అర్ధరాత్రి తరువాత గేటుకు లాకౌట్ నోటీసులు అతికించిన యాజమాన్యం
వేతన సవరణ చేయాలంటూ ఈ నెల 2నుంచి సమ్మెబాట పట్టిన కార్మికులు
లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం
ఆందోళనలో కార్మికులు.. మిల్స్ వద్ద నిరసన
భారీగా మోహరించిన పోలీసులు
వైఎస్సార్‌సీపీ నేతల మద్దతు
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్స్ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల సమయంలో మిల్స్ యాజమాన్యం లాకౌట్ నోటీసుల్ని గేటుకు అతికించింది. కార్మికులు లోపలికి రాకుండా గేట్లకు తాళాలు వేశారు. వేతన సవరణ చేయాలని కోరుతూ ఈ నెల 2వ తేదీ నుంచి కార్మికులు సమ్మె చేపట్టారు. సమ్మెను కొనసాగించేందుకు సోమవారం ఉదయం మిల్స్‌కు వెళ్లిన కార్మికులు లాకౌట్ నోటీసులు చూసి అవాక్కయ్యారు. ఆగ్రహంతో మిల్స్ ఎదుట ఆందోళనకు దిగారు. కార్మికులతో పాటు 11 కార్మిక సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. యాజమాన్యం స్పందించకపోవడంతో మిల్స్ గేటు ఎదుట సుమారు 5 వేల మంది కార్మికులు బైఠాయించి పెద్దఎత్తున నినాదాలు చేశారు.
మిల్స్ యాజమాన్యంతో కార్మిక సంఘాల నేతలు పలు దఫాలుగా జరిపిన చర్చలు సఫలం కాలేదు. దీంతో సాయంత్రం వరకూ ఆందోళన కొనసాగింది. కార్మికులు రూ.10 వేల వేతనం పెంచాలని కోరగా.. మిల్స్ యాజమాన్యం రూ.3,250 మాత్రమే పెంచేందుకు అంగీకరించింది. ఆ ప్రతిపాదన నచ్చకపోవడంతో కార్మికులు సమ్మెబాట పట్టారు. రాజమహేంద్రవరంలో 70 ఏళ్ల క్రితం స్థాపించిన ఆంధ్రా పేపర్ మిల్స్ ఇప్పటివరకు నిరంతరాయంగా నడిచింది. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడింది. కరోనా విపత్తు సమయంలో నష్టాల్లో ఉన్నా.. తిరిగి లాభాల బాట పట్టింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది.
ఒక్కసారే వేతన సవరణ
ఆంధ్రా పేపర్ మిల్స్ చరిత్రలో 2018లో ఒక్కసారి మాత్రమే వేతన సవరణ జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వేతన సవరణపై ఆశలు రేకెత్తాయి. కూటమి నేతలు అండగా ఉంటారనే ఉద్దేశంతో కార్మికులు సమ్మెకు ఉపక్రమించారు. తీరా సమ్మె ప్రారంభించాక కూటమి నేతలు ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని సీఎం, కూటమి ఎమ్మెల్యేలు చెప్పారు. కానీ.. యాజమాన్యం మాత్రం సీఎం ఆదేశాలను సైతం లెక్కచేయకుండా లాకౌట్ ప్రకటించడంతో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లాకౌట్ ప్రకటన నేపథ్యంలో పేపర్ మిల్స్
ఎదుట శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు.
వైఎస్సార్‌సీపీ అండ
వేతన సవరణ కోసం కార్మికులు, కార్మిక సంఘాల నేతలు చేస్తున్న ఆందోళన, సమ్మెకు వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సీనియర్ నాయకులు శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం ఆందోళనకు మద్దతు ప్రకటించారు. పేపర్ మిల్స్ చరిత్రలో ఎన్నడూ సీఎస్‌ఆర్ నిధులు ఇచి్చన దాఖలాలు లేవని, మిల్స్ ద్వారా వెలువడే కాలుష్యంతో జీవిస్తున్న ప్రజల అభివృద్ధికి పాటుపడిన సందర్భాలు లేవని వారన్నారు. మిల్స్ యాజమాన్యం కార్మికుల మధ్య విభేదాలు సృష్టిస్తోందన్నారు. సంఘాల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. యాజమాన్యం మొండి వైఖరి వీడాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే రాజమహేంద్రవరం బంద్ సైతం నిర్వహిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment