సాక్షి, అమరావతి: 108 అంబులెన్సుల పనితీరు రోజురోజుకూ మరింతగా దిగజారుతోంది. ఇప్పటికే నిధులు విడుదల చేయక నిర్వీర్యమైన ఆ పథకం.. ఇప్పుడు మరింత పతనావస్థకు చేరుతోంది. కనీస సౌకర్యాలు సైతం కల్పించకుండానే అవి తిరుగుతున్నట్లు చూపిస్తూ.. సవాలక్ష ఆంక్షలు విధిస్తూ ఎంతో ప్రాధాన్యమున్న ‘108’ను అగాథంలోకి నెట్టేస్తున్నారు. వీటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే.. అంబులెన్స్‌ల్లోని సిబ్బంది చేతికి వేసుకునే గ్లౌజులకు రేషన్ విధించారు. రోజుకు ఒక్క జత మాత్రమే ఇస్తాం.. ఉదయం ఈ గ్లౌజులు వేసుకుని రాత్రి వరకూ అవే వాడండి అంటూ యాజమాన్యం పరిమితులు విధించింది. ప్రమాద కేసుల్లో గాయపడిన బాధితులను అంబులెన్సులోకి ఎక్కించాలంటే విధిగా గ్లౌజ్ వేసుకోవాల్సిందే. ఒక బాధితుడికి వాడిన తర్వాత వాటిని మరో బాధితుడికి వాడే అవకాశం ఉండదు. కానీ, రోజుకు ఒక్క జత మాత్రమే గ్లౌజులు ఇస్తామని వాటి నిర్వాహకులు చెబుతుండడంతో సిబ్బంది తెల్లముఖం వేస్తున్నారు. ఉదయం వేసుకున్న గ్లౌజులే సాయంత్రం వరకూ వాడుకోవాలని, అంతకుమించి ఇవ్వలేమని చెప్పడం దారుణమని.. రక్తమోడుతున్న పేషెంట్లు అని చెప్పినా వినడంలేదని సిబ్బంది వాపోతున్నారు.
ఇంజక్షన్లకూ పరిమితులు
108 అంబులెన్సుకు ఫోన్ చేశారంటేనే బాధితులు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నట్లు లెక్క. ప్రధానంగా ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్న వారే వీటిని ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటారు. వీరికి ఘటనా స్థలిలోనే ట్రమడాల్ అనే నొప్పి నివారణ ఇంజక్షన్ ఇస్తారు. కానీ, వీటిని కూడా రోజుకు ఒకటీ లేదా రెండు ఇంజక్షన్లు మాత్రమే ఇస్తామని యాజమాన్యం చెబుతున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అలాగే, అంబులెన్సుల్లో కనీసం 30 రకాల మందులు ఉండాలని.. కానీ, ఏ మందు కూడా ఇవ్వడంలేదని వారు చెబుతున్నారు. ఇంజక్షన్లు, గ్లౌజులు, టాబ్లెట్లు.. ఇలా ఒకటేమిటి అన్నిటికీ పరిమితులు విధించారని, ఇదేమని అడిగితే మీరు బాధితుడిని తీసుకొచ్చి ఆస్పత్రికి అప్పగించడం వరకే మీ పని, అంతకంటే ఎక్కువ మాట్లాడొద్దు అని తమను యాజమాన్యం బెదిరిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.
వీఐపీ కాన్వాయ్‌కి వెళ్తే మందులకు మోక్షం
రోజువారీ అంబులెన్సుల్లో మందులు, ఇంజిక్షన్లు, గ్లౌజులు ఇవేమీ ఉండవు. అదే ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ కాన్వాయ్‌కి గానీ ఈ 108 అంబులెన్సులను పంపిస్తే అన్ని రకాల మందులూ, గ్లౌజులు, ఇంజిక్షన్లు వస్తున్నాయని చెబుతున్నారు. కాన్వాయ్ నుంచి అంబులెన్సు బయటకు రాగానే మళ్లీ ఇవేమీ కనిపించని పరిస్థితి. అంతేకాకుండా.. రాజకీయ నాయకులు ఒత్తిడి తెస్తే ఆ ప్రాంతానికి అంబులెన్సు పంపుతున్నారు.
ఒక్కో 108కు నెలకు 250 ఎమర్జెన్సీ కేసులు
108 వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా 439 ఉన్నాయి. ఇందులో కనిష్టంగా 80 వాహనాలు తిరగడంలేదు. అంటే 359 వాహనాలు తిరుగుతున్నాయనుకున్నా... ఒక్కో వాహనం నెలకు సరాసరిన 250 నుంచి 300 ఎమర్జెన్సీ కాల్స్‌కు హాజరవుతుంది. వీటిలో 40 నుంచి 50 శాతం ప్రమాద కేసులే. అంటే కనీసం 120 మంది ప్రమాదంలో గాయపడిన వారే. రోజుకు ఒక్కో వాహనం ఐదారుగురు బాధితుల్ని ఆస్పత్రుల్లో చేరుస్తుంటాయి. ఒక్కో వాహనానికి కనీసం 10 జతల గ్లౌజులు అవసరం. అధిక రక్తస్రావం అయినప్పుడు రెండు మూడు జతల గ్లౌజులు కూడా వాడాలి. కానీ, ఒక్క పేషెంటుకు మాత్రమే గ్లౌజులు ఇస్తుంటే మిగతా వారిని ఎలా అంబులెన్సు ఎక్కించాలన్నది ఉద్యోగుల వాదన. అసలే రకరకాల ఇన్‌ఫెక్షన్లు కాటేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో యాజమాన్యం నిబంధనలు విధించడం అటు సిబ్బందిని, ఇటు బాధితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
సీఎం డాష్‌బోర్డా మజాకా
ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకునే కోర్‌డాష్ బోర్డును చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. పైగా 108 అంబులెన్సుల విషయంలో దాని పనితీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. 99.54 శాతం వాహనాలు విజయవంతంగా తిరుగుతున్నట్లు చూపించారంటే పరిస్థితి అంచనా వెయ్యొచ్చు.
అన్ని వాహనాలకు ఇస్తున్నాం..
అన్ని వాహనాలకూ కావాల్సినన్ని మందులూ, గ్లౌజులు, ఇంజక్షన్లూ ఇస్తున్నామని యాజమాన్యం ప్రభుత్వానికి చెబుతోంది. స్టాకు పంపిణీ జరిగినట్టు కూడా చూపిస్తోంది. కానీ, వాహనాల్లోకి రావడం లేదంటే ఎక్కడ లోపం జరుగుతోందో విచారణ చేయిస్తాం. ఇప్పటికే ఈ వాహనాల్లో మందులు ఉన్నాయా లేదా, కాటన్, సర్జికల్స్ వంటివన్నీ ఉన్నాయో లేదో చూడాలని డ్రగ్ ఇన్స్‌పెక్టర్లకు కూడా ఆదేశాలిచ్చాం. రోజు వారీగా వాహనానికి ఎన్ని మందులు, ఎన్ని గ్లౌజులు ఇవ్వాలో యాజమాన్యానికి చెప్పాం.
– డా.రాజేంద్రప్రసాద్, నోడల్ అధికారి, 108 అంబులెన్సుల పథకం
Comments
Please login to add a commentAdd a comment