సు‘బాబూ’ల్ రైతు గోడు పట్టదా?
ధరల నిర్ణయానికి గడువు ముగిసినా.. మిన్నకుండిపోయిన సర్కారు
మార్కెట్ ధరలకు అనుగుణంగా ధరలు నిర్ణయించాలని రైతుల డిమాండ్
ధరలు తగ్గించాలని పేపర్ మిల్లుల ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పంటలకు ప్రత్యామ్నాయంగా వేస్తున్న సుబాబుల్, సర్వీ, జమాయిల్ తోటల రైతులు నానా తిప్పలు పడుతున్నారు. పత్తి, పొగాకు, మిర్చి వంటి పంటల స్థానంలో తక్కువ పెట్టుబడితో పాటు వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకుని పెరిగే ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపమన్న ప్రభుత్వమే.. ఇప్పుడు సదరు రైతులను పట్టించుకోవడంలో నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. ప్రత్యామ్నాయ పంటల ఉత్పత్తులకు రెండేళ్లకోసారి నిర్ణయించే ధరలను ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా సవరించాలని కోరుతున్న రైతుల గోడు అరణ్యరోదనగానే మిగులుతోంది. మరోపక్క ఈ ఉత్పత్తులను నిర్ణీత ధరలకు కొనుగోలు చేయాల్సిన పేపర్ మిల్లుల యజమానులు.. ధరలను పెంచకుండా ప్రభుత్వంపైఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో విసిగి వేసారిన రైతులు.. తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 20న మార్కెట్ కమిటీ కార్యాలయాల వద్ద ధర్నాలకు సమాయత్తమవుతున్నారు.
సాగు గొప్ప..: నీటి అవసరం అంతగా లేని ఈ తోటలను ప్రధానంగా ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో సాగు చేస్తున్నారు. రైతు సంఘాల లెక్కల ప్రకారం సుమారు 6 లక్షల హెక్టార్లలో సుబాబుల్, సర్వీ(సరుగుడు), జమాయిల్ సాగవుతున్నాయి. వీటి కర్రను పేపర్ తయారీకి ఉపయోగిస్తారు. ఎకరాకు 20 నుంచి 35 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో వాణిజ్య పంటలు వేసి రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటి సాగును ప్రోత్సహించాయి. అయితే, ఇప్పుడు మాత్రం ఆయా రైతులను పట్టించుకోవడం లేదు.
ధర నిర్ణయానికి గడువు ముగిసినా..!
ప్రస్తుతం సుబాబుల్ టన్ను రూ.4,400, జమాయిల్, సర్వీ రూ.4,600గా ఉంది. రెండేళ్లకోసారి నిర్ణయించే ధర గడువు గత ఫిబ్రవరి 20తో ముగిసింది. తిరిగి ధర నిర్ణయించాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో రైతులు ఇప్పటికైనా ధరలు నిర్ణయించాలని, మార్కెట్ ధరలకు అనుగుణంగా వాటిని సవరించాలని డిమాండ్ చేస్తున్నారు.
మిల్లర్లది విపరీత వాదన..
సుబాబుల్ సహా ఇతర తోటల దిగుబడి ప్రస్తుత ధరలను తగ్గించాలని మిల్లర్లు వితండ వాదం చేస్తుండడం గమనార్హం. ఇప్పటికే రెండేళ్ల కిందట నిర్ణయించిన ధరలు తమకు గిట్టుబాటు కావడంలేదని రైతులు నెత్తీనోరూ బాదుకుంటుంటే.. మిల్లర్లు మాత్రం ధరలను తగ్గించాలని కోరుతూ తమదైన శైలిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో ప్రైవేటు పేపర్ మిల్లుల యజమానులు ఈ విషయాన్నే స్పష్టం చేశారు. ఈ సమయంలో వారి వాదనకు ఫుల్‌స్టాప్ పెట్టి.. రైతుల గోడు పట్టించుకోవాల్సిన ధరల నిర్ణాయక కమిటీ(వ్యవసాయ మంత్రి, మార్కెటింగ్ శాఖ, జిల్లాల కలెక్టర్లు) మౌనపాత్ర పోషించింది. దీంతో మిల్లర్ల వాదనకు బలమేర్పడినట్టయింది.
దళారులదే పైచేయి..
ప్రస్తుత నిబంధనల ప్రకారం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలే ప్రత్యామ్నాయ పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే, ఈ విషయంలో అడుగడుగునా దళారులదే పైచేయిగా సాగుతోందని రైతులు వాపోతున్నారు. దళారులే రైతుల్ని నేరుగా సంప్రదించి ఉత్పత్తులను కొంటున్నారు. దీంతో రైతులు నిర్ణీత ధరలకన్నా తక్కువకే తమ ఉత్పత్తులను తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ఈ సమయంలో రంగంలోకి దిగాల్సిన మార్కెటింగ్ శాఖ కూడా దళారులకు లోబడి.. మిన్నకుండిపోతోందని రైతులు పేర్కొంటున్నారు.
వాణిజ్య పంటల స్థానంలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడంలోను, ప్రత్యామ్నాయ పంటలకు ధరలను నిర్ణయించడంలోనూ తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాయి. మరోపక్క, ప్రత్యామ్నాయ పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన మిల్లుల యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. దీంతో విసుగెత్తిన ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతన్నలు ప్రభుత్వంతో సమరానికి సిద్ధమవుతున్నారు.
రూ. 22 కోట్ల బకాయి సిర్పూరు మిల్లుపై కేసు
సిర్పూర్ పేపర్ మిల్లు, ఏపీ పేపర్ మిల్లు, ఐటీసీ, బిల్ట్, వెస్ట్ కోస్ట్, సుభోద్ ఎంటర్‌ప్రైజెస్, జేకే పేపర్ మిల్స్ వంటివి ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రత్యామ్నాయ పంట ఉత్పత్తులను కొంటున్నాయి. సరుకును మార్కెట్ కమిటీలు కొని మిల్లులకు సరఫరా చేయాలనేది నిబంధన. కానీ దళారులే నేరుగా కొనుగోళ్లు చేస్తుండడంతో కొన్ని మిల్లులు రైతులకు పెద్ద ఎత్తున బకాయి పడ్డాయి. సిర్పూర్ మిల్లు రూ.22 కోట్ల మేరకు రైతులకు బకాయి పడింది. దీంతో రైతుల ఫిర్యాదు మేరకు కృష్ణాజిల్లా కలెక్టర్ ఆ మిల్లుపై కేసు నమోదు చేయించారు మినహా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
వాయిదా తీర్మానం తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పామాయిల్, సుబాబుల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. శాసనసభ సోమవారం సమావేశం కాగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఎ. సురేష్ ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీనిపై చర్చకు అనుమతించాలని విపక్షం పట్టుబట్టింది. అయితే వేరే రూపంలో చర్చకు అవకాశమిస్తామని స్పీకర్ తెలిపారు. అప్పుడు సమగ్రంగా చర్చించాలని సూచించారు.
20న ధర్నా
సుబాబుల్ సహా ప్రత్యామ్నాయ పంటల రైతులు ఈ నెల 20న మార్కెటింగ్ కమిటీల ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. వారి డిమాండ్లు..
ఠ సిర్పూరు మిల్లు బకాయి పడిన రూ.22 కోట్లను మార్కెట్ కమిటీల నిధుల నుంచి తక్షణమే చెల్లించాలి
ఠ ఉత్పత్తి విక్రయ సమయంలో మున్ముందు కంపెనీల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలి
ఠ రైతులందరికీ గుర్తింపు కార్డులివ్వాలి
ఠ దళారీ వ్యవస్థను నిర్మూలించేలా మార్కెటింగ్ కమిటీలు చర్యలు చేపట్టాలి
ఠ ఈ వ్యవహారంపై వ్యవసాయ శాఖమంత్రి ప్ర స్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేయాలి.