ముఖ్యమంత్రి కోర్‌డాష్ బోర్డును పరిశీలిస్తే 414 వాహనాలు తిరిగినట్టు పొందుపరిచారు. 94.91 శాతం వాహనాలు తిరిగాయని చూపించారు. సీఎం కోర్‌డాష్ బోర్డులో ఉన్న లెక్కల ప్రకారమే వాహనాలకు బిల్లుల చెల్లింపు జరుగుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంటే రోజుకు 100కిపైగా వాహనాలను ఎక్కువ చూపించి బిల్లులు చెల్లిస్తున్నట్టు తేలుతోంది. వాహనం తయారీదారు దగ్గరే కొంటే... వాహనాలను తయారు చేసే కంపెనీ నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తే తక్కువ ధరకు లభిస్తాయి. అలా కాకుండా ఫ్యాబ్రికేషన్ చేసే ఇన్‌స్ట్రోమెడిక్స్ సంస్థ నుంచి అంబులెన్సులను కొన్నారు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య సలహాదారు జితేంద్రశర్మకు అత్యంత సన్నిహితుడిదనే చర్చ జరుగుతోంది. 89 వాహనాలను ఈ సంస్థ నుంచి నేరుగా కొనుగోలు చేయడం వల్ల ఒక్కో వాహనానికి రూ.5.39 లక్షలకు పైగా అధికంగా (టాటా అంబులెన్సులతో పోలిస్తే) చెల్లించారు. ఇందులో కమీషన్లు చేతులు మారాయని, ముఖ్యనేతల ప్రమేయం ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాబ్రికేషన్‌లో ఏముంటాయంటే..? ఫ్యాబ్రికేషన్ అంటే రకరకాల పరికరాలను అమర్చుకునేందుకు ఏర్పాటు చేసే వసతులు. అంబులెన్సులో ప్రధానంగా ఫ్యాబ్రికేషన్‌కు సంబంధించి చేతులు శుభ్రం చేసుకునేందుకు స్టీల్సింకు, అల్మారాలు, మందులు నిల్వ చేసుకునేందుకు అల్మారాలు, టూల్ బాక్సు, స్ట్రెచర్ కదలకుండా ఉండేందుకు ఒక స్టాండు, మల్టీచానెల్ మానిటర్ పరికరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఒక స్టాండు, ఆక్సిజన్ రెగ్యులేటర్, టూల్బాక్సు మీద మనిషి కూర్చోవడానికి షీటు తదితరాలన్నీ ఉంటాయి. ఏ వాహనానికైనా దాదాపుగా ఇవే ఉంటాయి. అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు అంబులెన్సుకు కూడా ఒకటి రెండు మినహా మరేమీ మారవు. ఆగస్ట్ 21 తర్వాత వేతనమే ఇవ్వలేదు 108లో దాదాపు 2 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆగస్ట్ 21న వేతనం ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటివరకూ ఇవ్వలేదు. పలుసార్లు వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం స్పందించలేదు. ఈ సంస్థ వచ్చాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి నెలా వేతనంలో కట్ చేస్తున్నారు. ఎందుకో తెలియదు. అడిగితే స్పందించేవారు లేరు. మా పరిస్థితి దయనీయంగా ఉంది. – కిరణ్‌కుమార్ (108 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు) వాహనం రూ.8.45 లక్షలు.. ఫ్యాబ్రికేషన్‌కు రూ.9.54 లక్షలు సాధారణంగా ఎక్కడైనా వాహనం ఖరీదు కంటే ఫ్యాబ్రికేషన్ వ్యయం ఎక్కువగా ఉండదు. కానీ ఫ్యాబ్రికేషన్ పేరుతో ప్రభుత్వం ఒక్కో వాహనానికి రూ.9.54 లక్షల దాకా చెల్లించడం గమనార్హం. 2016లో రాష్ట్రప్రభుత్వం 76 అంబులెన్సులను ఫోర్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. మరో 13 వాహనాలను కూడా అదే కంపెనీ నుంచి కేంద్ర మంత్రి సురేష్‌ప్రభు నిధులతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఫోర్స్ కంపెనీకి చెందిన ఒక్కో అంబులెన్స్ ఖరీదు రూ.8.45 లక్షలు కాగా ఫ్యాబ్రికేషన్ పనుల కోసం అదనంగా రూ.9,54,696 చెల్లించారు. అంటే వాహనంధర కన్నా వంద శాతం ఎక్కువగా చెల్లించడం గమనార్హం. గతంలో అంబులెన్సులకు ఫ్యాబ్రికేషన్ చేయించినప్పుడు రూ.2 లక్షలకు మించి కాలేదు. కానీ టీడీపీ సర్కారు ఏకంగా రూ.తొమ్మిదిన్నర లక్షలకు మించి ఖర్చు చేసింది. అత్యవసరానికి ఉపయోగపడే పరికరాలు అంటే డిఫ్రిబ్యులేటర్, ఆక్సిజన్ పైప్‌లైన్, మందులు తదితరాలకు మళ్లీ ప్రభుత్వమే ప్రత్యేకంగా చెల్లిస్తుంది. తెలంగాణలో రూ.11.65 లక్షలకే... కొద్ది నెలల కిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. ఒక్కో అంబులెన్స్ ఖరీదు రూ.9.30 లక్షలు కాగా ఫ్యాబ్రికేషన్‌కు రూ.2.35 లక్షలు వెచ్చించింది. దీన్నిబట్టి ఒక్కో వాహనం ఖరీదు రూ.11.65 లక్షలుగా తేలిపోతోంది. తెలంగాణ సర్కారు వీటిని టెండర్ల ద్వారా కొనుగోలు చేసింది. టాటా ఫ్యాబ్రికేటెడ్ 12.60 లక్షలలోపే టాటా కంపెనీ నుంచి 2016లో 202 అంబులెన్స్‌లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ‘ప్యాబ్రికేషన్’తో కలిపి ఒక్కో వాహనాన్ని రూ.12,60,106 చొప్పున విక్రయించారు. ప్రస్తుతం ఈ వాహనాల ధర ఇంకా తగ్గినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. దీన్నిబట్టి కమీషన్ల మాయాజాలం జరిగినట్లు తేటతెల్లం అవుతోంది. -
నెట్టుకొస్తున్నారు...రాజన్నా !
చిత్తూరు, చంద్రగిరి :రాష్ట్రంలోని పేద ప్రజలు సకాలంలో వైద్యం అందక మృతి చెందకూడదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలో నుంచి పుట్టిన 108 వాహనాన్ని ఇలా నెడుతున్నారు. చంద్రగిరిలో శుక్రవారం ఒక అత్యవసర కేసును ఆస్పత్రికి తరలించేందుకు మధ్యాహ్నం 2–30 గంటల ప్రాంతంలో 108 బయలుదేరింది. అయితే వాహనం స్టార్ట్‌కాలేదు. సిబ్బంది దాన్ని నెడుతూ ఆపసోపాలు పడిన అనంతరం స్టార్టయ్యింది. నెల రోజులుగా ఈ వాహనం పరిస్థితి ఇలాగే ఉందని..సమాచారం అందినా అధికారులు మరమ్మతుల గురించి పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. -
‘డిగ్గి.. యూపీలో తెలుగు మాట్లాడతారా..?’
