ఒకవైపు విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు నడుస్తుండగా.. భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసం మాత్రమే కూటమి మనుగడ కొనసాగాలనుకుంటే.. వెంటనే దానిని రద్దు చేయాలని సూచించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్‌లు తలపడుతుండడమే అందుకు కారణం.
ఎన్సీ అధినేత, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరుగుతుందో నేను మాట్లాడదల్చుకోలేదు. ఎందుకంటే ఆ ఎన్నికలతో మాకు సంబంధం లేదు కాబట్టి. కానీ, మా ఇండియా కూటమికి ఓ కాలపరిమితి అంటూ లేకుండా పోయింది.
దురదృష్టవశాత్తూ.. ఇండియా కూటమి సమావేశాలు జరిగినా నాయకత్వం, ఎజెండా, దాని మనుగడ గురించి స్పష్టత లేకుండా పోయింది. కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసమే కూటమి అనుకుంటే గనుక దానిని రద్దు చేస్తేనే మంచిది అని అభిప్రాయపడ్డారాయన.
#WATCH | Jammu: J&K CM Omar Abdullah says, "... I cannot say anything about what's going on in Delhi because we have nothing to do with Delhi Elections... As far as I remember, there was no time limit to the INDIA alliance. Unfortunately, no INDIA alliance meeting is being… pic.twitter.com/u9w9FazeJG
— ANI (@ANI) January 9, 2025
ఇదిలా ఉంటే.. కిందటి ఏడాదిలో జరిగిన జమ్ము కశ్మీర్(Jammu Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, ఎన్సీ కలిసే పోటీ చేసి విజయం సాధించాయి. అయితే.. మొన్నీమధ్య ఈవీఎంల వ్యవహారంలో ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీతో విబేధించారు. ఈవీఎంలను నిందించడం ఆపేసి గెలుపోటములను అంగీకరించాలని సలహా కూడా ఇచ్చారు. అయితే సీఎం అయ్యాక ఆయన ధోరణి మారిందంటూ కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. ఈ మధ్యలో..
బీజేపీపైనా ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు గుప్పించడంతో ఆయన విపక్ష కూటమికి దూరం అవుతున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. ఆ వెంటనే ఆయన అమిత్ షాను కలవడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. అయితే.. జమ్మూకశ్మీర్‌కు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నానని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రహోదా పునరుద్దరణ కోసమే కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసినట్లు స్పష్టత ఇచ్చారు.
తేజస్వి కామెంట్లతో..
ఒమర్ అబ్దుల్లా ఇండియా కూటమి రద్దు వ్యాఖ్యలు ఊరికనే చేయలేదు. ఇండియా కూటమిలో గత కొంతకాలంగా నాయకత్వం విషయంలో బేధాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియా కూటమిని కాంగ్రెస్ ముందుండి నడిపించాలని భావిస్తుండగా.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎస్పీ, ఆర్జేడీ లాంటి కొన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో మొన్నటి పార్లమెంట్ సమావేశాల సమయంలోనూ కాంగ్రెస్ వెంట ‘బీజేపీ వ్యతిరేక నిరసనల్లో’’ ఈ రెండు పార్టీలు కలిసి రాలేదు. దీంతో ఇండియా కూటమి మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయనన్న చర్చ నడిచింది.
ఈ తరుణంలో.. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ ఫైట్ ఈ గ్యాప్‌ను మరింతగా పెంచాయి. ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, దానిని ఇండియా కూటమి నుంచి దూరం పెట్టాలని ఆప్ డిమాండ్ సైతం చేసింది. ఈ పోటీని ఉద్దేశించి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన కామెంట్లపైనే ఆయన అలా స్పందించాల్సి వచ్చింది. ఇంతకీ తేజస్వి ఏమన్నారంటే.. ‘‘2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ఇండియా కూటమి లక్ష్యం. కాబట్టి కూటమి ఆ లక్ష్యం వరకే కట్టుబడి ఉంటుంది. అలాంటప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఆప్‌లు తలబడడం అసాధారణమైనదేం కాదు’’ అని తేజస్వి యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇక ఈ పరిణామంపై బీజేపీ సైతం స్పందించింది. ‘‘దేశీయంగా, అంతర్జాతీయంగా కుంభకోణాలు చేసినవాళ్లు, కేసులు ఉన్నవాళ్లు.. నిజాయితీపరుడైన మోదీకి వ్యతిరేకంగా ఒక్కతాటి మీదకు వచ్చాయి’’ అని ఎద్దేవా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment