Vikarabad District News
-
ఆన్లైన్ సేవలు అదుర్స్
షాబాద్: గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ సేవలు, రికార్డుల నిర్వహణ, అభివృద్ధి బాగుందని ఒడిశా బృందం సభ్యులు కితాబిచ్చారు. బుధవారం మండల పరిధిలోని సర్ధార్‌నగర్ గ్రామాన్ని ఒడిశా ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం సభ్యులు సందర్శించారు. గ్రామంలో పర్యటించిన ఒడిశా బృందం సభ్యులు పంచాయతీ కొనసాగుతున్న తీరును పరిశీలించారు. సొంత నిధుల సేకరణ, రాష్ట్ర నిధుల నిర్వహణ, ఉపాధిహామీ నిధులతో చేపట్టిన పల్లె ప్రకృతివనం, కంపోస్ట్ యార్డు, వైకుంఠధామం, హరితహారం నర్సరీ తదితరాలను పరిశీలించారు. పంచాయతీల పరిపాలనకు నిధుల సేకరణ, ఆన్లైన్ సేవలు చాలా బాగున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఒడిశా అధికారుల బృందం సీఈఓ అనిల్‌కుమార్, జిల్లా శిక్షణ అధికారి రుద్రయ్య, శ్రీనివాస్, షాబాద్ ఎంపీడీఓ అపర్ణ, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓ వీరాసింగ్, పంచాయతీ కార్యదర్శులు కవిత, శంకర్, రమేశ్, సిబ్బంది ఉన్నారు. సర్దార్‌నగర్ పంచాయతీ పాలనపై ఒడిశా బృందం ప్రశంసలు -
ప్రజా పాలన కళా యాత్ర ప్రారంభం
అనంతగిరి: ప్రజా పాలన కళా యాత్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌తో కలిసి ప్రజా పాలన కళా యాత్ర వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మంగళవారం నుంచే ప్రజా పాలన విజయోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులు నేటి నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు రోజూ మూడు గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పాటల ద్వారా ప్రచారం చేస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామాలు, మున్సిపాలిటీల్లో విస్తృతంగా ప్రచారం చేస్తారని వివరించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి ఎ.చెన్నమ్మ, సహాయ పౌర సంబంధాల అధికారి ప్రభాకర్, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, సాంస్కృతిక శాఖ కళాకారుల బృందం తదితరులు పాల్గొన్నారు. -
లైబ్రరీలను వినియోగించుకోవాలి
వికారాబాద్ అర్బన్: జిల్లాలోని గ్రంథాలయాలను విద్యార్థులు, నిరుద్యోగులు ఉపయోగించుకొని విజ్ఞానం పొందాలని శాసన మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేడ్కర్ భవన్లో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 17 గ్రంథాలయాలు, 3 లక్షల10 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని సూచించారు. పుస్తకాలు చదివితే కొత్త విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు మంజూరయ్యేలా చూస్తామని అన్నారు. మండల కేంద్రాలో గ్రంథాలయాల ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాయల చైర్మన్ రాజేశ్‌రెడ్డి, లైబ్రరీ సెక్రెటరీ సురేష్ బాబు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి -
సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి
ఇబ్రహీంపట్నం: విద్యార్థుల్లో అభిరుచిని పెంచేందుకు డిఫెన్స్, స్పేస్ కన్వెన్షన్–2024 సదస్సు ఏర్పాటు చేయ డం అభినందనీయమని ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, భారత రక్షణ శాఖ సైంటిఫిక్ అడ్వైజర్, డీఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్‌రెడ్డి అన్నారు. బుధవారం గురునానక్ విశ్వవిద్యాలయంలో భారత రత్న డాక్టర్ అబ్దుల్ కలాం ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ యూత్ సౌజ న్యంతో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు ప్రపంచంలోని డిఫెన్స్, స్పేస్ రంగా ల్లో నిపుణులైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు. యువతలో దేశ భక్తి, నైపుణ్యం, శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడానికి పలు ముఖ్యమైన విషయాలపై చర్చించారు. శాస్త్ర, సాంకేతిక, టెక్నాలజీ, ఇంజీనిరింగ్ , మేనేజ్మెంట్ వంటి విభాగాలలో భవిష్యత్ నాయకులుగా ఎదగాలన్నారు. -
ఎదురెదురుగా బైకులు ఢీ.. ఇద్దరికి గాయాలు
బంట్వారం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం కోట్‌పల్లి మండల పరిధిలోని కంకణాలపల్లి గేటు వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. యాలాల మండలం బెన్నూరుకు చెందిన ఇద్దరు యువకులు మోమిన్‌పేట వైపు నుంచి బైక్‌పై వస్తున్నారు. అదే క్రమంలో కోట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన మరో ఇద్దరు యువకులు వికారాబాద్ వైపు వెళుతున్నారు. రెండు బైక్‌లు ఎదురెదురుగా కంకణాలపల్లి గేటు వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బెన్నూరుకు చెందిన నరేందర్(30), కోట్‌పల్లికి చెందిన మహేశ్(25) తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై కోట్‌పల్లి పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. -
సర్వేతో అన్ని వర్గాలకు లబ్ధి
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తాండూరు: ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణం శాంతినగర్ కాలనీలోని ఎమ్మెల్యే ఇంట్లో ఎన్యుమరేటర్లు, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి కుటుంబ వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్యుమరేట్లరకు కుటుంబ వివరాలు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏరియా సూపర్ వైజర్ శారద, ఎన్యుమరేటర్ ఆంజనేయులు, సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దు జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి తాండూరు రూరల్: ఎరువులు, విత్తనాల కోసం వచ్చే రైతులను ఫర్టిలైజర్ దుకాణ యజమానులు ఇబ్బంది పెట్టరాదని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి సూచించారు. బుధవారం తాండూరులోని గణేశ్ ఫర్టిలైజర్ దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి సీజన్‌కు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఎమ్మార్పీకే విక్రయించాలని ఆదేశించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరి కోతల తర్వాత వరి కొయ్యలను కాల్చవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ రుద్రమూర్తి, ఏఓ కొమరయ్య, ఏఈఓలు పాల్గొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ ఇలాగేనా? గ్రామ కార్యదర్శిపై డీపీఓ జయసుధ ఆగ్రహం ధారూరు: మండలంలోని నాగసమందర్ గ్రామ పంచాయతీని బుధవారం డీపీఓ జయసుధ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కంపోస్టు షెడ్డు, నర్సరీ, వైకుంఠధామాన్ని పరిశీలించారు. వాటి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో గ్రామ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం లోపించిందని, వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి విధులకు సక్రమంగా హాజరు అవుతున్నారా అని ఆరా తీశారు. అనంతరం పంచాయతీ రికార్డులను పరిశీలించారు. పంచాయతీ స్థలంలో ఏర్పాటు చేసిన డబ్బాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీఓ షపీఉల్లా పాల్గొన్నారు. నేడు ‘చలో లగచర్ల’ అనంతగిరి: వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం చలో లగచర్ల కార్యక్రమం చేపడుతున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకట్ రాములు తెలిపారు. బుధవారం వికారాబాద్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల భూములను బలవంతంగా లాక్కోరాదని ప్రభుత్వానికి సూచించారు. దుద్యాల్ మండలంలో ఫార్మాసిటీ ఏర్పాటును వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. రైతుల అరెస్టును కండిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్, నాయకులు వెంకటయ్య, శ్రీనివాస్, చంద్రయ్య, సతీష్, నవీన్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
42శాతం రిజర్వేషన్ కల్పించాలి
తాండూరు టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వేంకటేశ్వర రావుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడిగ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 55 శాతానికి పైగా జనాభా ఉన్న బీసీలకు ఎన్నికల్లో కేవలం 18శాతం రిజర్వేషన్ కల్పించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ వివరాలను బయట పెట్టలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, నరేశ్, ప్రజాపతి, నరసింహ నాయక్, చందు తదితరులు వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ -
ప్రసవాలు చేయకుంటే మీరెందుకు
మోమిన్‌పేట: అన్ని వసతులు ఉన్నా ప్రసవాలు ఎందుకు చేయడం లేదని, అలాంటప్పుడు మీరు ఇక్కడ ఎందుకని మోమిన్‌పేట పీహెచ్సీ వైద్యులపై డీఎంహెచ్ఓ వెంకటరవణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి గర్భిణులు వస్తున్నా కాన్పులు ఎందుకు చేయడం లేదని వైద్యాధికారి సుజలను ప్రశ్నించారు. ఇక్కడ అన్ని వసతులు ఉన్నా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ నెలలో ఆయా గ్రామాలకు చెందిన 50మంది కాన్పులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నా ఒక్కరు కూడా ఆస్పత్రిలో పురుడు పోసుకోలేదని అన్నారు. గత నెలలో 44మంది మహిళలు కాన్పులు చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్నా కేవలం ఇద్దరు మాత్రమే ఇక్కడ కాన్పులు చేసుకున్నారని తెలిపారు. అన్ని హై రిస్క్ కేసులే వస్తున్నాయా అని ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి వాటిని ఉపేక్షించమని హెచ్చరించారు. గర్భిణులు ఆస్పత్రిలోనే ప్రసవాలు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఐఓ బుచ్చిబాబు, వైద్యులు సుజల, రషీద్ తదితరులు ఉన్నారు. మోమిన్‌పేట పీహెచ్సీ వైద్యులపై డీఎంహెచ్ఓ ఆగ్రహం -
No Headline
వికారాబాద్: కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల్ మండలం, లగచర్లలో అధికారులపై దాడి జరిగింది మొదలు జిల్లాలో పాలన అస్తవ్యస్తంగా తయారయ్యింది. ఇటు పోలీసులు.. అటు అధికారులు దాడి ఘటనపైనే దృష్టి సారించారు. ఇది జరిగి పది రోజులు దాటినా పాలన గాడిన పడలేదు. విచారణ.. అరెస్టుల పేరుతో పోలీసు యంత్రాంగం పరిగి, కొడంగల్, వికారాబాద్‌కే పరిమితమయ్యారు. ఉన్నతాధికారులు కూడా ఫార్మాసిటీ గ్రామాల్లోనే పర్యటిస్తున్నారు. దీంతో జిల్లాలో పాలన గాడి తప్పుతోంది. కుటుంబ సర్వేపై ప్రభావం ఈ నెల 9న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ ప్రారంభం కాగా.. మొదటి రెండు రోజులు అధికారులు హడావుడి చేశారు. ఎక్కడికక్కడ సర్వే ప్రక్రియను పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. 11వ తేదీ లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి జరగడంతో పరిస్థితి అదుపు తప్పిందనే చెప్పాలి. అధికారులు నిరసన బాట పట్టారు. మూడు రోజుల పాటు ప్రజలకు అందుబాటులో లేరు. పాలనపై దృష్టి పెట్టలేదు. పార్టీలు, నేతలు కలెక్టరేట్ బాట పట్టారు. నిత్యం పరామర్శలు, ఖండనలు చేస్తూనే ఉన్నాయి. మరో పక్క పోలీసు ఉన్నతాధికారులు విచారణ పేరుతో కలెక్టరేట్‌ను సందర్శించడం పరిపాటిగా మారింది. కుటుంబ సర్వేను అధికారులు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు లగచర్ల ఘటపై బిజీగా మారడంతో కలెక్టరేట్లో ఎవరూ అందుబాటులో ఉండటం లేదు. సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రజలు అధికారుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. తూతూమంత్రంగా కొనుగోళ్లు జిల్లాలో 5.80లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలు సాగు చేశారు. ఇందులో సింహభాగం పత్తి, వరి పంటలే. పత్తి 2.5 లక్షల ఎకరాల్లో వేయగా, వరి 1.3లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం ఈ రెండు పంటలు చేతికొచ్చాయి. ధాన్యం సేకరణకు ప్రభుత్వం 129 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. పత్తి కొనుగోలు కోసం 14 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే లగచర్ల ఘటన, కుటుంబ సర్వే ప్రక్రియలో కొంత మంది అధికారులు బీజీగా ఉండటంతో కొనుగోలు కేంద్రాల నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తేమ, తాలు శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గన్నీ బ్యాగులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు లగచర్ల ఘటన నుంచి బయట పడి పాలనపై దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. విచారణ.. అరెస్టులతో పోలీసులు బిజీ అధికారులదీ అదే పరిస్థితి కలెక్టరేట్లో ప్రజల పడిగాపులు పత్తి, ధాన్యం కొనుగోళ్లను పట్టించుకోని వైనం -
కేటీఆర్ ప్రోద్బలంతోనే దాడి
పరిగి: మాజీ మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతోనే లగచర్లలో అధికారులపై కొంతమంది దాడి చేశారని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం పరిగి పట్టణంలో అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్‌తో కలిసి లగచర్ల గ్రామ రైతులను పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొడంగల్ ప్రాంత రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్, అధికారులు లగచర్ల గ్రామానికి వచ్చారని, కొంత మంది కుట్రదారులు అధికారులపై హత్యాయ త్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. బోగమోని సురేశ్ రైతు కాదని, మణికొండలో విలాసవంతమైన భవనాల్లో ఉంటున్న వ్యక్తి అని అన్నారు. కేటీఆర్, నరేందర్‌రెడ్డి ప్రోద్బలంతోనే సురేశ్ ఈ దాడికి తెర తీశారని మండిపడ్డారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రజాహితం కోరే అధికారి అని, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామానికి వచ్చారని తెలిపారు. ఫార్మా రైతులతో మాట్లాడి ఎకరాకు రూ.18 లక్షలు, ఇంటి స్థలం, కుటుంబలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే దానిపై మాట్లాడటానికి వచ్చారని పేర్కొన్నారు. కానీ కుట్ర పూరితంగా దాడికి దిగారని అన్నారు. రైతులు ఒప్పుకొంటేనే ప్రభుత్వం భూములు తీసుకుంటుందన్నారు. అధికారులపై దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అన్నారు. నిందితులకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామన్నారు. సమస్యలు ఉన్న వారు తనను క్యాంపు కార్యాలయంలో కలవొచ్చని తెలిపారు. ప్రజా సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్నికల హామీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్‌రావు, డీసీసీ ఉపాధ్యక్షులు లాల్‌కృష్ణ, కడ్మూర్ ఆనందం, పార్టీ ప్రధాన కార్యదర్శి హన్మంతు, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, మండల అధ్యక్షుడు పరశురాంరెడ్డి పాల్గొన్నారు. ఎకరాకు రూ.35 లక్షల లబ్ధి.. దుద్యాల్: మండలంలోని లగచెర్ల, హకీంపేట్, పోలేపల్లి, రోటిబండతండా, పులిచెర్లకుంటతండాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేది విషపూరితమైన ఫార్మా కంపెనీ కాదని, గ్రీన్ ఫార్మా అని ఎంపీ మల్లు రవి తెలిపారు. లగచర్లలో ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ఫార్మా అంటే పరిశోధనాత్మక కంపెనీలు అని స్పష్టంచేశారు. మండలంలో సుమారు రూ.15 వేల కోట్లతో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం పరిహారం పెంచిందని, ఎకరాకు రూ.17 లక్షల నుంచి రూ.20 లక్షలతో పాటు ఎకరా భూమికి డీటీసీపీ లేఅవుట్లో 150 గజాల చొప్పున (ఎన్ని ఎకరాలు పోతే అంత విస్తీర్ణంలో) ప్లాట్లతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, బాధిత కుటుంబంలోని యువతకు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు. ఇలా ఎకరాకు మొత్తం రూ.32 లక్షల లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇదిలా ఉండగా లగచర్ల ఘటనలో పోలీసులు 30 మందిని అరెస్ట్ చేశారని, వీరిలో చాలా మందికి ఈ ఘటనతో సంబంధం లేదని లగచర్ల మాజీ సర్పంచ్ అనంతయ్య ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా.. వారి వివరాలు అందించాలని, నిర్దోషులను విడుదల చేయించేందుకు తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి లగచర్ల రైతులను పరామర్శించిన నేతలు -
శాస్త్రవేత్తల కృషి అభినందనీయం
తాండూరు: తాండూరు కందిపప్పు భౌగోళిక గుర్తింపు పొందడానికి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల కృషి అభినందనీయమని ఐసీఎస్ఆర్ కమిటీ సభ్యులు డాక్టర్ సౌమ్య వినయన్ పేర్కొన్నారు. బుధవారం తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్‌లో భాగమైన హైదరాబాద్‌కు చెందిన ప్రతినిధుల బృందం తాండూరును సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయస్థానం ప్రధాన శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ సుధారాణి, శాస్త్రవేత్తలతో భౌగోళిక గుర్తింపు పొందిన తాండూరు కంది ఉత్పత్తులపై వారితో కలిసి పొలాన్ని పరిశీలించారు. తాండూరు కందికి భౌగోళిక గుర్తింపు లభించిన తర్వాత మార్కెట్లో డిమాండ్ పెరిగిందని వారు కమిటీ సభ్యులకు వివరించారు. ఈ గుర్తింపు రావడానికి విశేష కృషి చేసిన శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ నుంచి వివరాలను సేకరించారు. తాండూరు కంది పంట పోషక విలువలపై వివరించారు. భౌగోళిక గుర్తింపు తీసుకొచ్చే సందర్భంగా ఎదుర్కొన్న సవాళ్లను, అనుభవాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ ఓ వన్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ప్రభిర్ మిశ్రా, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు. ఐసీఎస్ఆర్ కమిటీ సభ్యులు డాక్టర్ సౌమ్య వినయన్ -
ఇద్దరు పిల్లలతో గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: ఇద్దరు పిల్లలతో కలిసి గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ పల్లి గ్రామానికి చెందిన సుకమెట్టి శివకుమార్, నందిని(24) దంపతులకు ఏడెళ్ల క్రితం వివాహం జరగగా ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. ఏడు నెలల క్రితం వీరు బతుకుదెరువు నిమిత్తం జల్పల్లి శ్రీరాం కాలనీకి వలస వచ్చారు. ఇదిలా ఉండగా నందిని ఇతరులతో తరచూ ఫోన్ మాట్లాడే విషయమై భార్యాభర్తల నడుమ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 18న శివకుమార్ డ్యూటీకి వెళ్లి రాత్రి 7 గంటలకు వచ్చి చూడగా, పెద్ద కుమార్తె అమ్మ ఇంట్లో లేదని ఏడుస్తూ కనిపించింది. కుమారుడు శ్రీజన్(4), కుమార్తె నయనిక(2)లతో పాటు ఆమెకు సంబంధించిన వస్తువులు, గ్యాస్ సిలిండర్‌ను తీసుకొని ఇంటి నుంచి వెళ్లినట్లు గుర్తించాడు. శివ అనే ఆటోడ్రైవర్‌తో కలిసి వెళ్లి ఉంటుందన్న అనుమానంతో బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వీరి ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్లో గాని సమాచారం అందించాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. -
హామీలు నెరవేర్చాలి
దోమ: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని జిల్లా ఎన్పీఆర్డీ అధ్యక్షుడు దశరథ్ డిమాండ్ చేశారు. బుధవారం దోమ మండల పరిధిలో బాస్పల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి రవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలన్నారు. రూ.6 వేల పెన్షన్ నేటికి అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. నేటికి 11 నెలలు గడుస్తున్నా దివ్యాంగుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందన్నారు. రాష్ట్రంలో పెన్షన్ పెంపు కోసం 44,49,787 మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారన్నారు. కొత్తగా మరో 24,84,000 మంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికి, వారికి ఇంకా మంజూరు చేయలేదని మండిపడ్డారు. ప్రతి దివ్యాంగుడికి ఉచిత బస్‌పాస్, వివిధ ప్రభుత్వ శాఖల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ప్రతి నెల 5వ తేదీ లోపు పెన్షన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా అమలు చేస్తున్న మహిళా శక్తి క్యాంటీన్లలో తమకు 5శాతం కేటాయించేలని కోరారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నేతలు రాజు, వెంకటయ్య, గోపాల్, మొగులయ్య, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు. ఎన్పీఆర్డీ అధ్యక్షుడు దశరథ్ -
సమగ్ర సర్వేకు సహకరించండి
పరిగి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలు అధికారులకు నిర్భయంగా సమాచారాన్ని అందించాలని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి సూచించారు. బుధవారం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో సర్వేలో పాల్గొని కుటుంబ వివరాలను అధికారులకు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రజల స్థితిగతులు తెలుస్తాయన్నారు. గతంలో ఎన్నో సర్వేలు నిర్వహించగా ఇంత పకడ్బందీగా లేవని అన్నారు. ఈ సర్వేలో పూర్తి సమాచారం ఉందని కావున ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా తమ వివరాలను ఎన్యుమరేటర్లకు తెలపాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం ఎల్లప్పుడు కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సర్వే అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి -
కేంద్రం విధానాలపై రాజీలేని పోరు
యాచారం: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్య అన్నారు. కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 26న ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి బుధవారం మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి రైతులకు, కార్మికులకు, పేదలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. పేదలకు అన్యాయం చేస్తూ పారిశ్రామికవేత్తలకు వత్తాసు పలుకుతోందన్నారు. ధర్నాకు ప్రజలు పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేశ్, మల్లయ్య, చెన్నయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య -
నా చావుకు ఎవరూ కారణం కాదు
ఇబ్రహీంపట్నం రూరల్: ‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని సూసైడ్ లేఖ రాసిన ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని ఔటర్ సర్వీస్ రోడ్డు పక్కన చెట్టుకు ఉరి వేసుకొని కుళ్లిన స్థితిలో ఓ మృతదేహాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ రాఘవేందర్‌రెడ్డి, ఎస్ఐ బాలరాజు వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏడెనిమిది రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. చుట్టు పక్కల వెతికినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి ప్యాంట్ జేబుల్లో వెతకగా బీడీలు, అగ్గిపెట్టెతో పాటు ఒక కవర్లో లేఖను గుర్తించారు. తన చావుకు తీవ్రమైన కడుపునొప్పి కారణమని అందులో రాసి ఉంది. పక్కనే కుమార్తె ఉమ సెల్‌ఫోన్ నంబరు కూడా ఉండటంతో పోలీసులు సమాచారం ఇచ్చారు. వివరాలు ఆరా తీయగా.. మృతుడు నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం గోరెంకలపల్లి గ్రామానికి చెందిన పోల్‌రెడ్డి సుదర్శన్‌రెడ్డి(56)గా గుర్తించారు. నల్లమల్ల అపార్ట్మెంట్ ప్రముఖ్ టౌన్షిప్లో తన బిడ్డ వద్ద ఉండేవాడని తెలుసుకున్నారు. బోర్‌వెల్‌పై పని చేస్తూ పది రోజులకోసారి ఇంటికి వచ్చేవాడని తెలిపారు. వారం క్రితమే ఇంటి నుంచి వెళ్లినట్లు చెప్పారు. భార్య సునీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించినట్లు వివరించారు. కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా.. సూసైడ్ నోట్ రాసి ఉరేసుకున్న వ్యక్తి ఔటర్ సర్వీస్ రోడ్డు పక్కన కుళ్లినస్థితిలో మృతదేహం గుర్తింపు నల్లగొండ జిల్లా వాసిగా నిర్ధారణ -
మట్టి తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత
నవాబుపేట: మండల పరిధిలోని ఆర్కతల గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్న వ్యక్తులను మంగళవారం రాత్రి నవాబుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు టిప్పర్లు, ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. అందులో రెండు టిప్పర్లు మట్టితో ఉండగా, మిగతావి ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు వికారాబాద్ మైన్స్ అధికారులకు అప్పగించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు. తాండూరు రూరల్ సీఐ బదిలీ తాండూరు: తాండూరు రూరల్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి విధుల్లో చేరిన నెలరోజులకే బదిలీ అయ్యారు. రూరల్ నుంచి పరిగి ఠాణాకు బదిలీ చేస్తూ బుధవారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 3న ఉన్నతాధికారులు తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని రూరల్ సీఐ అశోక్, పట్టణ సీఐ సంతోష్, యాలాల ఎస్సై శంకర్, పెద్దేముల్ ఎస్సై గిరిలను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రూరల్ సీఐ అశోక్ స్థానంలో సీఐగా శ్రీనివాస్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో గత నెల 19న రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. నెల రోజుల వ్యవధిలోనే బదిలీ చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గుండెపోటుతో మున్సిపల్ మాజీ చైర్మన్ మృతి తాండూరు: తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ నాగారం నర్సింహులు బుధవారం గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న పలు రాజకీయ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ సభ్యుడిగా 1981లో, తర్వాత రెండు దఫాలుగా కౌన్సిలర్‌గా పనిచేశారు. 1995 ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలుపొందిన అనంతరం చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. -
ముగిసిన మైసిగండి జాతర
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో కొలువైన మైసమ్మ తల్లి ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. ఆరు రోజుల పాటు భక్త జన సందోహంతో కొనసాగిన ఉత్సవాలను ఆలయ నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. చివరి రోజు అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో అలంకరించడంతో పాటు, ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ, హోమం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ స్నేహలత, ఫౌండర్ ట్రస్టీ శిరోలి, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, నాయకులు భాస్కర్‌నాయక్, అరుణ్‌కుమార్, జవహర్, కృష్ణ, తహసీల్దార్ జ్యోతి ఆలయ అర్చక సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న అఖండ భజన
వికారాబాద్ అర్బన్: అనంతగిరి కొండలపై కొలువైన అనంతపద్మనాభ స్వామి కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా అనంతగిరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సేవా మండలి అఖండ భజనను తొమ్మిదోరోజు కూడా కొనసాగించారు. ఈ భజనలో 150 భజన బృందాలు పాల్గొన్నాయని సమన్వయ కర్తలు బాలరాజు, శిరీష, నాగభూషణం, నరేందర్‌రెడ్డి, దామోదర్, విజయలక్ష్మి, మాధవి పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన భజనలో దుద్యాల, మల్లెపల్లి, మొత్కూరు, సల్బత్తాపూర్, పీలారం, తాండూర్ భవానీ మండలి, కందనేల్లి, నారెగూడ, జీవన్గి బృందాలు పాల్గొన్నాయి. శుక్రవారం రాకంచర్ల పంచమ పీఠాధిపతి వెంకటాచార్యులు మానస పూజ నిర్వహించిన అనంతరం అఖండ భజన ముగింపు సమావేశం ఉంటుందని అనంతగిరి పరిరక్షణ సమితి సభ్యులు తెలిపారు. పోలీసుల అరెస్టు అప్రజాస్వామికం సేవలాల్ సేనా జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్ పరిగి: లగచర్లలో జరిగిన పరిణామాలను తెలుసుకోవడానికి వెళ్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సేవలాల్ సేనా జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ పేర్కొన్నారు. బుధవారం లగచర్ల వెళ్తున్న క్రమంలో గడిసింగపూర్లో పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లగచర్ల ఘటన నేపథ్యంలో నిజనిర్ధారణ కమిటీతో తెలుసుకునేందుకు వెళ్తుంటే అరెస్టులు చేయడం ఎంత వరకు సమంజసమని అన్నారు. రైతుల పక్షాన సేవలాల్ సేనా ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా తాము రైతుల వెంటే నిలుస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సేవలాల్ సేనా నేతలు తదితరులు పాల్గొన్నారు. నృత్య ప్రదర్శనలో చిన్నారుల సత్తా అనంతగిరి: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన నమో యామిని, నమో కృష్ణమూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ చాంపియన్‌షిప్‌లో వికారాబాద్‌కు చెందిన శ్రీ సరస్వతి నృత్య అకాడమికి చెందిన చిన్నారులు సత్తా చాటారు. ఇందులో భాగంగా వ్యక్తిగత విభాగంలో అకాడమికి చెందిన శశాంక్ దశావతార నృత్య ప్రదర్శనతో ఉత్తమ ప్రతిభ చాటి జూనియర్ రౌండ్లో మొదటి స్థానంలో నిలిచారు. అదేవిధంగా రెండో స్థానంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలో సంవేద్య నిలిచారు. సబ్ జూనియర్ రౌండ్లో మహస్విత రెండో స్థానంలో నిలిచింది. దీంతో పాటు గ్రూప్ డ్యాన్స్ విభాగంలో తెలంగాణ ఫోక్ సాంగ్‌తో చక్కటి ప్రదర్శన అందించి మొదటిస్థానంలో నిలిచారు. ఈ పోటీల్లో 16 రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. అనంతరం ప్రముఖులు, నిర్వాహకుల చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. -
సరుకుల ప‘రేషాన్’
దౌల్తాబాద్: పేద, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు అందించాలనే ఉద్దేశంతో ప్రజాపంపిణీ వ్యవస్థ ఏర్పాటైంది. అందులో భాగంగా బియ్యం, గోధుమలు, చక్కెర, కిరోసిన్, కారంపొడి, పసుపు, చింతపండుతో కలిపి అమ్మ హస్తం పేరుతో గతంలో తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను రేషన్ దుకాణాల ద్వారా అందించేవారు. అలాంటి వాటిని పౌర సరఫరాల శాఖ ఒక్కొక్కటిగా తగ్గిస్తూ బియ్యానికే పరిమితం చేసింది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువులను కొనలేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొమ్మిది రకాలు ఉమ్మడి రాష్ట్రంలో 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ హస్తం పేరుతో తొమ్మిది రకాల వస్తువులను తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు పంపిణీ చేసింది. కానీ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం సరుకులను తగ్గించింది. పౌర సరఫరాల శాఖ ద్వారా ఆహార భద్రత కార్డుదారుల కుటుంబంలో ఒక్కొక్కరికీ ఆరు కిలోలు, అంత్యోదయ కార్డు ఉన్న వారికి 35 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు నేటికీ గ్రామాల్లో పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా రేషన్ షాపుల ద్వారా అందించే సరుకులపైనే ఆధారపడి ఉన్నారు. మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. వీరిపై భారం పడకుండా ఉండాలంటే నిత్యావసర సరుకులను ప్రజాపంపిణీ ద్వారా అందిస్తూ ఆ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఇప్పటికై నా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యంతో పాటు తొమ్మిది రకాల వస్తువులను అమ్మహస్తం పేరుతో అందించాలని ప్రజలు భావిస్తున్నారు. అమ్మ హస్తం కోసం ఎదురుచూపులు గతంలో బియ్యంతో పాటు 9 రకాల దినుసుల పంపిణీ ఒక్కొక్కటిగా తగ్గిస్తూ బియ్యానికే పరిమితం -
భోజనం నాణ్యత లేకుంటే చర్యలు
యాలాల: మధ్యాహ్న భోజనం నాణ్యతగా లేకుంటే చర్యలు తప్పవని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని గంగాసాగర్, బాగాయిపల్లి గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. ఆహారం నాణ్యతగా ఉండేలా స్థానిక ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. అంతకుముందు బాగాయిపల్లిలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయనతో పాటు తహసీల్దార్ అంజయ్య, ఆర్ఐ సాయిచరణ్ తదితరులు ఉన్నారు. భూకై లాస్లో సబ్‌కలెక్టర్ పూజలు తాండూరు రూరల్: మండల పరిధిలోని అంతారం తండాలోని భూకై లాస్‌ను తాండూరు సబ్ కలెక్టర్ దర్శించుకున్నారు. బుధవారం రాత్రి ఆలయంలోని శివలింగానికి సబ్‌కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చరిత్రకు సంబంధించిన విషయాలను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ -
చలి పంజా..
పరిగి: చలి మంట వేసుకున్న యువకులు● రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత ● 12 డిగ్రీలకు పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు ● జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్యనిపుణులు బషీరాబాద్/పరిగి: చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రత్తలు 12 డిగ్రీలకు పడిపోయాయి. చల్ల గాలులకు జలుబు, శ్వాసకోస సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. వారం రోజుల నుంచి ఉదయం కూడా చలి గాలులు వీస్తున్నాయి. ఖాళీ ప్రదేశాలు, పొలాల వద్ద మంచు కురుస్తోంది. ఉదయం ఎనిమిది గంటలైనా చలి వీడటం లేదు. దీంతో బయటకు రావడానికి ప్రజలు జంకురతున్నారు. బషీరాబాద్ మండలంలో చలితీవ్రత పెరిగింది. తెల్లవారుజామున మంచుకురుస్తోంది. దీంతో ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మంగళవారం మర్పల్లి మండలంలో 11.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. దుద్యాల్ మండలంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33.9 డిగ్రీలుగా రికార్డయ్యింది. పరిగి మండలంలో పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 28 డిగ్రీల వరకు ఉండగా రాత్రి 12 డిగ్రీలకు పడిపోతున్నాయి. రాత్రి ఆరు గంటలు దాటిందంటే చలి పెడుతోంది. ప్రజలు చలిమంటలు వేసుకుంటున్నారు. పాటించాల్సిన జాగ్రత్తలు చలికాలంలో సాధారణంగా దగ్గు, జలుబు వస్తుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, గొంగునొప్పి, శ్వాసకోస సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. చలి తీవ్రత పెరుగుతున్నందున పిల్లలు, వృద్ధులు ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లకపోడమే మంచిదంటున్నారు. బషీరాబాద్: చలి కాచుకుంటున్న జనం -
ఇది ప్రభుత్వమా.. పోలీసు రాజ్యమా
బొంరాస్‌పేట: రాజ్యాంగబద్ధంగా కల్పించిన మహిళా హక్కులను కాలరాస్తే ఊరుకోమని ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్ (పీఓడబ్ల్యూ) జాతీయ కన్వీనర్ వి.సంధ్య అన్నారు. జాతీయ స్థాయికి పాకిన లగచర్ల ఘటనలో స్థానిక మహిళలు జాతీయ మహిళా సంఘాలకు చేసిన వినతికి స్పందించి తాము గ్రామానికి వెళ్తుండగా.. పోలీసులు ప్రభుత్వానికి వత్తాసుగా ఉంటూ తమను అడ్డగించడం సరికాదని మండిపడ్డారు. ‘‘మేం రాజకీయాలకు వ్యతిరేకం.. పోలీసులు నిర్వర్తిస్తున్న విధులు హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయి. నిర్బంధాలు, వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వానికి మంచిది కాదు. ఇది ప్రజా ప్రభుత్వమా? పోలీసు నియంత రాజ్యమా? ముఖ్యమంత్రి వైఖరి ఇదేనా?’’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం లగచర్లకు వెళ్తున్న జాతీయ, రాష్ట్ర మహిళా సంఘాల నేతలను మండల పరిధిలోని తుంకిమెట్ల వద్ద అడ్డుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో మహిళా పోలీసులు, మహిళా నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అనుసూయ, పీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు ఝాన్సీ, దామగుండం జేఏసీ నాయకురాలు గీత, ఓయూ జర్నలిజం ప్రొఫెసర్ పద్మజషా, వలస కార్మికుల సంఘం సిస్టర్ లీజీ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూములు లాక్కోవడం బాధాకరం పలువురు మహిళా నేతలు మాట్లాడుతూ.. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాలతోనే కుప్పకూలిందన్నారు. కాంగ్రెస్ కూడా అదే పంథాను అవలంబిస్తోందని తెలిపారు. ఆరుగ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి.. పేద ప్రజల వద్ద భూములను లాక్కోవడం, ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయడం బాధాకరమని తెలిపారు. బాధితులకు తాము అండగా ఉంటామని స్పష్టంచేశారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, ఐస్ఐ ఎండీ అబ్దుల్ రవూఫ్ వారిని సముదాయించి రెండు గంటల తర్వాత తిరిగి పంపించారు. అంతకుముందు వీరి అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీరాంనాయక్, సీఐటీయూ జిల్లా నాయకుడు మహిపాల్ ధర్నాకు దిగారు. వీరి వెంట వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, రైతుసంఘం రాష్ట్ర నాయకుడు శోభన్‌నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, కె.శ్రీనివాస్ తదితరులున్నారు. ఇదిలా ఉండగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు గురువారం లగచర్లకు రానున్నట్లు తెలిపారు. హక్కులను కాలరాస్తే ఊరుకోం నిర్బంధాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వానికి మంచిది కాదు పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య లగచర్ల వెళ్తుండగా మహిళా నేతల అరెస్ట్ -
మరుగుదొడ్లపై అవగాహన
కుల్కచర్ల: స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కుల్కచర్లలో కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని ముజాహిద్పూర్ గ్రామంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో విద్యార్థులు స్వచ్ఛ భారత్ పేరును ప్రస్ఫుటించే విధంగా నిలబడి అందరిని ఆకట్టుకున్నారు. కల్లు దుకాణాలపై ఎకై ్సజ్ దాడులు చేవెళ్ల: మండల పరిధిలోని పలు గ్రామాల్లోని కల్లు దుకాణాల్లో మంగళవారం చేవెళ్ల ఎకై ్సజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. మండల పరిధిలోని ఖానాపూర్, దామరగిద్ద, అంతారం, గొల్లపల్లి, ఇబ్రహీంపల్లి, కౌకుంట్ల తదితర గ్రామాల్లో చేవెళ్ల ఎకై ్సజ్ సీఐ శ్రీలత ఆదేశాలతో ఎస్ఐ ఖాజామొయినుద్దీన్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో ఆయా కల్లుదుకాణాల్లో శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌లకు పంపించినట్లు సీఐ శ్రీలత తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాలను కల్లు తయారీలో ఉపయోగించటంపై నిఘా ఉంచామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలు కలిపినట్లయితే ఆ కల్లు దుకాణాల యజమానులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. -
రైతులు ముందుకు రావాలి
అనంతగిరి: ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉద్యాన శాఖ, ఇకోపామ్ ఆయిల్ అండ్ ఫట్స్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ పంట సాగుపై జిల్లాస్థాయి రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా ఉద్యాన అధికారి సత్తార్ మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ పంట ఆవశ్యకత, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు గురించి వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి, శాస్త్రవేత్తలు, అధికారులు విజయన్, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. మరుగుదొడ్లు వినియోగించాలి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను వాడాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. మంగళవారం ప్రపంచ టాయిలెట్ డేను పురస్కరించుకుని కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పారిఽశుద్ధ్య కార్మికులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరుగుదొడ్లు లేని వారు నిర్మించుకోవాలన్నారు. పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో డిసెంబర్ చివరి నాటికి టాయిలెట్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్, డీఎంహెచ్ఓ వెంకటరవణ, డీడబ్ల్యూ కృష్ణవేణి, డీపీఓ జయసుధ, పీఆర్ ఈఈ ఉమేష్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ చల్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న కలెక్టర్ ప్రతీక్‌జైన్