బషీరాబాద్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
బషీరాబాద్: కర్ణాటక సరిహద్దులోని బషీరాబాద్ మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా ప్రసవాలు మాత్రం చేయడం లేదు. తాండూరు జిల్లా ఆస్పత్రికి 25కి.మీ. దూరంలో మండలం ఉండడంతో ఇక్కడి ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయాలనే సంకల్పంతో బషీరాబాద్, నవల్గా గ్రామాల్లో పీహెచ్‌సీలను ఏర్పాటు చేశారు. బషీరాబాద్‌లో 24 గంటల వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇక్కడి సిబ్బంది ఉదయం10కి వచ్చి సాయంత్రం 5గంటలకు ఇళ్లకు వెళ్లి పోతున్నారు. రాత్రి వేళ గర్భిణులు వచ్చినా, యాక్సిడెంట్ కేసులు, పాము కాటు కేసు బాధితులను తాండూరు జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ఇన్ పేషెంట్లు వస్తే సాయంత్రం వరకు వైద్యం చేసి రాత్రికి ఇంటికి పంపుతున్నారు. లేబర్ రూమ్ సరిగ్గా లేకపోవడంతో మూడు నెలలుగా ప్రసవాలు నిలిచిపోయాయి. కొంతమంది గర్భిణులు తాండూరు పీహెచ్‌సీలో, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో పురుడు పోసుకుంటున్నారు.
నవల్గ్గాలో మరీ దారుణం
నవల్గ్గా పీహెచ్‌సీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ పీహెచ్‌సీ పరిధిలో మూడు గ్రామాలు ఉండగా ఒక్క కాన్పు కూడా జరగలేదు. అడపాదడపా వచ్చే రోగులకు ఓపీ చూసి సాయంత్రం కాగానే ఇంటి ముఖం పడుతున్నారు. దీంతో ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఏదైన ప్రమాదం జరిగితే తాండూరు వెళుతున్నారు కానీ, పీహెచ్‌సీకి రావడం లేదని ఆస్పత్రి వర్గాలే చెబుతున్నాయి. బషీరాబాద్ మెడికల్ అధికారిగా పనిచేస్తున్న వైద్యుడు గోపాల్ ఇక్కడ ఇన్‌చార్జ్ బాధ్యతలు చూస్తున్నాడు.
స్కానింగ్‌కు ప్రైవేటు సెంటర్లకు
మండలంలోని రెండు పీహెచ్‌సీల్లో అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్లు లేకపోవడంతో గర్భిణులు తాండూరులోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. జిల్లా ఆస్పత్రిలోనూ ఒకే కేంద్రం ఉండడంతో అక్కడ స్కానింగ్‌కు సమయం పడుతోంది. దీంతో గర్భిణులు బయట కేంద్రాల బాట పడుతున్నారు. పీహెచ్‌సీల్లో స్కానింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
అత్యవసర వైద్యం అందడం లేదు
బషీరాబాద్ పీహెచ్‌సీలో 24 గంటలు వైద్య సేవలు అందించాల్సి ఉంది. అయితే ఇక్కడి సిబ్బంది ఆరేడు గంటలు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. అత్యవసర వైద్యం అందడం లేదు. ప్రసవాల కోసం వచ్చినా, ప్రమాదాలు జరిగినా తాండూరు జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. రాత్రి వేళ ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. గతంలో పాము కాటుకు గురైన యువకుడు ఆస్పత్రికి వస్తే ఇంజక్షన్ ఇచ్చేవారు లేక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి మృతి చెందాడు.
– లక్ష్మణ్, యువజన సంఘం నాయకుడు, బషీరాబాద్
Comments
Please login to add a commentAdd a comment