
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి
ఉత్తరాఖండ్‌లో పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచన
హర్సిల్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇక్కడ ఏదో ఒక సీజన్‌కు పరిమితం కాకుండా ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచు కొండలు, ప్రకృతి రమణీయతతో కూడిన సుందరమైన రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో ఆఫ్–సీజన్ అనేదే ఉండకూడదని పేర్కొన్నారు. పర్యాటర రంగాన్ని అభివృద్ధి చేసుకుంటే స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ గురువారం ఉత్తరాఖండ్‌లో పర్యటించారు. ఉత్తరకాశీ జిల్లాలోని ముఖ్వా గ్రామంలో గంగా మాత ఆలయాన్ని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. తనను గంగా మాత దత్తత తీసుకున్నట్లు భావిస్తున్నానని, ఆ తల్లి ఆశీస్సులే తనను కాశీ(వారణాసి)కి తీసుకెళ్లాయని, దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాయని వ్యాఖ్యానించారు. అనంతరం హర్సిల్ గ్రామంలో బహిరంగ సభలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఉత్తరాఖండ్‌లో శీతాకాలంలో పర్యటిస్తే చక్కటి అనుభూతి లభిస్తుందని అన్నారు. దేశమంతా పొగమంచుతో కప్పబడి ఉన్న సమయంలో ఉత్తరాఖండ్ మాత్రం సూర్యకాంతిలో స్నానమాడుతూ కనిపిస్తుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 12 నెలల టూ రిజం విజన్‌ను ప్రధానమంత్రి ప్రశంసించారు. పర్యాటకులను ఆకర్శించడానికి బహుముఖ చర్యలు అవసరమని పేర్కొన్నారు. వేసవి కాలంలో పర్యాటకులతో కళకళలాడే ఉత్తరాఖండ్ చలికాలంలో మాత్రం ఖాళీగా దర్శనిస్తోందని, ఈ పరిస్థితి మారాలని స్పష్టంచేశారు. అన్ని సీజన్లలో పర్యాటకులు భారీగా తరలివచ్చేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కోరారు. వింటర్ టూరిజం మనం లక్ష్యం కావాలని అన్నారు. చలికాలంలోనే అసలైన ఉత్తరాఖండ్‌ను అనుభూతి చెందవచ్చని పర్యాటకులకు సూచించారు.
గిరిజన గ్రామమైన జడూంగ్ నుంచి హర్సిల్ విలేజ్ వరకూ ట్రెక్, బైక్ జర్నీని ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో రెండు కీలకమైన రోప్‌వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు గుర్తుచేశారు. రోప్‌వే ప్రాజెక్టుతో కేదార్‌నాథ్ ప్రయాణం 9 గంటల నుంచి 30 నిమిషాలకు తగ్గిపోతుందని వెల్లడించారు. వివాహాలు చేసుకొనేందుకు, సినిమాలు, షార్ట్‌ఫిలింల షూటింగ్‌లకు ఉత్తరాఖండ్‌లో చక్కటి వేదికలు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సరిహద్దు గ్రామమైన హర్సిల్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రి మోదీయేనని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ పేర్కొన్నారు.
రేపు గుజరాత్‌లో మోదీ పర్యటన
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన గుజరాత్‌లో పర్యటించనున్నారు. నవసారి జిల్లాలో లఖ్‌పతి దీదీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మహిళా పోలీసులు, మహిళా సిబ్బంది ఆధ్వర్యంలోనే నిర్వహించబోతున్నారు.