న్యూఢిల్లీ : బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విషయం అయితే చాలు.. అది నిజమో కాదో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఆనక అది కాస్తా తప్పుడు సమాచారం అని తెలడంతో విమర్శల పాలవ్వడం పరిపాటి అయ్యింది కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌కి. తాజాగా మరోసారి నెటిజన్ల చేతిలో విమర్శల పాలవుతున్నారు దిగ్విజయ్ సింగ్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చేసిన ప్రయత్నం కాస్తా రివర్సవ్వడంతో తలపట్టుకున్నారు డిగ్గి రాజా. విషయం ఏంటంటే దిగ్విజయ్ సింగ్ తన ట్విటర్లో నిరుపయోగంగా పడి ఉండి శిథిలావస్థకు చేరుకున్న 108 వాహనాల ఫోటోను షేర్ చేశారు. ఫోటోతో పాటు యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశిస్తూ ‘యోగి జీ.. మీరు ఉత్తరప్రదేశ్‌కు ఏం చేశారు..? అఖిలేశ్ యాదవ్ హాయాంలో ప్రారంభించిన 108, 102 వాహనాలను మీరు ఇలా నిరుపయోగం చేసి దుమ్ము కొట్టుకుపోయే స్థితికి తీసుకోచ్చారు. ప్రజల ఆరోగ్యానికి మీరు ఇచ్చే ప్రాముఖ్యత ఇదేనా’ అంటూ ట్వీట్ చేశారు. ये उत्तर प्रदेश की हालत क्या कर दी योगी जी ने, अखिलेश यादव जी द्वारा चलवाई गई 108,102 एम्बूलेंस खड़ी जंग खा रही है और जनता अपने बीमार परिजनों को ठेलो पर अस्पताल ले जा रही है॥ #वाह_योगी_जी_वाह# #बेशरमी_की_भी_हद_होती_है# रजत यादव pic.twitter.com/zWJr8CugHY — digvijaya singh (@digvijaya_28) October 3, 2018 కానీ అసలు విషయం ఏంటంటే ఈ అంబులెన్స్‌లు ఆంధప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి. తొలుత రజత్ యాదవ్ అనే వ్యక్తి షేర్ చేసిన ఈ ఫోటోను కాస్తా దిగ్విజయ్ సింగ్ కాపీ చేసి తన ట్విటర్లో షేర్ చేశారు. యోగి ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామనుకుని ఆయనే నవ్వుల పాలయ్యారు. దిగ్విజయ్ ట్వీట్ చేసిన ఫోటో చూసిన నెటిజన్లు ‘ఉత్తరప్రదేశ్‌లో తెలుగు మాట్లాడతారా డిగ్గి’ అంటూ కామెంట్ చేశారు. అంతేకాకా ‘దిగ్విజయ్ ఒక అబద్దాల కోరు’ అంటూ విమర్శిస్తున్నారు. గతంలో కూడా దిగ్విజయ్ సింగ్ పగుళ్లు వచ్చిన ఓ మెట్రో పిల్లర్ ఫోటోను షేర్ చేస్తూ ‘భోపాల్ రైల్వే బ్రిడ్జి పరిస్థితి ఇది’ అంటూ ట్వీట్ చేశారు. ఆనక అది కాస్తా పాకిస్తాన్‌కు చెందిన మెట్రో పిల్లర్‌గా తెలడంతో తన పొరపాటుకు క్షమాపణలు చెప్పారు. -
108కు బ్రేకులు..
నల్లబెల్లి (వరంగల్) : అందరిని ఆదుకునే ఆపద్భందుకు బ్రేకులు పడ్డాయి. అరకొర వేతనాలు.. 12 గంటలకు పైగా పని.. ఉంటే ఉండండి.. పోతే పొండి అనే యాజమాన్యం బెదిరింపులతో 108 ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. 2005 ఆగస్టు 15న ప్రారంభించిన 108 సర్వీసులు ఇప్పటివరకు నిరంతరాయంగా ప్రజలకు సేవలందిస్తున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలని 37 రోజులుగా సమ్మె చేస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 108 అంబులెన్స్‌ల్లో పనిచేస్తున్న సిబ్బంది తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 37 రోజులుగా సమ్మె చేస్తున్నారు. 13 ఏళ్ల నుంచి అత్యవసర సమయాల్లో రోగులను రాత్రి పగలనక అంకిత భావంతో ఆస్పత్రులకు తరలిస్తూ ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులతో పాటు ఇప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ 108 ఉద్యోగులందరికీ భరోసాగా ఉంటామని ప్రకటిస్తూ హమీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సాక్షిగా 108 ఉద్యోగులకు తీపి కబురు అందిస్తామని ప్రకటించారు. దీంతో అప్పట్లో 108 ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అప్పటి నుంచి ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులను వేడుకున్నా ఫలితం లేదు. చేసేది లేక సమ్మె బాట పట్టారు. గతంలో మూడు సార్లు.. 108 ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం 2011, 2013, 2015 సంవత్సరాల్లో సమ్మెకు దిగారు. ప్రభుత్వమే 108 నిర్వహణ కొనసాగించాలని, జీఓ నం బర్.3 ప్రకారం వేతనాలు చెల్లించాలని, రోజుకు 8 గంటల పని సమయం నిర్ణయించాలని, అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలని, పబ్లిక్ ప్రైవేటు పాట్నర్షిఫ్ (పీపీపీ) విధానాన్ని రద్దు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పట్లో ప్రభుత్వం 108 ఉద్యోగుల డిమాండ్ నెరవేరుస్తామని హామినిచ్చింది. కానీ ఇంత వరకూ నెరవేర్చలేదు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి మళ్లీ ఆగస్టు 11 నుంచి సమ్మెబాట పట్టారు. దీంతో ఇటీవల లెబర్ కమిషనర్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్లతో పాటు సంబంధిత అధికారులు, జీవీకే సంస్థ నిర్వాహకులకు సమ్మె నోటీసు ఇచ్చి సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 1650 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. పూట గడవని బతుకులు.. 108 ఉద్యోగులు అంకిత భావంతో చేస్తున్న పనిగొప్పది. అత్యవసర సమయాల్లో ఎంతో మందిని సరైన సమయాల్లో ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడుతూ కుటుంబాలకు అండగా ఉండేది. రాత్రనక.. పగలనక 12 గంటలు విధులు నిర్వహిస్తే సంస్థ నిర్వాహకులు రూ.13 వేల నుంచి 14 వేల వరకు ఇస్తున్నారు. అంబులెన్స్‌లో కనీస సౌకర్యాలు ఉండవు. అంబులెన్స్‌లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరితే వేధింపులకు గురిచేస్తూ పని చేస్తే చేయండి లేదంటే మానేసుకొమ్మని బెదిరింపులకు పాల్పడుతున్నారంటే వారి బాధలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయినా.. నేడో రేపో ప్రభుత్వం తమను గుర్తిస్తుందనే ఆశతో ఇన్నాళ్లు పనిచేస్తూ వస్తున్నారు. కార్మిక చట్టాల ప్రకారం ప్రతీ కార్మికుడు రోజులో 8 గంటలు మాత్రమే పనిచేయాలి. కానీ 108 ఉద్యోగులు మాత్రం రోజుకి 12 గంటలు పనిచేస్తున్నారు. అదనంగా పనిచేసిన 4 గంటలకు ఎటువంటి ఓవర్ టైం పేమెంట్ ఇవ్వడంలేదు. అంతే కాకుండా 12 గంటలు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్దామనుకునే సమయంలో ఏదైనా కేసు వస్తే మరో రెండు గంటలు అదనంగా పని చేయాల్సి వచ్చేది. ఇలా నిత్యం 12 నుంచి 14 గంటల పని భారం తప్పేది కాదు. సిబ్బంది సరిపడా లేకపోవడంతో సమయానికి సెలవులు కూడా ఇవ్వడం లేదని పలువురు 108 ఉద్యోగులు వాపోతున్నారు. అత్యవసర సేవలపై ప్రభావం.. 108 ఉద్యోగులు ప్రజలను అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్పత్రులకు తరలిస్తున్న సమయాల్లో సంబంధిత వైద్యుల సూచనల మేరకు అవసరమైన చికిత్స అందిస్తూ అండగా నిలుస్తున్నారు. సమ్మె కారణంగా క్షేత్ర స్థాయిలో ప్రజలకు అత్యవసర సేవలు అందడం ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి జిల్లాలో అంబులెన్సులు 40 ఉన్నాయి. పైలెట్లు, ఈఎంటీలు 220 మంది మొత్తం ఉద్యోగులు ఉన్నారు. 172 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 108ను పబ్లిక్ ప్రైవేట్ పాట్నర్షిఫ్ (పీపీపీ) పద్ధతిలో 2009 సంవత్సరంలో జీవీకే సంస్థకు కట్టబెట్టారు. ఈ విధానం 108 ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. ఈ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తూ 108 నిర్వహణ ప్రభుత్వమే కొనసాగించాలి. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని జీవీకే సంస్థ బెదిరిస్తుంది. – అశోక్ పల్లె, తెలంగాణ 108 ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు. -
108 వాహనం రాకనే ఆగిన ప్రాణం
శ్రీకాకుళం, కొత్తూరు: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన 108 వాహన సేవలను టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. కొత్త వాహనాలు కొనుగోలు చేయకపోగా, పాత వాహనాలతో నెట్టుకు రావడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఫలితంగా సకాలంలో సేవలందక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా మండలంలోని దిమిలి పంచాయతీ పరిధి అమ్మన్నగూడకు చెందిన కందుల ఆఫీస్ (54) శనివారం రాత్రి ఆకస్మాత్తుగా పక్షవాతం వచ్చింది. వెంటనే 108కు ఫోన్ చేయగా, వాహనం మరమ్మతుల్లో ఉందని సమాధానం వచ్చింది. అయినప్పటికీ మరలా పలు దఫాలుగా ఫోన్ చేసినా కాల్ సెంటర్ సిబ్బంది స్పందించ లేదు. చివరకు వైఎస్సార్సీపీ నేత గోళ రామకృష్ణ మరోసారి కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి కనీసం ఆల్తి గిరిజన గ్రామంలో ఫీడర్ అంబులెన్స్(టూవీలర్ అంబులెన్స్) పంపించాలని కోరారు. చివరకు మూడు గంటలు ఆలస్యంగా రాత్రి 10.30 గంటలకు ఫీడర్ అంబులెన్స్ పంపించారు. ఇందులో ఆఫీస్‌ను కొత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ క్రమంలో ఆస్పత్రికి చేర్చిన బాధితుడిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే ఆస్పత్రి తలుపులు సకాలంలో తీయకపోవడంతోనూ, 108 సిబ్బంది నిర్లక్ష్యంతోనూ మృతి చెందినట్లు అతడి బంధువులు ఆందోళన చేశారు. మృతుడి భార్య నీలమ్మ అనారోగ్యంతో రెణ్నెళ్ల క్రితమే మృతి చెందింది. వీరికి కుమారులు చిరంజీవి, శేషగిరి ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి 108 వాహనాల నిర్వాహణపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంతోనే సకాలంలో సేవలందకపోవడంతో ప్రజలు ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయని వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు సారిపల్లి ప్రసాదరావు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన ఆఫీస్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా రూ. 5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఐటీడీఏ పీవో విచారణ చేపట్టాలని కోరారు. -
ఆపదలో బాంధవులు
-
పగలు తిప్పండి.. రాత్రి ఆపండి
సాక్షి, అమరావతి: అకస్మాత్తుగా అనారోగ్యం పాలైనా.. యాక్సిడెంట్ అయినా.. వెంటనే 108కు ఫోన్ చేయడం ప్రజలకు అలవాటు. ఇకపై రాత్రి పూట ఫోన్ చేస్తే 108 రాదు. ఎందుకంటే ఉన్న వాహనాలను పగలు మాత్రమే తిప్పండి, రాత్రి నిలిపివేయండి అంటూ 108 అంబులెన్సుల నిర్వహణా సంస్థ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీచేయడమే కారణం. రాష్ట్రంలో 439 వాహనాలుండగా 422 వాహనాలు తిరుగుతున్నాయని ముఖ్యమంత్రి కోర్‌డాష్ బోర్డులో సమాచారం ఉంది. కానీ ప్రస్తుతం 342 వాహనాలు మాత్రమే తిరుగుతున్నాయని నిర్వాహణ సంస్థ జీవీజీ ఉద్యోగులు చెబుతున్నారు. వాహనాలను పగలు మాత్రమే తిప్పాలని, ఐదు కిలోమీటర్ల దూరం అయితేనే వెళ్లాలని, అంతకుమించి దూరంలో సంఘటన స్థలం ఉంటే బిజీగా ఉన్నామని చెప్పాలని ఉద్యోగులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో చాలా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదానికో, ఇతరత్రా ఆపదలో ఉన్న పేదలు 108కు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నామని జవాబు వస్తోంది. వాహనాలు తిరగడం లేదని ఉద్యోగులెవరైనా మీడియాకు చెబితే అలాంటి వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని సంస్థ బెదిరిస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. కొన్ని వాహనాల్లో ఆక్సిజన్ సిలెండర్లు లేవు, 90 శాతం వాహనాల్లో మందులు లేవు, మెజార్టీ వాహనాలకు టైర్లు అరిగిపోయి తిరగడం లేదు..ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రెండు దఫాలుగా చర్చలు జరిగినా ఫలితం లేదు. అయితే తాము ఇచ్చిన సమ్మె నోటీసును వెనక్కి తీసుకోలేమని, ఏ క్షణంలో అయినా సమ్మెలోకి వెళతామని ఉద్యోగులు హెచ్చరించారు. 108 వాహనాల సమస్యలు ఇవీ.. - సకాలంలో ఇంజన్ ఆయిల్ మార్చకపోవడంతో ఇంజన్లు సీజ్ అవుతున్నాయి - హెడ్లైట్లు పనిచేయకపోవడంతో రాత్రి సమయంలో ప్రమాదానికి గురవుతున్నాయి - సైరన్, బార్‌లైట్స్, బ్లింకర్స్, బ్యాటరీ హారన్ పనిచేయడంలేదు. టైర్లు పూర్తిగా అరిగిపోయి వందల వాహనాలు తిరగలేని పరిస్థితిలో ఉన్నాయి - బ్రేకులు, బ్యాటరీలు పనిచేయడం లేదు - వైఫర్స్ పనిచేయకపోవడంతో వర్షంలో తిరగడం కష్టంగా ఉంటోంది. వాహనాల్లో మల్టీచానల్ మానిటర్, సెక్షన్ ఆపరేటర్స్, డిఫ్రిబ్యులేటర్, వెంటిలేటర్, పల్సాక్సీ మీటర్లు లేవు - కనీసం బీపీ ఆపరేటర్, స్టెతస్కోప్, గ్లూకోమీటర్, ధర్మామీటర్లు కూడా లేవు - చాలా అంబులెన్సుల్లో ఆక్సిజన్ అందుబాటులో లేదు - క్షతగాత్రులకు అవసరమైన కాటన్, డ్రెస్సింగ్ ప్యాడ్స్, సెరిలైజ్డ్ దూది, అయోడిన్, స్ట్రెచర్ కూడా లేవు - పాముకాటు సమయంలో ఇవ్వాల్సిన ఏఎస్వీ,టీటీ ఇంజక్షన్లు లేవు ఉద్యోగుల సమస్యలు.. - ప్రతినెలా ఉద్యోగుల వేతనాల్లో కారణం లేకుండా కోత వేస్తున్నారు - రోజుకు 8 గంటలు కాకుండా 12 గంటలు పనిచేయిస్తున్నారు - వేతనం పెంచుతామని హామీ ఇచ్చినా ఇప్పటికీ పెంచలేదు - గత 6 నెలలుకు సంబంధించిన రిలీవింగ్ బిల్లులు చెల్లించలేదు - వాహనాలకు మైనరు రిపేర్లు, పంక్చర్స్, ఎయిర్, హెడ్లైట్లకు సంబంధించిన బిల్లులు ఉద్యోగుల మీద వేస్తున్నారు. - వాహనాలు ఆగిపోతే ఆ సిబ్బందికి ప్రత్యామ్నాయం చూపించకపోగా వేతనాలు కూడా ఇవ్వడంలేదు. సిబ్బంది ప్రమాదానికి గురైతే ఎలాంటి వైద్య బీమా లేదు -
108 ఉద్యోగుల సహాయ నిరాకరణ
సాక్షి, మహబూబాబాద్: అత్యవసర పరిస్థితుల్లో బాధితుల వద్దకు వేగంగా వెళ్లి ప్రథమ చికిత్స అం దించి, ఆతర్వాత మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రి కి తరలించే 108 వాహన సేవలకు కొద్ది రోజు లుగా ఆటంకం ఏర్పడుతోంది. జీఓ నంబర్ 3 ప్రకారం వేతనాలు చెల్లించాలని, పని సమయాన్ని 8గంటలకు తగ్గించాలని, పీపీపీ విధానాన్ని రద్దు చేసి 108 వ్యవస్థను ప్రిన్సిపల్ సెక్రెటరీ పరిధిలోకి మార్చాలని ఆయా ఉద్యోగులు జీవీకే – ఈఎంఆర్ఐ యాజమాన్యానికి ఇటీవల నోటీసు ఇచ్చారు. ఈమేరకు ఈనెల 11వ తేదీ నుంచి ఈఎంటీలు, డ్రైవర్లు రోజూ 8గంటల పాటు విధులను బహిష్కరించి సహాయ నిరాకరణకు దిగారు. జిల్లాలో 108 వాహనాలు 9 ఉన్నాయి. మానుకోట, కేసముద్రం, కొత్తగూడ, బయ్యారం, మరిపెడ, తొర్రూర్, కురవి, గూడూరు మండలాల్లో వాహనాలు ఉండగా, డ్రైవర్లు, టెక్నీషియన్లతో కలిపి మొత్తం 45 మంది ఉన్నారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా 8 గంటలకు బదులు 12 గంటలు పనిచేయిస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం సహాయ నిరాకరణలో భాగంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు విధులు నిర్వర్తించి, పగలు 4గంటలు, రాత్రి 4 గంటలు అంబులెన్స్ నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్లు నెరవేర్చాలి పనివేళలు తగ్గించడంతోపాటు వేతనాలు పెంచాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి. – పాక విజయ్‌కుమార్, 108 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
అన్ ‘ఫిట్’
సాక్షి, అమరావతిబ్యూరో: ఎంతో మహోన్నత ఆశయంతో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన 108, 104 అంబులెన్సుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం విస్మరించింది. కనీస మరమ్మతులు చేయించకుండా వాహనాలు తిప్పడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. అత్యవసర సమయాల్లో బాధితులను రక్షించేందుకు ఏర్పాటుచేసిన 108 సర్వీసులే ప్రమాదాలకు లోనవుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మొబైల్ వాహనం ద్వారా వైద్య సేవలు అందించేందుకు ప్రవేశపెట్టిన 104 పథకం అమలు సైతం దయనీయంగానే ఉంది. ప్రమాదకర వాహనాలు ప్రజల ప్రాణాలతోచెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వం ఈ వాహనాల బాధ్యతలనుచూసే సంస్థలు వీటి నిర్వహణను గాలి కొదిలేయడంతోనే ఈ దుస్థితి నెలకొంది. ఎలాంటి ఫిట్నెస్ సర్టిఫికెట్(ఎఫ్‌సీ) లేకపోయినా ఈ వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. జిల్లాలో 104కు చెందిన 24 వాహనాలుండగా ఒక్క అంబులెన్స్‌కు ఫిట్నెస్ కానీ, ఆర్సీ కానీ, పొల్యూషన్ సర్టిఫికెట్ కానీ లేవు. అదేవిధంగా మూడు 108 వాహనాలు కూడా ఎఫ్‌సీ లేకుండానే తిరుతున్నాయి. కలిదిండి, ఇబ్రహీంపట్నం, చాట్రాయి మండల కేంద్రాల్లో ఉన్న 108 వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు. అయినా వాటి నిర్వహణ బాధ్యతలు చూసే సంస్థలు ఆయా వాహనాలను రోగులను తరలించేందుకు పంపుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 104 వాహనం ఒక రోజు ఓ గ్రామానికి వెళ్లి వస్తే ఆ వాహనానికి రూ. 