కాకినాడ డీప్‌వాటర్ పోర్టు విస్తరణ
రూ.1000 కోట్ల ప్రణాళిక
సాక్షి, కాకినాడ : కాకినాడ డీప్‌వాటర్ పోర్టును రూ.1000 కోట్లతో విస్తరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి పత్రాలను కాకినాడ సీపోర్ట్సు లిమిటెడ్ (కేఎస్పీఎల్) సీఈఓ ఎ. శేషగిరిరావు అందుకున్నారని శనివారం పోర్టు వర్గాలు తెలిపాయి. డీప్‌వాటర్ పోర్టు విస్తరణకు తొలి ప్రాధాన్యంగా బెర్త్‌లను పెంచుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆరు బెర్త్‌లు మాత్రమే ఉండగా ఈ ఏడాది ఏడో బెర్త్ నిర్మాణాన్ని పూర్తిచేసి వచ్చే ఏడాదికి మరో బెర్త్ నిర్మించాలనుకుంటున్నారు.
పోర్టుకు అనుసంధానంగా ఓడల రాకపోకలను మరింత వేగవంతంగా నిర్వహించేందుకు వీలుగా చానల్‌ను డ్రెడ్జింగ్ చేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చానల్ 15 మీటర్ల లోతులో ఉంది. వాస్తవానికి చానల్ లోతు 16 మీటర్లు ఉండాలి. ఒక మీటరు మేర పూడుకుపోవడంతో భారీ ఓడలు పోర్టుకు రావడానికి వీలుపడటం లేదు. ఈ కారణంగా 50 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కార్గో మాత్రమే రవాణా చేయగలుగుతున్నారు. మరో మీటర్ లోతు పెరిగేలా చానల్‌ను డ్రెడ్జింగ్ చేస్తే 80 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఓడలు కూడా పోర్టుకు సునాయాసంగా చేరుకుంటాయని అంచనా వేశారు.
తొలిసారి కంటైనర్ ట్రాఫిక్
విస్తరణలో భాగంగా తొలిసారి కాకినాడ డీప్‌వాటర్‌పోర్టు నుంచి కంటైనర్ ట్రాఫిక్‌ను ప్రవేశపెట్టాలని కేఎస్పీఎల్ నిర్ణయించింది. ఇంతవరకు విశాఖపట్నం పోర్టు నుంచి మాత్రమే కంటైనర్ ట్రాఫిక్ నడుస్తోంది. ప్రస్తుతం డీప్‌వాటర్ పోర్టు నుంచి ఎడిబుల్ ఆయిల్స్, ఐరన్ ఓర్, ఎరువులు రవాణా అవుతున్నాయి. కంటైనర్ ట్రాఫిక్ ప్రవేశపెట్టడం ద్వారా రొయ్యలు, చేపలు, పువ్వుల వంటివి విదేశాలకు ఎగుమతి చేయాలనేది ప్రణాళిక.
ఇందుకోసం వెయ్యి నుంచి 2 వేల వరకు రిఫ్రిజిరేటర్‌తో కూడిన కంటైనర్లను, ఓడల్లో ఎగుమతి, దిగుమతులకు క్రేన్లు కూడా ఏర్పాటు చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధంచేసింది. వచ్చే ఏడాదికల్లా విస్తరణ పనులు దాదాపు పూర్తి చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం కాకినాడ డీప్‌వాటర్ పోర్టు నుంచి 18 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేస్తున్నారు. విస్తరణ పూర్తి చేసి 25 మిలియన్ మెట్రిక్‌టన్నుల కార్గో రవాణా చేసే సామర్థ్యానికి చేరుకోవాలని పోర్టు ఏర్పాట్లు చేస్తోంది.