మిషన్ ‘ఎంప్లాయ్‌మెంట్’
* గ్రామీణ యువతకు ప్రైవేటుఉద్యోగాల కల్పన
* రూ.150 కోట్లతో 40 వేలమందికి శిక్షణ
* కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంత నిరుపేద యువతీ యువకులకు పెద్ద ఎత్తున ప్రైవేటు ఉద్యోగాల కల్పనపై సర్కారు దృష్టి పెట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 40 వేలమందికి వివిధ రకాల వృత్తి నైపుణ్యాలు(శిక్షణ) కల్పించి, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రవేశపెట్టిన ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్- గ్రామీణ కౌశల్య యోజన(డీడీయూ-జీకేవై)’ కింద ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) అధికారులు సుమారు రూ.150 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈజీఎంఎం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది.
తొలిదశలో 12,515 మందికి..
ఈజీఎంఎం ద్వారా 40 వేలమందికి ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు మూడు దశల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. తొలివిడతలో 12,515 మందికి శిక్షణ ఇప్పించేందుకు రూ.30.04 కోట్లు మంజూరు చేసింది. శిక్షణతో పాటు ఉద్యోగాలను కల్పించే బాధ్యతను ఎంపిక చేసిన ఏజెన్సీలకు అప్పగించింది. ఈ మేరకు వాటితో అవగాహన కుదుర్చుకోవాలని ఈజీఎంఎం అధికారులకు సర్కారు సూచించింది. ఒక్కో అభ్యర్థికి భోజనం, వసతి కోసం రూ.10.800, శిక్షణ కోసం రూ.13,696 ఖర్చుచేయాలని నిర్ణయించింది. అభ్యర్థులకు ప్రయాణ ఖర్చు.. తదితర సదుపాయాలను డీడీయూ-జీకేవై నిబంధనల మేరకు కల్పించాలని ఆదేశించింది.
గ్రామ సమాఖ్యల ద్వారా ఎంపిక
శిక్షణ, ఉద్యోగాల కల్పనకు అభ్యర్థులను గ్రామ సమాఖ్యల ద్వారా ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వం గతేడాది నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో సుమారు 15 లక్షలమంది పేద వర్గాలకు చెందిన యువకులు ఉన్నట్లు తేలింది. వీరిలో అత్యంత నిరుపేద(వ్యవసాయ భూమి లేని) కుటుంబాలకు చెందిన వారు సుమారు 2.5 లక్షల మంది ఉన్నట్లు అంచనా. వచ్చే నాలుగేళ్లలో వీరందరికీ అవసరమైన శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈజీఎంఎం సీఈవో మురళి తెలిపారు.