కార్మికుల వైద్యానికి ‘ఎమర్జెన్సీ’ దెబ్బ
- అత్యవసర వైద్యానికి అనుమతుల నిరాకరణ
- డెరైక్టర్ల అధికారాలకు కత్తెరేసిన ఈఎస్‌ఐ కార్పొరేషన్
- దుర్వినియోగం చేస్తున్నారంటూ సాకు
- అవసరమైతే వైద్యం చేయించుకున్నాక రీయింబర్స్ చేస్తామని స్పష్టీకరణ
- తెలుగు రాష్ట్రాల్లో 15 లక్షలమంది కార్మికుల్లో అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది కార్మికులు, వారి కుటుంబాలకు అందాల్సిన అత్యవసర వైద్యానికి బ్రేకులు పడ్డాయి. ఎమర్జెన్సీ వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లిన కార్మికులుగానీ, వారి కుటుంబాలుగానీ ఇకనుంచీ ముందు తమ చేతి డబ్బులు పెట్టుకోవాల్సిందే. సదరు వైద్యానికయ్యే ఖర్చును ఆ తర్వాతే ఎంప్లాయిస్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ) రీయింబర్స్ చేస్తుంది. ఎమర్జెన్సీ వైద్యానికి అనుమతిస్తుంటే ప్రతిఒక్కరూ అత్యవసర వైద్యమేనని చెప్పి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నారని, దీనివల్ల కేంద్ర కార్మికశాఖకు భారీగా వ్యయమవుతోందనే కారణంతో ఈఎస్‌ఐసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై తెలంగాణలోని 10 లక్షలమంది ఇన్స్యూర్డ్ పర్సన్స్(ఐపీ), ఆంధ్రప్రదేశ్‌లో 5 లక్షలమంది ఐపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బును తమకు ఖర్చు పెట్టడానికి ఇలాంటి ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంచాలకుల అధికారాలకు కత్తెర..
ప్రతి రాష్ట్రానికి ఈఎస్‌ఐకి సంచాలకుల కార్యాలయం(డెరైక్టరేట్) ఉంటుంది. ఆ మేరకు ఏపీ, తెలంగాణలకు రెండు డెరైక్టరేట్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు కార్మికులుగానీ, వారి కుటుంబసభ్యులుగానీ గుండెపోటు, న్యూరో సంబంధిత వ్యాధులు సోకినప్పుడు నేరుగా కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి.. ఈఎస్‌ఐ డెరైక్టర్ కార్యాలయానికి సమాచారమిస్తే 24 గంటల్లోనే అనుమతులిచ్చేవారు. పేషెంట్ నయాపైసా డబ్బు చెల్లించకుండా డెరైక్టరేట్ నుంచే చెల్లించేవారు. తాజాగా కేంద్ర పరిధిలో ఉండే ఈఎస్‌ఐ కార్పొరేషన్ ఈ విధానాన్ని తీసేసింది.
అత్యవసర వైద్యం పేరుతో ప్రతిఒక్కరూ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నారని, పథకం దుర్వినియోగం అవుతోందంటూ.. ఈఎస్‌ఐ డెరైక్టర్లకు నేరుగా అనుమతులిచ్చే విధానాన్ని తీసేసింది. అత్యవసర వైద్యమైతే రోగి డబ్బులు చెల్లించి చేయించుకోవాలని, ఆ తర్వాత వైద్యానికయ్యే ఖర్చును తిరిగి చెల్లిస్తామంది. ఈ నేపథ్యంలో అనుమతులు నిలిపేశారు. దీనిపై కార్మిక వర్గాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయి. లక్షలు చెల్లించి వైద్యం ఎలా చేయించుకోగలమని వాపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్మికులు, వారి కుటుంబసభ్యులు కలిపి 60 లక్షలమంది వరకు ఉన్నట్టు అంచనా.
ఇప్పుడు మాకు అధికారం లేదు
గతంలో కార్మికులుగానీ, వారి పిల్లలు గానీ, కుటుంబసభ్యులుగానీ అత్యవసర వైద్యమంటే తామే అనుమతులు ఇచ్చేవాళ్లమని, ఇప్పుడు కార్పొరేషన్ ఆ అధికారాలను తీసేసిందని తెలంగాణ ఈఎస్‌ఐ డెరైక్టర్ డా.దేవికారాణి, ఏపీ ఈఎస్‌ఐ డెరైక్టర్ డా.రమేష్‌కుమార్‌లు తెలిపారు. ఎమర్జెన్సీ వైద్యానికి రోగులే చెల్లించుకుంటే.. రీయింబర్స్ చేస్తామన్నారు. అప్పటికప్పుడు అనుమతులివ్వడం తమ చేతుల్లో లేదన్నారు.