Paper mills
-
ధరల చెల్లింపులో దబాయింపు!
సాక్షి, అమరావతి: సుబాబుల్, జామాయిల్, సరుగుడు కర్రకు ధరలేక రైతులు లబోదిబోమంటున్నారు. బడా పేపర్ మిల్లులను కట్టడి చేయడంలో రాష్ట్రంలోని గత ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడంతో వాళ్లు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. అందరి సమక్షంలో కుదుర్చుకున్న కనీస ఒప్పంద ధరను సైతం ఇవ్వలేమని ఐటీసీ సహా ఇతర పేపర్ మిల్లులు తెగేసి చెబుతున్నాయి. ఫలితంగా జామాయిల్ రైతులు ఎకరానికి సుమారు 25 వేలు, సుబాబుల్ రైతులు ఎకరానికి రూ.20 వేలు ఏటా నష్టపోతున్నారు. ధరల వ్యవహారంలో కంపెనీలు రైతుల్ని ఏమాత్రం ఖాతరుచేయకుండా అగౌరవపరుస్తున్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వమైనా తమ గోడు పట్టించుకోవాలని సుబాబుల్, జామాయిల్ రైతుల సంఘం కోరుతోంది. రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలలో సాగు.. రాష్ట్రంలో సుమారు 4 లక్షల ఎకరాలలో సుబాబుల్, జామాయిల్ (యూకలిప్టస్), సరుగుడు (చౌకలు) సాగవుతోంది. విశాఖ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాధారిత పంటగా వీటిని సాగుచేస్తున్నారు. మొత్తం సాగులో 40 శాతం వరకు ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఉంది. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం 80 వేల నుంచి లక్ష మంది వరకు ఈ తోటల్ని పెంచుతుంటారు. ఒకసారి ఈ మొక్కల్ని నాటితే పది పన్నెండేళ్ల పాటు ఉంచవచ్చు. వానలు ఉండి కాస్తంత సస్యరక్షణ చేస్తే మూడేళ్లలో తొలిసారి కర్ర కొట్టవచ్చు. మూడేళ్లకు కౌలు కలుపుకుని ఎకరానికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. అన్నీ సవ్యంగా ఉంటే 25 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుంది. మిల్లుల ఇష్టారాజ్యం.. ధరలు దారుణం 2014కి ముందు సుబాబుల్, జామాయిల్ ధరలు టన్నుకు రూ. 4,400 నుంచి రూ.4,600 మధ్య ఉండేది. ఆ తర్వాత ధరలు క్రమేణా తగ్గడం మొదలుపెట్టాయి. దీంతో రైతులు ఆందోళనకు దిగడంతో టీడీపీకి చెందిన ఆనాటి వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రైతులు, పేపర్ మిల్లుల ప్రతినిధులతో సమావేశమై కనీస ధరను రూ.4,600గా నిర్ణయించారు. అయితే, ఇందుకు మిల్లర్లు ప్రత్యేకించి ఐటీసీ వంటి కంపెనీలు ససేమిరా అనడమే కాకుండా రూ.4,000లకు మించి ఇవ్వలేమని భీష్మించాయి. ఈలోగా వ్యవసాయ మంత్రి మారిపోవడంతో రైతులు మళ్లీ మొరపెట్టుకున్నారు. జిల్లాకో రేటు పెట్టుకునేందుకు, తమ ఏజెంట్లతో కొనుగోలు చేయించేందుకు అనుమతివ్వాలని కంపెనీలు పట్టుబట్టి సాధించాయి. కంపెనీ ఏజెంట్లు, ఏఎంసీ అధికారులు కుమ్మక్కై ఏదో నామమాత్రంగా నిబంధనల ప్రకారం కొన్నట్టు చూపి మిగతా కర్రను తమ ఇష్టానుసారం కొంటున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, చీమకుర్తి ప్రాంతంలో రూ.4,400లకు కొనాల్సిన జామాయిల్ కర్రను టన్ను రూ.1,800, సుబాబుల్‌ను రూ.2 వేల నుంచి రూ.2,400 మధ్య కొంటున్నారు. అదే కృష్ణాజిల్లా నందిగామలో రూ.2 వేలకు మించి ఇవ్వడంలేదు. కర్ర కొట్టుడు, రవాణా ఖర్చులను తామే భరిస్తున్నందున ఇంతకుమించి ఇవ్వలేమని పేపర్ మిల్లులు తెగేసి చెబుతున్నాయి. రవాణా సౌకర్యం బాగుంటే ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే మారుమూల అయితే ధర తక్కువగా ఉంటోందని సుబాబుల్ రైతుల సంఘం నాయకుడు హనుమారెడ్డి చెప్పారు. ప్రతి రైతుకూ ఏటా రూ.25 వేలు నష్టం ధర లేకపోవడంతో రైతులు ఏటా ఎకరాకు రూ.20వేల నుంచి రూ.25 వేల వరకు నష్టపోతున్నారు. దీనిపై రైతులు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నాచేసినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం జామాయిల్ కర్ర టన్నుకు నిర్ణయించిన రూ.4,400ను, సుబాబుల్‌కు నిర్ణయించిన రూ.4,200ల ధరైనా ఇవ్వకపోతే తాము బతికేదెలా? అని ప్రశ్నిస్తున్నా రైతుల వేదన అరణ్యరోదనగానే మిగిలింది. ఆ ధరతో కొనుగోలు చేయలేమని ఐటీసీ, ఏపీ పేపర్ మిల్స్, జేకే పేపర్ మిల్స్ చెబుతున్నాయి. పేపర్ ధర పెరుగుతున్నప్పుడు ముడిసరకు ధర ఎందుకు పెరగదని రైతులు ప్రశ్నిస్తున్నారు. తీసి ఇవ్వాలంటే ఎలా? గత ప్రభుత్వ అనాలోచిత చర్యవల్ల రైతులే తమ తోటల్ని నరికి కర్రను స్టాక్ పాయింట్‌కు తరలించాల్సిన పరిస్థితి. ఇది చాలదన్నట్టు ఆ కర్రకుండే తాటను సైతం రైతులే తీయించి పేపర్ మిల్లులకు సరఫరా చేయాలని ప్రకాశం జిల్లాలో షరతు విధించారు. ఈ నిబంధనను తొలగించాలని రైతులు ఆందోళన చేస్తే దాన్ని తీసివేయడానికి బదులు రాష్ట్రవ్యాప్తంగా అదే విధానాన్ని అమలుచేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
స‘పోర్టు’ ఏది దొరా..?
సాక్షి. ఉలవపాడు(ప్రకాశం): రామాయపట్నం పోర్టు శంకుస్థాపన, ఆ తరువాత పరిణామాలు చూసిన వారికి బాబు నైజమేంటో అర్థమవుతుంది. కేంద్రం పోర్టు నిర్మిస్తామంటే.. లేదు, లేదు తామే కట్టుకుంటామని గొప్పలుపోయిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు.. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పైలాన్లు ఆవిష్కరించడం, ఆ తర్వాత పనులు ప్రారంభించకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి. ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా హడావుడిగా కార్యక్రమం ఏర్పాటు చేసి పైలాన్ ఆవిష్కరించారు. అంతే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఇస్తే మేజర్ పోర్టు నిర్మిస్తామని కేంద్రం చెబుతున్నా.. లెటర్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తామని చెప్పడంతోనే ఈ పోర్టు నిర్మాణంపై ప్రజలకు అనుమానం వచ్చింది. రెండు నెలల్లోపు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని జనవరి 9న నిర్వహించిన పైలాన్ ఆవిష్కరణ సభలో చంద్రబాబు చెప్పారు కానీ, ఇప్పటి వరకు అతీగతి లేదు. కేవలం ఎన్నికల ప్రచారం కోసం రామాయపట్నం పోర్టు పేరు వాడుకోవడానికి ఇక్కడ పైలాన్ ఆవిష్కరించారు తప్ప మరొకటి కాదని జిల్లా ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు ప్రాథమిక అనుమతులే లేవు రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలన్న ప్రక్రియ అంతా మోసమేనని తేలిపోయింది. ఓడరేవుకు అవసరమైన ప్రా«థమిక అనుమతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నుంచి అనుమతి పొందలేదు. ఓడరేవుకు అవసరమైన చోట అటవీ భూములు సేకరించాలి. దీనికి అటవీ శాఖ అనుమతి అవసరం. ఇక భూసేకరణకు సంబంధించి ప్రజల వద్ద నుంచి సేకరించాల్సిన భూమికి సంబంధించిన వివరాలు, సేకరణ అంశాలు అసలు ప్రారంభంకాలేదు. కేవలం ఎన్నికలు వస్తున్నాయనే కారణంతోనే భారీ ప్రాజెక్టు అయిన రామాయపట్నం పోర్టుకు హడావుడిగా శంకుస్థాపన చేశారు. ప్రజలను మోసం చేసే కార్యక్రమంగా మాత్రమే ఇది మిగిలింది. ముందుకు పడని అడుగు పోర్టు నిర్మాణానికి ఉలవపాడు, గుడ్లూరు మండలాల పరిధిలో 2,200 ఎకరాలు అవసరమని నిర్ణయించారు. ఉలవపాడు మండలంలోని రామాయపట్నం రెవెన్యూలో 1 నుంచి 262 సర్వే నంబర్లు వరకు, గుడ్లూరు మండలం రావూరు రెవెన్యూ పరిధిలోని 1 నుంచి 72 సర్వే నంబర్ల వరకు భూమిని తీసుకోవాలని భావించారు. అంటే రామాయపట్నం, సాలిపేట గ్రామాలతోపాటు అటవీ శాఖ భూములు ఇందులో ఉన్నాయి. వీటిని సేకిరిస్తేనే పోర్టు నిర్మాణం సాధ్యం. రెండు నెలలో పనులు మొదలు అవుతాయని చెప్పిన చంద్రబాబు కనీసం భూ సేకరణలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. భూ సేకరణ గురించి కానీ, పోర్టు నిర్మాణ పనుల గురించి ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు. పేపరు మిల్లుదీ అదే పరిస్థితి.. ‘పోర్టు, పేపరు మిల్లు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా అభివృద్ధికి డోకా లేదు’ అంటూ బాకా ఊదిన ప్రభుత్వ పెద్దలు అసలు విషయాన్ని మరిచారు. గుడ్లూరు మండలం చేవూరు, రావూరు రెవెన్యూ పరిధిలో పేపరు మిల్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇండోనేషియా ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకుని 2,400 ఎకరాలు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. భూమి పూజ చేసి పైలాన్ ఆవిష్కరించారు. కానీ ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రామాయపట్నం పోర్టు కోసం వైఎస్సార్ సీపీ పోరాటం కావలి నుంచి రామాయపట్నం వరకు పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు రామాయపట్నం పోర్టు కోసం గత ఐదేళ్లుగా వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి కావలి నుంచి రామాయపట్నం వరకు పాదయాత్ర చేశారు. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డితోపాటు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కందుకూరుకు వచ్చిన సమయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రామాయపట్నం పోర్టును నిర్మిస్తామని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రజలకు జగన్ భరోసా ఇచ్చారు. -
సు‘బాబూ’ల్ రైతు గోడు పట్టదా?
ధరల నిర్ణయానికి గడువు ముగిసినా.. మిన్నకుండిపోయిన సర్కారు మార్కెట్ ధరలకు అనుగుణంగా ధరలు నిర్ణయించాలని రైతుల డిమాండ్ ధరలు తగ్గించాలని పేపర్ మిల్లుల ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పంటలకు ప్రత్యామ్నాయంగా వేస్తున్న సుబాబుల్, సర్వీ, జమాయిల్ తోటల రైతులు నానా తిప్పలు పడుతున్నారు. పత్తి, పొగాకు, మిర్చి వంటి పంటల స్థానంలో తక్కువ పెట్టుబడితో పాటు వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకుని పెరిగే ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపమన్న ప్రభుత్వమే.. ఇప్పుడు సదరు రైతులను పట్టించుకోవడంలో నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. ప్రత్యామ్నాయ పంటల ఉత్పత్తులకు రెండేళ్లకోసారి నిర్ణయించే ధరలను ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా సవరించాలని కోరుతున్న రైతుల గోడు అరణ్యరోదనగానే మిగులుతోంది. మరోపక్క ఈ ఉత్పత్తులను నిర్ణీత ధరలకు కొనుగోలు చేయాల్సిన పేపర్ మిల్లుల యజమానులు.. ధరలను పెంచకుండా ప్రభుత్వంపైఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో విసిగి వేసారిన రైతులు.. తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 20న మార్కెట్ కమిటీ కార్యాలయాల వద్ద ధర్నాలకు సమాయత్తమవుతున్నారు. సాగు గొప్ప..: నీటి అవసరం అంతగా లేని ఈ తోటలను ప్రధానంగా ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో సాగు చేస్తున్నారు. రైతు సంఘాల లెక్కల ప్రకారం సుమారు 6 లక్షల హెక్టార్లలో సుబాబుల్, సర్వీ(సరుగుడు), జమాయిల్ సాగవుతున్నాయి. వీటి కర్రను పేపర్ తయారీకి ఉపయోగిస్తారు. ఎకరాకు 20 నుంచి 35 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో వాణిజ్య పంటలు వేసి రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటి సాగును ప్రోత్సహించాయి. అయితే, ఇప్పుడు మాత్రం ఆయా రైతులను పట్టించుకోవడం లేదు. ధర నిర్ణయానికి గడువు ముగిసినా..! ప్రస్తుతం సుబాబుల్ టన్ను రూ.4,400, జమాయిల్, సర్వీ రూ.4,600గా ఉంది. రెండేళ్లకోసారి నిర్ణయించే ధర గడువు గత ఫిబ్రవరి 20తో ముగిసింది. తిరిగి ధర నిర్ణయించాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో రైతులు ఇప్పటికైనా ధరలు నిర్ణయించాలని, మార్కెట్ ధరలకు అనుగుణంగా వాటిని సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. మిల్లర్లది విపరీత వాదన.. సుబాబుల్ సహా ఇతర తోటల దిగుబడి ప్రస్తుత ధరలను తగ్గించాలని మిల్లర్లు