ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్లకు మహర్దశ రానుంది. ఇక్కడ ఏర్పాటుకానున్న టీసీఎస్, ఇబ్రహీంపట్నం సమీపంలో నెలకొల్పనున్న వైట్‌గోల్డ్ స్పిన్నింగ్ మిల్స్ కంపెనీలతో గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి. ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కోసం స్థానిక యువతీ యువకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాజధాని హైదరాబాద్ నగరానికి అతి సమీపంలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో యువత కొంత కాలంగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది.
చేతిలో డిగ్రీ, పీజీ పట్టాలున్నా అవి దేనికీ పనికి రాకుండాపోతున్నాయి. ఇప్పటికే టాటా లాంటి కంపెనీలు ఈ ప్రాంతంలో ఉన్నా స్థానికులకు మాత్రం ఉద్యోగాలు అందని ద్రాక్షలా మారింది. పేరుకే ఈ ప్రాంతంలో వందలాది ఇంజినీరింగ్, పీజీ కళాశాలలున్నా.. ‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా ఆయా కళాశాలల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు దక్కడంలేదు. ఒకవేళ దొరికినా కేవలం వాచ్‌మెన్, సెక్యూరిటీ గార్డ్స్, స్వీపర్ పోస్టులే స్థానికులకు పరిమితమయ్యాయి.
మరికొందరు డిగ్రీలు చేతబుచ్చుకుని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇప్పటికే పలు కోచింగ్ సెంటర్లలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ నగరానికి అన్ని దిక్కులా ఎన్నో పరిశ్రమలు వెలిశాయి. కానీ నాగార్జునసాగర్ రహదారి పరిధిలోని పట్నం నియోజకవర్గంలో మాత్రం ఏ ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఇప్పుడిప్పుడే పలు కంపెనీలు ఈ ప్రాంతం వైపు దృష్టి సారిస్తున్నాయి.
టీసీఎస్‌లో 28 వేల మందికి అవకాశాలు..
మండలంలోని ఆదిబట్ల సమీపంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)పై నిరుద్యోగ యువత గంపెడాశలు పెట్టుకుంది. ఇప్పటికే 28 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టీసీఎస్ సీఈఓ చంద్రశేఖరన్ ప్రకటించారు. దీంతో స్థానిక యువతలో ఆశలు నెలకొన్నాయి.
కాగా.. టీసీఎస్ బహుళజాతి సంస్థ కావటంతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పేరిట కళాశాలలోనే విద్యార్థులను ఎంపిక చేసుకుంటారని, స్థానికులకు అవకాశా లు తథ్యమని కొందరు భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్నో ఇంజనీరింగు కళాశాలలు ఉండటంతో చాలామంది విద్యార్థులకు ఉపాధి లభించి నిరుద్యోగ సమస్య కొంతవరకు తీరుతుందని పలువురు ఆశిస్తున్నారు.
వైట్‌గోల్డ్‌లో పదివేల ఉద్యోగాలు..
ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ పరిధిలోని సుమారు 200 ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న వైట్‌గోల్డ్ ఇంటెగ్రేటెడ్ స్పింటెక్స్ పార్క్ స్పిన్నింగ్ మిల్స్ నిర్మాణానికి గత ఏడాది అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో స్థానిక మహిళలకు అధిక శాతం అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇది కూడా నిర్మాణ దశలో ఉండటంతో భవిష్యత్తులో మహిళలకు ఉద్యోగావకాశాలు దక్కుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వైట్ గోల్డ్‌లో దాదాపు పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నారు.
త్వరలోనే ఐటీఐఆర్..
ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో త్వరలోనే ఐటీఐఆర్ సంస్థ కూడా ఏర్పా టు కాబోతున్నట్లు సమాచారం. ఇందు కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపినట్లు తెలిసింది. ఐటీఐఆర్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందిగా ప్రభుత్వం సంస్థ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఐటీఐ ఆర్ ఏర్పాటు సాకారమైతే ఈ ప్రాంతం మరింత పురోభివృద్ధి దిశగా పయనిస్తుందని, పెద్ద సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి దొరికే అవకాశాలున్నాయి.
భవితకు భరోసా!
Published Sat, Sep 6 2014 11:47 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement