అత్యాధునిక 108, 104 సర్వీసులు రేపే ప్రారంభం | YS Jagan launching fully infrastructured Ambulance services in vijayawada | Sakshi
Sakshi News home page

అత్యాధునిక 108, 104 సర్వీసులు రేపే ప్రారంభం

Published Tue, Jun 30 2020 12:39 PM | Last Updated on Tue, Jun 30 2020 1:46 PM

YS Jagan launching fully infrastructured Ambulance services in vijayawada - Sakshi

సాక్షి, అమరావతి : అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ దిశలో మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు చేపట్టి, అమలు చేస్తున్న సీఎం ఇప్పుడు అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసుల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వసతులతో 108, 104 సర్వీసుల్లో సమూలు మార్పులు చేసి వాటిని తీర్చిదిద్దారు. బుధవారం ఉదయం 9:35 గంటలకు సీఎం వైఎస్‌ జగన్ విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద అత్యాధునిక అంబులెన్స్‌ సర్వీసులను ప్రారంభించనున్నారు. విషమ పరిస్థితిల్లో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా చికిత్స అందించేలా వాటిలో మార్పులు చేశారు. వాటి సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. ఇంకా చిన్నారుల కోసం కూడా ప్రత్యేకంగా నియో నేటల్‌ అంబులెన్సులు ప్రారంభిస్తున్నారు. 

108 సర్వీసుల్లో మార్పులు :
అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన వారు ఎవరికైనా గుర్తుకు వచ్చే 108 సర్వీసులో సమూల మార్పులు చేశారు. వాటిలో అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేశారు. కొత్తగా 412 అంబులెన్సులను కొనుగోలు చేసి, ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్సులను కూడా వినియోగించనున్నారు.కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్సులలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్‌ఎస్‌)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టు (ఏఎల్‌ఎస్‌)తో తీర్చి దిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు (నియో నేటల్‌) వైద్య సేవలందించేలా తయారు చేశారు. 

ఏయే సదుపాయాలు ?
బీఎల్‌ఎస్‌ అంబులెన్సులలో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ ఛైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీ పారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయగా, ఏఎల్‌ఎస్‌ అంబులెన్సులలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ఇక నియోనేటల్‌ అంబులెన్సులలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను కూడా అమర్చారు. సకాలంలో వైద్యం అందక ఏ ఒక్క రోగి కానీ, ప్రమాదానికి గురైన వారు కానీ, చిన్నారులు కానీ మృత్యువాత పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన అంబులెన్సులను పెద్ద సంఖ్యలో ఒకేసారి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. శిశు మరణాలను కూడా పూర్తిగా నివారించే దిశలో ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేస్తోంది.

ఎంత వేగంగా సేవలు..?
పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 30 నిమిషాల్లో అంబులెన్సులు చేరే విధంగా ఆ స్థాయిలో సర్వీసులు ప్రారంభిస్తున్నారు.

ఎలా సాధ్యం..?
ప్రతి అంబులెన్సును ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ (ఈఆర్‌సీ)తో అనుసంధానం చేయడం ద్వారా, ఫోన్‌ చేసిన వారిని వేగంగా ట్రాక్‌ చేసే వీలు కలుగుతుంది. అదే విధంగా ప్రతి అంబులెన్సులో ఒక కెమెరా, ఒక మొబైల్‌ డేటా టెర్మినల్‌ (ఎండీటీ), మొబైల్‌ ఫోన్‌తో పాటు, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్‌ వెహికిల్‌ లొకేషన్‌ టాండ్‌ (ఏవీఎల్‌టీ) బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.  

104 సర్వీసుల్లో మార్పులు :
104 సర్వీసుల్లో సమూల మార్పులు చేసిన ప్రభుత్వం, హెల్త్‌ కేర్‌ డెలివరీ విధానంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఆ స్థాయిలో మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల(ఎంఎంయూ)ను తీర్చిదిద్దింది. మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా, అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక సర్వీసు అందుబాటులో ఉండే విధంగా ఒకేసారి 656 సర్వీసులను సిద్ధం చేశారు. 

ఎంఎంయూ(104)ల్లో సదుపాయాలు :
ప్రతి మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ)లో ఒక వైద్య అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్‌ఎంతో పాటు, ఆశా వర్కర్‌ ఉంటారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)తో అనుసంధానమై పని చేసే ఎంఎంయూలు, ఇక నుంచి మారుమూల కుగ్రామాలలో సైతం శరవేగంగా వైద్య సేవలందించనున్నాయి. రోగులకు అప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన ఔషథాలను ఉచితంగా అందజేస్తారు.ప్రతి ఎంఎంయూలో ఆటోమేటిక్‌ వెహికిల్‌ లొకేషన్‌ టాండ్‌ (ఏవీఎల్‌టీ)తో పాటు, గ్లోబల్‌ పొజిషనింగ్‌ విధానం (జీపీఎస్‌) కూడా ఏర్పాటు చేశారు. ఆధార్‌ కోసం బయోమెట్రిక్‌ ఉపకరణాలు, ఇంకా రోగులకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయడం కోసం  ట్యాబ్, పర్సనల్‌ కంప్యూటర్‌ (పీసీ) కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. తద్వారా రోగులకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డు (ఈహెచ్‌ఆర్‌) తయారు చేయడం చాలా సులువు అవుతుంది.

ఎంఎంయూలు- 20 రకాల సేవలు :
మాతా శిశు మరణాలు నివారించడంతో పాటు, చిన్నారుల ఆరోగ్యం కాపాడడం, వారిలో పౌష్టికాహార లోపం లేకుండా చూడడం, ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని సీజన్లలో ప్రబలే అంటువ్యాధులు నివారించడం, కుగ్రామాలలో నివసించే వారికి కూడా అత్యాధునిక వైద్య సదుపాయం కల్పిస్తూ, మొత్తం 20 రకాల  సేవలందించడం కోసం 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేస్తూ, ప్రభుత్వం ఎంఎంయూలను తీర్చిదిద్దింది. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, ఈ సేవలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఏయే సర్వీసులు ఎన్నెన్ని.. ?
అన్నీ కలిపి ఒకేసారి మొత్తం 1068 వాహనాలను సీఎం వైయస్‌ జగన్‌ బుధవారం ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.200.15 కోట్లు ఖర్చు చేసింది.కొత్త, పాత అంబులెన్సులతో పాటు, మొత్తం ఎంఎంయూల నిర్వహణకు ఏటా రూ. 318.93 కోట్లు ఖర్చు కానుంది.

గతంలో... ఇప్పుడు :
రాష్ట్రంలో గతంలో 108 అంబులెన్సులు 440 చోట్ల  (ప్రాంతాలు వాహనాలు)లో మాత్రమే సేవలందించగా, ఇప్పుడు మొత్తం 705 చోట్లనుంచి  పని చేయనున్నాయి. ప్రతి మండలం (676 మండలాలు)తో పాటు, పట్టణ ప్రాంతాల్లోనూ సేవలందించనున్నాయి. అదే విధంగా గతంలో 104 అంబులెన్సులు (ఎంఎంయూ) 292 మాత్రమే ఉండగా, ఇప్పుడు మండలానికి ఒకటి చొప్పున మొత్తం 676 సర్వీసులు పని చేయనున్నాయి. 20 రకాల వైద్య సేవలందిస్తూ, రోగులకు అవసరమైన మొత్తం 74 రకాల ఔషథాలు కూడా అందజేయనున్నాయి. గతంలో ఈ అంబులెన్సులలో కేవలం 52 రకాల ఔషథాలు మాత్రమే ఉండేవి. వైద్యులు అతి కష్టం మీద అందుబాటులో ఉండేవారు.

కానీ ఇప్పుడు 104ల్లోమొత్తం 744 మంది వైద్యులు సేవలందించనున్నారు. ఇంకా వీటిని డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసి నిర్వహించనున్నారు. తద్వారా అన్ని చోట్ల క వైద్య సేవలు అందనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 676 సంఖ్యలో ఉన్న 104 వాహనాలు ప్రతి రోజూ 40,560 మందికి సేవ చేస్తూ, ఏటా ఏకంగా 1.45 కోట్ల రోగులకు వైద్య సేవలందిస్తాయని భావిస్తున్నారు.

డాక్టర్‌ వైఎస్సార్‌ రహదారి భద్రత 108 సర్వీస్‌ ద్వారా..
108 అంబులెన్సు సర్వీసులకు కొత్తగా ప్రారంభిస్తున్న డాక్టర్‌ వైయస్సార్‌ రహదారి భద్రత కార్యక్రమాన్ని లింక్‌ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి దీని ద్వారా ఆస్పత్రులలో ఉచితంగా వైద్య సేవలందిస్తారు. రెండు రోజుల పాటు లేదా గరిష్టంగా రూ.50 వేల వ్యయం వరకు ఆ వైద్య సేవలందిస్తారు. డాక్టర్‌ వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టు ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement