
అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి
మే 5 నుంచి ప్రతి జిల్లాలో ఒక పైలట్ మండలం
జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు ప్రతిగ్రామంలో సదస్సులు
భూభారతి అవగాహన సదస్సుల్లో మంత్రి పొంగులేటి
సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్/నాగిరెడ్డిపేట/లింగంపేట (ఎల్లారెడ్డి)/ నేలకొండపల్లి: భూభారతి చట్టం అమలులో అధికారులు తప్పు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. భూభారతి చట్టంపై వరంగల్ నగరం, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్పల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దే పల్లిలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లా డారు.
‘భూభారతి చట్టం అమలులో భాగంగా నాలుగు పైలట్ మండలాల్లో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు బుధవారంతో ముగుస్తాయి. మే 5 నుంచి ప్రతీ జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తాం. జూన్ 2వ తేదీ నుంచి ఆగస్టు 15 వరకు రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామా నికి అధికారులే వచ్చి సదస్సులు పెట్టి మీ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారు’అని ప్రకటించారు.
15 రోజుల్లో గ్రామ రెవెన్యూ అధికారులు : మరో 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,986 రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులను నియమిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 320 మంది సర్వేయర్లు ఉండగా, వారి సంఖ్యను వేయికి పెంచుతామని చెప్పారు. మరో 6 వేల మంది ప్రైవేట్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి, లైసెన్స్‌లను అందజేసి రైతులకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రతి నియోజకవర్గానికి 3 వేల నుంచి 4 వేల మంది యువతకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను వచ్చేనెల 5వ తేదీలోపు మంజూరు చేస్తామని ప్రకటించారు. సుర్దేపల్లి సభలో కల్యాణలక్ష్మి లబ్ధిదా రులకు చెక్కులు అందజేసి, గ్రామంలో రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
విలువైన భూములు కొట్టేసేందుకే ధరణి తెచ్చారు : బీఆర్‌ఎస్ నాయ కులు రాష్ట్రంలోని విలువైన భూములను కొట్టేసేందుకే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఎక్కడ చూసిన బీఆర్‌ఎస్ నాయకులు భూములు కబ్జా చేసి అక్రమంగా పట్టాలు చేసుకొని అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సమస్యలను ఒక్క రూపాయి ఖర్చులేకుండా పరిష్కరించేందుకే భూ భారతి చట్టం వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో ఎంపీ సురేశ్ షెట్కార్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, మదన్‌మోహన్‌రావు పాల్గొన్నారు.
నా మనుమరాలిని చదివించండి సార్
‘బడి ఫీజులు చెల్లించలేను సార్.. ఏదైన గురుకుల పాఠశాలలో నా మనుమరాలిని చదివించండి’అని ఓ వృద్ధురాలు పెట్టుకున్న వినతికి మంత్రి పొంగులేటి వెంటనే స్పందించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం రాంచంద్రాపురం గ్రామానికి చెందిన ఊర్మిల వరంగల్ రెవెన్యూ సదస్సులో మంత్రికి ఈ మేరకు వినతిపత్రం అందించింది. మంత్రి సంబంధిత అధికారులను పిలిచి వినతిపత్రం అందజేసి సీటు ఇప్పించే ప్రయత్నం చేయాలని ఆదేశించారు.