పైలట్ ప్రాజెక్టుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రారంభం
వారానికి 3 రోజులు వైద్యం
సాక్షి, యాదాద్రి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిపుణులైన డాక్టర్లతో వైద్య సేవలు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పీహెచ్‌సీలలో ప్రాథమిక వైద్యంతో పాటు స్పెషలిస్ట్ వైద్య సేవలను రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీ వరకు పీహెచ్‌సీలలో వారానికి మూడు రోజులు క్యాంపులు నిర్వహి స్తారు. వైద్య, ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్‌లు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్య క్రమంలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 29 మంది నిపుణులైన వైద్యులు పీహెచ్‌సీలకు వెళ్లి 12 రకాల వైద్య సేవలు అందిస్తారు.
ఇందుకోసం భువనగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక షెడ్యూల్‌ను రూపొందించింది. భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లలో పనిచేస్తున్న స్పెషలిస్ట్ వైద్యులు ఆయా పీహెచ్‌సీలకు వెళతారు. వీలైతే అక్కడే వైద్యం చేసి మందులను ఇస్తారు. అవసరాన్ని బట్టి మెరుగైన వైద్యం కోసం భువనగిరి మెడికల్ కళాశాల, జిల్లా కేంద్ర ఆస్పత్రి, జనరల్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరాల్లో పీడియాట్రిక్, గైనకాలజీ, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, ఈఎన్‌టీ, సైక్రియాట్రిక్, దంత వైద్యం, ఫిజియోథెరపీ, చర్మవ్యాధులు, సాధారణ శస్త్ర చికిత్సలకు పరీక్షలు నిర్వహిస్తామని భువనగిరి జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment