
జలదిగ్బంధం
తాండూరు రూరల్: మండల పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా వాగులు ఉగ్రరూపందాల్చడంతో వీర్‌శెట్టిపల్లి జలదిగ్భందంలో చిక్కుకుంది. గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర సరుకులు పాడయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచి చీకటికమ్ముకుంది. విషయం తెలుసుకున్న తాండూరు సబ్ కలెక్టర్ విశ్వప్రసాద్, తహసీల్దార్ తారాసింగ్, యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, ఆర్‌ఐ గోపి శనివారం గ్రామస్తులకు ధైర్యం చెప్పారు. సాయంత్రానికి ఉధృతి తగ్గి రాకపోకలు కొనసాగాయి.
లారీ డ్రైవర్లను కాపాడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం
మండల పరిధిలోని ఓగిపూర్ సమీపంలో సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లిన లారీ డ్రైవర్లు జట్టూరు వాగులో చిక్కుకున్నారు. కర్ణాటక రాష్ట్రం చంద్రపల్లి డ్యాం ఒక్కసారిగా నీటిని విడుదల చేయడంతో జట్టూరువాగు వద్ద లారీలు వరదలో చిక్కుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముజావీర్, జార్ఖండ్‌కు చెందిన బుద్దిరామ్ లారీల్లో ఇరుక్కుకుని కంపెనీ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారు కరన్‌కోట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మహబూబ్‌నగర్‌కు చెందిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం సాయంతో పడవలో వెళ్లి డ్రైవర్లను కాపాడారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ తారాసింగ్, రూరల్ సీఐ నగేష్, ఎస్‌ఐ రాథోడ్ వినోద్ పర్యవేక్షించారు.
సంగెంకలాన్ ఎస్సీకాలనీలోకి చేరిన వరద
సంగెంకలాన్ చుట్టూ వాగులు పొంగిపొర్లి ఎస్సీ కాలనీలోని ఇళ్లల్లోకి వరద చేరింది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బోంకూర్ గ్రామం చుట్టూ నీరు చేరి గ్రామస్తులు ఆందోళన చెందారు.
మునిగిన సబ్‌స్టేషన్..
మండలంలోని గౌతపూర్ విద్యుత్ సబ్‌స్టేషన్ నీట మునిగింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆయా గ్రామాలకు తాండూరు సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా కొనసాగించారు.
ఉగ్రరూపంద్చాలిన కాగ్నా
అర్ధరాత్రి ఇళ్లలోకి చేరిన వరద
ఓగిపూర్–జట్టూరు వాగులో చిక్కుకున్న లారీ డ్రైవర్లు

జలదిగ్బంధం