10 వేలు నిర్వహణ సంస్థ పీఎస్ఎంఆర్కు అందుతుంది. అందువల్లే ఆవి ఫిట్‌గా లేకపోయినా కాసులకు కక్కుర్తిపడి వాటిని రోజూ తిప్పుతున్నారని సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇటీవల ఫిట్నెస్ లేని 104 వాహనం ప్రమాదానికి గురికాగా డ్రైవరుతో సహా ఎనిమిది నెలల గర్భిణి అయిన నర్సు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 104 సిబ్బంది ఆందోళనకు దిగారు. ఇలాంటి వాహనాల్లో తాము పనిచేయమని వారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్పందించి ఈ వాహనాలన్ని ఫిట్‌గా ఉండేలా మరమ్మతులు చేయిస్తామని ఈ ఏడాది మే 1వ తేదీన స్వయంగా ప్రకటించారు. మూడు నెలలు గడిచినా ఫలితం లేకపోవడం విచారకరం. గర్భిణనిని తీసుకెళ్తూ... జిల్లాలోని గరికిముక్కల గ్రామానికి చెందిన మేరికి పురిటి నొప్పులతో గత నెల 30వ తేదీన కలిదిండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. అత్యవసరంగా ఆమెను 108 వాహనంలో సమీప పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యలో గుర్వాయిపాలెం ఇటుకల బట్టీ వద్దకు రాగానే 108 వాహనం ముందు చక్రం విరిగిపోయింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ వాహనానికి ఫిట్నెస్ లేనికారణంగానే ఈ ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. చాలా వరకు అంబులెన్స్‌లకు కాలం చెల్లడం. ఉన్నవి కూడా కండీషన్లో లేకపోవడం. పాడైపోయిన ఉపకరణాలు (స్పేర్‌పార్ట్స్) సరైన మరమ్మతులకు నోచుకోకపోవడంతో జిల్లాలో 108 వాహనాలు తరచూ షెడ్లకు చేరుతున్నాయి. ముఖ్యంగా ఫిట్నెస్ లేని వాహనాల వల్ల అటు రోగులతోపాటు ఇటు సిబ్బంది సైతం ప్రాణాలను పణంగా పెట్టాల్సిరావడం విచారకరం. రాష్ట్రంలో మూలనపడ్డ అంబులెన్స్‌లను 15 రోజుల్లోగా మరమ్మతులు చేయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించినా ఫలితం లేకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ముక్కుతూ.. మూల్గుతూ..! జిల్లాలో 108 అంబులెన్స్ వాహనాలు 33 ఉన్నాయి. వీటిలో 20కిపైగా వాహనాలు తరచూ మరమ్మతుల కోసం మెకానిక్ షెడ్డుకు చేరుతున్నాయి. వీటి నిర్వహణ బాధ్యత చూసుకునే సంస్థ యాజమాన్యం వాహనాల మరమ్మతుల విషయంలో పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మెకానిక్ షెడ్డు నుంచి బయటకు వచ్చిన వాహనాలు వారం రోజులు తిరగక ముందే మళ్లీ అక్కడికే చేరుతుండటం గమనార్హం. అలాగే చాలా వాహనాల్లో సరైన సౌకర్యాలు ఉండడం లేదు. ఉదాహరణకు నూజివీడు 108 వాహనం తీసుకుంటే ఏదైనా తేలికపాటి వర్షం వచ్చినా ఈ వాహనంలో కూర్చోవడానికి వీలుండదు. వాహనం లోపలి ఉండే రోగులు కూడా ఈ బాధలు తప్పవు. వర్షం నీటితో వాహనం తడిసిపోయేది. ఒకవేళ వర్షంలో వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. వాహనం వైఫర్ బ్లేడ్స్ పనిచేయకపోవడం ఇందుకు కారణం. ఇలా జిల్లా మొత్తంగా 108 వాహనాల వల్ల రోగులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు మేల్కోకపోతే ప్రజల ప్రాణాలు గాలిలో దీపంలా మారే ప్రమాదం ఉంది. -
108 ఉద్యోగులపై సర్కారు కక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 108 వాహనాల్లో పనిచేస్తున్న సుమారు 2400 మంది ఉద్యోగులను తొలగించేందుకు సర్కారు పూనుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో కొత్తగా ఉద్యోగులను నియమించేం దుకు నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు వారం రోజుల కిందట తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 6 నుంచి సమ్మెలోకి వెళతామని నోటీసులో పేర్కొ న్నారు. ఈ నోటీసును అందుకున్న ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోకపోగా.. వారిని తొలగించి కొత్త వారిని నియమించుకోవాలని వార్తా పత్రికల్లో ప్రకటన ఇప్పించింది. 108 వాహనాల నిర్వహణ సంస్థ బీవీజీ(భారత్ వికాస్ గ్రూప్) సంస్థ ఈ ప్రకటన జారీచేసింది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, పైలెట్స్ (డ్రైవర్లు) కావాలని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మంగళగిరిలోని తమ కార్యాలయంలో వారం రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాహనాల నిర్వహణను సరిగా పట్టించుకోకపోవడం లేదు. వేతనాలు జాప్యం, కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాల వల్ల ఉద్యోగులు పలుసార్లు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చారు. కండీషన్లో లేని వాహనాలుప్రాణాప్రాయ స్థితిలో, అత్యవసర సమయాల్లో రోగులను, బాధితులను ఆదుకునేందుకు కూతవేటు దూరంలో అందుబాటులో ఉండే 108 వ్యవస్థను ప్రభుత్వం దారుణ పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. సేవలకు వీలుగా వాహనాలను ఉంచాలని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న సిబ్బంది మెడపై తాజాగా తొలగింపు కత్తి పెట్టింది. కండీషన్లో లేని 108 వాహనాలను సరిచేయాలన్న విన్నపాలు వినిపించుకోకపోగా వాటి రిపేర్ల ఖర్చులను డ్యూటీలోని సిబ్బంది భరించాల్సి వస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే సర్వీసులో తిరగని వాహనాలను కూడా తిరుగుతున్నట్లు సీఎం డ్యాష్‌బోర్డులో చూపిస్తూ మోసం చేస్తున్నారు. వాహనాల్లోని పేషెంట్ల క్యాబిన్లలో ఏసీ, లైట్లు పనిచేయవు. బీపీ, స్టెత్‌స్కోప్, గ్లూకోమీటర్లు లాంటి పరికరాల్లో పనిచేయనివే ఎక్కువగా ఉన్నాయి. అధికశాతం వాహనాలలో ఆక్సిజన్, కాటన్, డ్రస్సింగ్ ప్యాడ్స్, స్టెటరలైజ్డ్ దూది, అయోడిన్ కూడా ఉండడం లేదు. స్ట్రెచ్చర్లు ఉపయోగపడటంలేదు. చాలా వాహనాలకు బీమా సౌకర్యం, పొల్యూషన్ సర్టిఫికెట్లు లేవు. వాహనాలకు సకాలంలో ఇంజనాయిల్ కూడా మార్చడంలేదు. వాహనాల టైర్లు అరిగి పోయి, ఊడిపోయి తిరగడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నాయి. హెడ్లైట్లు పనిచేయవు. బ్యాటరీ నిర్వహణలేదు. వర్షం పడితే అనేక వాహనాల్లోకి నీరు కారుతోంది. రాజధాని జిల్లా అయిన కృష్ణాలో ఇటీవల ఓ గర్భిణీని తీసుకెళుతుండగా వాహనం మొరాయించింది. చివరకు ఆమెను ఆటోలో ఆస్పత్రికి చేర్చాల్సి వచ్చింది. వైఎస్సాఆర్ కడప, నెల్లూరు జిల్లాల్లో వాహనాలు ఎక్కువగా షెడ్డుకే పరిమితం అవుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇవే పరిస్థితులని 108 సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1100 నెంబరకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని సిబ్బంది వాపోతున్నారు. సమస్యల పరిష్కారం కోరితే బెదిరింపులా? దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరించి వాహనాల నిర్వహణను మెరుగుపర్చాలని కోరితే కొత్తగా ఉద్యోగ ప్రకటన ఇస్తారా అని ఉద్యోగుల సంఘం తీవ్రంగా మండిపడింది. ఈనెల 5వ తేదీలోపు చర్చలకు ఆహ్వానించారని, ఆరోజు తమకు హామీ లభించకపోతే నోటీసులో పేర్కొన్నట్టు 6వ తేదీ నుంచి సమ్మెలోకి వెళతామని సంఘం అధ్యక్షుడు కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. రెండు మాసాల కిందట ప్రభుత్వమే చర్చలు జరిపి, పరిష్కారానికి హామీ ఇచ్చినా అది చేయకుండా ఉద్యోగులను వేధిస్తోందని, ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన తాము భయపడతామని అనుకోవడం పొరపాటు అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని, తాము కూడా పోరాటానికి సిద్ధమవుతున్నట్టు ఆయన తెలిపారు. నేడో రేపో 104 ఉద్యోగులు కూడా సమ్మెలోకి వెళుతున్నట్టు ప్రకటించనున్న నేపథ్యంలో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడనుందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 108 వాహనాల సంఖ్య: 417 ప్రస్తుతం తిరుగుతున్న వాహనాలు: 297 ఆగిపోయిన వాహనాలు: 120 తిరుగుతున్న వాటిలో ఆక్సిజన్ లేని వాహనాలు: 97 -
108 సేవలపైనా ఆంక్షలు
ఒంగోలు: 108...ఈ వాహనం పేరు వింటే మొట్టమొదట గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి. ఆయన సీఎం అయిన వెంటనే పేదల ఆరోగ్యం కోసం 108 వాహనాన్ని ప్రవేశపెట్టి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. 108 పథకం అంతటి ఆదరణ పొందింది. ఇప్పుడు 108 సేవలపైనా ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అనధికారికంగా ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి జిల్లా కోఆర్డినేటర్ చెబుతున్న సమాధానం ఒకలా ఉంటే వాస్తవంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య మరోలా ఉంది. ఇవీ.. ఆంక్షలు ♦ ఇటీవల టంగుటూరు సమీపంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గుండె, ఊపిరితిత్తులకు మధ్య భాగంలో లోతుగా గాయమైంది. బంధువులు హుటాహుటిన అతడిని టంగుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తీసుకెళ్లాలని సూచించారు. ప్రైవేటుగా వాహనం మాట్లాడుకునే ప్రయత్నం చేయగా క్షతగాత్రుడి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఎవరూ ముందుకు రాలేదు. అతడి బంధువులు 108ను ఆశ్రయించారు. తాము కేవలం రిమ్స్‌కు మాత్రమే తీసుకెళ్తామని, ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లేది లేదని 108 సిబ్బంది తేల్చి చెప్పారు. ♦ ఇటీవల రాణి అనే ఒక మహిళ దుద్దుకూరు సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఎన్నో ఆటోలు ఆ మార్గంలో వెళ్తున్నా ఒక్కరూ కనీసం ఆస్పత్రికి తరలించేందుకు ముందుకు రాలేదు. ఇక లాభం లేదని భావించి 108కు కాల్ చేస్తే అరగంటకు వచ్చింది. రిమ్స్‌కు తీసుకెళ్తాం తప్ప.. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిబ్బంది ససేమిరా అన్నారు. ♦ చీరాలకు చెందిన ఓ కుటుంబం తిరుపతి దైవ దర్శనానికి వెళ్లింది. తిరిగి వచ్చే క్రమంలో ఆ కుటుంబంలో ఒక చిన్న బాబు అస్వస్థతకు గురయ్యాడు . చేతిలో బిడ్డ చేతిలోనే వాలిపోతుండడంతో కుటుంబ సభ్యులు రైలులో నుంచే 108కు కాల్ చేశారు. ఒంగోలులో రైలు ఆగడంతోనే 108 సిబ్బంది వారిని వాహనంలోకి ఎక్కించుకున్నారు. రిమ్స్‌కు మాత్రమే తీసుకెళ్తామని చెప్పారు. గతంలో ఇవ్వన్నీ లేవు గతంలో ఇలాంటి ఆంక్షలు లేవు. ఎక్కడో ఏదో ఫిర్యాదులు వచ్చాయంటూ జిల్లా కోఆర్డినేటర్లు పలు జిల్లాల్లో దర్యాప్తులు జరిపారు. పలు ప్రైవేటు ఆస్పత్రులు తమ ఆస్పత్రికి కేసు తీసుకొస్తే డబ్బులు ఇస్తామంటూ 108 సిబ్బందికి ఆశ చూపుతున్నారు. దీన్ని పసిగట్టిన 108 పథకం ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు. ఒక వేళ అత్యవసరం అనుకుంటే సంబంధిత అంబులెన్స్ సిబ్బంది జిల్లా కోఆర్డినేటర్‌తో మాట్లాడి ఆయన అనుమతితో ప్రైవేటు ఆస్పత్రులకు తరలించాలి. వాస్తవానికి సిబ్బంది చేతివాటం అనేది అతి చిన్న సమస్య. దీన్ని నివారించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అనేకం ఉన్నాయి. ఒక వైపు ప్రభుత్వం 108కు సేవలు అందించేందుకు నిధులు అందిస్తున్నా క్షతగాత్రులు మాత్రం ప్రభుత్వ వైద్యశాల నుంచి ప్రైవేటు వైద్యశాలకు వెళ్లేందుకు ప్రైవేటు అంబులెన్స్‌లకు అదనంగా ఖర్చు పెడుతున్నారు. మరో వైపు 108 సిబ్బంది కేస్ టేకప్ చేసినప్పుడు కాల్ సెంటర్ సిబ్బందితో మాట్లాడతారు. కాల్ సెంటర్లోని ఎక్స్పర్ట్స్ సూచనల మేరకు పనిచేస్తారు. క్షతగాత్రుల అభిప్రాయం తీసుకుంటే పోయేదానికి జిల్లా కోఆర్డినేటర్‌తో ఎందుకు లింక్ పెట్టారనేది సందేహం వ్యక్తమవుతోంది. మూలనపడిన మూడు అంబులెన్స్‌లు జిల్లాలో మొత్తం 32 అంబులెన్స్‌లు నడుస్తుండగా పలు అంబులెన్స్‌లు దాదాపు డొక్కు వాహనాలుగా మారాయి. ప్రభుత్వం కొత్త వాహనాలు మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరో వైపు గిద్దలూరు, కంభం , పర్చూరుల్లోని 108 వాహనాలు మరమ్మతులకు గురయ్యాయి. వీటిని బాగు చేసేందుకు మెకానిక్‌ల సమస్య ఎదురవుతోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి వాహనాల మరమ్మతులకు గత యాజమాన్యం రూ.1.50 లక్షలు బకాయి ఉంది. 2017 డిసెంబర్ నుంచి యాజమాన్యం మారింది. పాత యాజమాన్యం తమకు బకాయి కట్టలేదంటూ మరమ్మతులు చేసేందుకు ఒప్పందం చేసుకున్న సంస్థ నిరాకరించింది. అత్యవసరమైతే అవకాశం ఇస్తున్నాం అవినీతి మకిలీ అంటకూడదనే ఉద్దేశంతోనే కేసులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నాం. ఒకవేళ క్షతగాత్రులు ఎవరైనా మేము ఫలానా ఆస్పత్రికే తీసుకెళ్లండని కోరితే సిబ్బంది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. నేను స్వయంగా క్షతగాత్రులతో మాట్లాడిన తర్వాత అనుమతి ఇస్తున్నా. అంతే తప్ప ప్రైవేటు వైద్యశాలలకు తరలించొద్దని ఎలాంటి ఉత్తర్వులు మాకు రాలేదు. దీనిపై మా సిబ్బందికి అవగాహన కల్పిస్తాం. – బాలాజీ, 108 జిల్లా కోఆర్డినేటర్ -
108 కష్టాలు
పశ్చిమగోదావరి, భీమవరం (ప్రకాశం చౌక్): ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలో కూయ్.. కూయ్.. కూయ్.. మంటూ ప్రమాద స్థలానికి చేరుకునేది 108 వాహనం ఇది ఒకప్పటి మాట.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక అయిన 108 సేవలు దేశవ్యాప్తంగా పేర్గాంచాయి. పేదలకు విశేష సేవలందించాయి. అత్యవసర సేవలందించడంలో 108కు పురస్కారాలు కూడా దక్కాయి. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం ఈ సేవల పరిస్థితి దారుణంగా ఉంది. ఫోన్ చేసినా సంఘటనా స్థలానికి వచ్చేందుకు గంటల సమయం పడుతోంది. చాలీచాలనీ వాహనాలు, మరమ్మతులు, నిధుల లేమితో వాహన సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం 108 సేవలపై నిర్లక్ష్యం వహించడమే కారణంగా కనిపిస్తోంది. దీంతో ఆపదలో ఉండి 108 కోసం ఎదురుచూసే పలువురు క్షతగాత్రుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న సంఘటనలు ఉన్నాయి. జిల్లాలో అమలు తీరు అధ్వానం జిల్లాలో 108 పథకం అమలు తీరు దారుణంగా ఉంది. అత్యవసర సేవలు అందించాల్సిన 108 వాహనాలు మరమ్మతుల బారినపడితే వాటిని సరిచేయించేందుకు నెలలు గడిచిపోతున్నాయి. చిన్నపాటి మరమ్మతులకు కూడా నోచుకోకపోవడంతో పలు వాహనాలు మూలనపడుతున్నాయి. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. జిల్లాలో 30 మాత్రమే.. జిల్లాలో 37 వాహనాలకు గాను ప్రస్తుతం 30 వాహనాలు మాత్రమే సేవలందిస్తున్నాయి. వాహనాల కొరతతో ప్రమాద స్థలానికి చేరుకోవడానికి గంటల సమయం పడుతుంది. జిల్లాలో ఆకివీడు, ఉండి, కాళ్ల, పెనుమంట్ర, దెందులూరు, పాలకోడేరు మండలాలకు 108 వాహనాలు లేవు. ఆయా గ్రామాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు, అత్యవసర సేవలకు వాహనాలు వచ్చేందుకు తీవ్ర జాప్యం జరుగుతోంది. భీమవరంలోని 108 వాహనం భీమవరం మండలంతో పాటు పాలకోడేరు, ఆకివీడు, ఉండి, కాళ్ల మండలాలకు సేవలు అందించాల్సి వస్తోంది. భీమవరం ఏరియా ఆస్పత్రిలో అత్యవసర కేసులను వైద్యులు ఈ వాహనంలోనే ఏలూరు పంపిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఒకే సమయంలో రెండు, మూడు అత్యవసర కేసులు వస్తే మెరుగైన సేవలు అందడం కష్టమవుతోంది. సిబ్బంది ప్రవర్తనతో ఇబ్బందులు గతంలో ఆపదలో ఉన్న వారిని చూసి 108కి సమాచారం ఇస్తే హుటాహుటిన వచ్చిన ఆస్పత్రికి తరలించేవారు. అయితే ప్రస్తుతం కొందరు 108 సిబ్బంది ప్రమాదం సమాచారం ఇచ్చే వారి పేరు, చిరునామా, క్షతగ్రాతుల పేర్లు, ఆధార్ నంబర్లు వంటి వివరాలు అడిగి ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమాచారం ఇచ్చే వారి వివరాలు చెప్పనవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా 108 సిబ్బంది పట్టించుకోవడం లేదని పలువురు అంటున్నారు. కొత్త వాహనాల కోసం ప్రతిపాదించాం జిల్లాకు 108 వాహనాలను కొత్తగా మంజూరు చేయాలని ప్రతిపాదించాం. అలాగే పాత 108 వాహనాలను మరమ్మతులు చేయిస్తున్నాం. ఎక్కడైనా సిబ్బంది సమాచారం ఇచ్చే వారిని ఇబ్బందులకు గురిచేస్తే తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – ఈ.రాజ్‌కుమార్, 108 జిల్లా విభాగం మేనేజర్, ఏలూరు -
108లో హలో సిస్టర్స్
గంగవరం : గంగవరం మండలం గండ్రాజుపల్లె వద్ద 108 వాహనంలో ఒక గర్భిణి కవల పిల్లలకు జన్మనిచ్చింది. పెద్ద ఉగిని గ్రామానికి చెందిన అబూజార్ భార్య ఆల్మాస్ నిండుగర్భిణి. శుక్రవారం నొప్పులు ప్రారం భం కావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. వెంటనే 108 వాహనం వచ్చింది. ఆ వాహ నంలో పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలి çస్తున్నారు. మార్గమధ్యంలో గండ్రాజుపల్లె వద్ద ఆమె కవలను(ఆడపిల్లలను) ప్రసవించింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని, పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు 108 సిబ్బంది కిషోర్, శివ తెలిపారు. -
145 కొత్త ‘108’ వాహనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 145 ఉచిత అత్యవసర వైద్య సేవల (108) వాహనాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ మైదానంలో వైద్యారోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి వీటిని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 316 వాహనాలు ఈ సేవలను అందిస్తుండగా 145 వాహనాలు సరిగ్గా పని చేయటం లేదు. వీటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారు. -
108 నిర్వాహణ సంస్థతో ఉద్యోగుల చర్చలు విఫలం
-
రాష్ట్రవ్యాప్త బంద్‌కు 108 ఉద్యోగుల పిలుపు
అమరావతి : 108 నిర్వహణా సంస్థతో 108 ఉద్యోగుల చర్చలు విఫలం కావడంతో వారు రాష్ట్రవ్యాప్తంగా రేపు(గురువారం) బంద్‌కు పిలుపునిచ్చారు. 12 గంటల పనివేళలను 8 గంటలకు కుదించాలని, 50 శాతం జీతాలు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. జీవీకే సంస్థ నుంచి రావాల్సి ఉన్న రూ.7 కోట్ల బకాయిలను ఇప్పించాలని కోరారు. గత ఆరు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 8 గంటల పని సమయం కేటాయించాలని లేదంటే తామే 8 గంటలు పని చేసి ఆ తర్వాత ఫోన్లు స్విఛ్ ఆఫ్ చేస్తామని హెచ్చరించారు. -
ఆపదలో అపర సంజీవిని..
