emergency medicine
-
పల్మనరీ మెడిసిన్ ఔట్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీ పెట్టడానికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసింది. మూడేళ్ల తర్వాత ప్రస్తుత పరిస్థితులను ఆధారం చేసుకొని గత మార్గదర్శకాల్లో పలు మార్పులు చేర్పులు చేసింది. గతంలో మెడికల్ కాలేజీకి అనుమతి రావాలంటే 24 డిపార్ట్మెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం వాటిల్లో నాలుగింటిని తొలగించి, ఒక దాన్ని చేర్చారు. అంటే 21 విభాగాలు ఉంటే సరిపోతుంది. అయితే ఎంబీబీఎస్ విద్యార్థులకు కీలకమైన పల్మనరీ మెడిసిన్ విభాగం తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. దీనితో పాటు ప్రాధాన్యత కలిగిన ఎమర్జెన్సీ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, రేడియేషన్ అంకాలజీ విభాగాలను కూడా ఎన్ఎంసీ తొలగించింది. కొత్తగా సమీకృత వైద్య పరిశోధన విభాగాన్ని తీసుకొచ్చింది. అత్యవసర వైద్యానికి ప్రాధాన్యం ఇచి్చంది. సాధారణ పడకలను 8 శాతం తగ్గించి ఐసీయూ పడకలను మాత్రం 120 శాతం పెంచింది. పల్మనాలజీ కిందే ఛాతీ, ఊపిరితిత్తుల వ్యాధులు ఛాతీ, ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులు లేదా కరోనా వంటి సమయాల్లో పల్మనరీ మెడిసిన్ కీలకమైనది. టీబీ వ్యాధి కూడా దీని కిందకే వస్తుంది. వెంటిలేటర్ మీద ఉండే రోగులను పల్మనరీ, అనెస్తీషియా విభాగాల వైద్యులే చూస్తారు. అలాంటి ప్రాధాన్యత కలిగిన విభాగాన్ని తొలగించడంపై సంబంధిత వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పల్మనరీని తీసేయడం వల్ల అనెస్తీషియా, జనరల్ మెడిసిన్ స్పెషలిస్టులపై భారం పడుతుందని అంటున్నారు. కాలేజీలో తొలగించిన విభాగాలకు చెందిన పీజీలు ఉండరు. దానికి సంబంధించిన వైద్యం కూడా అందుబాటులో ఉండదు. పల్మనరీ మెడిసిన్ రద్దు సమంజసం కాదు 50 ఏళ్లుగా ఉన్న పల్మనరీ మెడిసిన్ విభాగం తప్పనిసరి నిబంధన తొలగించడం సరైన చర్య కాదు. 2025 నాటికి టీబీ నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకున్న భారత్ పల్మనరీ వంటి కీలకమైన విభాగాన్ని తీసేయడం సమంజసం కాదు. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కమిటీ కన్వినర్,ఐఎంఏ, తెలంగాణ మరికొన్ని మార్గదర్శకాలు అనెస్తీషియా కింద పెయిన్ మేనేజ్మెంట్ విభాగాన్ని తీసుకొచ్చారు. దీర్ఘకాలిక నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు వంటివి ఈ విభాగం కిందికి వస్తాయి. యోగాను ఒక విభాగంగా ప్రవేశపెట్టారు. ఈ మేరకు వేర్వేరుగా స్త్రీ, పురుష శిక్షకులు ఉండాలి. గతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 300 పడకలు అవసరం కాగా, ప్రస్తుతం వాటిని 220కి కుదించారు. స్కిల్ ల్యాబ్ తప్పనిసరి చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థులు నేరుగా రోగుల మీద కాకుండా బొమ్మల మీద ప్రయోగం చేసేందుకు దీన్ని తప్పనిసరి చేశారు. గతంలో కాలేజీకి సొంత భవనం ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు 30 ఏళ్లు లీజుతో కూడిన భవనం ఉంటే సరిపోతుంది. కాలేజీ, అనుబంధ ఆసుపత్రి మధ్య దూరం గతంలో 10 కిలోమీటర్లు, 30 నిమిషాల ప్రయాణంతో చేరగలిగేలా ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు దీనిని కేవలం 30 నిమిషాల్లో చేరగలిగే దూరంలో ఉండాలన్న నియమానికి పరిమితం చేశారు. ఎన్ని సీట్లకు ఎన్ని జర్నల్స్, పుస్తకాలు ఉండాలన్నది స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా డాక్టర్లు, నర్సులతో పాటు మొత్తం 17 మంది సిబ్బందితో అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలి. ఎంబీబీఎస్ విద్యార్థులను ఇక్కడికి శిక్షణకు పంపుతారు. గతంలో ఎంబీబీఎస్, హౌసర్జన్లు, రెసిడెంట్లకు హాస్టల్ వసతి తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు రెసిడెంట్లకు తీసేశారు. -
రైళ్లలో అత్యవసర మందులతో ఫస్ట్ ఎయిడ్.. విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: రైలు ప్రయాణీకులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు దేశంలోని అన్ని రైళ్లు, రైల్వే స్టేషన్లలో అత్యవసర మందులు, మెడికల్ సామాగ్రి, ఆక్సిజన్ సిలిండర్ కలిగిన మెడికల్ బాక్స్‌లను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అత్యవసర పరిస్థితులలో ప్రయాణీకులకు ఫస్ట్ ఎయిడ్ సేవలు చేసేలా ఫ్రంట్ లైన్ సిబ్బంది అయిన ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ), ట్రైన్ గార్డులు, సూపరింటెండ్లు, స్టేషన్ మాస్టర్లకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. రైళ్లు, రైల్వే స్టేషన్లలో అత్యవసర వైద్య సేవలు కల్పించే అంశాన్ని పరిశీలించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు అణుగుణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులతో ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అన్ని ప్రయాణీకుల రైళ్లతో పాటు రైల్వే స్టేషన్లలో అత్యవసర మందులతో కూడిన మెడికల్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని, రైల్వే సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్ సేవలు అందించడంలో శిక్షణ ఇవ్వాలని, రైలు ప్రయాణీకులలో ఎవరైనా డాక్టర్ అందుబాటులో ఉంటే వారి చేత లేదా సమీప రైల్వే స్టేషన్లో అస్వస్థతకు గురైన ప్రయాణికునికి తక్షణ వైద్య సేవలు అందే సదుపాయం కల్పించాలని నిపుణుల సంఘం సిఫార్సు చేసినట్లు మంత్రి తెలిపారు. చదవండి: పాత బడ్జెట్ చదివిన సీఎం అశోక్ గెహ్లాట్..! ఫస్ట్ ఎయిడ్ సేవలు అందించే రైల్వే సిబ్బందికి ఎప్పటికప్పుడు రిఫ్రెషర్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే రైల్వే స్టేషన్‌కు సమీపాన ఉన్న ఆస్పత్రులు, అక్కడ పని చేసే వైద్యుల, వారి మొబైల్ నంబర్లతో కూడిన జాబితాను రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అస్వస్థతకు గురైన లేదా గాయపడిన ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించేందుకు రైల్వే, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్పత్రుల అంబులెన్స్ సర్వీసులను కూడా అందుబాటులో ఉంచినట్లు మంత్రి పేర్కొన్నారు. బీఐఎస్ ఆమోదం లేని బొమ్మల తయారీపై చర్యలు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ఆమోదం లేకుండా బొమ్మలు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి చెప్పారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న బీఐఎస్ మార్క్ లేని బొమ్మలు పిల్లల ఆరోగ్యానికి ఎలాంటి చేటు కలిగిస్తున్నవో ప్రభుత్వం మదింపు చేస్తోందా అన్న ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ బీఐఎస్ ఆమోదం లేకుండా బొమ్మలు తయారు చేస్తున్న వారిపై తరచుగా దాడులు నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
అత్యవసర ఔషధాల జాబితాలో కరోనరీ స్టెంట్లు
న్యూఢిల్లీ: కరోనరీ స్టెంట్లను అత్యవసర ఔషధాల జాతీయ జాబితా(ఎన్ఎల్ఈఎం–2022)లో చేరుస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మెటల్ సెంట్లు(బీఎంఎస్), మందు పూత పూసిన స్టెంట్లు(డీఈఎస్)ను ఈ జాబితాలో చేర్చారు. ఇన్నాళ్లూ ‘పరికరాల’ జాబితాలో ఉన్న స్టెంట్లను ఔషధాలుగా అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చడం వల్ల ఎంబీఎస్, డీఈఎస్‌తోపాటు బీవీఎస్, బయోడిగ్రేడబుల్ సెంట్ల ధరలు తగ్గనున్నాయి. ధరలపై నేషనల్ ఫార్మాస్యూటికల్, ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) తుది నిర్ణయం తీసుకోనుంది. దేశంలో కరోనరీ ఆర్టరీ వ్యాధులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో స్టెంట్ల ధరల తగ్గుదల వల్ల బాధితులకు ఎంతో ఉపశమనం కలుగనుంది. అత్యవసర ఔషధాల జాతీయ జాబితాలో 2015లో 376 ఔషధాలు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య 384కు చేరింది. ఎన్ఎల్ఈఎంలో ఉన్న మందులను ఎన్పీపీఏ నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించడానికి వీల్లేదు. -
జాతీయ ప్రణాళిక కావాలి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తుండడం, మరణాల సంఖ్య పెరుగుతుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా బాధితులకు ప్రాణవాయువు, అత్యవసర ఔషధాలు అందుబాటులో లేకపోవడం విచారకరమని పేర్కొంది. కరోనా కట్టడి వ్యూహం, ఆక్సిజన్, ఔషధాల సరఫరాపై జాతీయ ప్రణాళిక అవసరమంది. దేశంలో కరోనా కల్లోల పరిస్థితిని సుప్రీంకోర్టు గురువారం సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేషన్ సాగుతున్న విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించే జ్యుడీషియల్ అధికారం హైకోర్టులకు ఉందా? లేదా? అనేది పరిశీలిస్తామంది. దేశంలో కనీసం 6 హైకోర్టుల్లో కోవిడ్ సంబంధిత అంశాలు విచారణలో ఉన్నాయని గుర్తుచేసింది. సుమోటో విచారణలో తమకు సహకరించేందుకు సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వేను అమికస్ క్యూరీగా సుప్రీంకోర్టు ధర్మాసనం నియమించింది. కోర్టులు వాటి అధికారాలను ఉపయోగించుకుంటున్నాయి ఇండియాలో కరోనా ప్రస్తుత పరిస్థితి, నియంత్రణ చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. కొన్ని అంశాలపై సుమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు తెలియజేసింది. ఢిల్లీ, బాంబే, సిక్కిం, మధ్యప్రదేశ్, కలకత్తా, అహ్మదాబాద్ హైకోర్టుల్లో కరోనా పరిస్థితికి సంబంధించిన అంశాలు విచారణలో ఉన్నాయని తెలిపింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆయా న్యాయస్థానాలు వాటి పరిధిలోని అధికారాలను ఉపయోగించుకుంటున్నాయని వివరించింది. ఒక కోర్టు ఒక అంశానికి, మరో కోర్టు మరో అంశానికి ప్రాధాన్యం ఇస్తుండడంతో గందరగోళం తలెత్తుతోందని వెల్ల డించింది. కాబట్టి నాలుగు కీలక అంశాలు.. ఆక్సిజన్ సరఫరా, అత్యవసర ఔషధాల పంపిణీ, వ్యాక్సినేషన్ విధానం, లాక్డౌన్ ప్రకటనపై హైకోర్టులకు ఉన్న అధికారంపై దృష్టి పెడతామని స్పష్టం చేసింది. ఈ నాలుగు అంశాలపై ప్రభుత్వానికి నోటీసు ఇస్తున్నామని, వీటిపై జాతీయ ప్రణాళిక తమకు కావాలని వ్యాఖ్యానించింది. జాతీయ ప్రణాళికను హైకోర్టులకు సమర్పించాలని సొలిసిటర్ జనరల్‌కు ధర్మాసనం సూచించింది. -
విధిలేని పరిస్థితుల్లో దిగొచ్చిన పాక్ !
ఇస్లామాబాద్ : జమ్ము కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌తో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను అన్నిస్థాయిల్లో నిలిపివేసిన సంగతి తెలిసిందే. తన దేశంలో వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహానికనుగుణంగా ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యాధికారిని కూడా బహిష్కరించింది. బాలీవుడ్ సినిమాలను, సీరియళ్లను నిలిపివేసింది. అంతేకాక, భారత్‌లో తయారైన వస్తువులను కొనుగోలు చేయరాదంటూ ఆ దేశ సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆవేశంతో భారత్‌తో సంబంధాలు నిలిపివేసిన దాయాది దేశానికి ఇప్పుడు మెల్లిగా కష్టాలు తెలిసొస్తున్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను చూస్తే పాక్ నుంచి భారత్‌కు వచ్చే దిగుమతుల కన్నా భారత్ నుంచి పాక్‌కు అయ్యే దిగుమతులే ఎక్కువ. ఇప్పుడు పాకిస్తాన్‌కు ప్రాణాంతక వ్యాధుల (ఉదా: రేబిస్, పాముకాటు)కు తగిన మందులు అవసరమయ్యాయి. ఈ మందులను ఇంతకు ముందు భారత్ నుంచి దిగుమతి చేసుకునేది. వాణిజ్యంపై నిషేధం దరిమిలా ఇన్ని రోజులుగా ఆ దేశంలో నిల్వ ఉన్న మందులు అయిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మందులు అందకపోతే చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశముంది. ఈ ప్రమాదాన్ని గ్రహించిన పాకిస్తాన్ వాణిజ్య శాఖ భారత్ నుంచి ఔషధాలను దిగుమతి చేసుకోవడానికి చట్టబద్ధంగా అనుమతినిచ్చిందని అక్కడి జియో న్యూస్ తెలిపింది. పిటిఐ నివేదిక ప్రకారం 2019 జులై వరకు పాకిస్తాన్ నుంచి భారత్‌కు 136 కోట్ల రూపాయల ఫార్మా ఆర్డర్ ఉంది. కశ్మీర్ విభజన నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్యం రద్దు కావడంతో ఇవి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడు పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లిన ఇటువంటి పరిస్థితిలో పాక్‌కు భారత్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయి. మరి ఈ విషయంపై మోదీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.. వేచి చూడాలి. -
108 ఆంక్షలు!
సాక్షి, అమరావతి: 108 అంబులెన్సుల పనితీరు రోజురోజుకూ మరింతగా దిగజారుతోంది. ఇప్పటికే నిధులు విడుదల చేయక నిర్వీర్యమైన ఆ పథకం.. ఇప్పుడు మరింత పతనావస్థకు చేరుతోంది. కనీస సౌకర్యాలు సైతం కల్పించకుండానే అవి తిరుగుతున్నట్లు చూపిస్తూ.. సవాలక్ష ఆంక్షలు విధిస్తూ ఎంతో ప్రాధాన్యమున్న ‘108’ను అగాథంలోకి నెట్టేస్తున్నారు. వీటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే.. అంబులెన్స్‌ల్లోని సిబ్బంది చేతికి వేసుకునే గ్లౌజులకు రేషన్ విధించారు. రోజుకు ఒక్క జత మాత్రమే ఇస్తాం.. ఉదయం ఈ గ్లౌజులు వేసుకుని రాత్రి వరకూ అవే వాడండి అంటూ యాజమాన్యం పరిమితులు విధించింది. ప్రమాద కేసుల్లో గాయపడిన బాధితులను అంబులెన్సులోకి ఎక్కించాలంటే విధిగా గ్లౌజ్ వేసుకోవాల్సిందే. ఒక బాధితుడికి వాడిన తర్వాత వాటిని మరో బాధితుడికి వాడే అవకాశం ఉండదు. కానీ, రోజుకు ఒక్క జత మాత్రమే గ్లౌజులు ఇస్తామని వాటి నిర్వాహకులు చెబుతుండడంతో సిబ్బంది తెల్లముఖం వేస్తున్నారు. ఉదయం వేసుకున్న గ్లౌజులే సాయంత్రం వరకూ వాడుకోవాలని, అంతకుమించి ఇవ్వలేమని చెప్పడం దారుణమని.. రక్తమోడుతున్న పేషెంట్లు అని చెప్పినా వినడంలేదని సిబ్బంది వాపోతున్నారు. ఇంజక్షన్లకూ పరిమితులు 108 అంబులెన్సుకు ఫోన్ చేశారంటేనే బాధితులు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నట్లు లెక్క. ప్రధానంగా ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్న వారే వీటిని ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటారు. వీరికి ఘటనా స్థలిలోనే ట్రమడాల్ అనే నొప్పి నివారణ ఇంజక్షన్ ఇస్తారు. కానీ, వీటిని కూడా రోజుకు ఒకటీ లేదా రెండు ఇంజక్షన్లు మాత్రమే ఇస్తామని యాజమాన్యం చెబుతున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అలాగే, అంబులెన్సుల్లో కనీసం 30 రకాల మందులు ఉండాలని.. కానీ, ఏ మందు కూడా ఇవ్వడంలేదని వారు చెబుతున్నారు. ఇంజక్షన్లు, గ్లౌజులు, టాబ్లెట్లు.. ఇలా ఒకటేమిటి అన్నిటికీ పరిమితులు విధించారని, ఇదేమని అడిగితే మీరు బాధితుడిని తీసుకొచ్చి ఆస్పత్రికి అప్పగించడం వరకే మీ పని, అంతకంటే ఎక్కువ మాట్లాడొద్దు అని తమను యాజమాన్యం బెదిరిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. వీఐపీ కాన్వాయ్కి వెళ్తే మందులకు మోక్షం రోజువారీ అంబులెన్సుల్లో మందులు, ఇంజిక్షన్లు, గ్లౌజులు ఇవేమీ ఉండవు. అదే ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ కాన్వాయ్కి గానీ ఈ 108 అంబులెన్సులను పంపిస్తే అన్ని రకాల మందులూ, గ్లౌజులు, ఇంజిక్షన్లు వస్తున్నాయని చెబుతున్నారు. కాన్వాయ్ నుంచి అంబులెన్సు బయటకు రాగానే మళ్లీ ఇవేమీ కనిపించని పరిస్థితి. అంతేకాకుండా.. రాజకీయ నాయకులు ఒత్తిడి తెస్తే ఆ ప్రాంతానికి అంబులెన్సు పంపుతున్నారు. ఒక్కో 108కు నెలకు 250 ఎమర్జెన్సీ కేసులు 108 వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా 439 ఉన్నాయి. ఇందులో కనిష్టంగా 80 వాహనాలు తిరగడంలేదు. అంటే 359 వాహనాలు తిరుగుతున్నాయనుకున్నా... ఒక్కో వాహనం నెలకు సరాసరిన 250 నుంచి 300 ఎమర్జెన్సీ కాల్స్‌కు హాజరవుతుంది. వీటిలో 40 నుంచి 50 శాతం ప్రమాద కేసులే. అంటే కనీసం 120 మంది ప్రమాదంలో గాయపడిన వారే. రోజుకు ఒక్కో వాహనం ఐదారుగురు బాధితుల్ని ఆస్పత్రుల్లో చేరుస్తుంటాయి. ఒక్కో వాహనానికి కనీసం 10 జతల గ్లౌజులు అవసరం. అధిక రక్తస్రావం అయినప్పుడు రెండు మూడు జతల గ్లౌజులు కూడా వాడాలి. కానీ, ఒక్క పేషెంటుకు మాత్రమే గ్లౌజులు ఇస్తుంటే మిగతా వారిని ఎలా అంబులెన్సు ఎక్కించాలన్నది ఉద్యోగుల వాదన. అసలే రకరకాల ఇన్ఫెక్షన్లు కాటేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో యాజమాన్యం నిబంధనలు విధించడం అటు సిబ్బందిని, ఇటు బాధితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. సీఎం డాష్బోర్డా మజాకా ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకునే కోర్‌డాష్ బోర్డును చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. పైగా 108 అంబులెన్సుల విషయంలో దాని పనితీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. 99.54 శాతం వాహనాలు విజయవంతంగా తిరుగుతున్నట్లు చూపించారంటే పరిస్థితి అంచనా వెయ్యొచ్చు. అన్ని వాహనాలకు ఇస్తున్నాం.. అన్ని వాహనాలకూ కావాల్సినన్ని మందులూ, గ్లౌజులు, ఇంజక్షన్లూ ఇస్తున్నామని యాజమాన్యం ప్రభుత్వానికి చెబుతోంది. స్టాకు పంపిణీ జరిగినట్టు కూడా చూపిస్తోంది. కానీ, వాహనాల్లోకి రావడం లేదంటే ఎక్కడ లోపం జరుగుతోందో విచారణ చేయిస్తాం. ఇప్పటికే ఈ వాహనాల్లో మందులు ఉన్నాయా లేదా, కాటన్, సర్జికల్స్ వంటివన్నీ ఉన్నాయో లేదో చూడాలని డ్రగ్ ఇన్స్పెక్టర్లకు కూడా ఆదేశాలిచ్చాం. రోజు వారీగా వాహనానికి ఎన్ని మందులు, ఎన్ని గ్లౌజులు ఇవ్వాలో యాజమాన్యానికి చెప్పాం. – డా.రాజేంద్రప్రసాద్, నోడల్ అధికారి, 108 అంబులెన్సుల పథకం -
పడకేసిన పీహెచ్‌సీలు!
అత్యవసర మందులకే దిక్కులేని దుస్థితి పరిశుభ్రత, నీటి సౌకర్యం శూన్యం 140 పీహెచ్‌సీలు, 300 ఉప కేంద్రాల్లో వైద్యాధికారుల తనిఖీల్లో వెలుగులోకి... సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) కుంటుపడ్డాయి. ఈ విషయాన్ని స్వయానా వైద్య ఆరోగ్యశాఖ అధికారులే పేర్కొనడం గమనార్హం. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి వైద్యాధికారుల బృందం ఇటీవల యాదాద్రి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, రంగారెడ్డి జిల్లాల్లోని 140 పీహెచ్‌సీలు, 300 ఉప కేంద్రాలను తనిఖీ చేసింది. అనంతరం ప్రభుత్వాని కి నివేదిక సమర్పించింది. నివేదిక ప్రకారం అనేక పీహెచ్‌సీల్లో నీటి వసతే లేదు. మరుగుదొడ్ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. పీహెచ్‌సీల చుట్టూ చెట్లు, పొదలే దర్శనమిస్తున్నాయి. విద్యుత్ సరఫరా అంతంతే. చాలా పీహెచ్‌సీల్లో మెడికల్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొందరు వైద్య సిబ్బంది ఇష్టారీతిన గైర్హాజరవుతుండగా మరికొందరైతే పూర్తిగానే రావడం మానేశారు. అత్యవసర మందులు లేని పరిస్థితి... చాలా పీహెచ్‌సీల్లో అత్యవసర మందులే లేవని ఉన్నతస్థాయి బృందం నివేదించింది. గర్భిణులకు ఇచ్చే మందులు, పిల్లలకు ఇచ్చే విటమిన్ మాత్రలు లేవని తేల్చింది. ఐఎఫ్ఏ మాత్రలు, విటమిన్ ఏ సిరప్, విజమిన్ కె అందుబాటులో లేవని పేర్కొం ది. అత్యవసర మందులను తెప్పించుకోవడం లోనూ పీహెచ్‌సీలు విఫలమవుతున్నాయని... ఔషధాలను నిల్వ ఉంచుకునే సరైన వ్యవస్థ కూడా అక్కడ లేదని బృందం పేర్కొంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు లేవని తేల్చింది.ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేవు. షుగర్, మలేరియా, మూత్రం వంటి పరీక్షలు మినహా హెచ్ఐవీ వంటి పరీక్షలు చేసే పరిస్థితి లేదు. చాలా పీహెచ్‌సీలు రోగులను పరీక్షించి అందుబాటులో ఉన్న మందులు ఇచ్చి పంపడం వరకే పరిమితమయ్యాయి. 60 శాతం పీహెచ్‌సీలు కొన్నేళ్లుగా ప్రసవాలు చేయడం లేదని బృందం విమర్శించింది. కేవలం 10 శాతం పీహెచ్‌సీలు తమ లక్ష్యం మేరకు ప్రసవాలు చేస్తున్నాయి. హై రిస్క్ ప్రెగ్నెన్సీలను ఎలా గుర్తించాలనే ప్రశ్నకు చాలా మంది వైద్య సిబ్బంది సమాధానం ఇవ్వలేక పోయారని బృందం పేర్కొంది. పరికరాల నిర్వహణ, మరమ్మతు యంత్రాంగం లేదని వివరించింది. చాలా ఉప వైద్య కేంద్రాలు అద్దె గదుల్లోనే నిర్వహిస్తున్నారని, ఒక పీహెచ్‌సీలోనైతే కాలం తీరిన వ్యాక్సిన్‌ను ఉపయోగించినట్లు తేల్చింది. -
కార్మికుల వైద్యానికి ‘ఎమర్జెన్సీ’ దెబ్బ
- అత్యవసర వైద్యానికి అనుమతుల నిరాకరణ - డెరైక్టర్ల అధికారాలకు కత్తెరేసిన ఈఎస్ఐ కార్పొరేషన్ - దుర్వినియోగం చేస్తున్నారంటూ సాకు - అవసరమైతే వైద్యం చేయించుకున్నాక రీయింబర్స్ చేస్తామని స్పష్టీకరణ - తెలుగు రాష్ట్రాల్లో 15 లక్షలమంది కార్మికుల్లో అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది కార్మికులు, వారి కుటుంబాలకు అందాల్సిన అత్యవసర వైద్యానికి బ్రేకులు పడ్డాయి. ఎమర్జెన్సీ వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లిన కార్మికులుగానీ, వారి కుటుంబాలుగానీ ఇకనుంచీ ముందు తమ చేతి డబ్బులు పెట్టుకోవాల్సిందే. సదరు వైద్యానికయ్యే ఖర్చును ఆ తర్వాతే ఎంప్లాయిస్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) రీయింబర్స్ చేస్తుంది. ఎమర్జెన్సీ వైద్యానికి అనుమతిస్తుంటే ప్రతిఒక్కరూ అత్యవసర వైద్యమేనని చెప్పి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నారని, దీనివల్ల కేంద్ర కార్మికశాఖకు భారీగా వ్యయమవుతోందనే కారణంతో ఈఎస్ఐసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై తెలంగాణలోని 10 లక్షలమంది ఇన్స్యూర్డ్ పర్సన్స్(ఐపీ), ఆంధ్రప్రదేశ్‌లో 5 లక్షలమంది ఐపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బును తమకు ఖర్చు పెట్టడానికి ఇలాంటి ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంచాలకుల అధికారాలకు కత్తెర.. ప్రతి రాష్ట్రానికి ఈఎస్ఐకి సంచాలకుల కార్యాలయం(డెరైక్టరేట్) ఉంటుంది. ఆ మేరకు ఏపీ, తెలంగాణలకు రెండు డెరైక్టరేట్లు ఉన్నాయి. ఇప్పటివరకు కార్మికులుగానీ, వారి కుటుంబసభ్యులుగానీ గుండెపోటు, న్యూరో సంబంధిత వ్యాధులు సోకినప్పుడు నేరుగా కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి.. ఈఎస్ఐ డెరైక్టర్ కార్యాలయానికి సమాచారమిస్తే 24 గంటల్లోనే అనుమతులిచ్చేవారు. పేషెంట్ నయాపైసా డబ్బు చెల్లించకుండా డెరైక్టరేట్ నుంచే చెల్లించేవారు. తాజాగా కేంద్ర పరిధిలో ఉండే ఈఎస్ఐ కార్పొరేషన్ ఈ విధానాన్ని తీసేసింది. అత్యవసర వైద్యం పేరుతో ప్రతిఒక్కరూ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నారని, పథకం దుర్వినియోగం అవుతోందంటూ.. ఈఎస్ఐ డెరైక్టర్లకు నేరుగా అనుమతులిచ్చే విధానాన్ని తీసేసింది. అత్యవసర వైద్యమైతే రోగి డబ్బులు చెల్లించి చేయించుకోవాలని, ఆ తర్వాత వైద్యానికయ్యే ఖర్చును తిరిగి చెల్లిస్తామంది. ఈ నేపథ్యంలో అనుమతులు నిలిపేశారు. దీనిపై కార్మిక వర్గాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయి. లక్షలు చెల్లించి వైద్యం ఎలా చేయించుకోగలమని వాపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్మికులు, వారి కుటుంబసభ్యులు కలిపి 60 లక్షలమంది వరకు ఉన్నట్టు అంచనా. ఇప్పుడు మాకు అధికారం లేదు గతంలో కార్మికులుగానీ, వారి పిల్లలు గానీ, కుటుంబసభ్యులుగానీ అత్యవసర వైద్యమంటే తామే అనుమతులు ఇచ్చేవాళ్లమని, ఇప్పుడు కార్పొరేషన్ ఆ అధికారాలను తీసేసిందని తెలంగాణ ఈఎస్ఐ డెరైక్టర్ డా.దేవికారాణి, ఏపీ ఈఎస్ఐ డెరైక్టర్ డా.రమేష్కుమార్లు తెలిపారు. ఎమర్జెన్సీ వైద్యానికి రోగులే చెల్లించుకుంటే.. రీయింబర్స్ చేస్తామన్నారు. అప్పటికప్పుడు అనుమతులివ్వడం తమ చేతుల్లో లేదన్నారు. -
ఎడ్లబండే.. అంబులెన్సు..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వాహనాల ఎత్తివేత అత్యవసర వైద్యం అందని ద్రాక్షే.. పునరుద్ధరించాలని గిరిజనుల వేడుకోలు ఉట్నూర్ :ఐటీడీఏ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ) గిరిజనులకు అత్యవసర వైద్యం అందించడానికి నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్ఎఫ్డీసీ) ద్వారా పదిహేనేళ్ల క్రితం అంబులెన్సులు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సేవలు అందిస్తున్న అంబులెన్సులకు సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో సేవలు నిలిచాయి. అంబులెన్సులు కొనుగోలు చేసి చాలా ఏళ్లు కావడంతో కాలం చెల్లాయి. కొన్నింటికి విడిభాగాలు దొరకని పరిస్థితి. గత అక్టోబర్‌లో రాష్ట్ర స్థాయిలో జరిగిన వైద్యశాఖ మినిట్స్ అఫ్ ది మీటింగ్‌లో ఏజెన్సీ పీహెచ్‌సీల అంశం ప్రస్తావనకు వచ్చింది. సాధ్యాసాధ్యాలను చర్చించిన యంత్రాంగంఅంబులెన్స్లను ఎత్తివేయాలని నిర్ణయించారు. దీం తో జనవరి నుంచి ఇచ్చోడ, దండేపల్లి, బజార్హత్ను ర్, నర్సాపూర్(టి), నేరడిగొండ, గుడిహత్నూర్, భీం పూర్, నార్నూర్, వాంకిడి, దంతన్‌పల్లి, ఝర్రి, పిట్టబొంగరం పీహెచ్‌సీల అంబులెన్సులు ఎత్తివేశారు. అద్దె అంబులెన్సులకు రూ.80 లక్షలు విడుదలైనా.. అంబులెన్సు సేవలను నిలిపివేసిన వైద్యశాఖ ప్రత్యామ్నాయంగా ఏజెన్సీలోని 31 పీహెచ్‌సీల్లో వ్యాధుల తీవ్రత అంతగా ఉండని మందమర్రి, లోన్వెల్లి, ఈజ్గాం పీహెచ్‌సీలను మినహాయించి మిగతా 28 పీహెచ్‌సీలకు అద్దె ప్రతిపాదికన ఏడాది పాటు అంబులెన్సులు సమకుర్చుకోవాలని రూ.80 లక్షలు విడుదల చేసింది. ఏజెన్సీలో ప్రసవ సమయంలో గర్భవతులను ఆరోగ్య కేంద్రాలకు, ఇళ్లకు తరలించడానికి ఐటీడీఏ ఐఏపీ ద్వారా కొనుగోలు చేసిన ఆరు అంబులెన్సులను ఉపయోగిస్తుంది. వీటి నిర్వహణకు విడుదలైన రూ.80 లక్షల నిధులు ఖర్చు చేస్తుండటంతో ఐటీడీఏ పీహెచ్‌సీలకు అద్దె అంబులెన్సులు ఏర్పాటు చేయడం లేదు. దీంతో పీహెచ్‌సీలకు అంబులెన్సులు లేక పోవడంతో ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవడంలో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. అంబులెన్సు వాహన సౌకర్యం లేక పీహెచ్‌సీల పరిధిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, ర్యాపిడ్ ఫీవర్ సర్వేల నిర్వహణ, విద్యార్థుల ఆరోగ్య పరీక్షలకు వసతి గృహల పర్యటన, అత్యవసర వైద్య శిబిరాల ఏర్పాటు, బీసీడీఎస్ నుంచి పీహెచ్‌సీలకు మందుల రవాణా తదితర పనులు చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. వ్యాధుల సీజన్ ప్రారంభం కావడంతో పీహెచ్‌సీలకు అంబులెన్సు సౌకర్యం కల్పిస్తే అత్యవసర సమయంలో గిరిజనుల ప్రాణాలు కాపాడగలుగుతామని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. తొమ్మిది పీహెచ్‌సీలకే అంబులెన్సులు ప్రతి ఏడాది వ్యాధుల సీజన్లో ఐటీడీఏ దాదాపు 24 పీహెచ్‌సీలకు అంబులెన్సు సౌకర్యం కల్పించి మిగతా పీహెచ్‌సీలను అంబులెన్సు ఉన్న కేంద్రాలకు అనుసంధానం చేసి గిరిజనులకు అత్యవసర వైద్యం అందిస్తోంది. పీహెచ్‌సీలకు అంబులెన్సులు ఎత్తివేయడంతో గిరిజనులకు అత్యవసర వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఏజెన్సీలో ఎన్ఆర్హెచ్ఎంకు చెందిన మూడు అంబులెన్సులు జైనూర్, సిర్పూర్(యు), తిర్యాణి పీహెచ్‌సీల్లో ఉన్నాయి. అదికాక 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఐఏపీ పథకంలో భాగంగా రూ.60 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ఆరు అంబులెన్సుల్లో కాసిపేట, అంకోళి, గిన్నెధరి పీహెచ్‌సీలకు మూడు, ఆస్రా హెచ్ఎమ్ఆర్ఐ అనే సంస్థ అధినంలోని ఇంద్రవెల్లి, తిర్యాణి పీహెచ్‌సీలకు రెండు అంబులెన్సులు, మరొక్కటి హెల్త్ సెల్ నిర్వహణకు వాంకిడి పీహెచ్సీలో ఉంది. ఇలా ఏజెన్సీలోని 31 పీహెచ్‌సీల్లో తొమ్మిదింటికే ఇతర పథకాల ద్వారా వచ్చిన అంబులెన్సులు మినహా అంబులెన్సులు లేక పోవడంతో గిరిజనుల పాలిట శాపంగా మారుతుంది. అంబులెన్సు సౌకర్యాలు లేక పరిస్థితి విషమిస్తే ఎడ్లబండ్లే దిక్కు అవుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు. సీజన్ మొదలు కావడంతో ఐటీడీఏ విడుదల చేసిన నిధులతో ప్రతి పీహెచ్‌సీకి అద్దె అంబులెన్సు సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటున్నాం.. - ప్రభాకర్‌రెడ్డి, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి జనవరి నుంచి పీహెచ్‌సీలకు అంబులెన్సులు తొలగించబడ్డాయి. అద్దె అంబులెన్సుల కోసం వైద్యశాఖ రూ.80 లక్షలు నిధులు కేటాయించింది. గర్భిణీ, బాలింతల మరణాల నివారణకు కేటాయించిన అంబులెన్సుల ఖర్చులకు నిధులు ఉపయోగిస్తున్నాం. వ్యాధుల సీజన్ ప్రారంభం కావడంతో పీహెచ్‌సీలకు అంబులెన్సుల సౌకర్యం కల్పించడానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాం.