
నేటి మధ్యాహ్నం కల్లా ఢిల్లీకి
అనంతరం తీహార్ జైలుకు
న్యూఢిల్లీ: 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి, పాకిస్తాన్ సంతతి ఉగ్రవాది తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రాణాను తీసుకొని భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి బుధవారం రాత్రి 7.10 గంటలకు(భారత కాలమానం ప్రకారం) ప్రత్యేక విమానంలో బయలుదేరారు. గురువారం మధ్యాహ్నంకల్లా ఢిల్లీకి చేరుకోనున్నారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) రాణాను అధికారికంగా అరెస్టు చేస్తుంది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య రాణాను తీహార్ జైలుకు తరలిస్తారు.
రాణా భద్రత కోసం జైలులో ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. జైలు చుట్టూ పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ముంబై ఉగ్రవాద దాడుల కేసులో ఢిల్లీలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టులో రాణాపై విచారణ ప్రారంభం కానుంది. కేసు విచారణ ఢిల్లీలోనే జరుగుతుంది కాబట్టి రాణాను ముంబైకి తరలించే అవకాశం లేదని అంటున్నారు. అమెరికా నుంచి రాణా తరలింపు ప్రక్రియను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. తనను ఇండియాకు అప్పగించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ రాణా దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు ఇటీవలే తిరస్కరించింది. దాంతో అతడిని ఇండియాకు అప్పగించేందుకు అవరోధాలు తొలగిపోయాయి.