గూడూరు టోల్‌ప్లాజా వద్ద బారులుదీరిన వాహనాలు
ఆదివారం కూడా భారీగా తరలిన జనం
పండుగకు ఇప్పటికే 30 లక్షల మందికి పైగా సొంతూళ్లకు..!
సాక్షి, హైదరాబాద్/ నెట్‌వర్క్ : సంక్రాంతి పండుగ వేళ...ప్రయాణాలు సాగుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా మహానగరం పల్లెబాట పట్టింది. వారం రోజులుగా సుమారు 30 లక్షల మందికి పైగా నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లినట్టు అంచనా. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి. సొంత వాహనాల్లోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. సుమారు 8 లక్షల మందికి పైగా రైళ్లలో తరలివెళ్లినట్టు అధికారులు అంచనా వేశారు.
ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఏపీ వైపు వెళ్లే బస్సులను కూకట్‌పల్లి, మియాపూర్, అమీర్‌పేట, లక్డీకాఫల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్ మీదుగా నడిపారు. వరంగల్ వైపు వెళ్లే బస్సులను ఉప్పల్‌కే పరిమితం చేశారు.కొన్నింటిని సాగర్‌రోడ్డు, బీఎన్‌రెడ్డినగర్, హయత్‌నగర్ వరకు పరిమితం చేశారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల్లో కలిపి 12 లక్షల మందికి పైగా వెళ్లారు.
హైవేలన్నీ వాహనాలతో నిండుగా..: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం కూడా రద్దీ కొన సాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ బస్టాండ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి రాత్రి 7 గంటల వరకు 65 వేల వాహనాలు వెళ్లాయి. నల్లగొండ జిల్లాలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు 30 వేల వాహనాలు వెళ్లాయి.
హెదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా నుంచి సాధారణ రోజుల్లో 30వేల వరకు వాహనాలు రాకపోకలు సాగించగా, ఆదివారం 70 వేలకు పైగా వాహనాలు వెళ్లాయి. ఫాస్టాగ్ స్కానింగ్ ఆలస్యం కావడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు మల్టిజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment