సాగుకు యువత దూరం
వ్యవసాయం ఆశించదగ్గ వృత్తి కాదంటున్న గ్రామీణ యువత
సాగులో అడుగు పెట్టలేమంటున్న 70% యువకులు
ఆదాయ మార్గాలు బాగున్న వృత్తుల వైపే చూపు
ఉత్పాదకత లేని కారణంగా సాగును వదిలేస్తామంటున్న 60% రైతులు
స్టేట్ ఆఫ్ రూరల్ యూత్ ఎంప్లాయిమెంట్ రిపోర్ట్–2024లో వెల్లడి
పుట్టిన పల్లెను విడిచిపెట్టేందుకు గ్రామీణ యువత ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. చదువుతో సంబంధం లేకుండా సాగులో తల్లిదండ్రులకు సాయపడే వారు. వారసత్వంగా వచి్చన వ్యవసాయాన్నే ప్రధాన వృత్తిగా ఎంచుకొనేవారు. పది మందికి అన్నం పెట్టేవారు. పదుగురికి ఉపాధి చూపేవారు. ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు వ్యవసాయం పట్ల గ్రామీణ యువతలో ఆసక్తి సన్నగిల్లుతోంది. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు మళ్లుతున్నారే తప్ప సాగు చేసేందుకు మాత్రం ముందుకు రావడంలేదని డెవలప్‌మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ యూనిట్ (డీఐయూ) విడుదల చేసిన స్టేట్ ఆఫ్ రూరల్ యూత్ ఎంప్లాయిమెంట్ రిపోర్టు–2024 వెల్లడించింది.
సాక్షి, అమరావతి: వ్యవసాయం ఆశించతగ్గ వృత్తి కాదని తెగేసి చెబుతున్నారని ఈ నివేదిక తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు కొలువులు రాకపోయినా, ఆదాయ మార్గాలు బాగున్న ఇతర ఉపాధి మార్గాలను ఎంచుకొంటున్నట్లు పేర్కొంది. సాగులో సరైన ఆదాయం లేక రైతులే వారి పిల్లలను వ్యవసాయం చేయొద్దని సలహాలు ఇస్తున్నారు. ఆందోళన కల్గించే మరో విషయం ఏమిటంటే ప్రస్తుతం సాగు చేస్తున్న వారిలో 60 శాతం మంది లోటు ఉత్పాదకత కారణంగా సాగును వదిలేయాలని నిర్ణయించుకున్నారు. వీరిలో 63 శాతం మంది వ్యవసాయం లాభసాటి కాదని స్పష్టం చేశారు.
21 రాష్ట్రాల్లో సర్వే
కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ట్రాన్స్‌ఫార్మ్ రూరల్ ఇండియా, గ్లోబల్ ఆపర్చ్యూనిటీ యూత్ నెట్‌వర్క్, గ్లోబల్ డెవలప్‌మెంట్ ఇంక్యుబేటర్ సంస్థలతో కలిసి డీఐయూ ఈ పరిశోధన చేసింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో ‘గ్రామీణ ప్రాంతాల్లో యువత – ఉపాధి అవకాశాల’పై నిర్వహించిన సర్వేతో పాటు వివిధ అంశాలపై శాస్త్రీయ పద్ధతుల్లో లోతైన పరిశీలన జరిపి విడుదల చేసిన ఈ నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 5,169 మంది గ్రామీణ యువతను డీఐయూ బృందాలు సంప్రదించాయి. పురుషులు– మహిళలను 50 ః 50 నిష్పత్తిలో సర్వే చేశారు. వీరిలో 18–25 ఏళ్ల మధ్య ఉన్న వారు 26.6%, 26–35 ఏళ్ల మధ్య ఉన్న వారు 73.4% మంది ఉన్నారు. వ్యవసాయం పట్ల యువత ఆలోచన సరళిపై ఆ సంస్థ వివిధ కోణాల్లో అధ్యయనం చేసింది.
మహిళల్లో 40 శాతం మందికే ఉపాధి
ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్న వారిలో దాదాపు 80 శాతం మంది 40 ఏళ్ల పైబడిన వారే ఉన్నారు. పైగా 18–25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువకుల్లో సగానికిపైగా ఏదో ఒక వృత్తి చేస్తుండగా, మహిళల్లో నాలుగో వంతు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. 26–35 ఏళ్ల మధ్య ఉన్న యువకుల్లో దాదాపు 85 శాతం మంది జీతంతో కూడిన పని చేస్తుండగా, 10 శాతం నిరుద్యోగులుగా ఉన్నారు. ఇదే వయస్సు కలిగిన మహిళల్లో 40 శాతం మంది మాత్రమే పని చేస్తున్నట్టుగా గుర్తించారు.
వ్యవసాయ అనుబంధ రంగాల వైపు
సాగుకు అనువైన భూమి, తగిన సాగునీటి వనరులు అందుబాటులో లేకపోవడం, ఇన్‌పుట్స్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం.. మరీ ముఖ్యంగా రైతుకు నిర్దిష్టమైన ఆదాయం లేకపోవడం వంటి కారణాలే వ్యవసాయం పట్ల గ్రామీణ యువతలో ఆసక్తి సన్నగిల్లిపోతుండడానికి ప్రధాన కారణంగా ఈ సర్వేలో గుర్తించారు. అయితే ఐటీ, ఇంజనీరింగ్ ఇతర వృత్తుల వైపు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ, మెజార్టీ గ్రామీణ యువత మాత్రం ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలుగా వ్యవసాయ అనుబంధ రంగాలనే ఎంచుకునేందుకు ముందుకొస్తుండడం ఇక్కడ చెప్పుకోతగ్గ సానుకూల అంశంగా పేర్కొనవచ్చు.
పల్లె విడిచి వెళ్లేందుకు సిద్ధం
జీవించడానికి తగిన ఆదాయం వ్యవసాయంలో రావడంలేదని గ్రామీణ యువత తేల్చేసింది. కూలి పనికి పోయినా రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు వస్తుందని, ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడినా వ్యవసాయంలో వచ్చే ఆదాయం రోజువారీ కుటుంబ పోషణకు కూడా సరిపోవడంలేదని స్పష్టం చేశారు. కుటుంబం సంతోషంగా జీవించేందుకు వ్యవసాయం ఉపయోగకరం కాదని 63.8 శాతం పురుషులు, 62.7 శాతం మహిళలు చెప్పారు. దూరాభారమైనా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల కోసం పల్లె విడిచి వెళ్లేందుకే మెజార్టీ గ్రామీణ యువత సిద్ధపడుతున్నారు.
వ్యవసాయంకంటే మెరుగైన ఆదాయం వచ్చే ఉపాధి మార్గాలు ఉన్నాయని పురుషుల్లో 38 శాతం, మహిళల్లో 51.4 శాతం మంది చెప్పారు. లాభసాటి కాని వ్యవసాయం చేసేకంటే గ్రామం విడిచి ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు పురుషుల్లో 32.3 శాతం, మహిళల్లో 23.6 శాతం మంది స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత చాలా తక్కువ ఉందంటూ పురుషుల్లో 67.6 శాతం, మహిళల్లో 68.9 శాతం మంది చెప్పుకొచ్చారు.
సాగుకు అనుకూలమైన భూమి కొరత ఉందని పురుషుల్లో 42.9 శాతం, మహిళల్లో 57.2 శాతం మంది అభిప్రాయపడ్డారు. పైగా మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏటా ప్రతి సీజన్‌లోనూ వాతావరణం సాగుకు అనుకూలించడంలేదని పేర్కొన్నారు. తరచూ వచ్చే విపత్తుల వల్ల అన్ని విధాలుగా నష్టపోయేది రైతులేనని పురుషుల్లో 44.2 శాతం, మహిళల్లో 39.7 శాతం అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment