
న్యూఢిల్లీ, సాక్షి: 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది తహవూర్ రాణాను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. అనంతరం, తీహార్ జైలుకు తరలించింది. తీహార్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు ఎన్ఐఏ కోర్టు ముందు రాణాను ప్రవేశపెట్టనున్నారు. తీహార్‌లోని హై సెక్యూరిటీ జైల్లోనే రాణాను ఎన్ఐఏ విచారణ చేయనుంది. ముంబై దాడుల వెనుక పాకిస్తాన్‌లో ఎవరెవరున్నారనే కోణంలో ఎన్ఐఏ విచారణ జరుపనుంది.
26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది తహవూర్ రాణా ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన రాణాను తీసుకు వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టులో గురువారం మధ్యాహ్నాం ల్యాండయ్యింది. దీంతో దేశ రాజధాని రీజియన్‌లో హైఅలర్ట్ ప్రకటించారు.
ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే తహవూర్ రాణాను ఎన్‌ఐఏ అధికారికంగా అరెస్టు చేసినట్లు సమాచారం. అనంతరం ఎన్‌ఐఏ కోర్టుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. అక్కడే ఎన్‌ఐఏ న్యాయమూర్తి 2008 ముంబై ఉగ్రదాడి కేసు విచారించనున్నారు. విచారణ అనంతరం.. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు తీహార్ జైలుకు తరలిస్తారా? లేదంటే మరోచోట ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
🚨 BIG BREAKING NEWS
26/11 mastermind Tahawwur Rana has ARRIVED in India, following his EXTRADITION from US [Bharti Jain/TOI] 🔥
— NIA will take him into custody. pic.twitter.com/ELPwS28L5L— Megh Updates 🚨™ (@MeghUpdates) April 10, 2025
తహవూర్ రాణాను విచారణ ఇలా ఉండనుంది
26/11 దాడుల నిందితుడు రాణాపై దర్యాప్తు ఎలా జరుగుతుందనే అంశంపై పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తహవూర్ రాణాను ఎన్‌ఐఏ లేదా సంబంధిత దర్యాప్తు సంస్థలు అతనిని అరెస్ట్ చేస్తాయి. అనంతరం,ఎన్ఐఎలోని 12 మంది సీనియర్ అధికారుల బృందంతో విచారణ చేస్తారు. రాణా నుంచి మరిన్ని వివరాలు రాబట్టడానికి, కోర్టులో పోలీస్ కస్టడీ కోరుతారు. ఈ దశలో అతని పాస్‌పోర్ట్‌లు, డాక్యుమెంట్లు, కమ్యూనికేషన్ పరికరాలను పరిశీలన జరుగుతుంది.
అతని సహచరులతో సంబంధాలపై విచారణ చేపడతారు. కుట్రలు,ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా అనే కోణంలో ప్రశ్నలు ఉంటాయి. పోలీస్ విచారణ ముగిసిన తర్వాత, అతనిని జైల్లో జుడిషియల్ కస్టడీకి తీసుకుంటారు. ఈ దశలో కోర్టులో చార్జ్ షీట్ దాఖలవుతుంది. ప్రతి 14 రోజులకు ఒకసారి రిమాండ్ పొడిగింపు.ఎన్ఐఏ/సీబీఐ వంటి సంస్థలు సేకరించిన ఆధారాల ఆధారంగా యూఏపీఏ, ఐపీసీ, ఆయుధ చట్టాలలోని సెక్షన్ల కింద కోర్టులో చార్జ్‌షీట్ నమోదు చేస్తారు.
తహవూర్ రాణాకు శిక్ష పడేది అప్పుడే
అంతర్జాతీయ సంబంధాలు, విదేశీ ఉగ్రవాద సంస్థల నుండి మద్దతు, డబ్బు మార్పిడి లింకులు పరిశీలన ఉంటుంది. చార్జ్ షీట్ కోర్టు ఆమోదించిన తరువాత అభియోగాలపై రాణా తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తారు. ప్రభుత్వ తరఫున ప్రాసిక్యూషన్ ఆధారాలు సమర్పిస్తుంది. తుది తీర్పు రీత్యా శిక్ష అమలవుతుంది. ఆధారాల బలాన్ని బట్టి ఈ మొత్తం ప్రక్రియ నెలల నుంచి సంవత్సరాల వరకూ సాగే అవకాశం ఉంటుంది.
ఎవరి తహవూర్ రాణా
పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడైన తహవూర్ రాణా, 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ మరుసటి ఏడాది FBI అతన్ని అరెస్టు చేసింది. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. అయితే ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.
ఇక.. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో తహవూర్ రాణా(Tahavur Rana)ను భారత్‌కు అప్పగించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఆమోదించారు. దీంతో ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే.. ఆ తర్వాత కూడా భారత్‌కు తరలించే అంశంపై రాణా ఊరట కోసం ప్రయత్నించినప్పటికీ.. దారులన్నీ అప్పటికే మూసుకుపోయాయి.