Rural youth
-
మాయమైపోతున్నాడు రైతన్నవాడు
పుట్టిన పల్లెను విడిచిపెట్టేందుకు గ్రామీణ యువత ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. చదువుతో సంబంధం లేకుండా సాగులో తల్లిదండ్రులకు సాయపడే వారు. వారసత్వంగా వచి్చన వ్యవసాయాన్నే ప్రధాన వృత్తిగా ఎంచుకొనేవారు. పది మందికి అన్నం పెట్టేవారు. పదుగురికి ఉపాధి చూపేవారు. ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు వ్యవసాయం పట్ల గ్రామీణ యువతలో ఆసక్తి సన్నగిల్లుతోంది. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు మళ్లుతున్నారే తప్ప సాగు చేసేందుకు మాత్రం ముందుకు రావడంలేదని డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ యూనిట్ (డీఐయూ) విడుదల చేసిన స్టేట్ ఆఫ్ రూరల్ యూత్ ఎంప్లాయిమెంట్ రిపోర్టు–2024 వెల్లడించింది.సాక్షి, అమరావతి: వ్యవసాయం ఆశించతగ్గ వృత్తి కాదని తెగేసి చెబుతున్నారని ఈ నివేదిక తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు కొలువులు రాకపోయినా, ఆదాయ మార్గాలు బాగున్న ఇతర ఉపాధి మార్గాలను ఎంచుకొంటున్నట్లు పేర్కొంది. సాగులో సరైన ఆదాయం లేక రైతులే వారి పిల్లలను వ్యవసాయం చేయొద్దని సలహాలు ఇస్తున్నారు. ఆందోళన కల్గించే మరో విషయం ఏమిటంటే ప్రస్తుతం సాగు చేస్తున్న వారిలో 60 శాతం మంది లోటు ఉత్పాదకత కారణంగా సాగును వదిలేయాలని నిర్ణయించుకున్నారు. వీరిలో 63 శాతం మంది వ్యవసాయం లాభసాటి కాదని స్పష్టం చేశారు. 21 రాష్ట్రాల్లో సర్వే కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ట్రాన్స్‌ఫార్మ్ రూరల్ ఇండియా, గ్లోబల్ ఆపర్చ్యూనిటీ యూత్ నెట్వర్క్, గ్లోబల్ డెవలప్మెంట్ ఇంక్యుబేటర్ సంస్థలతో కలిసి డీఐయూ ఈ పరిశోధన చేసింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో ‘గ్రామీణ ప్రాంతాల్లో యువత – ఉపాధి అవకాశాల’పై నిర్వహించిన సర్వేతో పాటు వివిధ అంశాలపై శాస్త్రీయ పద్ధతుల్లో లోతైన పరిశీలన జరిపి విడుదల చేసిన ఈ నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 5,169 మంది గ్రామీణ యువతను డీఐయూ బృందాలు సంప్రదించాయి. పురుషులు– మహిళలను 50 ః 50 నిష్పత్తిలో సర్వే చేశారు. వీరిలో 18–25 ఏళ్ల మధ్య ఉన్న వారు 26.6%, 26–35 ఏళ్ల మధ్య ఉన్న వారు 73.4% మంది ఉన్నారు. వ్యవసాయం పట్ల యువత ఆలోచన సరళిపై ఆ సంస్థ వివిధ కోణాల్లో అధ్యయనం చేసింది.మహిళల్లో 40 శాతం మందికే ఉపాధి ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్న వారిలో దాదాపు 80 శాతం మంది 40 ఏళ్ల పైబడిన వారే ఉన్నారు. పైగా 18–25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువకుల్లో సగానికిపైగా ఏదో ఒక వృత్తి చేస్తుండగా, మహిళల్లో నాలుగో వంతు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. 26–35 ఏళ్ల మధ్య ఉన్న యువకుల్లో దాదాపు 85 శాతం మంది జీతంతో కూడిన పని చేస్తుండగా, 10 శాతం నిరుద్యోగులుగా ఉన్నారు. ఇదే వయస్సు కలిగిన మహిళల్లో 40 శాతం మంది మాత్రమే పని చేస్తున్నట్టుగా గుర్తించారు.వ్యవసాయ అనుబంధ రంగాల వైపుసాగుకు అనువైన భూమి, తగిన సాగునీటి వనరులు అందుబాటులో లేకపోవడం, ఇన్పుట్స్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం.. మరీ ముఖ్యంగా రైతుకు నిర్దిష్టమైన ఆదాయం లేకపోవడం వంటి కారణాలే వ్యవసాయం పట్ల గ్రామీణ యువతలో ఆసక్తి సన్నగిల్లిపోతుండడానికి ప్రధాన కారణంగా ఈ సర్వేలో గుర్తించారు. అయితే ఐటీ, ఇంజనీరింగ్ ఇతర వృత్తుల వైపు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ, మెజార్టీ గ్రామీణ యువత మాత్రం ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలుగా వ్యవసాయ అనుబంధ రంగాలనే ఎంచుకునేందుకు ముందుకొస్తుండడం ఇక్కడ చెప్పుకోతగ్గ సానుకూల అంశంగా పేర్కొనవచ్చు. పల్లె విడిచి వెళ్లేందుకు సిద్ధం జీవించడానికి తగిన ఆదాయం వ్యవసాయంలో రావడంలేదని గ్రామీణ యువత తేల్చేసింది. కూలి పనికి పోయినా రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు వస్తుందని, ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడినా వ్యవసాయంలో వచ్చే ఆదాయం రోజువారీ కుటుంబ పోషణకు కూడా సరిపోవడంలేదని స్పష్టం చేశారు. కుటుంబం సంతోషంగా జీవించేందుకు వ్యవసాయం ఉపయోగకరం కాదని 63.8 శాతం పురుషులు, 62.7 శాతం మహిళలు చెప్పారు. దూరాభారమైనా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల కోసం పల్లె విడిచి వెళ్లేందుకే మెజార్టీ గ్రామీణ యువత సిద్ధపడుతున్నారు.వ్యవసాయంకంటే మెరుగైన ఆదాయం వచ్చే ఉపాధి మార్గాలు ఉన్నాయని పురుషుల్లో 38 శాతం, మహిళల్లో 51.4 శాతం మంది చెప్పారు. లాభసాటి కాని వ్యవసాయం చేసేకంటే గ్రామం విడిచి ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు పురుషుల్లో 32.3 శాతం, మహిళల్లో 23.6 శాతం మంది స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత చాలా తక్కువ ఉందంటూ పురుషుల్లో 67.6 శాతం, మహిళల్లో 68.9 శాతం మంది చెప్పుకొచ్చారు.సాగుకు అనుకూలమైన భూమి కొరత ఉందని పురుషుల్లో 42.9 శాతం, మహిళల్లో 57.2 శాతం మంది అభిప్రాయపడ్డారు. పైగా మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏటా ప్రతి సీజన్లోనూ వాతావరణం సాగుకు అనుకూలించడంలేదని పేర్కొన్నారు. తరచూ వచ్చే విపత్తుల వల్ల అన్ని విధాలుగా నష్టపోయేది రైతులేనని పురుషుల్లో 44.2 శాతం, మహిళల్లో 39.7 శాతం అభిప్రాయపడ్డారు. -
పట్టణ యువతలో 61శాతం మందికి కంప్యూటర్ నైపుణ్యం
సాక్షి, అమరావతి : దేశంలో కంప్యూటర్ నైపుణ్యం పట్టణ యువతలో 61 శాతం ఉండగా అదే గ్రామీణ యువతలో కేవలం 34 శాతమే ఉందని ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్–24 వెల్లడించింది. కంప్యూటర్ నైపుణ్యాల సామర్థ్యం రాష్ట్రాల మధ్య వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆ నివేదిక తెలిపింది. కెమెరా, మోడమ్, ప్రింటర్ వంటి పరికరాలు ఇన్స్టాల్ చేసే సామర్థ్యం పట్టణ యువతలో ఉందని.. అయితే గ్రామీణ యువతలో అది ఎనిమిది శాతమేనని పేర్కొంది.ఇలా వివిధ రకాల కంప్యూటర్ నైపుణ్యాల్లో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాయని వివరించింది. ఇక ఫైళ్లను బదిలీచేసే సామర్థ్యం మినహా చాలా నైపుణ్యాల్లో కర్ణాటక ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. ఫైల్ లేదా ఫోల్డర్‌ను కాపీ చేయగల లేదా తరలించగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 45.56 శాతం ఉంటే కేరళ యువతలో 90.28 శాతం.. తమిళనాడు యువతలో 72.28 శాతం, కర్ణాటక యువతలో 64.36 శాతం, తెలంగాణలో 53.83 శాతం ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది.అలాగే, డూప్లికేట్ లేదా టూల్స్‌ను కాపీచేసి పేస్ట్ చేయగల సామర్థ్యంతో పాటు సమాచారాన్ని ట్రాన్స్ఫర్ చేయగల నైపుణ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 43.30 శాతం ఉందని ఆ నివేదిక తెలిపింది. ఇది కేరళ యువతలో 89.30 శాతం, తమిళనాడు యువతలో 70.45 శాతం, కర్ణాటక యువతలో 60.24 శాతం, తెలంగాణలో 50.40 శాతం ఉంది.ప్రెజెంటేషన్ల సామర్థ్యం కేరళలో ఎక్కువ..ఇక జోడించిన ఫైల్‌తో ఈ–మెయిల్ పంపగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 36.38 శాతం ఉంటే కేరళ యువతలో అత్యధికంగా 73.34 శాతం, తమిళనాడులో 55.33 శాతం, కర్ణాటకలో 45.04 శాతం, తెలంగాణలో 45.46 శాతం సామర్థ్యం ఉంది. ప్రెజెంటేషన్ సాఫ్ట్‌వేర్‌తో ఎలక్ట్రానిక్ ప్రెజెంటేషన్లను సృష్టించగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 10.18 శాతం ఉండగా కేరళ యువతలో 40.33 శాతం, తమిళనాడులో 26.10 శాతం, కర్ణాటకలో 22.33 శాతం, తెలంగాణలో 14.27 శాతం ఉందని రిపోర్ట్ వెల్లడించింది.గ్రామీణంలో ‘నెట్’ వినియోగం 25 శాతమే..అలాగే, దేశంలో 15 ఏళ్ల వయస్సు నుంచి 29 ఏళ్లలోపు యువత ఇంటర్నెట్ వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో 25.30 శాతం ఉండగా పట్టణ ప్రాంతాల్లో 57.53 శాతం ఉందని తెలిపింది. వర్గాల వారీగా ఇంటర్నెట్ వినియోగాన్ని పరిశీలిస్తే.. ఎస్టీ వర్గాల్లో 20.39 శాతం, ఎస్సీల్లో 24.96 శాతం, వెనుకబడిన వర్గాల్లో 34.28 శాతం, సాధారణ వర్గాల్లో 50.15 శాతం ఇంటర్నెట్ ఉందని రిపోర్ట్ తెలిపింది. మెజారిటీ యువత మాధ్యమిక లేదా ఉన్నతస్థాయి విద్యను అభ్యసిస్తున్నారని, దీంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్, డిజిటల్ నైపుణ్యాల యాక్సెస్ యువత జనాభాలో కూడా పెరిగిందని.. అయితే సాంకేతిక నైపుణ్యాలను, సామర్థ్యాన్ని పెంచేందుకు యువతకు తగిన శిక్షణ ఇవ్వాల్సి ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది. -
గ్రామీణ యువత కోసం ఐటీ హబ్‌ల ఏర్పాటు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గ్రామీణ యువతలో నైపుణ్యాలను వెలికి తీసేందుకే ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా తెలిపారు. నిజామాబాద్ నగరంలో కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఐటీ హబ్‌లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు శుక్రవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో ‘టాస్క్’సంస్థ సహకారంతో జాబ్ మేళా నిర్వహించారు. నాపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలి ‘తనపై ఆరోపణలు చేస్తున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు 24 గంటల సమయం ఇస్తు న్నానని, ఆలోగా ఆరోపణలు రుజువు చేయక పోతే నిజామాబాద్ పులాంగ్చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని’ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నాకు ఎవరు ఒక్క రూపాయి ఇచ్చారో రుజువు చేయాలని, అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తే బాగోదని హెచ్చరించారు. శుక్రవారం నిజా మాబాద్ జిల్లాకేంద్రంలో కవిత విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడిరాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో రింగ్ రోడ్డు పూర్తి చేయలేకపోతే, ఇప్పుడు మేం చేశామని చెప్పారు. నిజామా బాద్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ డబ్బులు ఏ కుటుంబం తిన్నదో ప్రజలకు తెలుసున్నారు. ‘నా తండ్రిని అంటే వదిలేశా..ఇప్పుడు నా భర్తను కూడా విమర్శిస్తున్నారు..మజాక్ చేస్తే బాగుండదు.ఆయన రాజకీయాల్లో లేకున్నా పేరు ఎందుకు తీస్తున్నారంటూ’ అర్వింద్‌ను ప్రశ్నించారు. అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా అక్కడకు వెళ్లి ఆయన్ను ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తానని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్యే గణేశ్ గుప్తా పాల్గొన్నారు. -
గ్రామీణ యువతకు శిక్షణ, ఉపాధిలో ఏపీ స్పీడ్
-
గ్రామీణ యువతకు శిక్షణ, ఉపాధిలో ఏపీ స్పీడ్
సాక్షి, అమరావతి: గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలి ఐదు రాష్ట్రాల్లో స్థానం సంపాదించుకుంది. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణలో మూడో స్థానం, వారు ఉపాధి పొందడం (ప్లేస్‌మెంట్స్)లో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద దేశంలోని 27 రాస్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 14.51 లక్షల మంది గ్రామీణ యువత శిక్షణ పొందగా ఇందులో 8.70 లక్షల మంది ఉపాధి పొందినట్లు తెలిపింది. గ్రామీణ యువతకు వృత్తిపరమైన లేదా వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ఈ పథకం కింద నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడంలో ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. శిక్షణ పొందిన అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 15 నుంచి 35 ఏళ్ల లోపు పేద కుటుంబాలకు చెందిన గ్రామీణ యువతకు ఈ పథకం కింద నైపుణ్య శిక్షణ ఇస్తారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, మైనారిటీలకు 15 శాతం, మహిళలకు 33 శాతం మందికి శిక్షణలో ప్రాధాన్యత ఇస్తారు. అలాగే దివ్యాంగులు, కుటుంబ నిర్వహణలో ఉన్న మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. దేశంలో 37 రంగాల్లో 877 ప్రాజెక్టు అమలు ఏజెన్సీలు 2,369 కేంద్రాల్లో ఈ శిక్షణ ఇస్తున్నాయి. -
కష్టాలు వెంటాడుతున్నా ‘తగ్గేదే లే’.. ఒక్కోమెట్టూ ఎక్కుతూ..
పేదరికం అడ్డొచ్చినా, కష్టాలు వెంటాడుతున్నా వెనక్కి తగ్గలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రభుత్వ సహకారంతో ఉన్నత విద్యనభ్యసించారు. ఒక్కోమెట్టూ ఎక్కుతూ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. తాము సంపాదించిన మొత్తంలో కొంత స్వగ్రామాలకు, మరికొంత పేద విద్యార్థులకు వెచ్చిస్తూ సేవా కార్యక్రమాల్లో తరిస్తున్నారు.. వెంకటగిరి నియోజకవర్గంలోని సాఫ్ట్వేర్ ఉద్యోగులు. బిడ్డలు పెద్దవాళ్లయిన తర్వాత పేగుబంధాన్ని మరిచి తల్లిదండ్రులను ఒంటరివాళ్లను చేస్తున్న ఈ రోజుల్లో.. తాము ఉన్నతంగా స్థిరపడినా కుటుంబానికి వెన్నంటే ఉంటున్నారు. పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామీణ సాఫ్ట్వేర్ ఇంజినీర్లపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్. చదవండి: వింత అచారం: వరుడు వధువుగా.. వధువు వరుడిగా.. వెంకటగిరి(తిరుపతి జిల్లా): ఒకప్పుడు పల్లెటూళ్లంటే పాడుబడిన పూరిళ్లు.. చదువూసంధ్యలేని ప్రజలు. ఇప్పుడు కాలం మారింది. చదువుపై ఆసక్తి పెరిగింది. తాము పడ్డ కష్టాలు బిడ్డలు పడకూడదని తల్లిదండ్రులు నిశ్చయించుకుంటున్నారు. కూలిపనులు చేసి కూడా పైసాపైసా కూడబెట్టి ఉన్నత చదువులు చదివిస్తున్నారు. వారి ఆకాంక్షలు నెరవేరుస్తూ బిడ్డలు ఉన్నత స్థానాల్లో స్థిరపడుతున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా, డాక్టర్లుగా రాణిస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా సాఫ్ట్వేర్ ఇంజినీర్లే దర్శనమిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రభుత్వ ఫీజురీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత చదువులు చదువుతున్నారు. సీనియర్లను స్ఫూర్తిగా తీసుకుని జూనియర్లు కూడా ఇంజీనీరింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. లక్షల్లో వేత నాలు పొందుతూ ఊరి రుణం తీర్చుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు కేరాఫ్ అడ్రస్ కమ్మవారిపల్లె నియోజకవర్గంలోని డక్కిలి మండలం, కమ్మవారిపల్లిలోనే 45 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉన్నారు. 120 ఇళ్లు ఉన్న ఈ గ్రామంలో చాలామంది ఉన్నత విద్యనభ్యసించి వివిధ హోదాల్లో స్థిరపడ్డారు. దళితవాడకు చెందిన పెంచలయ్య కుమార్తె జ్యోతి ఎంబీబీఎస్, కుమారుడు ప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా రాణిస్తున్నారు. ఓపిక ఉన్నంత వరకు కూలి పనులు చేస్తామని చెబుతున్నారు. తమ బిడ్డల సంపాదనతో ఇంట్లో అన్ని సౌకర్యాలు సమకూరాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ►డక్కిలి మండలం, కొత్తనాలపాడు గ్రామానికి చెందిన పీ.కృష్ణయ్య పైసాపైసా కూడబెట్టి తన కుమారుడు వెంకటేశ్వర్లును ఎంసీఐ వరకు చదివించాడు. ప్రస్తుతం వెంకటేశ్వర్లు చెన్నై హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నారు. నెలకు రూ.1.8 లక్షల వేతనం. ►వెంకటగిరి మండలం, సిద్ధవరం గ్రామానికి చెందిన సుబ్బరాయుడుకు రాజేష్, రాఘవ ఇద్దరు కుమారులు. ఉన్న ఎకరా పొలాన్ని విక్రయించి పిల్లలను నెల్లూరులోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంటర్మీడియెట్ చదివించాడు. అనంతరం ప్రభుత్వం అందించిన సహకారం, ఫీజురీయింబర్స్‌మెంట్‌తో ఇంజినీరింగ్ వరకు చదివించాడు. తండ్రి కలలను సాకారం చేస్తూ బెంగళూరు, చెన్నైలో సాఫ్ట్వేర్లుగా స్థిరపడ్డారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంపై మక్కువ ఎక్కువ నియోజకవర్గంలోని డక్కిలి మండలం, ఆల్తూరుపాడు గ్రామంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందిన కే.చైతన్య, చంద్రశేఖర్‌రెడ్డి తదితర యువకుల స్ఫూర్తితో పదులు సంఖ్యలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. రూ.లక్షల్లో జీతాలు ఉండడంతో తాము కూడా సాఫ్ట్‌వేర్‌గా ఎదగాలన్న కసి స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. మోపూరు, పాతనాలపాడు, కోత్తనాలపాడు, చాపలపల్లి, మిట్టపాళెం, కమ్మపల్లి, వల్లివేడు, యాతలూరు వంటి గ్రామాల్లోని ప్రతివీధిలో ఇద్దరోముగ్గురో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉండడం గమనార్హం. తల్లిదండ్రలు కూడా తమ బిడ్డలు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగానే స్థిరపడాలని కోరుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో వన్నెతగ్గని ఉద్యోగం రెండేళ్లుగా కరోనా కష్టాల్లోనూ సాఫ్ట్వేర్ రంగానికి ఎక్కడా డిమాండ్ తగ్గలేదు. సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇళ్ల నుంచి (వర్క్ ఫ్రం హోం) విధులు చేయించుకున్నాయి. కమ్మవారిపల్లి, కోత్తనాలపాడు, మోపూరు, ఆల్లూరుపాడు, డక్కిలి గ్రామాల్లో వందల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇళ్ల నుంచే తమ విధులు నిర్వహించారు. తల్లిదండ్రలతో పాటు బంధువులకు దగ్గరగా జీవనం సాగించారు. -
వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దీనిద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగంలో పరిశ్రమల ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకెళ్లేందుకు వీలవుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు. రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీవోల) వంటివి చిన్న, మధ్యతరగతి రైతులకు ఎంతగానో ఉపయుక్తం అవుతాయన్నారు. వీటి నిర్మాణానికివ్యవసాయ విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని వెంకయ్యనాయుడు సూచించారు. ఆదివారం బిహార్ చంపారన్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. చిన్న, మధ్యతరగతి రైతులు తమకున్న పరిమిత వనరులతో అద్భుతాలు సాధించడం వెనుక దేశ వ్యవసాయ రంగం గొప్పదనం దాగుందని, అందుకే వివిధ మార్గాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా వారికి మద్దతుగా నిలవాలన్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ఆహారభద్రతను సుస్థిరం చేయాలన్నారు. -
వాడవాడలా జాబ్‌మేళాలు!
మార్చిలోగా 35 వేల మందికి ప్రైవేటు ఉద్యోగాలే లక్ష్యం సాక్షి, హైదరాబాద్: అర్హత కలిగిన గ్రామీణ యువతకు ప్రైవేటు ఉద్యోగాలను కల్పించే నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జాబ్ మేళాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ, మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మార్చిలోగా గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 35 వేల మందికి ఉద్యోగాలను ఇప్పించాలని భావి స్తున్నా రు. ఇందుకుగాను రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఒక మినీ, ప్రతి జిల్లాలో ఒక మెగా జాబ్‌మేళా నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో మినీ మేళా ద్వారా 150 నుంచి 250మందికి, మెగా మేళా ద్వారా కనీసం 250 నుంచి 350 మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యం. వివిధ కోర్సులలో అభ్యర్థులకు శిక్షణ నిమిత్తం 42 ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ (పీఐఏ)లను గ్రామీణాభివృద్ధిశాఖ ఏర్పాటు చేసింది. వాటితో సమన్వయంగా పనిచేసి జాబ్ మేళాల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారు(డీఆర్డీవో)లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రం స్పాన్సర్ చేస్తున్న డీడీయూ– జీకేవై పథకం ద్వారా 3 నెలల శిక్షణను ఇప్పిం చనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి అన్ని జిల్లాలోనూ శిక్షణ, జాబ్‌మేళాలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగార్థుల్లో నైపు ణ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఇంగ్లిష్ వర్డ్స్ రెడినెస్ కంప్యూటర్ (ఈడబ్ల్యూఆర్‌సీ) కేంద్రాలను ఏర్పాటు చేయా లని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో 11 కేంద్రాలున్నాయి. -
నవతరం పారిశ్రామికవేత్తలుగా యువత
* నిజామాబాద్ ఎంపీ కవిత * నైపుణ్యాభివృద్ధిపై టిఫ్‌తో తెలంగాణ జాగృతి ఒప్పందం సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు, గ్రామీణ యువతను నవతరం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వాల్సి ఉందని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. యువతలో నైపుణ్యం, వ్యవస్థాపక సామర్థ్యం పెంపుదలకు సంబంధించి తెలంగాణ పారిశ్రామివేత్తల సంఘం(టిఫ్)తో తెలంగాణ జాగృతి మంగళవారం ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో ఎంపీ కవిత మాట్లాడుతూ... ఈ ఒప్పందం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కడంతో పాటు.. పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయన్నారు. పారిశ్రామికాభివృద్ధి హైదరాబాద్ పరిసరాలకే పరిమితం కాకుండా.. వికేంద్రీకరణ ద్వారా జిల్లాలకు విస్తరిస్తామన్నారు. జిల్లాల్లో స్థానిక వనరులకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు కావాలని, నిజామాబాద్‌లో సీడ్ పార్కు, వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు ప్రతిపాదనను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. కులవృత్తులు, వ్యవసాయం దెబ్బతినడంతో గ్రామాలను వదిలి పట్టణాలకు వలస వస్తున్న రైతు బిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణకు పూర్వ వైభవం సాధించడంతో పాటు.. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. జనావాసాల్లో ఉన్న సూక్ష్మ, లఘు పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. పరిశ్రమలకు తాగునీరు, ఆస్తిపన్ను తదితర సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. బహుళ ఉత్పత్తుల పారిశ్రామిక వాడల ఏర్పాటుకు సంబంధించి టిఫ్‌తో కలసి పనిచేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం పాత్రను కవిత ప్రస్తావించారు. ఉపాధి కల్పనపై దృష్టి పెట్టండి ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల కోసం చూడకుండా ఉపాధి కల్పనపై యువత దృష్టి సారించాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువమందికి ఉపాధి కల్పిం చేలా పరిశ్రమలను స్థాపించాలన్నారు. టీ హబ్ తరహాలో తెలంగాణ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయాలన్నారు. పారి శ్రామికవృద్ధి జరిగితేనే వాణిజ్యాభివృద్ధి జరుగుతుందని సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన టీఎస్ఐపాస్, ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌లు, రిచ్, టాస్క్ తదితరాల ప్రత్యేకతలను టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి వివరించారు. తెలంగాణ జాగృతితో కలసి 18 పారిశ్రామికవాడల్లో టిఫ్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తుందని టిఫ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా టిఫ్ ప్రచురించిన ‘మేకిన్ తెలంగాణ’ సంచికను ఎంపీ కవిత ఆవిష్కరించారు. సమావేశంలో టిఫ్ ప్రతినిధులు ఆనంద్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఎఎల్ఎన్ రెడ్డి, హరినాథ్, లక్ష్మణరావు పాల్గొన్నారు. -
మిషన్ ‘ఎంప్లాయ్మెంట్’
* గ్రామీణ యువతకు ప్రైవేటుఉద్యోగాల కల్పన * రూ.150 కోట్లతో 40 వేలమందికి శిక్షణ * కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంత నిరుపేద యువతీ యువకులకు పెద్ద ఎత్తున ప్రైవేటు ఉద్యోగాల కల్పనపై సర్కారు దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 40 వేలమందికి వివిధ రకాల వృత్తి నైపుణ్యాలు(శిక్షణ) కల్పించి, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రవేశపెట్టిన ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్- గ్రామీణ కౌశల్య యోజన(డీడీయూ-జీకేవై)’ కింద ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) అధికారులు సుమారు రూ.150 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈజీఎంఎం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. తొలిదశలో 12,515 మందికి.. ఈజీఎంఎం ద్వారా 40 వేలమందికి ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు మూడు దశల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. తొలివిడతలో 12,515 మందికి శిక్షణ ఇప్పించేందుకు రూ.30.04 కోట్లు మంజూరు చేసింది. శిక్షణతో పాటు ఉద్యోగాలను కల్పించే బాధ్యతను ఎంపిక చేసిన ఏజెన్సీలకు అప్పగించింది. ఈ మేరకు వాటితో అవగాహన కుదుర్చుకోవాలని ఈజీఎంఎం అధికారులకు సర్కారు సూచించింది. ఒక్కో అభ్యర్థికి భోజనం, వసతి కోసం రూ.10.800, శిక్షణ కోసం రూ.13,696 ఖర్చుచేయాలని నిర్ణయించింది. అభ్యర్థులకు ప్రయాణ ఖర్చు.. తదితర సదుపాయాలను డీడీయూ-జీకేవై నిబంధనల మేరకు కల్పించాలని ఆదేశించింది. గ్రామ సమాఖ్యల ద్వారా ఎంపిక శిక్షణ, ఉద్యోగాల కల్పనకు అభ్యర్థులను గ్రామ సమాఖ్యల ద్వారా ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వం గతేడాది నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో సుమారు 15 లక్షలమంది పేద వర్గాలకు చెందిన యువకులు ఉన్నట్లు తేలింది. వీరిలో అత్యంత నిరుపేద(వ్యవసాయ భూమి లేని) కుటుంబాలకు చెందిన వారు సుమారు 2.5 లక్షల మంది ఉన్నట్లు అంచనా. వచ్చే నాలుగేళ్లలో వీరందరికీ అవసరమైన శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈజీఎంఎం సీఈవో మురళి తెలిపారు. -
కార్పొరేట్ కంపెనీలు గ్రామాలపై దృష్టి పెట్టాలి
నైపుణ్యం పెంచుకుంటే ఆదాయం పెరుగుతుంది ⇒అమరరాజా గ్రోత్ కారిడార్ ప్రారంభ సభలో సీఎం చంద్రబాబు చిత్తూరు నుంచి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధి: నైపుణ్యం పెంచుకుంటే అధికాదాయాన్ని పొందవచ్చని, ఇందుకోసం గ్రామీణ యువత నైపుణ్యం సంపాదించడంపై దృష్టిసారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గ్రామీణ యువత స్కిల్స్ డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తగుచర్యలు తీసుకుంటోందన్నారు. గురువారం చిత్తూరు సమీపంలో 500 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అమరరాజా గ్రోత్ కారిడార్‌ను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలన్నారు. మౌలికవసతులు లేని మారుమూల గ్రామాల్లో యూనిట్‌ను ఏర్పాటు చేసి అమరరాజా కార్పొరేట్ సంస్థలకు ఆదర్శంగా నిలిచిందని, అదే బాటలో మిగిలిన సంస్థలు కూడా నడవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అనేక మౌలిక వసతులు ఉన్నాయని, వీటిని వినియోగించుకోవడం ద్వారా 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. నంబర్ వన్ స్థానంపై దృష్టి .. వచ్చే పదేళ్లలో బ్యాటరీల తయారీలో మొదటి స్థానంలో నిలవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమరరాజా గ్రూపు వైస్ చైర్మన్ జయదేవ్ గల్లా పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైతే ఈ రంగంలో ఉన్న ఇతర కంపెనీలను కొనుగోలు అంశాలను కూడా పరిశీలిస్తామన్నారు. 500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రోత్ కారిడార్ వచ్చే నాలుగైదేళ్ళలో రూ. 4,500 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా మరో 20,000 మందికి ఉపాధి కల్పించగలదన్నారు. ప్రస్తుతం అమరరాజా గ్రూపులో సుమారు 12,500 మంది పనిచేస్తున్నారు. -
కిక్కుతో.. చిత్తు
పల్లెల్లో పారుతున్న సారా 40 శాతం యువశక్తి అటువైపే 30 ఏళ్లకే రోగాల బారిన అప్పుల పాలైన వారు బలవన్మరణం వైపు వీరిలో ఎక్కువ మంది రైతులే.. ‘సాక్షి’ సర్వేలో వెలుగు చూసిన భయంకరమైన నిజాలు నీటి చుక్క దొరకని గ్రామాలుండవచ్చు గానీ మద్యం దొరకని పల్లె లేదు... కష్టజీవులు నిత్యం మద్యం తాగనిదే ఉండలేరు... ఇలా చాలామంది మద్యానికి బానిసలవుతున్నారు... వీరిలో ఎక్కువగా యువకులే... విస్కీ, బీరు, సారా, కల్లు ఇవన్నీ యువత కష్టార్జితాన్నే కాదు.. శ్రమశక్తినీ హరిస్తున్నాయి... చీప్ లిక్కర్, నాటు సారా ప్రభావంతో ఆరోగ్యవంతులు అనారోగ్యం బారిన పడుతున్నారు. వారానికి ఒకటి రెండు రోజులు పనికి వెళ్లినా... రెండు, మూడు గంటల కంటే ఎక్కువ పని చేయలేకపోతున్నారు. వీరిలో చిన్నసన్నకారు రైతులే అధికం. మద్యానికి వ్యసన పరులు కావడం.. సొంత పొలంలో పనులు కూడా చేసుకోలేని దుస్థితి. ఇవన్నీ ‘సాక్షి’ నిర్వహించిన సర్వేలో వెలుగు చూసిన నిజాలు.. సంగారెడ్డి, సాక్షి ప్రతినిధి: ‘సాక్షి’ ఇటీవల పలు పల్లెల్లో మద్యంపై శాంపిల్ సర్వే నిర్వహించగా భయంకరమైన నిజాలెన్నో వెలుగు చూశాయి. జిల్లాలోని దాదాపు 52 పల్లెల్లో సర్వే నిర్వహించింది. బెల్టు షాపు, సారా లేని పల్లెలు కన్పించలేదంటే ఒట్టు. ఆదాయాన్ని రాబట్టే క్రమంలో ఎక్సైజ్ అధికారులు మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే పల్లె పల్లెన బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పాటయ్యాయి. ప్రతి పల్లెలో సగటున మూడు నుంచి 6 వరకు బెల్టు దుకాణాలు నడుస్తున్నాయి. 500 గడప ఉన్న పల్లెలో రోజు వారి విక్రయాలు రూ.20 నుంచి రూ.30 వేలు ఉంటుంది. ఈ లెక్కన ఏడాదికి సగటున కోటి రూపాయల విలువ చేసే మద్యాన్ని రైతులు, యువకులు తాగేస్తున్నారు. అప్పుల పాలైన రైతును ఆత్మహత్యకు ఉసిగొల్పుతున్నది మద్యమేనని తేలింది. బెల్టు షాపులకు ఫుల్స్టాప్ పెట్టకపోతే యువశక్తి రసం పీల్చిన కాయలా మిగిలిపోనుంది. దుద్దెడలో రాజయ్య... కొండపాక మండలం దుద్దెడ జనాభా 7,650. ఇందులో సుమారు 2,880 మంది వ్యవసాయం, ఇతర ఉపాధి పనులు చేస్తున్నారు. దుద్దెడలో ఒక మద్యం షాపు ఉండగా ఐదు బెల్ట్‌షాపులు, 15 సారా కేంద్రాలు, ఒ కల్లు దుకాణం ఉంది. సుమారు రెండు వేల మంది మద్యం తాగుతున్నట్టు వెల్లడైంది. గ్రామానికి చెందిన జక్కుల రాజయ్య (39) మద్యానికి బానిసై పనులు చేయడం మానేశాడు. తనకున్న ఎకరం పొలాన్ని అమ్మేశాడు. కుటుంబ పోషణ భారం భార్య రాధవ్వపై పడింది. ముగ్గురు పిల్లలను సాకుతోంది. మద్యం మత్తులో రాజయ్య జగదేవ్‌పూర్ మండలం గణేశ్‌పల్లి శివారులో మరణించాడు. ఇప్పుడు రాధవ్వ అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవలే ఆమెకు గర్భకోశ ఆపరేషన్ జరిగింది. పిల్లలు ఇంకా చేతికి అందలేదు. విధిలేని పరిస్థితుల్లో వారి కుమారుల్లో ఒకరు చదువు మానేసి కుటుంబ భారం నెత్తికెత్తుకున్నారు. ‘మా నాయిన... తాగి చనిపోయిండు. మా అమ్మ ఎంతచెప్పినా వినకపోయేటోడు. ఉన్న భూమి అమ్మిండు. మందు పాడుగాను మాకు కష్టాలొచ్చినయ్’... అంటూ కుమారులు ఆందోళన వ్యక్తం చేశారు. పల్వంచలో.. టేక్మాల్ మండల పల్వంచ జనాభా 2,250. ఇందులో సుమారు 1,500 మంది మద్యం తాగుతుంటారు. గ్రామంలో కల్లు దుకాణం, రెండు బెల్టు దుకాణాలున్నాయి. రైతులు, రైతు కూలీలు, చేతి వృత్తుల వారే ఈ దుకాణాలకు ఆదాయ వనరు. ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు తెరుచుకొనే ఉంటాయి. ‘తాగుడుకు బానిసై మా బావ పిల్లలను సరిగ్గా పట్టించుకోడు, ఉన్న డబ్బుల్ని ఖర్చుచేస్తున్నాడు. ఏమి చేయాలో తెలియక మేమంతా బాధపడున్నాం’ అని మల్లేశం అనే వ్యక్తి తెలిపారు. మా అన్నయ్య కష్టమంతా తాగడానికి పెడుతుండని గ్రామానికి చెందిన కిష్టమ్మ ఆవేదనగా తెలిపింది. ఉదయం నుంచి తాగుడు అలవాటు ఉన్నవారు వంద మంది వరకు ఉంటారు. 24 గంటలూ సారా అందుబాటులో.. మనూరు మండలం దుదగొండ జనాభా 1,500. ఇక్కడ దాదాపు 600 మంది రైతులున్నారు. సారా 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. సమీపంలోని రాణాపూర్ తండాకు చెందిన గిరిజనులు సారా తెచ్చి విక్రయిస్తారు. 5 బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సుమారు 30 మంది ఇక్కడ రోజంతా మందు తాగుతుంటారు. 80 మంది వరకు ఏ పనీ లేకుండా గడుపుతున్నారు. వీళ్లంతా 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వయసున్న వారే కావడం గమనార్హం. మద్యం తాగుతున్న వారి కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులు, గేదెలు మేపుతున్నారు. రుద్రారంలో.. నారాయణఖేడ్ మండలం రుద్రారం జనాభా 2,200. ఇక్కడ సుమారు 800 మంది రైతులున్నారు. చేతి వృత్తుల వారు 500 మంది ఉంటారు. 8 బెల్టుషాపులు, ఓ కల్లు దుకాణం ఉంది. ఇక్కడ 80 మంది నిత్యం మద్యం సేవిస్తుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం మత్తులో మునిగిపోయేవారు ఐదుగురున్నారు. అప్పుల బాధ, కుటుంబ కలహాలు, సరైన పని లేక వీరంతా మద్యానికి అలవాటు పడ్డారు. ఇక్కడి బెల్టు షాపుల్లో రోజుకు దాదాపుగా 200 క్వార్టర్ బాటిళ్ళు విక్రయిస్తుంటారు. మద్యం తాగొద్దని మహిళలు ఎంత మొత్తుకున్నా తాగడం మానడం లేదు. ఆయా కుటుంబాల్లో రోజూ గొడవలు జరుగుతుంటాయి. ఇందిరానగర్‌లో తాగాలే... ఊగాలే.. కల్హేర్ మండలం ఇందిరానగర్ జనాభా 512. ఇక్కడ సుమారు 60 మంది రైతులుంటారు. ఇతర కుల వృత్తుల వారు 30 మంది వరకున్నారు. కల్లు దుకాణం, బెల్టు షాపు ఉంది. 40 మంది వరకు నిత్యం మద్యం తాగుతుంటారు. 20 మంది వరకు వ్యసన పరులున్నారు. పొద్దునుంచీ తాగుతూనే ఉంటారు. వారు ఏ పనీ చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అప్పులు చేసి అవస్థలు పడుతున్నారు. ఉత్తులూరులో నిత్యం గొడవలే.. పెద్దశంకరంపేట మండలం ఉత్తులూరు జనాభా 2,423. ఇక్కడ సుమారు 1,500 మంది రైతులున్నారు. కల్లు దుకాణం ఉంది. గ్రామంలో వెయ్యి మందికి పైగా కల్లు తాగుతారు. ఒక బెల్టుషాపు ఉండగా 350 మంది బీరు, విస్కీ తాగుతున్నారు. రోజూ 75 నుంచి 100 క్వార్టర్ బాటిళ్లు విక్రయిస్తున్నారు. 50 మంది పనీపాటా లేకుండా మద్యం తాగుతూనే ఉండడంతో వారికి ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. సదరు కుటుంబాల్లో నిత్యం గొడవలే.. తట్టి కుదవబెట్టి తాగుతం... మండలంలోని శంషొద్దీన్పూర్లో మూడు బెల్డుషాపులు, కల్లుదుకాణం, సారా విక్రయాలు కొనసాగుతున్నాయి. గ్రామ జనాభా 1,076. జనాభాలో 4 శాతం మంది తాగుడుకు బానిసయ్యారు. 336 రైతు కుటుంబాలుండగా, ఐదు కుటుంబాల వారు కమ్మరి, కుమ్మరి, చాకలి వృత్తులపై ఆధారపడ్డారు. బానిసలుగా మారిన పలువురు మద్యం ప్రియులు డబ్బులు లేని వేళల్లో గ్రామంలోని కల్లు, బెల్టుషాపుల నిర్వాహకుల వద్ద అరువుపై మద్యం తాగుతున్నారు. తట్టి, చెంబు, బిందెలు కుదవ పెడుతున్నారు. మంతూర్‌లో.. పుల్కల్ మండలం మంతూర్ గ్రామ జనాభా 698. ఎక్కువ మంది దళితులు, బీసీ వర్గాలే. ఇందులో సన్నకారు రైతులు, జులాయిగా తిరిగే వారు మద్యానికి బానిసలవుతున్నారు. వ్యవసాయంపై ఆధార పడ్డ కుటుంబాలు సుమారు 20 నుంచి 30 మధ్య ఉంటాయి. సింగూర్ ప్రాజెక్టు ముంపు గ్రామం కావడంతో చాలామంది వలసలు వెళ్లారు. పొద్దట్నుంచీ తాగుడు అలవాటున్న వారు సుమారు 10 మంది వరకుంటారు. తాగుడు అలవాటున్న వారంతా పనిచేయకుండా జులాయిగా తిరుగుతున్నారు. డబ్బులు లేకపోతే అప్పు చేస్తారు. అప్పు దొరకక పోతే రెండు లేక మూడు రోజులు కూలికి వెళ్తుంటారు. కుటుంబ సభ్యులు పనులు చేయగా వచ్చిన డబ్బులను కూడా వీరు మందుకు ఖర్చు చేస్తున్నారు. -
భవితకు భరోసా!
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్లకు మహర్దశ రానుంది. ఇక్కడ ఏర్పాటుకానున్న టీసీఎస్, ఇబ్రహీంపట్నం సమీపంలో నెలకొల్పనున్న వైట్‌గోల్డ్ స్పిన్నింగ్ మిల్స్ కంపెనీలతో గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి. ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కోసం స్థానిక యువతీ యువకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాజధాని హైదరాబాద్ నగరానికి అతి సమీపంలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో యువత కొంత కాలంగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది. చేతిలో డిగ్రీ, పీజీ పట్టాలున్నా అవి దేనికీ పనికి రాకుండాపోతున్నాయి. ఇప్పటికే టాటా లాంటి కంపెనీలు ఈ ప్రాంతంలో ఉన్నా స్థానికులకు మాత్రం ఉద్యోగాలు అందని ద్రాక్షలా మారింది. పేరుకే ఈ ప్రాంతంలో వందలాది ఇంజినీరింగ్, పీజీ కళాశాలలున్నా.. ‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా ఆయా కళాశాలల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు దక్కడంలేదు. ఒకవేళ దొరికినా కేవలం వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్స్, స్వీపర్ పోస్టులే స్థానికులకు పరిమితమయ్యాయి. మరికొందరు డిగ్రీలు చేతబుచ్చుకుని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇప్పటికే పలు కోచింగ్ సెంటర్లలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ నగరానికి అన్ని దిక్కులా ఎన్నో పరిశ్రమలు వెలిశాయి. కానీ నాగార్జునసాగర్ రహదారి పరిధిలోని పట్నం నియోజకవర్గంలో మాత్రం ఏ ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఇప్పుడిప్పుడే పలు కంపెనీలు ఈ ప్రాంతం వైపు దృష్టి సారిస్తున్నాయి. టీసీఎస్‌లో 28 వేల మందికి అవకాశాలు.. మండలంలోని ఆదిబట్ల సమీపంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)పై నిరుద్యోగ యువత గంపెడాశలు పెట్టుకుంది. ఇప్పటికే 28 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టీసీఎస్ సీఈఓ చంద్రశేఖరన్ ప్రకటించారు. దీంతో స్థానిక యువతలో ఆశలు నెలకొన్నాయి. కాగా.. టీసీఎస్ బహుళజాతి సంస్థ కావటంతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పేరిట కళాశాలలోనే విద్యార్థులను ఎంపిక చేసుకుంటారని, స్థానికులకు అవకాశా లు తథ్యమని కొందరు భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్నో ఇంజనీరింగు కళాశాలలు ఉండటంతో చాలామంది విద్యార్థులకు ఉపాధి లభించి నిరుద్యోగ సమస్య కొంతవరకు తీరుతుందని పలువురు ఆశిస్తున్నారు. వైట్గోల్డ్లో పదివేల ఉద్యోగాలు.. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ పరిధిలోని సుమారు 200 ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న వైట్‌గోల్డ్ ఇంటెగ్రేటెడ్ స్పింటెక్స్ పార్క్ స్పిన్నింగ్ మిల్స్ నిర్మాణానికి గత ఏడాది అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో స్థానిక మహిళలకు అధిక శాతం అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇది కూడా నిర్మాణ దశలో ఉండటంతో భవిష్యత్తులో మహిళలకు ఉద్యోగావకాశాలు దక్కుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వైట్ గోల్డ్‌లో దాదాపు పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నారు. త్వరలోనే ఐటీఐఆర్.. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో త్వరలోనే ఐటీఐఆర్ సంస్థ కూడా ఏర్పా టు కాబోతున్నట్లు సమాచారం. ఇందు కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపినట్లు తెలిసింది. ఐటీఐఆర్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందిగా ప్రభుత్వం సంస్థ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఐటీఐ ఆర్ ఏర్పాటు సాకారమైతే ఈ ప్రాంతం మరింత పురోభివృద్ధి దిశగా పయనిస్తుందని, పెద్ద సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి దొరికే అవకాశాలున్నాయి. -
యువతకు పెద్దపీట
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : ప్రస్తుతం అధికారం చేపట్టనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో గ్రామీణ యువతకు స్వయంఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న చెప్పారు. బుధవారం డిచ్పల్లి టీటీడీసీ ఆవరణలో ఎస్బీహెచ్ ఆధ్వర్యంలో *కోట్ల వ్యయంతో నిర్మించిన ‘గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(ఆర్ఎస్ఈటీఐ)’ భవనాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. యువతకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారి నైపుణ్యాలను వెలికి తీసే విధంగా కృషి చేయాలని సూచించారు. ఏ శిక్షణ కేం ద్రంలోనైనా జీవితాంతం సరిపోయే శిక్షణ ఇవ్వలేరని, మారుతున్న పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానానికి అనుకూలంగా ఎప్పటి కప్పుడు కొత్త విధానాలను మనకు మనమే నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. జ్ఞానం అనేది ఎంతో విలువైనదని, మనం ఎంచుకున్న రంగంలో జ్ఞానం సంపాదిస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలెదురైనా పరిష్కరించుకోవచ్చన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యువత ముందుగా కోరుకోనేది ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించడం. అయితే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే సాధ్యం కాదని, అందుకే యువత స్వయం ఉపాధి పొందుతూ ఇతరులకు ఉపాధి చూపించే మార్గం ఎంచుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఎంత తీవ్రంగా ఉందంటే.. చౌకధరల దుకాణం డీలర్ పోస్టుకు ఇంటర్వ్యూ పిలిచినా, పీజీ చేసిన వారు సైతం హాజరువుతున్నారని ఉదాహరణగా తెలిపారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు త్వరలో అధికారం చేపట్టనున్న ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగాలను పరిశీలిస్తే, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోందన్నారు. ఎస్బీహెచ్ ఆర్ఎస్ఈటీఐ ద్వారా వివిధ కోర్సుల్లో శిక్షణ పొంది, స్వయం ఉపాధి పొందుతున్న యువత వివరాలను సంస్థ ప్రతినిధులు నమోదు చేసుకోవాలని సూచిం చారు. ఏడాది, రెండేళ్ల తర్వాత వారు స్వయం ఉపాధి పొందుతున్నారా లేదా వాటిని వదిలేసి ఇంటికి చేరుకున్నారా అనే విషయాన్ని గమనించాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక డాటా విధానాన్ని ఏర్పాటు చేసుకోవాల ని కలెక్టర్ సూచించారు. అనంతరం ఎస్బీహెచ్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. 2002లో ఎస్బీహెచ్ ఆ ధ్వర్యంలో ఆర్ఎస్ఈటీఐ ను మొట్టమొదట వరంగల్ జిల్లా హసన్‌పర్తిలో ప్రారంభించామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఏడు కేంద్రాలు, కర్ణాటకలో రెండు, మ హారాష్ట్రలో మూడు శిక్షణ కేంద్రాలు కొనసాగుతున్నా రు. గ్రామీణాభివృద్ధిశాఖ వారు చేసిన సర్వేల్లో ఈ శిక్షణ కేంద్రం ‘ఏఏ’ గ్రేడ్ సాధించిందన్నారు. కార్య క్రమంలో ఆర్బీ ఐ రీజనల్ డెరైక్టర్ కేఆర్‌దాస్, ఎస్బీహెచ్ సీజీఎంలు సురేశ్‌బాబు, ఎస్.వెంకటరామన్, జీఎం ఆర్ఎన్.డా ష్, ఆర్ఎస్ఈటీఐ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ పీసీ దాస్, సం స్థ డెరైక్టర్ విష్ణుకుమార్, సర్పంచ్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.