వితండ వాదం చేస్తుండడం గమనార్హం. ఇప్పటికే రెండేళ్ల కిందట నిర్ణయించిన ధరలు తమకు గిట్టుబాటు కావడంలేదని రైతులు నెత్తీనోరూ బాదుకుంటుంటే.. మిల్లర్లు మాత్రం ధరలను తగ్గించాలని కోరుతూ తమదైన శైలిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో ప్రైవేటు పేపర్ మిల్లుల యజమానులు ఈ విషయాన్నే స్పష్టం చేశారు. ఈ సమయంలో వారి వాదనకు ఫుల్స్టాప్ పెట్టి.. రైతుల గోడు పట్టించుకోవాల్సిన ధరల నిర్ణాయక కమిటీ(వ్యవసాయ మంత్రి, మార్కెటింగ్ శాఖ, జిల్లాల కలెక్టర్లు) మౌనపాత్ర పోషించింది. దీంతో మిల్లర్ల వాదనకు బలమేర్పడినట్టయింది. దళారులదే పైచేయి.. ప్రస్తుత నిబంధనల ప్రకారం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలే ప్రత్యామ్నాయ పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే, ఈ విషయంలో అడుగడుగునా దళారులదే పైచేయిగా సాగుతోందని రైతులు వాపోతున్నారు. దళారులే రైతుల్ని నేరుగా సంప్రదించి ఉత్పత్తులను కొంటున్నారు. దీంతో రైతులు నిర్ణీత ధరలకన్నా తక్కువకే తమ ఉత్పత్తులను తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ఈ సమయంలో రంగంలోకి దిగాల్సిన మార్కెటింగ్ శాఖ కూడా దళారులకు లోబడి.. మిన్నకుండిపోతోందని రైతులు పేర్కొంటున్నారు. వాణిజ్య పంటల స్థానంలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడంలోను, ప్రత్యామ్నాయ పంటలకు ధరలను నిర్ణయించడంలోనూ తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాయి. మరోపక్క, ప్రత్యామ్నాయ పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన మిల్లుల యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. దీంతో విసుగెత్తిన ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతన్నలు ప్రభుత్వంతో సమరానికి సిద్ధమవుతున్నారు. రూ. 22 కోట్ల బకాయి సిర్పూరు మిల్లుపై కేసు సిర్పూర్ పేపర్ మిల్లు, ఏపీ పేపర్ మిల్లు, ఐటీసీ, బిల్ట్, వెస్ట్ కోస్ట్, సుభోద్ ఎంటర్ప్రైజెస్, జేకే పేపర్ మిల్స్ వంటివి ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రత్యామ్నాయ పంట ఉత్పత్తులను కొంటున్నాయి. సరుకును మార్కెట్ కమిటీలు కొని మిల్లులకు సరఫరా చేయాలనేది నిబంధన. కానీ దళారులే నేరుగా కొనుగోళ్లు చేస్తుండడంతో కొన్ని మిల్లులు రైతులకు పెద్ద ఎత్తున బకాయి పడ్డాయి. సిర్పూర్ మిల్లు రూ.22 కోట్ల మేరకు రైతులకు బకాయి పడింది. దీంతో రైతుల ఫిర్యాదు మేరకు కృష్ణాజిల్లా కలెక్టర్ ఆ మిల్లుపై కేసు నమోదు చేయించారు మినహా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. వాయిదా తీర్మానం తిరస్కరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పామాయిల్, సుబాబుల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. శాసనసభ సోమవారం సమావేశం కాగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఎ. సురేష్ ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీనిపై చర్చకు అనుమతించాలని విపక్షం పట్టుబట్టింది. అయితే వేరే రూపంలో చర్చకు అవకాశమిస్తామని స్పీకర్ తెలిపారు. అప్పుడు సమగ్రంగా చర్చించాలని సూచించారు. 20న ధర్నా సుబాబుల్ సహా ప్రత్యామ్నాయ పంటల రైతులు ఈ నెల 20న మార్కెటింగ్ కమిటీల ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. వారి డిమాండ్లు.. ఠ సిర్పూరు మిల్లు బకాయి పడిన రూ.22 కోట్లను మార్కెట్ కమిటీల నిధుల నుంచి తక్షణమే చెల్లించాలి ఠ ఉత్పత్తి విక్రయ సమయంలో మున్ముందు కంపెనీల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలి ఠ రైతులందరికీ గుర్తింపు కార్డులివ్వాలి ఠ దళారీ వ్యవస్థను నిర్మూలించేలా మార్కెటింగ్ కమిటీలు చర్యలు చేపట్టాలి ఠ ఈ వ్యవహారంపై వ్యవసాయ శాఖమంత్రి ప్ర స్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేయాలి.