
ఆయకట్టు పంటలకు నష్టం
నీట మునిగిన పత్తి, వరి
● పాడైన రోడ్లు
మర్పల్లి: మండల పరిధిలో శుక్రవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షంతో పంటలు పాడయ్యాయి. పత్తి, పసుపు, మొక్కజొన్న, కూరగాయ పంటలు నీట మునిగాయి. రావులపల్లి, కల్‌ఖోడ ఆర్‌అండ్‌బీ రోడ్డు, మర్పల్లి నుంచి తండాకు వెళ్లేందకు వేసిన రోడ్లు తెగిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజల రాకపోకలు స్తంభించాయి. రావులపల్లి చెరువు కింద కుడి, ఎడమ కాల్వల ఆయకట్టులో 200 ఎకరాల వరకు పంటలు కోతకు గురయ్యాయి. దీంతో రైతులు కన్నీటి పర్వంతమయ్యారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ప్రభుత్వంకు విజ్ఞప్తి చేశారు. కల్‌ఖోడ గ్రామంలో ఓరైతు ఇల్లు వర్షానికి కూలింది. పలు ఇండ్లలో నీరు చేరి జాగరణ చేశారు. తెలుసుకున్న తహసీల్దార్ పురుషోత్తం, ఎస్‌ఐ రవూఫ్, అధికారులు కల్‌ఖోడ, రావులపల్లి గ్రామాలలో పంటలను పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. కోతకు గురైన రోడ్లను, పంటలను పరిశీలించి పరిహారం అందేవిదంగా ప్రభుత్వంకు నివేదికలు పంపుతామన్నారు.
ఎకరాకు రూ.25వేలు: మెతుకు ఆనంద్
విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పార్టీ నాయకులతో కలిసి పాడైన పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పాడైన పంటలకు తక్షణ సాయంగా రైతులకు ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి రైతులు ఉన్నారు.

ఆయకట్టు పంటలకు నష్టం