108పై 420 అటాక్‌! | 420 Attack on 108! | Sakshi
Sakshi News home page

108పై 420 అటాక్‌!

Published Tue, Oct 9 2018 3:11 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

420 Attack on 108! - Sakshi

పేదవాడికి అపర సంజీవని లాంటి పథకాన్ని స్వయంగా సర్కారే గొంతు నులుముతోంది. అర్ధరాత్రి, అపరాత్రి అనే భేదం లేకుండా పిలవగానే వచ్చి వాలిపోయే 108 పథకాన్ని ప్రభుత్వమే రెక్కలు విరగ్గొడుతోంది. ఆపదలో ఉన్నామంటూ ఆర్తనాదాలు చేస్తున్నా బాధితుల గోడు పట్టించుకోకుండా అంబులెన్సు వ్యవస్థను కుప్పకూల్చుతోంది. ఇదే ఆరోగ్యశాఖలో పీపీపీ (పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌) పేరుతో కార్పొరేట్లకు కోట్లకు కోట్లు చెల్లిస్తున్న ప్రభుత్వానికి పేదవాడిని కాపాడే అంబులెన్సులు గుర్తుకు రాలేదు. టైర్లు అరిగిపోయాయని, డీజిల్‌ లేదని, వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని ఉద్యోగులు రోజూ మొత్తుకుంటున్నా పెడచెవిన పెడుతోంది. నిధులివ్వాల్సిన ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకో కుండా నిర్వహణ సంస్థపైకి నెట్టేస్తోంది. పథకం సరిగా నడవక పోవడానికి నిర్వహణ సంస్థే కారణమని పదేపదే ప్రభుత్వం చెప్పడం, తన అనుకూల మీడియాతో రాయించుకోవడం తెలిసిందే. ఓవైపు మూలన పడ్డ వాహనాలను పట్టించుకోకపోగా మరోవైపు కొత్త అంబులెన్సుల కొనుగోళ్లను కూడా అవినీతిమయంగా మార్చిన ప్రభుత్వానికి బాధితుల గోడు పట్టడం లేదు. అంబులెన్సు వాహనాలకు ప్రభుత్వం కనీసం ఇన్సూరెన్స్‌ కూడా చెల్లించడం లేదు. బీమా కట్టకపోవడంతో వాహనాలు ఏదైనా ప్రమాదానికి గురైతే పేదల జీవితాలు వీధిపాలవుతున్నాయి. ఈ పథకంలో పనిచేసే స్వల్ప వేతన జీవులకు సకాలంలో వేతనం అందకపోవడం నిర్వహణ సంస్థల బాధ్యతా? ఇది సర్కారుది కాదా? ఏతావాతా రాష్ట్రంలో అంబులెన్సు వ్యవస్థను నీరుగార్చి ఆపదలో ఉన్నవారిని గాలికొదిలేసిన సర్కారు...ఏ కొనుగోళ్లలో ఎంత కమీషన్లు వస్తాయని చూస్తోందే కానీ నీరుగారిన పథకాన్ని పునరుద్ధరించే ఆలోచనే చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ హయాంలో పథకం పురుడు పోసుకుని దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో అమలవుతుండగా... పురుడు పోసుకున్న చోటే ఈ పథకం పుట్టెడు కష్టాల్లోకి నెట్టేయబడుతోంది.     

సాక్షి, అమరావతి: ఆపదలో ఆదుకునే అంబులెన్సులకే ఆపద వాటిల్లుతోంది! అత్యవసర వాహనాలు ఆగిపోకుండా చూడాల్సిన సర్కారే వీటిని మూలనపెడుతోంది. వాహనాలకు నిధులివ్వకపోగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా నిర్వహణా సంస్థలపై నెపం వేస్తోంది. రెండు ప్రభుత్వ విభాగాల మధ్య నెలకొన్న వివాదంతో 50 కొత్త అంబులెన్సులు విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద ఓ షెడ్‌లో మూడు నెలలుగా మూలనపడి ఉండటం సర్కారు అసమర్థతకు నిదర్శనం. ఇక రోగులను కాపాడాల్సిన అంబులెన్సుల కొనుగోలును కూడా ప్రభుత్వ పెద్దలు ఆదాయ వనరుగా మార్చుకున్న తీరు విస్మయం కలిగిస్తోంది. 

నిధులివ్వకుండా నిర్వహణ సంస్థలపై నెపం...
108 నిర్వహణకు టెండర్లు పిలిచింది సర్కారే. ఇష్టారాజ్యంగా బాధ్యతలు కట్టబెట్టిందీ ప్రభుత్వమే. పర్యవేక్షణ మరచి ఇప్పుడు సంస్థలపై నెపం వేస్తోంది. నాలుగున్నరేళ్లుగా ఏ నెలలోనూ సకాలంలో పథకానికి నిధులు చెల్లించలేదు. వాహనాలకు మరమ్మతులు చేయించలేదు. ఎప్పుడూ వంద వాహనాలు మూలనే ఉంటున్నాయి. ప్రస్తుతం బీవీజీ సంస్థ 108 నిర్వహణా బాధ్యతలు చూస్తోంది. ఈ సంస్థ సరిగా నిర్వహించడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. టైర్లు అరిగి, డీజిల్‌ లేక, ఇంజన్లు రిపేరుకు రావడంతో వాహనాలు తిరగడం లేదని, వీటికి మరమ్మతులు చేయించాలని మొత్తుకున్నా సర్కారు స్పందిచటం లేదని, అలాంటప్పుడు తమపై నెపం ఎలా వేస్తారని నిర్వహణ సంస్థ ప్రశ్నిస్తోంది. ఘటనా స్థలం నుంచి బాధితులతో అంబులెన్సులు వచ్చేదాకా అనుమానమేనని సిబ్బంది పేర్కొంటున్నారు.

కొన్నవీ వాడుకోవడం లేదు...
కేంద్ర ప్రభుత్వ నిధులతో 50 అంబులెన్సులను ఏపీఎంఎస్‌ఐడీసీ (ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) మూడు నెలల క్రితం కొనుగోలు చేసింది. వీటిని రిజిస్ట్రేషన్‌ చేయించి వినియోగించాల్సిన బాధ్యత కుటుంబ సంక్షేమశాఖది. ఫ్యాబ్రికేషన్, రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తేనే తీసుకుంటామని ఆ శాఖ చెబుతోంది. కొనుగోలు చేసి ఇచ్చామని, ఇక ఆ బాధ్యత తమది కాదని ఏపీఎంఎస్‌ఐడీసీ అంటోంది. ఇలా రెండు విభాగాల మధ్య వివాదంతో విజయవాడ వద్ద గన్నవరంలోని ఓ షెడ్‌లో కొత్త అంబులెన్సులను మూలనపడేశారు. మరోవైపు ఇప్పటివరకూ ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో వాహనాల తయారీ సంస్థ కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలిసింది. కొనుగోలుచేసిన వాహనాలను ఎందుకు వాడుకోవడం లేదని 108 వాహనాల పర్యవేక్షణాధికారి డా.రాజేంద్రప్రసాద్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించ లేదు.

తిరిగేవి 310... డాష్‌బోర్డులో 414 
సీఎం కోర్‌ డ్యాష్‌బోర్డులో మాయలు జరుగుతున్నాయనేందుకు 108 వాహనాల వివరాలే నిదర్శనం. రాష్ట్రంలో మొత్తం 439 వాహనాలుండగా రోడ్డుమీద తిరుగుతున్నవి తక్కువగా ఉంటున్నాయి. సోమవారం వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 108 ఉద్యోగుల నుంచి సేకరించిన సమాచారం మేరకు 310 వాహనాలు తిరిగినట్టు తేలింది. కానీ సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ముఖ్యమంత్రి కోర్‌డాష్‌ బోర్డును పరిశీలిస్తే 414 వాహనాలు తిరిగినట్టు పొందుపరిచారు. 94.91 శాతం వాహనాలు తిరిగాయని చూపించారు. సీఎం కోర్‌డాష్‌ బోర్డులో ఉన్న లెక్కల ప్రకారమే వాహనాలకు బిల్లుల చెల్లింపు జరుగుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంటే రోజుకు 100కిపైగా వాహనాలను ఎక్కువ చూపించి బిల్లులు చెల్లిస్తున్నట్టు తేలుతోంది.

వాహనం తయారీదారు దగ్గరే కొంటే...
వాహనాలను తయారు చేసే కంపెనీ నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తే తక్కువ ధరకు లభిస్తాయి. అలా కాకుండా ఫ్యాబ్రికేషన్‌ చేసే ఇన్‌స్ట్రోమెడిక్స్‌ సంస్థ నుంచి అంబులెన్సులను కొన్నారు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య సలహాదారు జితేంద్రశర్మకు అత్యంత సన్నిహితుడిదనే చర్చ జరుగుతోంది. 89 వాహనాలను ఈ సంస్థ నుంచి నేరుగా కొనుగోలు చేయడం వల్ల ఒక్కో వాహనానికి రూ.5.39 లక్షలకు పైగా అధికంగా (టాటా అంబులెన్సులతో పోలిస్తే) చెల్లించారు. ఇందులో కమీషన్లు చేతులు మారాయని, ముఖ్యనేతల ప్రమేయం ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఫ్యాబ్రికేషన్‌లో ఏముంటాయంటే..?
ఫ్యాబ్రికేషన్‌ అంటే రకరకాల పరికరాలను అమర్చుకునేందుకు ఏర్పాటు చేసే వసతులు. అంబులెన్సులో ప్రధానంగా ఫ్యాబ్రికేషన్‌కు సంబంధించి చేతులు శుభ్రం చేసుకునేందుకు స్టీల్‌సింకు, అల్మారాలు, మందులు నిల్వ చేసుకునేందుకు అల్మారాలు, టూల్‌ బాక్సు, స్ట్రెచర్‌ కదలకుండా ఉండేందుకు ఒక స్టాండు, మల్టీచానెల్‌ మానిటర్‌ పరికరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఒక స్టాండు, ఆక్సిజన్‌ రెగ్యులేటర్, టూల్‌బాక్సు మీద మనిషి కూర్చోవడానికి షీటు తదితరాలన్నీ ఉంటాయి. ఏ వాహనానికైనా దాదాపుగా ఇవే ఉంటాయి. అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్టు అంబులెన్సుకు కూడా ఒకటి రెండు మినహా మరేమీ మారవు.

ఆగస్ట్‌ 21 తర్వాత వేతనమే ఇవ్వలేదు
108లో దాదాపు 2 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆగస్ట్‌ 21న వేతనం ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటివరకూ ఇవ్వలేదు. పలుసార్లు వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం స్పందించలేదు. ఈ సంస్థ వచ్చాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి నెలా వేతనంలో కట్‌ చేస్తున్నారు. ఎందుకో తెలియదు. అడిగితే స్పందించేవారు లేరు. మా పరిస్థితి దయనీయంగా ఉంది.
– కిరణ్‌కుమార్‌ (108 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు)

వాహనం రూ.8.45 లక్షలు.. ఫ్యాబ్రికేషన్‌కు రూ.9.54 లక్షలు
సాధారణంగా ఎక్కడైనా వాహనం ఖరీదు కంటే ఫ్యాబ్రికేషన్‌ వ్యయం ఎక్కువగా ఉండదు. కానీ ఫ్యాబ్రికేషన్‌ పేరుతో ప్రభుత్వం ఒక్కో వాహనానికి రూ.9.54 లక్షల దాకా చెల్లించడం గమనార్హం. 2016లో రాష్ట్రప్రభుత్వం 76 అంబులెన్సులను ఫోర్స్‌ కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. మరో 13 వాహనాలను కూడా అదే కంపెనీ నుంచి కేంద్ర మంత్రి సురేష్‌ప్రభు నిధులతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఫోర్స్‌ కంపెనీకి చెందిన ఒక్కో అంబులెన్స్‌ ఖరీదు రూ.8.45 లక్షలు కాగా ఫ్యాబ్రికేషన్‌ పనుల కోసం అదనంగా రూ.9,54,696 చెల్లించారు. అంటే వాహనంధర కన్నా వంద శాతం ఎక్కువగా చెల్లించడం గమనార్హం. గతంలో అంబులెన్సులకు ఫ్యాబ్రికేషన్‌ చేయించినప్పుడు రూ.2 లక్షలకు మించి కాలేదు. కానీ టీడీపీ సర్కారు ఏకంగా రూ.తొమ్మిదిన్నర లక్షలకు మించి ఖర్చు చేసింది. అత్యవసరానికి ఉపయోగపడే పరికరాలు అంటే డిఫ్రిబ్యులేటర్, ఆక్సిజన్‌ పైప్‌లైన్, మందులు తదితరాలకు మళ్లీ ప్రభుత్వమే ప్రత్యేకంగా చెల్లిస్తుంది.

తెలంగాణలో రూ.11.65 లక్షలకే...
కొద్ది నెలల కిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. ఒక్కో అంబులెన్స్‌ ఖరీదు రూ.9.30 లక్షలు కాగా ఫ్యాబ్రికేషన్‌కు రూ.2.35 లక్షలు వెచ్చించింది. దీన్నిబట్టి ఒక్కో వాహనం ఖరీదు రూ.11.65 లక్షలుగా తేలిపోతోంది. తెలంగాణ సర్కారు వీటిని టెండర్ల ద్వారా కొనుగోలు చేసింది. 

టాటా ఫ్యాబ్రికేటెడ్‌ 12.60 లక్షలలోపే
టాటా కంపెనీ నుంచి 2016లో 202 అంబులెన్స్‌లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ‘ప్యాబ్రికేషన్‌’తో కలిపి ఒక్కో వాహనాన్ని  రూ.12,60,106 చొప్పున విక్రయించారు. ప్రస్తుతం ఈ వాహనాల ధర ఇంకా తగ్గినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. దీన్నిబట్టి కమీషన్ల మాయాజాలం జరిగినట్లు తేటతెల్లం అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement