
ఆగం చేసిన కోట్‌పల్లి వరద
రాంపూర్‌తండా, గట్టేపల్లి రైతులను ముంచిన కోట్‌పల్లి అలుగునీరు
● వాగులో కొట్టుకుపోయిన నాలుగు గేదెలు వాటి దూడెలు
● 30 విద్యుత్ స్తంభాలు, నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం
ధారూరు: రాంపూర్‌తండాలో సాగుచేసిన కంది, వరి పంటలను కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగునీరు తూడ్చిపెట్టిందని రైతులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. తండాకు చెందిన బుజ్జిబాయి, రుక్కిబాయి, మున్యానాయక్‌లు సాగుచేసిన వరి, కంది పంట పొలాలు నీటిలో కొట్టుకుపోయాయి. వాగు పక్క నుంచి వేసిన విద్యుత్ లైన్‌లో దాదాపు 30 స్తంభాలు నేలకొరిగాయి. మూడు ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. ఓ ట్రాన్స్‌ఫార్మర్ కొట్టుకుపోయింది.
వీధినపడ్డ రైతు తార్యానాయక్
వాగు పక్కనే ఉన్న పొలంలో కుటుంబంతో ఉంటున్న తార్యానాయక్ పాడి పరిశ్రమ కొనసాగిస్తున్నారు. పొలంలో నిర్మించుకున్న ఇంట్లో నిద్రించగా శనివారం తెల్లవారుజామున వాగు ఉధృతంగా ప్రవహించి పాకలో కట్టేసిన నాలుగు గేదెలను, వాటి దూడెలు నీటి ప్రవాహంలో కలిసిపోయాయి. ఎంత వెతికినా వాటి కళేబరాలు కూడా దొరకలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంట్లోకి వదర చేరి సామగ్రి కొట్టుకుపోయింది. నాలుగు ఎకరాల వరిపై ఇసుక మేట వేసింది. నిద్రలోంచి మేల్కన్న తార్యానాయక్ ప్రాణాలను అరచేతిలో పెట్టకుని తండ్రి, భార్యా, ముగ్గురు పిల్లల్ని ఇంట్లోంచి తీసుకెళ్లి ప్రాణాలు దక్కించుకున్నారు. గేదెలు, వాటి దూడలకు రూ. 5 లక్షల విలువ ఉంటుందని, వరి పొలం, ఇంటి సామాగ్రి కలిపి రూ.2 లక్షలు, మొత్తం రూ.7 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరాడు. వరుస వర్షాల కారణంగా కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగునీరు వాగు ప్రవహిస్తుండడంతో పంటలు పాడయ్యాయి. వాగుకు ఇరువైపులా 600 మీటర్ల వరకు కంది, పత్తి, వరి పంటలు నేలమట్టమయ్యాయి. మండలంలోని గట్టెపల్లి గ్రామంలోనే 30 ఎకరాలు పత్తి, పది ఎకరాల కంది, 25 ఎకరాల్లో వరి పాడైంది. కౌలు రైతు నర్సింహ 1.70లక్షలతో 15 ఎకరాల్లో కౌలు పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. రుద్రారం, అల్లాపూర్, నాగసమందర్ గ్రామాల్లో దాదాపు 42 ఎకరాల్లో కంది, వరి, పత్తి పంటలు నీటిలో కొట్టుకపోయాయని రైతులు వాపోయారు. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పాడైన పంట పంట పొలాలను పరిశీలించి పరిహారం అందిచాలని రైతులు కోరుతున్నారు.
కూలిన కేరెళ్లి సొసైటీ భవనం
నిరంతరంగా కురుస్తున్న వర్షాలకు మండల పరిధిలోని కేరెళ్లి సోసైటి భవనం శనివారం కూలింది. భవనం వెనుక బాగంలో కూలడం, దాని పక్కనే ఉన్న అంగన్‌వాడీ భవనంలో ఎవరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది. శనివారం సాయంత్రం ధారూరు పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, సీఈఓ కె.నర్సింలు సంఘటన స్థలాన్ని సందర్శించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కూలిన భవనాన్ని వెంటనే డిస్మెటల్ చేయించాలని గ్రామస్తులు కోరారు.
ధారూరు: అర్దరాత్రి ఇంట్లోకి వాగునీటి ప్రవాహం చేరడంతో ప్రాణాలతో బయటపడ్డ తార్యానాయక్ కుంటుంబం
ధారూరు: రాంపూర్‌తండాలో తార్యానాయక్ ఇంట్లోకి చేరిన వరద

ఆగం చేసిన కోట్‌పల్లి వరద