దర్యాప్తు విషయాలు బహిర్గతమయ్యాయా?
లేక ఈనాడు తన అజెండాకు అనుగుణంగా కథనాలను నడిపిస్తోందా?
రూ.3,000 కోట్ల నికర లాభాలు సాధిస్తున్న అరబిందో రూ.494 కోట్లు సమకూర్చుకోలేదా?
నిజంగానే బెదిరించి ఉంటే పోర్టులో 100% వాటా తీసుకుంటారుగానీ 41 శాతం వాటా మాత్రమే ఎందుకు తీసుకుంటుంది?
వ్యూహాత్మక పెట్టుబడిలో భాగంగానే కాకినాడ డీప్‌వాటర్ పోర్టులో వాటాల కొనుగోలు
ఆడిటర్లను ఆయా శాఖల అధికారులు ఎంపిక చేస్తారన్న విషయం ఎల్లో మీడియాకు తెలియదా?
ఏది నిజం ?
సాక్షి, అమరావతి: కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల విక్రయంపై ‘ఈనాడు’ తన ఆక్రోశాన్ని మరోసారి వెళ్లగక్కింది. 150 దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తూ ఏటా రూ.3,000 కోట్లకు పైగా లాభాలను ఆర్జిస్తున్న కంపెనీ రూ.494 కోట్లు సమకూర్చుకోవడం కూడా పెద్ద వింత అయినట్లు ఒక విషపూరిత కథనాన్ని వండివార్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేస్తున్న దర్యాప్తు అంతా ఈనాడుకు చెవిలో చెబుతున్నట్లుగా ‘‘రూ.494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?’’ అంటూ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది.
స్వయం ప్రతిపత్తి కలిగిన ఈడీ లాంటి సంస్థ దర్యాప్తు చేస్తున్న విషయాలే కాకుండా ఎవర్ని, ఎప్పుడు, ఎలా విచారిస్తారు...? వారిని ఏ ప్రశ్నలు అడుగుతారు? అనే వాటిని కథనంలో ప్రచురించడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ నిజంగానే విషయాలను ఇలా బయటకు చెబుతుంటే ఆ దర్యాప్తు ఎంత పక్షపాతంతో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు! లేదంటే ఈనాడు తన అజెండాకు అనుగుణంగా ఈడీ పేరుతో ఈ కథనాలను వండివార్చి ఉండాలి. ఈ రెండింటిలో ఏది నిజమైనా ఈనాడు ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి అజెండాకు డప్పు కొడుతుందో ఊహించవచ్చు!!
అది వ్యూహాత్మక పెట్టుబడి
అరో ఇన్‌ఫ్రా వ్యూహాత్మక పెట్టుబడిలో భాగంగా కాకినాడ డీప్ వాటర్‌పోర్టులో వాటాలు కొనుగోలు చేసింది. పోర్టులో 41 శాతం వాటాలను కేవీ రావు పూర్తి సమ్మతితోనే 2020లో విక్రయించడంతో పాటు ఆ వాటాల విలువ రూ.494 కోట్లను స్వీకరించారు. కాకినాడ డీప్‌వాటర్ పోర్టు దగ్గరలోనే కాకినాడ సెజ్‌ను రూ.1,700 కోట్లకు కొనుగోలు చేయడంతో పాటు ఆ సెజ్‌లో రూ.2,400 కోట్లతో మరో పోర్టును కూడా అరో ఇన్‌ఫ్రా నిర్మిస్తోంది. ఇదంతా వ్యూహాత్మక వ్యాపార ప్రణాళికలో భాగంగా జరిగింది.
సెజ్‌ను ఆనుకుని ఉన్న కాకినాడ డీప్ వాటర్ పోర్టులో కూడా తమకు వాటాలు ఉంటే వ్యూహాత్మకంగా ప్రయోజనకరమని అరబిందో సంస్థ భావించింది. భవిష్యత్‌లో కాకినాడ డీప్ వాటర్ పోర్టులోని తన మెజార్టీ వాటాలను ప్రమోటర్ కేవీ రావు విక్రయించాలని భావిస్తే ముందుగా అరబిందో సంస్థకే అవకాశం ఇవ్వాలి. ఆ నిబంధన ( రైట్ టు ఫస్ట్ రెఫ్యూజల్) ఒప్పందంలో ప్రధానాంశం. ఒకవేళ బెదిరించి ఉంటే మొత్తం పోర్టునే స్వాధీనం చేసుకుని ఉంటారు కదా! 41 శాతం వాటా కొనుగోలు తర్వాత కూడా పోర్టు యాజమాన్య హక్కులు కేవీరావు చేతిలోనే ఉన్నాయి కదా. ఆయన్ను నిజంగానే బెదిరించి ఉంటే అప్పుడే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, స్టాక్ ఎక్సŠచ్‌ంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ), నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(ఎన్‌ఏఎల్‌ఎస్‌ఏ) తదితర సంస్థలకు ఫిర్యాదు చేసేవారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయించేవారు. కానీ కేవీ రావు ఈ నాలుగున్నరేళ్లలో ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. కేవీ రావుకు అభ్యంతరం ఉంటే వాటాల బదిలీ పూర్తయ్యేలోగా వివిధ దశల్లో ఎప్పుడైనా సరే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. కానీ ఆయన ఏ దశలో కూడా ఫిర్యాదు చేయలేదు. అంటే ఆయన పూర్తి సమ్మతితోనే వాటాలను విక్రయించారన్నది స్పష్టమవుతోంది. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఫిర్యాదు చేశారంటే దీని వెనుక కుట్రను సులభంగా అర్థం చేసుకోవచ్చు.
ఆడిట్ సంస్థను ఎంపిక చేసేది ఆ శాఖ కార్యదర్శి
ప్రభుత్వాలు వివిధ విభాగాల్లో ఆడిటింగ్ నిర్వహించడం సాధారణం. ఏదైనా విభాగంలో ఆడిటింగ్ నిర్వహించాలంటే ఆ శాఖకు చెందిన కార్యదర్శి ఆడిటింగ్ సంస్థను ఎంపిక చేస్తారు. ఇక్కడ కూడా అదే విధంగా పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్‌ఎల్‌పీ అనే ఆడిటింగ్ సంస్థను ఎంపిక చేశారు. ఆ ఆడిటింగ్ సంస్థకు, విజయసాయిరెడ్డికి ఏమిటి సంబంధం? లేని సంబంధాలను అంటగట్టి మసిబూసి మారేడు కాయ చేయాలని, తద్వారా ఎల్లో గ్యాంగ్‌కు ప్రయోజనం కలిగించేందుకు ఈనాడు పడరానిపాట్లు పడుతోంది.
తప్పుడు ఫిర్యాదు... వెంటనే కేసు
అనంతరం అసలు పాత్రధారి తెరపైకి వచ్చారు. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడైన కాకినాడ డీప్ వాటర్‌పోర్ట్ ప్రమోటర్ కేవీ రావుతో ఈ నెల 2న సీఐడీకి ఫిర్యాదు ఇప్పించారు. 2020లో తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో 41శాతం వాటాను అరబిందో సంస్థకు చెందిన అరో రియాల్టీ సంస్థ కొనుగోలు చేసిందని ఆయన నాలుగేళ్ల తరువాత ఫిర్యాదు చేయడం చంద్రబాబు పక్కా కుట్రను స్పష్టం చేస్తోంది. విచిత్రం ఏమిటంటే... కేవీ రావు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు చేసిన ఈ నెల 2నే సీఐడీ కేసు నమోదు చేసేయడం గమనార్హం
ప్రైవేట్ ఒప్పందంతో ప్రభుత్వానికి ఏం సంబంధం?
అరబిందో సంస్థ 150 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ అంతర్జాతీయంగా విశేష గుర్తింపు పొందింది. ఏటా రూ.72 వేల కోట్ల టర్నోవర్, రూ.3 వేల కోట్ల నికర లాభం నమోదు చేస్తోంది. ఆ వ్యాపార లావాదేవీ పూర్తిగా అరబిందో సంస్థ, కేవీ రావు మధ్య జరిగిన ప్రైవేట్ ఒప్పందం. అందులో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికిగానీ, ఇతరులకుగానీ ఎలాంటి సంబంధం లేదు. కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల విక్రయం అన్నది పూర్తిగా రెండు ప్రైవేటు సంస్థల మధ్య వ్యవహారం. ఐదేళ్ల తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఆ వ్యవహారంలో తల దూర్చడం వెనుక పక్కా కుట్ర ఉందని స్పష్టమవుతోంది.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రైవేటు ఆస్తుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ దందా సాగిస్తుండటం విభ్రాంతికరం. రెండు సంస్థల మధ్య ప్రైవేటు వ్యవహారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం జోక్యం వెనుక మర్మం ఏమిటి? ప్రభుత్వం మారగానే అంతకుముందు జరిగిన ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఓ దుష్ట సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుంది. పరస్పర అంగీకారంతో ప్రైవేటు ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు సాగుతుంటాయి. ఐదేళ్ల తరువాత సహజంగానే ఆ ఆస్తుల మార్కెట్ విలువ పెరుగుతుంది. మార్కెట్ విలువ పెరిగింది కాబట్టి ఐదేళ్ల క్రితం తనను బెదిరించి ఆస్తిని అమ్మేలా చేశారని ఫిర్యాదు చేస్తామంటే ఎలా..? వాటిలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే పరిస్థితి ఎంతవరకు వెళుతుంది ?
ప్రభుత్వ పోర్టును కారుచౌకగా కట్టబెట్టింది బాబే
కాకినాడ డీప్ వాటర్ పోర్టును ప్రైవేటుపరం చేసింది గతంలో చంద్రబాబు ప్రభుత్వమేనన్నది అసలు వాస్తవం. ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఏడీబీ రుణాలతో ఏపీ ప్రభుత్వం కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌ను 1997లో నిర్మించింది. లాభాల్లో ఉన్న ఆ పోర్టును 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే కారు చౌక ధరకు ప్రైవేటుపరం చేశారు. ఓ మలేషియా కంపెనీని ముందు పెట్టి కాకినాడ డీప్‌వాటర్ పోర్టును కారు చౌకగా కట్టబెట్టేశారు. కానీ తరువాత అసలు విషయం వెలుగు చూసింది. మలేషియా కంపెనీ ముసుగులో చంద్రబాబు సన్నిహితుడు కేవీ రావు ఆ పోర్టును దక్కించుకున్నట్లు బయటపడింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను కూడా చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుండటం గమనార్హం.
అంతా బాబు కుట్ర స్క్రిప్టే...
కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాలను హస్తగతం చేసుకునేందుకు చంద్రబాబు పన్నాగం పన్నారు. ఈ క్రమంలో పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణాను తెరపైకి తెచ్చి జనసేనలోని తన కోవర్ట్, మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కాకినాడ పర్యటనకు పంపారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గత నెల 29న ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం చేరుకుని కాకినాడలో వాలారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వద్దకు చేరుకుని రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ డ్రోన్ కెమెరాలతో డ్రామా పండించారు. యాంకరేజ్ పోర్ట్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరి అక్కడ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే వారు ప్రశ్నించాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబునే కదా!!
Comments
Please login to add a commentAdd a comment