కెడిట్ ప్లాన్ విడుదల చేస్తున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
సాక్షి, అమరావతి: రైతులకు మరింత ఆర్థిక చేయూతనిచ్చేందుకు బ్యాంకర్లు ఉదారంగా ముందుకు రావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సచివాలయంలో నాబార్డ్ క్రెడిట్ సెమినార్ జరిగింది. ఇందులో 2024–25కు నాబార్డ్ రూ.3.55 లక్షల కోట్ల అంచనాతో రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్‌ను కాకాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. గ్రామీణాభివృద్ధి రంగం బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అన్ని విధాలుగా చేయూతనిచ్చిన నాబార్డ్‌ను అభినందిస్తున్నానన్నారు.
వ్యవసాయం, నీటిపారుదల, సామాజిక, గ్రామీణ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డ్ మద్దతునివ్వడం అభినందనీయమని తెలిపారు. వ్యవసాయ రంగంలో సవాళ్ల పరిష్కారం, స్థిరమైన వృద్ధి సాధన కోసం ప్రభుత్వం, కార్పొరేట్ రంగం, ఆర్థిక సంస్థలతో కలిసి నాబార్డ్ రోడ్‌మ్యాప్ తయారుచేయాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాల్యూ చైన్, విలువ జోడింపు, కౌలు రైతులకు విరివిగా రుణ సదుపాయం కల్పించాలన్నారు.
నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ 2024–25కి రాష్ట్ర రుణ ప్రణాళికను రూ.3.55 లక్షల కోట్లుగా అంచనా వేశామన్నారు. ఇది 2023–24తో పోలిస్తే 24 శాతం అధికమన్నారు. ఈసారి 38 శాతం పంట రుణాలు, 25 శాతం ఎంఎస్‌ఎంఈ, 13 శాతం వ్యవసాయ టర్మ్, 4 శాతం వ్యవసాయ అనుబంధ అవసరాలకు, 2 శాతం వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు, 18 శాతం ఇతర రంగాలకు రుణాలు ఇచ్చేలా æప్రణాళిక తయారు చేశామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2.04 లక్షల కోట్లు, పంట రుణాలకు రూ.1.36 లక్షల కోట్లుగా అంచనా వేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సహకార, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అహ్మద్ బాబు, వ్యవసాయ, ఉద్యాన శాఖల కమిషనర్లు శేఖర్‌బాబు, శ్రీధర్, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్, ఆర్బీఐ జీఎం ఆర్కే మహానా, ఎస్‌ఎల్‌బీసీ కన్వ్నిర్ ఎం.రవీంద్రబాబు, నాబార్డ్ జీఎం డాక్టర్ కేవీఎస్ ప్రసాద్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ శారదా జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment