Andhra Pradesh: వేగం పెంచండి | CM YS Jaganmohan Reddy Mandate For Officials On YSR Health Clinics | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: వేగం పెంచండి

Published Thu, Nov 11 2021 2:08 AM | Last Updated on Thu, Nov 11 2021 8:01 AM

CM YS Jaganmohan Reddy Mandate For Officials On YSR Health Clinics - Sakshi

క్యాన్సర్‌ రోగులకు సమగ్రంగా వైద్యం అందించడంపై మరింత శ్రద్ధ పెట్టాలి. నాలుగైదు విడతల్లో చికిత్స (కీమోథెరపీ) అందించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ వ్యాధిని నయం చేయగలం. అయితే గత ప్రభుత్వంలో ఒకటి రెండు సార్లు చికిత్స అందించి వదిలేసే వారు. దీంతో కొన్నాళ్లకు మళ్లీ వ్యాధి తిరగబెట్టేది. పేదలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదనే ఉద్దేశంతోనే మనందరి ప్రభుత్వం క్యాన్సర్‌కు ఆరోగ్యశ్రీ కింద పూర్తి స్థాయిలో ఎన్ని విడతల్లో వైద్యం అవసరమైతే అన్ని విడతల్లోనూ ఉచితంగా  అందించేందుకు ఏర్పాట్లు చేసింది.  
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: గ్రామాలు, వార్డుల్లోని ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు చేపట్టిన వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,011 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటికే 8,585 చోట్ల పనులు మొదలయ్యాయని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. పీహెచ్‌సీల్లో నాడు–నేడు కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని, డిసెంబర్‌ నాటికి మరమ్మతు పనులు పూర్తవుతాయని చెప్పారు. అవసరమైన చోట 146 కొత్త భవనాల నిర్మాణం 2022 మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్పగా.. వీటి నిర్మాణాలు మరింత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

సీహెచ్‌సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయని, అత్యవసర పనులు ఇప్పటికే పూర్తి చేశామని అధికారులు తెలిపారు. మిగిలిన పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన 16 మెడికల్‌ కాలేజీల్లో పనుల ప్రగతిని అధికారులు వివరించారు. ఇప్పటికే నాలుగు చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల నిర్మాణాలకు సన్నాహాలను పూర్తి చేస్తున్నామని తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల, విశాఖ జిల్లా అనకాపల్లి మెడికల్‌ కాలేజీ స్థలాలపై కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయని చెప్పారు. ఈ కేసులను త్వరగా పరిష్కరించేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఇవికాకుండా 9 చోట్ల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. క్యాన్సర్‌ రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందించడాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. 

నిరంతర ప్రక్రియగా వైఎస్సార్‌ కంటి వెలుగు
వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం కింద ఇంతకు ముందు ఎవరైనా పరీక్షలు చేయించుకోని వారికి కంటి పరీక్షలు చేయించాలని సీఎం ఆదేశించారు. కంటి సమస్యలు గుర్తించిన వారికి కళ్లజోడు ఇవ్వాలని, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయించాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని త్వరగా  పూర్తి చేయాలని, దీనికోసం ఒక వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని ఆదేశించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌కు, 104కు అనుసంధానంచేసి.. నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఇప్పటి వరకు కంటి వెలుగు కార్యక్రమం అమలు ప్రగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే 66,17,613 మంది పిల్లలకు పరీక్షలు చేశామని, వారిలో 1,58,227 మందికి కంటి అద్దాలు ఇచ్చామని తెలిపారు. 60 ఏళ్ల పైబడ్డ 13,58,173 మందికి పరీక్షలు చేశామన్నారు. ఇందులో 7,60,041 మందికి కంటి అద్దాలు ఇవ్వాల్సి ఉండగా 4,69,481 మందికి ఇచ్చామని, మరో 1,00,223 మందికి శస్త్ర చికిత్సలు చేయించామని వివరించారు. మరో 26,437 మందికి కాటరాక్ట్‌ సర్జరీలు చేయించాలన్నారు. కోవిడ్‌ పరిస్థితుల కారణంగా కంటి వెలుగు కార్యక్రమానికి అవాంతరాలు ఏర్పడ్డాయని తెలిపారు.

త్వరిత గతిన హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటు 
వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అందుబాటులో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్‌ హబ్స్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. మొత్తం 16 చోట్ల ఏర్పాటయ్యే హెల్త్‌ హబ్స్‌కు సంబంధించి, ఇప్పటికే 13 చోట్ల స్థలాలు గుర్తించామని, మిగిలిన చోట్ల కూడా త్వరగా ఆ పని పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గణనీయంగా పెరిగిన వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సేవలు
► 2019 జూన్‌కు ముందు ఆరోగ్య శ్రీ కింద ఉన్న 1059 వైద్య ప్రక్రియలు 2019 జూన్‌ తర్వాత 2,446కు పెంపు.
► 2019 జూన్‌కు ముందు ఆరోగ్యశ్రీ కింద ఉన్న 919 కవరేజీ ఆస్పత్రులు.. ఆ తర్వాత 1,717కు పెంపు. 
► కొత్తగా 3,18,746 మందికి ఆరోగ్యశ్రీ కింద లబ్ధి
► 2019 జూన్‌కు ముందు ఆరోగ్య శ్రీద్వారా సగటున రోజుకు 1,570 మందికి లబ్ధి కలిగితే.. ప్రస్తుతం 3,300 మందికి లబ్ధి.
► బధిర, మూగ వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు.
► ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజునే ఆరోగ్య ఆసరా కింద డబ్బు చెల్లింపు. ఇప్పటి వరకు 7,82,652 మందికి ఆరోగ్య ఆసరా కింద రూ.439.4 కోట్లు చెల్లింపు. 
► శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఇల్లు గడవడం కోసం రోజుకు రూ.225 చొప్పున లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు ఆరోగ్య ఆసరా పథకం కింద ప్రభుత్వం ఇస్తున్న విషయం తెలిసిందే.  

కోవిడ్, వ్యాక్సినేషన్‌ పరిస్థితి ఇలా..
► మొత్తం పాజిటివ్‌ కేసులు 3,366
► పాజిటివిటీ రేటు 0.7 శాతం
► పాజిటివిటీ రేటు 0 నుంచి 2 లోపు ఉన్న జిల్లాలు 12
► పాజిటివిటీ రేటు 2 కంటే ఎక్కువగా ఉన్న జిల్లా 1 
► అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ 23,457
► అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ డీ–టైప్‌ సిలిండర్లు 27,311
► డిసెంబర్‌ 15 నాటికి ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు మొత్తం 140
► సింగిల్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారు 1,17,71,458
► రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారు 2,17,88,482
► మొత్తం వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారు 3,35,59,940
► మొత్తం వ్యాక్సినేషన్‌ కోసం ఉపయోగించిన డోసులు 5,53,48,422

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement