బతుకుతూ... బతికిస్తోంది | Women Worked constantly and giving them employment | Sakshi
Sakshi News home page

బతుకుతూ... బతికిస్తోంది

Published Tue, Apr 16 2019 12:01 AM | Last Updated on Tue, Apr 16 2019 12:01 AM

Women Worked constantly and giving them employment - Sakshi

కష్టాలకు వెరవలేదు..కన్నీళ్లకు జడవలేదు..మొక్కవోని ధైర్యంతో కష్టాల కడలికి ఎదురీదింది. చివరికి విజయ తీరాలను అందుకుంది. అప్పటి వరకు ఇంటి నాలుగు గోడలకే పరిమితమై, భర్త సంపాదించి పెడుతుంటే సంసారాన్ని నడుపుకుంటూ వచ్చిన ఈ సాధారణ గృహిణి, భర్త హఠాన్మరణంతో దిక్కుతోచక ఎలా బతకాలో తెలియని పరిస్థితుల్లో కష్టపడితే ఎలాగైనా బతకొచ్చని నిరూపించింది. భర్త నెలకొల్పిన సంస్థను ఆయన లాగే నిరంతరం శ్రమిస్తూ తాము ఉపాధి కల్పించిన వారిని రోడ్డున పడకుండా చేసి, అందరితో శభాష్‌ అనిపించుకుంది శ్రీదేవి అలియాస్‌ లక్ష్మీ..

ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో...
గ్రామీణులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో 20 సంవత్సరాల క్రితం వేముల శ్రీనివాస్‌ మాక్స్‌ సొసైటీని 20 లక్షల రూపాయల టర్నోవర్‌తో స్థాపించాడు. తాను పొందిన శిక్షణతో గ్రామీణ ప్రాంతంలోని వారికి శిక్షణనిస్తూ, ఉపాధి కల్పించాడు. అదే సమయంలో తన ఇల్లాలికి సైతం చేనేత వృత్తిలోని మెళకువలను కూడా నేర్పించాడు. వీరందరి కృషి, పనిలో నైపుణ్యం కారణంగా ఇక్కడ తయారైన వస్తువులు దేశ విదేశాలకు సైతం ఎగుమతి అయ్యేవి.. ఇల్లందకుంట మండలం లక్ష్మాజిపల్లికి చెందిన వేముల శ్రీనివాస్, శ్రీదేవి దంపతులు 1997 వ సంవత్సరంలో సీఎమ్‌ఈవై ద్వారా యువ సహకార సం«ఘాన్ని ఏర్పాటు చేసి 70 మందికి శిక్షణ ఇచ్చారు. అలా శిక్షణ పొందిన వారు రోజుకు 200 నుంచి 300 రూపాయలు సంపాదించుకునేలా తయారు చేశారు.

భర్త ఆశయాలే పరమావధిగా...
అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆ కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది.  భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన చనిపోయినప్పటికి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలనే దృఢ నిశ్చయంతో లక్ష్మి తాను నేర్చుకున్న విద్యను మరో పదిమందికి నేర్పించుకుంటూ పోయింది. భర్త తనతోనే ఉన్నాడన్నట్లుగా ఆమె  బొట్టు, మట్టెలు తీయలేదు. ఆయన తన దగ్గరే ఉండి పని చేయిస్తున్నట్లుగా కష్టపడి పని చేసింది. క్రమ క్రమంగా ఆ గ్రామంలో చేనేత దుస్తులు తయారు చేసే వారు ఎక్కువై పోయారు. ప్రస్తుతం కార్పెట్‌లు, బెడ్‌షీట్‌లు స్సీఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ కార్యాలయాలలో ఉపయోగించే అన్ని రకాల వస్త్రాలను వివిధ రకాల డిజైన్‌లతో తయారు చేస్తున్నారు. ఇంటిలోనే దాదాపు పదిమందికి పైగా నూలు వడుకుతూ, కార్పెట్‌లు తయారుచేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీరు తయారు చే సిన కార్పెట్‌లు వివిధ మేళాలలో ప్రదర్శించబడడమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన ఆప్కో టెక్స్‌టైల్స్‌లో విరివిగా అమ్ముడు పోతున్నాయి. 

ప్రశంసలు, పురస్కారాలు
గతంలో ముఖ్యమంత్రి, కలెక్టర్ల నుంచి ప్రశంసాపత్రాలతోబాటు, గత కొద్ది రోజుల క్రితం నాబార్డ్‌ పూణె సంస్థ ద్వారా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ముంబై, గవర్నర్‌ల చేతుల మీదుగా సర్టిఫికెట్‌లు అందుకున్నారు. గత ఫిబ్రవరి నెలలో హర్యానా రాష్ట్రంలోని హరితాబాద్‌లో జరిగిన అంతర్‌ రాష్ట్ర్రీయ మేళాలో పాల్గొన్నారు.
– స్వర్ణ మొలుగూరి, సాక్షి,హైదరాబాద్‌ సిటీ

ప్రభుత్వ ఆదరణ కరువు
మారుమూల గ్రామం నుంచి లక్షలాది రూపాయల విలువ చేసే వస్త్రాలను ఆప్కోకు విక్రయించడం జరిగిందని, ఇప్పటి వరకు రూ. 15 లక్షలకు పైగా ఆప్కో నుంచి రావాల్సి ఉందని లక్ష్మి వాపోయింది. అదే విధంగా తాము ఎవరి మెప్పు కోసం పనులు చేయడం లేదని, కేవలం పదిమందికి ఉపాధి కల్పించడం కోసమేనని, ఇంత చేసినా తమను ప్రభుత్వం గుర్తించడం లేదని చేనేత కార్మికులకు ఇవ్వవలసిన పింఛన్‌ సైతం అందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. కష్టే ఫలి అంటూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న లక్ష్మిని స్ఫూర్తిగా తీసుకుని గ్రామంలోని యువత, స్త్రీలు కష్టపడి పని చేస్తున్నారు,  

శిక్షణతో స్వయం ఉపాధి
శ్రీదేవి ఇచ్చిన శిక్షణతో పదేళ్లుగా స్వయం ఉపాధి పొందుతున్నాను. గతంలో నేను నా భార్య కూలీ పనిచేసే వాళ్లం. ప్రస్తుతం ఇద్దరం ఈ సహకార సంఘంలోనే పని చేస్తూ నెలకు దాదాపు ఆరువేలకు పైగా సంపాదించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం.
– ఎండీ. గౌసుద్దీన్‌

అద్దకంలో శిక్షణ పొందాను
గత ఆరు సంవత్సరాలుగా కార్పెట్‌లు, ఇతర వస్త్రాలపై అద్దకంలో శిక్షణను పొందాను. ప్రతిరోజు నేను రెండు కార్పెట్‌లను తయారు చేస్తాను. దీనివల్ల రోజుకు రూ. 200 నుంచి 300 వరకు వస్తాయి. 
– ఎండీ ర హీమా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement