సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్వహించే నైపుణ్య శిక్షణ కోర్సులు, ఉపాధి కల్పన వంటి వివరాలు 24గంటలు అందుబాటులో ఉండేవిధంగా ‘స్కిల్ యూనివర్స్’ పేరుతో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) త్వరలో అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు.
విజయవాడ ఆటోనగర్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి బుగ్గన శుక్రవారం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.ట్రైనింగ్, ప్లేస్‌మెంట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం యువతకు ఎప్పటికప్పుడు తెలిసేలా డాష్ బోర్డును తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ, సీడ్యాప్, న్యాక్, పీఏడీఏ వంటి వివిధ సంస్థలకు చెందిన శిక్షణ వివరాలు పోర్టల్‌లో నమోదు చేయనున్నట్టు చెప్పారు.
రాష్ట్ర యువతి, యువకులు నైపుణ్య శిక్షణ కోసం నమోదు చేసుకునేవారు, శిక్షణ దశలో ఉన్నవారు, శిక్షణ పూర్తి చేసుకున్నవారు, ఉద్యోగాల్లో చేరినవారు... ఇలా సమగ్ర సమాచారం ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యే విధంగా డ్యాష్‌బోర్డును అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.కేతిక, నైపుణ్య విద్యను అభ్యసించే యువతి, యువకులకు అధ్యాపకుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతన పోర్టల్‌లో అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతో కరిక్యులమ్(రెజ్యూమ్) తయారు చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్ తెలిపారు.
వాటర్ మేనేజ్‌మెంట్, ప్లంబింగ్ స్కిల్ కౌన్సిల్‌లో ఏపీఎస్‌ఎస్‌డీసీ సాధించిన అవార్డును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ కార్యదర్శులు, ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను మంత్రి అభినందించారు. ఈ సమావేశంలో సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ నాగరాణి, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ డాక్టర్ వినోద్‌కుమార్, ఈడీ దినేష్కుమార్, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ నవ్య, సీడ్యాప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment