- అత్యవసర మందులకే దిక్కులేని దుస్థితి
- పరిశుభ్రత, నీటి సౌకర్యం శూన్యం
- 140 పీహెచ్‌సీలు, 300 ఉప కేంద్రాల్లో వైద్యాధికారుల
- తనిఖీల్లో వెలుగులోకి...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) కుంటుపడ్డాయి. ఈ విషయాన్ని స్వయానా వైద్య ఆరోగ్యశాఖ అధికారులే పేర్కొనడం గమనార్హం. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి వైద్యాధికారుల బృందం ఇటీవల యాదాద్రి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, రంగారెడ్డి జిల్లాల్లోని 140 పీహెచ్‌సీలు, 300 ఉప కేంద్రాలను తనిఖీ చేసింది. అనంతరం ప్రభుత్వాని కి నివేదిక సమర్పించింది.
నివేదిక ప్రకారం అనేక పీహెచ్‌సీల్లో నీటి వసతే లేదు. మరుగుదొడ్ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. పీహెచ్‌సీల చుట్టూ చెట్లు, పొదలే దర్శనమిస్తున్నాయి. విద్యుత్ సరఫరా అంతంతే. చాలా పీహెచ్‌సీల్లో మెడికల్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొందరు వైద్య సిబ్బంది ఇష్టారీతిన గైర్హాజరవుతుండగా మరికొందరైతే పూర్తిగానే రావడం మానేశారు.
అత్యవసర మందులు లేని పరిస్థితి...
చాలా పీహెచ్‌సీల్లో అత్యవసర మందులే లేవని ఉన్నతస్థాయి బృందం నివేదించింది. గర్భిణులకు ఇచ్చే మందులు, పిల్లలకు ఇచ్చే విటమిన్ మాత్రలు లేవని తేల్చింది. ఐఎఫ్‌ఏ మాత్రలు, విటమిన్ ఏ సిరప్, విజమిన్ కె అందుబాటులో లేవని పేర్కొం ది. అత్యవసర మందులను తెప్పించుకోవడం లోనూ పీహెచ్‌సీలు విఫలమవుతున్నాయని... ఔషధాలను నిల్వ ఉంచుకునే సరైన వ్యవస్థ కూడా అక్కడ లేదని బృందం పేర్కొంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు లేవని తేల్చింది.ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేవు. షుగర్, మలేరియా, మూత్రం వంటి పరీక్షలు మినహా హెచ్‌ఐవీ వంటి పరీక్షలు చేసే పరిస్థితి లేదు. చాలా పీహెచ్‌సీలు రోగులను పరీక్షించి అందుబాటులో ఉన్న మందులు ఇచ్చి పంపడం వరకే పరిమితమయ్యాయి.
60 శాతం పీహెచ్‌సీలు కొన్నేళ్లుగా ప్రసవాలు చేయడం లేదని బృందం విమర్శించింది. కేవలం 10 శాతం పీహెచ్‌సీలు తమ లక్ష్యం మేరకు ప్రసవాలు చేస్తున్నాయి. హై రిస్క్ ప్రెగ్నెన్సీలను ఎలా గుర్తించాలనే ప్రశ్నకు చాలా మంది వైద్య సిబ్బంది సమాధానం ఇవ్వలేక పోయారని బృందం పేర్కొంది. పరికరాల నిర్వహణ, మరమ్మతు యంత్రాంగం లేదని వివరించింది. చాలా ఉప వైద్య కేంద్రాలు అద్దె గదుల్లోనే నిర్వహిస్తున్నారని, ఒక పీహెచ్‌సీలోనైతే కాలం తీరిన వ్యాక్సిన్‌ను ఉపయోగించినట్లు తేల్చింది.