సాక్షి, అమరావతి: అకస్మాత్తుగా అనారోగ్యం పాలైనా.. యాక్సిడెంట్ అయినా.. వెంటనే 108కు ఫోన్ చేయడం ప్రజలకు అలవాటు. ఇకపై రాత్రి పూట ఫోన్ చేస్తే 108 రాదు. ఎందుకంటే ఉన్న వాహనాలను పగలు మాత్రమే తిప్పండి, రాత్రి నిలిపివేయండి అంటూ 108 అంబులెన్సుల నిర్వహణా సంస్థ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీచేయడమే కారణం. రాష్ట్రంలో 439 వాహనాలుండగా 422 వాహనాలు తిరుగుతున్నాయని ముఖ్యమంత్రి కోర్‌డాష్ బోర్డులో సమాచారం ఉంది. కానీ ప్రస్తుతం 342 వాహనాలు మాత్రమే తిరుగుతున్నాయని నిర్వాహణ సంస్థ జీవీజీ ఉద్యోగులు చెబుతున్నారు.
వాహనాలను పగలు మాత్రమే తిప్పాలని, ఐదు కిలోమీటర్ల దూరం అయితేనే వెళ్లాలని, అంతకుమించి దూరంలో సంఘటన స్థలం ఉంటే బిజీగా ఉన్నామని చెప్పాలని ఉద్యోగులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో చాలా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదానికో, ఇతరత్రా ఆపదలో ఉన్న పేదలు 108కు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నామని జవాబు వస్తోంది. వాహనాలు తిరగడం లేదని ఉద్యోగులెవరైనా మీడియాకు చెబితే అలాంటి వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని సంస్థ బెదిరిస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. కొన్ని వాహనాల్లో ఆక్సిజన్ సిలెండర్లు లేవు, 90 శాతం వాహనాల్లో మందులు లేవు, మెజార్టీ వాహనాలకు టైర్లు అరిగిపోయి తిరగడం లేదు..ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రెండు దఫాలుగా చర్చలు జరిగినా ఫలితం లేదు. అయితే తాము ఇచ్చిన సమ్మె నోటీసును వెనక్కి తీసుకోలేమని, ఏ క్షణంలో అయినా సమ్మెలోకి వెళతామని ఉద్యోగులు హెచ్చరించారు.
108 వాహనాల సమస్యలు ఇవీ..
- సకాలంలో ఇంజన్ ఆయిల్ మార్చకపోవడంతో ఇంజన్లు సీజ్ అవుతున్నాయి
- హెడ్‌లైట్‌లు పనిచేయకపోవడంతో రాత్రి సమయంలో ప్రమాదానికి గురవుతున్నాయి
- సైరన్, బార్‌లైట్స్, బ్లింకర్స్, బ్యాటరీ హారన్ పనిచేయడంలేదు. టైర్లు పూర్తిగా అరిగిపోయి వందల వాహనాలు తిరగలేని పరిస్థితిలో ఉన్నాయి
- బ్రేకులు, బ్యాటరీలు పనిచేయడం లేదు
- వైఫర్స్ పనిచేయకపోవడంతో వర్షంలో తిరగడం కష్టంగా ఉంటోంది. వాహనాల్లో మల్టీచానల్ మానిటర్, సెక్షన్ ఆపరేటర్స్, డిఫ్రిబ్యులేటర్, వెంటిలేటర్, పల్సాక్సీ మీటర్లు లేవు
- కనీసం బీపీ ఆపరేటర్, స్టెతస్కోప్, గ్లూకోమీటర్, ధర్మామీటర్‌లు కూడా లేవు
- చాలా అంబులెన్సుల్లో ఆక్సిజన్ అందుబాటులో లేదు
- క్షతగాత్రులకు అవసరమైన కాటన్, డ్రెస్సింగ్ ప్యాడ్స్, సెరిలైజ్డ్ దూది, అయోడిన్, స్ట్రెచర్ కూడా లేవు
- పాముకాటు సమయంలో ఇవ్వాల్సిన ఏఎస్‌వీ,టీటీ ఇంజక్షన్‌లు లేవు
ఉద్యోగుల సమస్యలు..
- ప్రతినెలా ఉద్యోగుల వేతనాల్లో కారణం లేకుండా కోత వేస్తున్నారు
- రోజుకు 8 గంటలు కాకుండా 12 గంటలు పనిచేయిస్తున్నారు
- వేతనం పెంచుతామని హామీ ఇచ్చినా ఇప్పటికీ పెంచలేదు
- గత 6 నెలలుకు సంబంధించిన రిలీవింగ్ బిల్లులు చెల్లించలేదు
- వాహనాలకు మైనరు రిపేర్లు, పంక్చర్స్, ఎయిర్, హెడ్‌లైట్లకు సంబంధించిన బిల్లులు ఉద్యోగుల మీద వేస్తున్నారు.
- వాహనాలు ఆగిపోతే ఆ సిబ్బందికి ప్రత్యామ్నాయం చూపించకపోగా వేతనాలు కూడా ఇవ్వడంలేదు. సిబ్బంది ప్రమాదానికి గురైతే ఎలాంటి వైద్య బీమా లేదు
Comments
Please login to add a commentAdd a comment