
కాకినాడ పోర్టు వాటాల వ్యవహారంలో హైకోర్టులో విక్రాంత్‌రెడ్డి పిటిషన్
ప్రభుత్వం కుమ్మక్కయినందునే సాయిరెడ్డి తదితరులు ముందస్తు బెయిల్ కోరలేదు
హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి
పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో నిందితులైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులతో ప్రభుత్వం కుమ్మక్కైందని, అందువల్లే ఈ కేసులో మరో నిందితుడైన యర్రం విక్రాంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విక్రాంత్‌రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది టి. నిరంజన్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు. వారితో ప్రభుత్వం కుమ్మక్కయినందునే వారు ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేయలేదని తెలిపారు. విక్రాంత్‌రెడ్డిపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టును కోరారు.
తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాలను అరబిందో సంస్థ కొన్నదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడు, పోర్టు ప్రమోటర్ కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన కేసులో యర్రం విక్రాంత్ రెడ్డికి హైకోర్టు గతంలో ముందస్తు బెయిలు మంజూరు చేసింది. కాగా, ఈ కేసును కొట్టేయాలని కోరుతూ విక్రాంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం తేలేంత వరకు ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ మంగళవారం విచారణ జరిపారు. విక్రాంత్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాస్తవానికి వాటాల బదిలీ విషయంలో ఫిర్యాదుదారు కేవీ రావు, అరబిందో గ్రూపునకు మధ్య రాజీ కుదిరిందని, దీనిపై పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయని తెలిపారు. ఈ వాటాల బదిలీతో విక్రాంత్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
అయినా దర్యాప్తు పేరుతో పిటిషనర్‌ను సీఐడీ అధికారులు వేధింపులకు గురి చేసే అవకాశం ఉందని చెప్పారు. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను బహిర్గతం చేస్తూ పత్రికల్లో కథనాలు కూడా రాయిస్తున్నారని వివరించారు. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు కాకినాడ పోర్టు యజమాని కేవీ రావుకు రూ.25 లక్షలు ఖర్చులు విధించాలని ఆయన కోర్టును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment