
అస్తవ్యస్తంగా ముగిసిన 2024–25 వ్యవసాయ సీజన్
రైతుల గోడు పట్టని ప్రభుత్వం.. సాగు నీరివ్వడంలోనూ నిర్లక్ష్యమే
ఖరీఫ్, రబీలో 27 లక్షల ఎకరాలు సాగుకు దూరం
రెండు సీజన్లలో 1.51 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యం.. సాగైంది 1.24 కోట్ల ఎకరాల్లోనే
ఖరీఫ్‌లో వైపరీత్యాలతో 10 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
ఖరీఫ్ దెబ్బతో రబీలోనూ సాగుకు దూరంగా లక్షల ఎకరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే శాపంగా మారింది. ప్రకృతి వైపరీత్యాలు, కరువు దెబ్బతీస్తున్నా, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో 2024–25 ఖరీఫ్, రబీ సీజన్లలో వ్యవసాయమే అస్తవ్యస్తమైపోయింది. రైతులు తీవ్ర ఒడిదొడుకుల మధ్య పంటలు సాగు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరకు రైతులు తీవ్ర నష్టాలపాలయ్యారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఖరీఫ్ సాగు ఆలశ్యం కాగా, ఆ ప్రభావం రబీ పైనా పడింది.
రబీ సాగు కోసం ముందస్తు ఏర్పాట్లు చేయడంలో విఫలమైన ప్రభుత్వం రెండో పంటకు నీరివ్వడంలోనూ వైఫల్యం చెందింది. ప్రభుత్వ నిర్వాకం, పెట్టుబడి సాయం అందకపోవడం, అదనుకు విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు పడరాని పాట్లుపడ్డారు. ఈ తిప్పలన్నీ పడలేక చాలా మంది రైతులు వారి పొలాల్లో సాగే చేయకుండా వదిలేశారు. రెండు సీజన్లలో కలిపి 1.51 కోట్ల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యం కాగా, 1.24 కోట్ల ఎకరాల్లోనే సాగయ్యాయి. ఖరీఫ్‌లో 16 లక్షల ఎకరాలు.. రబీలో 11 లక్షల ఎకరాల్లో.. మొత్తంగా 27 లక్షల ఎకరాల్లో సాగే లేకుండా సీజన్ ముగిసింది.
ఖరీఫ్‌లో వరుస వైపరీత్యాల బారిన పడి 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 6 లక్షల ఎకరాలు కరువు బారిన పడ్డాయి. అయినా ప్రభుత్వం నుంచి రైతులకు కనీస మద్దతు కూడా దక్కలేదు. దీంతో రైతులు కుదేలైపోయారు. దాని ప్రభావం రబీ పైనా పడింది. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. లక్షలాది ఎకరాల్లో విత్తనం నాటడానికి కూడా రైతులు సాహసించలేకపోయారు. రబీ సాగు లక్ష్యం 57.65 లక్షల ఎకరాలు కాగా.. సాగైన విస్తీర్ణం 46.40 లక్షల ఎకరాలే. అంటే 11.25 లక్షల ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకు రాలేదు.
దాళ్వాలో వరి సాగు లక్ష్యం 20 లక్షల ఎకరాలు కాగా సాగైంది 16.52 లక్షల ఎకరాల్లోనే. అంటే 3.50 లక్షల ఎకరాలు ఖాళీగా ఉండిపోయాయి. సాధారణంగా రెండో పంటలో వరి కంటే ఎక్కువగా అపరాలు సాగవుతాయి. ఈసారి అపరాల సాగు లక్ష్యం 23.50 లక్షల ఎకరాలు కాగా, సాగైన విస్తీర్ణం 16.72 లక్షల ఎకరాలే. అంటే దాదాపు 6.78 లక్షల ఎకరాలు ఖాళీగా ఉండి పోయాయి. వీటిలో ప్రధానంగా శనగలు 11.17 లక్షల ఎకరాలకు గాను, 7.5 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. మినుము సాగు లక్ష్యం 8.50 లక్షల ఎకరాలు కాగా, 6.95 లక్షల ఎకరాల్లో పంట వేశారు. గతేడాది రికార్డు స్థాయిలో సాగైన మొక్కజొన్న కూడా ఈసారి తగ్గిపోయింది.
ఈ ఏడాది మొక్కజొన్న సాగు లక్ష్యం 5.27 లక్షల ఎకరాలకుగాను 4.55 లక్షల ఎకరాలే సాగైంది. ఇలా పంటలన్నీ లక్ష్యానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయాయి. ఇప్పటికీ రబీ పంటల సాగు చివరి దశకు చేరుకున్నా కొన్ని ప్రాంతాల్లో సాగు నీరందక పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సీజన్ ఆరంభంలోనే ఫెంగల్ తుపాన్ దెబ్బతీయగా, ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు రైతులను దెబ్బతీశాయి. దీనికి తోడు సాగు నీటి నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట పెను శాపంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment