బకాయిలు చెల్లించకపోతే నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సేవలు బంద్
ఆరోగ్యశ్రీ సీఈవోకు నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాల లేఖ
ఏడాదిగా రూ.1000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని వెల్లడి
బకాయిలు రూ.500 కోట్లే.. ఏడాదిలోనే రూ. 920 కోట్లు చెల్లించాం
వైద్య ఆరోగ్యశాఖ అధికారుల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పేరుకుపోయిన ఆరోగ్య శ్రీ బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఈ నెల 10వ తేదీ నుంచి వైద్య సేవలను నిలిపివేస్తామని ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. బకాయిలు భారీగా ఉండటంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని తెలి పాయి. ఈ మేరకు మంగళవారం తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (తెన్హా) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ నేతృత్వంలోని ప్రతినిధులు ఆరోగ్య శ్రీ సీఈవోకు మెయిల్ ద్వారా లేఖ పంపారు. 12 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని కోరారు.
రాష్ట్రంలో 368 నెట్‌వర్క్ హాస్పిటల్స్
రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కింద రాష్ట్రంలో 368 నెట్‌వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్యం అందించే ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ పథకాలను కూడా చేర్చారు. ఈ పథకాల కింద చేసే చికిత్సలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ ద్వారా చెల్లిస్తుంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.672 కోట్లు ఉన్నాయి.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు అధిక ప్రచారంతో నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కేసులు పెరిగాయి. రేవంత్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల కింద ఇప్పటివరకు రూ.920 కోట్లు చెల్లించింది. ఇందులో పాత బకాయి రూ.672 కోట్లు పోను సుమారు రూ. 250 కోట్లు మాత్రమే కొత్తగా ఈ ఏడాది కాలంలో చెల్లించిందన్న మాట. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి.
368 ఆసుపత్రులకు కలిపి సుమారు రూ.1000 కోట్లకు పైగా రీయింబర్స్‌మెంట్ రావలసి ఉందని యాజమాన్యాలు అంటున్నాయి. ఒక్కో ఆసుపత్రికి రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు చెబుతున్నాయి. కొన్ని ఆసుపత్రులకు గత సంవత్సరం జనవరి బిల్లులు కూడా ఇప్పటి వరకు రాలేదు. ఈ నేపథ్యంలో 10వ తేదీలోపు బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో ఆ తేదీ నుంచే ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు తెన్హా అధ్యక్షుడు వద్దిరాజు రాకేశ్ స్పష్టం చేశారు.
బకాయిలు రూ.500 కోట్లే: అధికారులు
ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1000 కోట్లు ఉన్నాయన్న వాదనను ఆరోగ్యశాఖ అధికారులు తోసిపుచ్చారు. రూ.500 కోట్ల వరకు ఉంటాయని తెలిపారు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు ఏడాది కాలంలో రూ.920 కోట్లు చెల్లించామని, డిసెంబర్ చివరి వారంలో కూడా రూ.40 కోట్ల బిల్లులను విడుదల చేశామని చెప్పారు.
2014– 2023 మధ్య ఆరోగ్యశ్రీ బకాయిలు నెలకు సగటున రూ.52 కోట్ల చొప్పున గత సర్కారు చెల్లిస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ మధ్య ప్రతి నెలా నెట్‌వర్క్ ఆసుపత్రులకు సగటున రూ.72 కోట్లు చొప్పున చెల్లించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment