15 డిమాండ్ల సాధన కోసం పట్టు
రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు
కలెక్టరేట్ల ఎదుట రిలే దీక్షలు
25లోగా ప్రభుత్వం స్పందించకపోతే సేవలను నిలిపేస్తామని స్పష్టీటకరణ
సాక్షి, అమరావతి: అత్యవసర విభాగమైన 108 అంబులెన్స్ సేవలను ప్రభుత్వమే నిర్వహించడం సహా 15 డిమాండ్ల సాధన కోసం సిబ్బంది సమ్మె బాట పట్టారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఒక రోజు రిలే దీక్షలు చేశారు.
ప్రభుత్వం నిర్వహణ సంస్థలను పదేపదే మార్చడంతో తాము గ్రాట్యుటీ, ఎర్న్‌డ్ లీవులు, వార్షిక సెలవులను కోల్పోతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం ఈ నెల 25లోగా సానుకూలంగా స్పందించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే శాపాలు
సీఎం చంద్రబాబు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు చిరుద్యోగుల పాలిట శాపాలుగా మారాయి. అస్మదీయులకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు 108, 104 నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందోను ప్రభుత్వం తప్పిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగ భద్రత లేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని, ఉన్నఫళంగా నిర్వహణ సంస్థను వెళ్లగొడితే ఆరి్థకంగా నష్టపోతామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం ఉద్యోగి ఒక సంస్థలో ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తే గ్రాట్యుటీ పొందేందుకు అర్హత ఉంటుంది. అరబిందో సంస్థ నిర్వహణ బాధ్యతలను 2020 జూలై 1నుంచి ప్రారంభించింది. 2027 వరకూ కాంట్రాక్ట్ కాలపరిమితి ఉంది. వచ్చే ఏడాది జూలై 1 నాటికి ఐదేళ్లు పూర్తి అవుతుంది.
ఇంతలోనే ప్రభుత్వం ఆ సంస్థను వెళ్లగొట్టే చర్యలకు పూనుకుంటోందని, అలా జరిగితే 108లో పనిచేసే డ్రైవర్, ఈఎంటీ రూ.30 వేలు చొప్పున, 104లో పనిచేసే డ్రైవర్, డీఈవోలు రూ.15 వేల వరకూ గ్రాట్యుటీ నష్టపోతామని ఉద్యోగులు చెబుతున్నారు.
ప్రభుత్వమే అందరికీ గ్రాట్యుటీ చెల్లించాలి
కాంట్రాక్ట్ దక్కించుకుంటున్న కార్పొరేట్ కంపెనీలు సేవలను సక్రమంగా నిర్వహించడం లేదని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే సేవలను నిర్వహించాలి. ఇదే ప్రధాన డిమాండ్‌గా సమ్మె నోటీసు ఇచ్చాం. ఈ నెల 25లోగా ప్రభుత్వం స్పందించని పక్షంలో ఏ క్షణమైనా సమ్మెకు దిగుతాం.
ఐదేళ్లు తిరగకుండానే నిర్వహణ సంస్థను మారిస్తే మేం ఆర్థికంగా చాలా నష్టపోతాం. ఒక్క గ్రాట్యుటీ రూపంలోనే 108 ఉద్యోగులే రూ.30 వేల చొప్పున రూ.10 కోట్ల వరకూ నష్టపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఐదేళ్లలోపే నిర్వహణ సంస్థ మారితే ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. – బి.కిరణ్‌కుమార్, ప్రెసిడెంట్, ఏపీ 108 సరీ్వసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్
Comments
Please login to add a commentAdd a comment