ఆపదలో ఉన్నవారిని ఆదుకొని పునర్జన్మ ప్రసాదించే ‘108’ (అంబులెన్స్) వాహనాలు, అందులో పనిచేసే సిబ్బంది సమస్యల కారణంగా ఆపదలో పడ్డారు.కష్టాలు గట్టెక్కుతాయని వారు ఇన్నాళ్లుగా ఎదురు చూశారు. చాలీ చాలని వేతనాలతో పనిచేశారు.ఇక చేసేది లేక వారు సమ్మె దిశగా అడుగలు వేస్తున్నారు. 108 వాహనం రావడం కాస్త ఆలస్యమైతేనే అమ్మో..అని అంటాం. ఒకవేళ అవి పూర్తిగా నిలబడిపోతే పరిస్ధితి ఏమిటి...? అనే సందేహం అందరిలో వ్యక్తమవుతోంది. కడప రూరల్:రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా 108 వాహనాలు ప్రమాదంలో పడ్డాయి. ఎంతలా అంటే ప్రభుత్వం ఎప్పడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలి యని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ‘108’ వాహనాలు రెండు బ్యాకప్‌తో కలిపి మొత్తం 31 వాహనాలు ఉన్నాయి. సంస్థ మారినా వెంటాడుతున్న సమస్యలు.. గడిచిన 2017 డిసెంబర్ 13వ తేదీన 108 వ్యవస్ధ జీవీకే నుంచి యూకేఎస్‌ఏఎస్ మరియు బీవీజీ సంయుక్త ఆధ్వర్యంలోకి వచ్చింది. అంతకుముందు అరకొరగా ఉన్న సమస్యలు సంస్థ మార్పుతో మరింత ఎక్కువయ్యాయి. వాహనాలు తిరగాలంటే కండీషన్లో ఉండాలి. ప్రధానంగా డీజిల్ సమస్య ఉండకూడదు. అయితే ఈ రెండు సమస్యలు వీటిని పట్టి పీడిస్తున్నాయి. ఒక వాహనానికి నెలకు డీజల్; మరమ్మతులు, సిబ్బంది వేతనాలకు రూ 1.10 లక్షలు రావాలి. అయితే నిధులు సక్రమంగా అందడంలేదు. దీంతో చాలా వాహనాలకు కొత్త టైర్లను మార్చలేని పరిస్ధితి నెలకొంది. అలాగే వాహనాలు కండీషన్లో లేని కారణంగా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. డీజల్ బకాయిలు లక్షల్లో పేరుకుపోయి ఉన్నాయి. ఇబ్బందుల్లో సిబ్బంది.. రెండు వాహనాలకు సగటున ఐదుగురు టెక్నీషియన్స్, ఐదుగురు పైలెట్లు ( డ్రైవర్లు) షిప్టుల ప్రకారం విధులు చేపడతారు. ఆ ప్రకారం ఒక వాహనానికి ఒక రోజుకు (24 గంటల్లో) దాదాపు 15 కేసులు వస్తాయి. రాత్రి పూట వచ్చే కేసులు అధికంగా ఉంటాయి. దీంతో సిబ్బందిపై పనిభారం పడుతోంది. పైలెట్లు, టెక్నీషియన్స్ మొత్తం 136 మంది ఉండాలి. అయితే 122 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరంతా 12 గంటల పాటు వి«ధులు చేపడుతున్నారు. సాధారణంగా 8 గంటలు మాత్రమే పనిచేయాలి. అలా అయితే సిబ్బంది సంఖ్యను అందుకు అనుగుణంగా పెంచాలి. యాజ మాన్యాల ఆ దిశగా ఆలోచించడంలేదు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో పాటు వేతనాలు సక్రమంగా అందడంలేదు. గడిచిన నవంబర్ నెలకు సంబంధించిన జీతాలు ఇంతవరకు రాలేదు. పొరుగున ఉన్న తెలం గాణా ప్రభుత్వం అక్కడి సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఒకరికి రూ.4 వేలకు పైగా వేతనాలను పెంచింది. 2007లో వైఎస్ తెచ్చిన ‘108’... నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పలు ప్రజా సంక్షేమ పథకాలను చేపట్టారు. ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశారు. అందులో భాగంగా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడడానికి నడుం బిగించారు. 2007లో 108 వాహనాలను ప్రవేశపెట్టారు. వీటి రాకతో నాటి నుంచి నేటి వరకు లక్షలాది మంది ప్రాణాలు నిలిచాయి. రాష్ట్రంలో ఈ వ్యవస్ధ విజయవంతం కావడంతో 108 వాహనాలు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా నడుస్తున్నాయి. ఇప్పడు ఇవి కష్టాల నుడుమ ప్రయాణం సాగిస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌కు వినతి.. సోమవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్ బాబూరావునాయుడుకు 108 ఈఎంటీ అసోíసియేషన్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వీరమల్ల సాంబశివయ్య, నాయకులు ఎరుకలయ్య, ఏ గురుస్వామి, రాజేంద్ర, పణితి మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. వాహనాలను కండీషన్లో ఉంచాలని తెలి పారు. అత్యవసర మందులకు కొరత ఉందన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమ సమçస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం వారు ‘సాక్షి’తో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర అసోషియేషన్ పిలుపు మేరకు ఈ రోజు అన్ని జిల్లాలో జల్లా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. ఒక వారం రోజులలోపు సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెలోకి వెళ్లాల్సి ఉంటుందన్నారు. -
వేతనాల్లేవు... వాహనాలు తిరగవు...
విజయనగరం గంటస్తంభం: ఆపద సమయంలో ఆదుకునే 108 వాహనానికి గడ్డుపరిస్థితి దాపురించింది. అందులో పనిచేసే సిబ్బందికి నెలల తరబడి వేతనాలు అందడంలేదనీ... వాహనాలు సరిగ్గా తిప్పలేక సేవలు అందించలేకపోతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో 108 సర్వీసెస్ ఎంప్లాయిస్ యూ నియన్ అధ్యక్షుడు బంగార్రాజు ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి సంయుక్త కలెక్టర్–2 కె.నాగేశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 27 వాహనాలుండగా ఏడు సాంకేతిక కారణాల వల్ల పని చేయ డం లేదని, 15 వాహనాలకు ఇన్సూరెన్స్ లేక తిప్పలేకపోతున్నామని తెలిపారు. ఇక ఉద్యోగులకు జనవరి నెల నుంచి నెలవారీ జీతాలివ్వకుండా... పని చేసిన రోజులకే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవీకే సంస్థ ఏటా 10శాతం వేతనం పెంచేదని, 2016 నుం చి పెరగలేదన్నారు. 52రోజుల జీతం పెండింగ్‌లో ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. వీటిని పరిష్కరించాలని కోరారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు మొత్తం 210 అర్జీ లు వచ్చాయి. జేసీ–2 నాగేశ్వరరావుతోపాటు డీఆర్వో ఆర్.ఎస్.రాజ్‌కుమార్ వినతులు స్వీకరించారు. అందులో కొన్నింటిని పరిశీలిస్తే.... ♦ మూతపడిన జ్యూట్ మిల్లులు తెరిపించా లని ఇఫ్టూ జల్లా కమిటీ నాయకులు కె.సన్యాసిరావు, బోని సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు వినతిపత్రం ఇచ్చారు. ♦ కుమిలిలో నిర్మించిన సామాలమ్మ గుడిని దేవాదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకో వాలని ఆ గ్రామానికి చెందిన జి.నాగిరెడ్డి కో రా రు. ♦ దరం కార్యక్రమం జరగక ఇబ్బందులు పడుతున్నామని, తన కుమారుడు అజయ్ కోసం తొమ్మిది నెలలుగా తిరుగుతున్నా పట్టిం చుకోవడం లేదని బొబ్బిలికి చెందిన పి.జయరా వు తెలిపారు. ♦ ప్రధానమంత్రి పసల్‌బీమా యోజనలో పని చేస్తున్న వ్యవసాయ బీమా కార్యకర్తలకు ఖరీఫ్ కాలంలోనే పని కల్పిస్తున్నారని, ఈ ఏడాది పని కల్పించాలని బీమా కార్యకర్తల ఆసోసియేషన్ అధ్యక్షుడు బి.ప్రశాంత్ తది తరులు వినతిపత్రం సమర్పించారు. ♦ పూసపాటిరేగ మండలం పతివాడ పంచాయతీ త మ్మయ్యపాలెంలో సర్వే నెం: 111/2లో 10 ఎకరాలు 62సెంట్లు, 112లో 17.97ఎకరాలు ప్రభు త్వ భూమిలో మత్స్యకారులు చేపలు ఎండబెట్టుకుంటున్నారని, ఆ భూములు అక్రమణకు గురవుతున్నాయని సర్పంచ్ ఎ.పైడిరాజు, ఎంపీటీసీ సభ్యుడు కూర్మినాయుడు తదితరులు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ♦ అంతకుముందు నిర్వహించిన డయల్‌యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఎనిమిది ఫోన్ కాల్స్ వచ్చాయి. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. -
విశాఖ జిల్లా వ్యాప్తంగా 108వాహనాలు బ్రేక్‌డౌన్