![Permanent office for 108 Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/17/108.jpg.webp?itok=-2C05jAU)
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 108 కార్యాలయం
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆపదలో ఉన్నవారికి అపర సంజీవనిలా సేవలు అందిస్తున్న 108 వాహనానికి, సిబ్బందికి శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేసి విజయవాడ నగరపాలకసంస్థ సముచిత గౌరవం కల్పించింది. సాధారణంగా 108 వాహనాలు, ఉద్యోగులకు ప్రత్యేకంగా ఎటువంటి కార్యాలయాలు ఉండవు. స్థానికంగా ఉన్న అవకాశాల మేరకు షెడ్లు లేదా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోని చెట్ల కింద అంబులెన్స్‌లను పెట్టుకుని సిబ్బంది అక్కడే ఉంటారు.
ఆపదలో ప్రజలు ఉన్నారంటూ తమకు ఫోన్ వచ్చిన వెంటనే వెళ్లి ప్రాణాలను కాపాడుతుంటారు. ఇదే తరహాలో విజయవాడ 18వ డివిజన్ రాణిగారితోటలోని కనకదుర్గమ్మ వారధి పక్కన వాటర్ ట్యాంక్ కింద ఆశ్రయం పొందుతున్న 108 వాహనం, సిబ్బందికి నగరపాలక సంస్థ రూ.12లక్షలతో శాశ్వత భవనం నిర్మించింది.
వాటర్ ట్యాంక్ కింద 108 అంబులెన్స్ పెట్టుకుని సిబ్బంది పడుతున్న ఇబ్బందులను గుర్తించిన స్థానిక కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ... ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు కార్పొరేషన్ అధికారులతో సంప్రదించి వారధి సమీపంలోనే 108 అంబులెన్స్‌కు శాశ్వత కార్యాలయం నిర్మాణానికి అనుమతులు, రూ.12లక్షల నిధులు మంజూరు చేయించారు.
నిర్మాణ పనులు పూర్తయి కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ కార్యాలయంలో విద్యుత్, వాహనాల పార్కింగ్ వంటి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు. 108 వాహనానికి శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేయడంపై సిబ్బంది హర్షం వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment