
కృష్ణా జిల్లా చల్లపల్లిలో 108 వాహనాన్ని నెడుతున్న స్థానికులు
108 కోసం క్షతగాత్రులు ఎదురుచూపులు నలుగురు నెడితేగానీ స్టార్ట్ కాని వాహనం
అర కిలోమీటరు దూరం వెళ్లేందుకు అర్ధగంట సమయం
కృష్ణా జిల్లా చల్లపల్లిలో దుస్థితి
చల్లపల్లి (అవనిగడ్డ): అత్యవసర పరిస్థితుల్లో రోగులు, క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడాల్సిన 108 వాహనాలు నిర్వహణ, యాంత్రిక లోపాలతో కునారిల్లుతున్నాయి. అత్యవసర సమయంలోనూ వాహనాలు కదలకుండా మొరాయిస్తే, నలుగురు కలిసి నెట్టి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా చల్లపల్లిలో 108కి ఇదే దుస్థితి దాపురించింది. స్టార్ట్ చేసి ఎంతసేపటికీ ఫలితం లేకపోవటంతో రోడ్డున పోయే నలుగురిని పిలిచి నెట్టించారు.
అరకిలోవీుటరుకు అరగంట పట్టింది
వాహనం స్టార్టింగ్ తో పని అయిపోలేదు. అర కిలోమీటరు దూరంలో ఉన్న క్షతగాత్రుల్ని చేరుకోవటానికి అరగంట పట్టింది. సోమవారం ఉదయం కృష్ణాజిల్లా, మొవ్వ మండలం పెదపూడి గ్రామానికి చెందిన కందుల కోటేశ్వరరావు తన అక్క శేషమ్మతో కలిసి అవనిగడ్డలోని తమ బంధువుల ఇంటికి వెళ్తూ చల్లపల్లి ఆటోనగర్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. కోటేశ్వరరావు ముఖానికి, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. శేషమ్మ తలకు తీవ్ర గాయమవడంతో స్పృహ కోల్పోయింది. స్థానికులు ప్రమాదం జరిగిన వెంటనే 108కు ఫోన్ చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి అర కిలోమీరు దూరంలో చల్లపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 108 వాహనం ఉంది.
సమాచారం అందుకున్న 108 పైలెట్ వాహనాన్ని స్టార్ట్ చేయబోగా అది మొరాయించింది. ఎంత సేపటికీ కదలకపోవడంతో రోడ్డునపోయే నలుగురిని పిలిచి నెట్టించినా వాహనం కదల్లేదు. 15 నిమిషాల తరువాత వాహనం స్టార్టయి ఘటనాస్థలానికి చేరుకుంది. అర కిలోమీటరు దూరం రావడానికి ఇంత ఆలస్యమా? అంటూ స్థానికులు 108 సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టార్టింగ్ సమస్యఅని చెప్పిన సిబ్బంది క్షతగాత్రుల్ని వెంటనే చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి మచిలీపట్నం తరలించారు. నలుగురు కలిసి తోస్తే గానీ స్టార్ట్ కాని 108 వాహనం అత్యవసర సమయాల్లో బాధితుల ప్రాణాలను ఎలా కాపాడుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.